శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం
శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం
సంజయ వ్యాఖ్యానం
మ. కరుణాసాగర పూర్ణుడై పొరలుచూ కర్తవ్య సంబద్ధుడై
తరుణమ్ముల్ హితబుద్ధిగన్ మరుగుటన్ ధాతృత్వ మూలమ్ములన్
పరి శ్రాంతమ్మున పార్ధునున్ గనగ సంభ్రాంత్యాద్య భావమ్ములన్
కరుణార్దమ్ముల భూపతీ, తెలుప నేకాయంగుతోనిట్లనన్ (1)
శ్రీ భగవాన్ వాణి
ఉ. కాలము కానికాలమున కానివి వాక్కుల నేలఁ జెప్పగన్,
ఏలను స్వార్థమే కలిగిహెచ్చుగ తెల్పుచు యుండుటేలనన్
బాలుడవై నివేదనల పంతము సాగిల నేల నిప్పుడున్
జాలిని జూపగా నలతి జాడ్యము సద్గతి పొందకుండుటల్ (2)
చం. పిరికితనమ్ము లన్ వదలు, పేరగ నేలనొ నీకు బుర్రలో
సరియగుబుద్ధి కాదది విశారద హీనము తప్పు వాదనల్
తరుణపు యుద్ధమేగతియ తప్పుల నెంచకచూడు మిప్పుడున్
దురములఁ దీరగా తెగువ దూకుడు పార్ధ, విధాన మిప్పుడున్ (3)
శా. ద్రోణాచార్యులు భీష్మ పూజ్యులుగనే *ధూకంపు వ్యూహామ్ములన్
రాణమ్ముల్ సడి జేయ యుద్ధమున ధైర్యమ్ముల్ ప్రసాదించగన్
బాణాలే యరిసూదనా విధులలో బంధుత్వ విస్మాపనల్
ప్రాణాలే విడిచేయు త్యాగము కదా ప్రాధాన్యతే పోరులన్ (4)
ఉ. చేయను యుద్దమున్ గురువుఁ జెండుట నీచపు చేష్ట లే యనన్
గాయము రక్తసిక్తమగు గమ్యపు రాజ్యము నాకువద్దనన్
ప్రాయపు వీరులన్ హతము ప్రాభవ యుద్ధపుభోగమేలనన్
ధ్యేయపు పోరులన్ ప్రిదులు దేహము లేల వినాశ మందగన్ (5)
చం. ఎవరుజయింతురో నెఱుక లెంచగ లేని విధాన యుద్ధమున్
ఎవరు భయమ్ము చెందిటుల నింకుల చేష్టల పోరు మానగన్
ఎవరు దయార్ద్ర సంభవుల నెల్లర చంపగ నాకు కాదనన్
ఎవరని మర్దనల్ చలుప నెంతకు జ్ఞానము రాని ప్రశ్నగన్ (6)
చం. భయముల దోషమే మదిని బంధపు దోషుడనైతి చూడుమో,
నయమగు ధర్మమే యిదియ న్యాయపు సత్యములేను జెప్పితిన్
నయమగు సంధి యున్న యది నాకును దెల్పుము నీవ యిప్పుడే
ప్రియమగువాదనల్ దగిన ప్రీతిగ బాసలఁ దెల్ప పార్థుడున్ (7)
శా. ఈశోకాగ్నిని దించుమా మనసులన్ యిచ్ఛా వియోగ్యమ్ములన్
నాశమ్ముల్ గనగన్ విపాప ఫలముల్ న్యాయాధికారమ్ములన్,
ఆశించన్ వసుధాధిపత్యముగనే అర్థాంతరంగమ్ము లన్
వైశారద్య నుపాయ యుద్ధ విహితా వైవిద్య ధ్యేయమ్ములన్ (8)
సంజయ వ్యాఖ్యానము
ఉ. ఈవిధమున్ మదీయకలలీ విధి మానస మెల్ల నిండగా
నా విజయుండుపల్కెనిటు నాశయ యుత్సుక తోడఁ దెల్పగన్
నే విడువంగ యుద్ధ మును నీరస మెచ్చగ సంగతించగన్,
ఈ విపులమ్ములన్ దెలుప నింకను విల్లును ముట్ట లేననన్ (9 )
చం. గురువుల దీవెనల్, సహజ గొప్పలు నీవుగ శోకమేలనన్
విరివిగ బంధుజాలమిట విందుల, వేడ్కల మందహాసముల్
తరతమ భేదముల్ విడువ ధర్మ నిబద్ధత నిల్చెనివ్విధిన్
శరణము నీవె యంచునిట సాకుల దెల్పగ కృష్ణు డంతటన్ (10)
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
శా. శోకం బాపెడి వాని బోధనలలో సూ త్రమ్ము పాటించ గన్
శోకించన్ సురజ్ఞానివోలె పలుకుల్సూ క్తుల్ ప్రబోధించగన్
శోకమ్ముల్ వచియించు గాథ లెరుగన్ సూత్రాల లక్ష్యమ్ము గన్
శోకించే విధిగా మనన్ వలదు వాక్సూరమ్ము నీతోడుగన్ (11)
మ. ఇక నేడే మన మొక్కటై పగఱ వేధించే సమూహమ్ము లన్,
ఇక ముందే మనముండుచోటునిట ప్రాప్తించన్ సహాయమ్ములన్,
ఇక నాత్మాంశములే సజీవముల ప్రావీణ్యంపు సారమ్ములన్,
ఇకనీవూ మరి నేనుగాను కలసే యిష్టమ్ము ప్రశ్నే యగున్ (12)
ఉ. జీవుని జన్మ యాత్మ యగు చిత్రవిచిత్రము గానుపృథ్విపై
పోవును బాల్య మీడులును పొందుగ జీవుని యాత్రలేయగున్
జీవన శైలిలో బ్రతుకు జీర్ణము దేహము లందు సాగగన్
పోవును దేహమొక్కటిల పోరుల పాలయి వీరులైననున్ (13)
మ. విషయాలేభవ మొందగన్ వినయమే వేద్యంపు విశ్వాసమున్
విషయమ్ముల్ విధి రీతివేదనలుగా వేల్పుల్ సుసౌఖ్యమ్ములన్
విషయాలేమరి పుట్టుగిట్టుటలనే విన్యాస సత్యమ్ములన్
విషయమ్మే దన సర్వమున్ వితరణే వేదోక్త సామ్యమ్ముగన్ (14)
ఉ. ధీరుల ముఖ్య చేష్టలన దివ్యసమాంతర రాజ్య కాంక్షలన్
నేరుగ సాగనీ పరమ నిర్మల క్షేత్రపు ధర్మ యుద్ధముల్
వీరులు వ్యాకులమ్మగుచు విగ్రహ చేష్టలు దీప్తి చెందగన్
వారలు పోరునందుతగ వర్తన వేద్యపు భావనమ్ము లన్ (15)
మ. కనిపించే వినయమ్ము గమ్యమగుటే కాలమ్ము తీర్పేయగున్
తనువంతాస్థిరమై సమమ్ములుగనే తత్త్వమ్ము శీతోష్ణముల్
అనువౌ మార్పుల వాస్తవాసరళి గా వాశ్చల్య వైనమ్ములన్
కననొక్కండును యుద్ధ వేత్తగనగా గాండీవ ధారేయనన్ (16)
చెం. పరమ శివా యనంగ పద పాటవ మెంచగ నెవ్వ రైననున్,
వెరగున వాధృ సంహతపు వేళలఁ జెప్పు సమర్ధతా తతుల్
స్థిరమగువాని నాశనముచేయుట కారణమైన నేలనన్
తరణ విధమ్ము తెల్పగలదారుల నెంచగ బుద్ధి నేర్వగన్ (17)
శా. దేహమ్ముల్ స్థిరహీన మైన కదనా దీక్షత్వ నాశమ్ముగన్
మోహమ్ముల్ స్థిరహీనమై వివిధమున్ మోక్షమ్ము వెంటాడగన్
దాహమ్ముల్ స్థిరముండకన్ సమరమే దాసాను దాస్యమ్ముగన్
దేహాత్మా స్థిరమున్ వసించు నెపుడున్ దేవాత్మ సాయమ్ముగన్ (18)
ఉ. ఆత్మలఁ జంపుభావముననర్థము లేయవి వట్టిభావనల్
ఆత్మలు వేరుగాకదలి యాశల బెంచగఁ జంపలేముగా
ఆత్మలుఁ గల్గ లేదనెడి వాదన లన్నియు కాలతీర్పులన్
ఆత్మము చంపదెవ్వరిని యార్తము నందును కాలమందునన్ (19)
ఉ. ఆత్మము పుట్టిగిట్టుట యనాదిగ లేదనసత్యమేయగున్
ఆత్మకు భావనాశయము లార్ద్రత బంధము లెన్న లేకయున్
ఆత్మము జన్మలేనిదన హాస్యమసత్యపు విశ్వతే యగున్
ఆత్మకు దేహఛాయలుగ హద్దులె లౌకిక చావు పుట్టుకల్ (20)
శా. ఓ, పార్థా మనలోని యాత్మ స్థిరముల్ నోడంగ వేధింపులన్
ఓ, పార్థా నవశక్తితో నరయనన్నో యాత్మ గాలెక్కగన్
హే, పార్థా మరణమ్ములేనిమనసే యీపోరు మర్మమ్ములన్
హా, పార్థా యెవరెట్లుచంపగలరో హారమ్ము నా యాజ్ఞగన్ (21)
శా. జీవార్థమ్ము లనే ప్రధాన విధిగా చిత్తమ్ము దర్శించగన్
ప్రావీణ్యమ్ములనే విధాన బలమై ప్రాధాన్యతాభావమున్
జీవాత్మా స్థిరతత్త్వ దేహమనగా ఛిద్రా శరీరమ్ము గా
దైవాత్మా పనుపుల్ సహేతు విధిగా ధైర్యమ్ము ప్రారంభమున్ (22)
ఉ. ఆత్మను శస్త్రముల్ కదలి యాలము ఛిద్రము జేయలేవనన్
ఆత్మనుఁ గాల్చ వీలవదు యగ్నికి నేయితరమ్ముఁ గూడినన్
ఆత్మను నీరు నేపగిది నార్ద్రము జేయదు యేమిజేసినన్
ఆత్మను గాలికూల్చగల హాలతు లేదను సూనృతమ్ములన్(23)
ఉ. ఆత్మలు శాశ్వతంంబనగ నాతప మందున వానలందునన్
ఆత్మల నెండగా మరియు నార్ద్రతఁ జెందవు నాశమందగన్
ఆత్మ చలించ దెప్పుడు సహాయపరంపరలందు చేరగన్
ఆత్మల శోధనమ్ము గన సాధ్యము కాదన సత్యమే యగున్ (24)
ఉ. ఆత్మలు కంటికానవు సమానముగావిధి పాటి జేయగన్
ఆత్మ మనస్సునన్ దొరక నట్టిది యేపరి మార్పు లేనిదే
ఆత్మకు దేహమందున ప్రహారపు ధర్మము నిల్పు లక్ష్యమున్
ఆత్మకు వాదనెన్ననల నర్జున, బాధల వేధనెందుకో (25)
ఉ. పుట్టుట యన్నదేనిజము పృథ్విని మానవ ధర్మ మార్గమున్
గిట్టుట తప్పదన్నదియు కీలక సత్యము జన్మజన్మకున్
పట్టిన పట్టువీడుటలొ పంతముఁ బూనగ నేలనివవిధిన్
గట్టి మనస్సుగాసమర గర్జనఁ జేయగ శంఖ ముదుమా (26)
ఉ. పుట్టిన చింతలన్ గొలువు పూనగ సేవలొనర్చలేకయున్
గిట్టి, ఋణానుబంధమున కీలక మైన మరో ప్రభూతినిన్
పుట్టి నియంత్రణల్ జరుగు పూర్ణ నియుక్తము పూర్తి జేయగన్
గిట్టుట నంతమందు పరి ఖేదముఁ చెందగ యుద్ధ మందునన్ (27)
ఉ. పుట్టుక కారణమ్మదియ పుణ్యము పాపము లెందువల్లనో
గిట్టెడు సాకుపోరుయను కేలినిఁ జేయుట వల్లనే యనన్
పుట్టుట గిట్టుటే బ్రతుకు స్పూర్తిగ జీవన ధర్మ మార్గమే,
నిట్టి శరీరమే కలుగ నీకును శోకము లేల నిప్పుడున్ (28)
మ. కననొక్కండిల నబ్బురమ్ముగనగా గర్వమ్ము పెంపొందగా
విననొక్కండిల నబ్బురమ్ముగనగా విశ్వాస సాధ్యమ్ముగా
వినిపించే భగవాను కృష్ణు వర వైవిధ్యమ్ము లేపాద్యముల్
విన నెవ్వారు వచింపగా మహిమలన్ వేద్యాను కర్మంబులన్ (29)
చం. ప్రకృతిన పుట్టుజీవులకు బంధన పాశము యాత్మయై చనన్
ప్రకృతిని నిత్యవస్యమను పక్షము నందునఁ చేరి యుండుటన్
సుకృతము నెంచగా భరత సూత్రము సాటిగ పోరులందునన్
వికృతముఁ జూపు శోకమును వీడిధనుస్సును పట్టు యుద్ధమున్ (30)
చం. పదిలము సత్య ధర్మమను బంధన చేష్టల యుద్ధమందునన్
పద పడి పోరు జేయ నిటు పాపపు చింతలవేల యుద్ధమున్
చెదరని ధర్మమౌను కద శ్రేష్ఠపు వీరుల శౌర్యమూర్తులన్,
అది యిది ప్రశ్న లేల మనమార్గము ధర్మమునిల్పు టర్జునా (31)
చం. తెలియకవచ్చెనంచిటుసుధీ, విధివేద్య విదారణమ్ములన్
తెలియును నాదు బోధనలు తేట లమేయ వివాద చేష్టలన్
తలపులు స్వర్గ మార్గమున తప్పక తెర్చియెనుండు నర్జునా
సులభముగా సజావున విశోధన స్వర్గ విజేయ సత్యముల్ (32)
శా. పోరాటమ్మున యుద్ధ ధర్మముకదా ప్రోత్సాహ మీలాగునన్
పోరాటమ్మును మాని నీవుభయముల్ పొందంగ హీనమ్ము లౌ
నేరమ్ముల్ నెరజేయ నొప్పదనగా నీబోధ పాటించ కన్
ఘోరమ్మౌ దొసగుల్ ప్రకోపముల ముక్కోణంపు భావమ్ములన్ (33)
ఉ. లోకులు నీదుజంకులను లోలల చేష్టల నీచమంచనన్
మేకులు గాహృదిన్ చెరగి మిక్కుట నీచవిమర్శచేయగన్
కాకుల పోలికన్ పొడిచి కర్దము చల్లగఁ జూడ నెంచగన్
మాకిటు బాధలన్ గలుగ మంచిది కాదను భావమెచ్చగన్ (34)
ఉ. మిక్కిలి యుద్ధ విద్యలను మీరగ హెచ్చి నజేయమందగన్
చిక్కని దృష్టి తప్పినను చేరువ నష్టము లెక్కువేయగున్
మక్కువ బంధులందుపర మార్థము మానుము యుద్ధమందునన్
తక్కువ జేసిచూడకిటు ధర్మము యుద్ధపు బాధ్యతర్జునా (35)
శా
నీవైరిప్రజలెంతగా విరివిగా నిర్వేద నిస్తేజ ముల్
నీ వీరత్వములేగనన్ కదన నిర్నీతార్థ స్వార్ధమ్ములౌ
యావేశమ్ములనన్ ధరన్ పరమ గర్హ్యమ్మై విచారించగన్
నీవే నోర్పును జూప నిందలు వినన్ నీబోధలేమార్చినన్ (36)
మ.
సమరమ్మందున మృత్యువుల్ సహజ మేస్వర్గమ్ము ప్రాప్తమ్ము గా,
అమరత్వంబగు నీదు కర్మలుగనన్ యారాధ్య వేద్యా గతిన్
సమరమ్మున్ జయమైన భోగములిలన్ సాధ్యమ్ము స్వంతమ్ములౌ
అమరత్వాశయమేవిధానపరమౌయాకాంక్ష లేయర్జునా (37)
మ.
సమరమ్మందున లాభనష్టములనన్ సామ్యంపు సంభావ్యతన్
సమరమ్మున్ సుఖ దుఃఖముల్ గలుగుటన్ సందర్భ లక్ష్యమ్ముగన్
సమరమ్మున్ విధిపాపపుణ్యము లుగన్ సన్నద్ధమై సాగగన్
సమరమ్మున్ సహజమ్ము సంఘటిత విస్తారమ్ము సాగించగన్ (38)
ఉ.
జ్ఞాన పథంబులన్ సమత జ్ఞానము పంచితి నేను నివ్విధిన్
జ్ఞాన మొసంగగా బరగు జ్ఞానవిశేషము బోధజేయగన్
దానినె కర్మగన్ దెలుపు ధర్మము సామ్యపథంబుజూపగన్
జ్ఞానము తోడు నీమనసు సద్గతి పొందుట నీదు లక్ష్యమున్ (39)
ఆరంభమ్మగు కర్మలే కదనమున్ హార్యమ్ము లౌభావముల్
ప్రారంభమ్మగు తేజముల్ కలకలల్ ప్రారబ్ధ కర్మాలనన్
సారమ్ముల్ స్థిత కర్మలున్ గనుటనే సారథ్య లక్ష్యమ్ముగన్
ధీరుండౌ విధిగన్ సుసంగవిధులన్ దేహమ్ము యుద్ధమ్మునన్ (40)
ఉ. నిశ్చయ చిత్తమొక్కటియ నీమపు నిష్ఠల తేజమేయగున్
నిశ్చల కర్మచేయువిధి నీతుల దర్శన మార్గమేయగున్
నిశ్చయ మెంతయున్న విధి నిర్ణయ మన్నది నేను తీర్చగన్
నిశ్చల చిత్తమందు నిక నీదు నియామక కార్య మెంచు మా! (41)
ఉ. భోగ విలాస మాయలతొ బోల మనస్కులు చూడ గల్గగన్
వేగవిశారదల్ నెరపు వేదముఁ దెల్పగ విద్య లెల్లరన్
బాగుగ జీనమంద పరి పాటిగ వ్యూహము తీర్చ యుద్ధమున్
త్యాగమనంతముల్ సమర ధర్మము నందున నీవు జేయగన్ (42)
చం. మనదనెడీక్షణమ్ముసుఖమార్గము గానువిధాన తీర్పులన్
మనమున కోర్కెలేగతిగ మానసవాహక కాలపొంగులన్
మనము సకాల కర్మలను మార్కొను విద్యలు తేజరిల్లగన్
మనసిడి జేయుయుద్ధములె మాన్యములైనవిధర్మ సామ్యమై (43)
చం. తెలుపుదు సత్యవాక్కులను తీక్షణ నిర్ణయ మెంచి యందునన్
చలనములీ విధాన మున జాలము లన్నియు భ్రాంతియే యనన్
కలవర మైన చిత్తమున కర్కశ కాలపు దర్శనమ్ములన్
మలుపులనిచ్చు విద్యలను మార్గము లెంచగ సూనృతమ్ములన్ (44)
ఉ. నీవిటు హర్ష ద్యోతపు వినీతుడుగా మనసుంచి సాగగన్
నీవిక ప్రేమతత్త్వమును నిత్యపరాత్పర యోగసాధనన్
నీవెటులైనసత్యమును నిల్పగ నిశ్చయ కార్యరూపమున్
నీవ యతఃపరమ్ములుగ నిశ్చయ సిద్ధికి కారణమ్ముగన్ (45)
ఉ. చిన్న జలాశయమ్ములు సుచిత్రవిచిత్ర యుపాయమేయనన్
చిన్నది యాశలన్ ప్రబల జ్యేష్ఠ సహాయపరంపరమ్ముగన్,
ఉన్న పరాత్పరుండు స్థిర ముత్సవ తత్త్వము బోధఁ జేయగన్
యున్నత వేదపాఠములు యుద్ధృతి మార్చెడి బ్రాహ్మతత్త్వమున్ (46)
శా. కర్మాచార్యవిధానమే విధులుగా కార్యమ్ము సాఫల్యతన్
ధర్మమ్ముల్ నెరవేర్చగా విశదమౌ తన్మాత్ర విశ్వాసమున్
కర్మల్ కర్తలు తప్పినన్ మనిషిగా కాలమ్ము శాసించగన్
కర్మా పేక్షయులేక సాగు ఫలముల్ కర్తవ్య సాధ్యమ్ముగన్ (47)
శా. యోగాసక్తి విధేయతన్ జయములే యోగ్యంపు సంభావ్యతన్
రాగార్ద్రానుభవాప్రమేయ ఫలమే రాజ్యమ్ము స్వంతమ్ముగన్
సాగించన్ మది ధర్మ కర్మలవిధుల్ సాధ్యమ్ము సాంతమ్ము గా
యోగమ్ముల్ పటిమా సమాన ప్రతిగా నుల్లమ్ము సమ్మోదమున్ (48)
మ. ఫలమాశించెడి కర్మలే సమరమున్ ప్రశ్నార్థ కమ్మై చనన్
ఫలమున్ బొందగ సాధ్యమై పరమ సంప్రాప్తమ్ము లక్ష్యమ్ముగన్
ఫలమాశించక జేయుటే ఫలితమౌ పాఠ్యమ్ము బోధించగన్
ఫలమే యుద్ధపు సాధనా జవము సంపన్నాధికారమ్ములే. (49)
మ. సమతాచిత్తము కర్మలన్ జరపగా సామాన్య వైనమ్ముగన్
మమతాఖేదము లెల్లమానుటగతిన్ మాన్యమ్ము సౌలభ్యముల్
సమతాభావమెరుంగుమా మురిపమై సామ్రాజ్య భావమ్ములన్
సమతాయోగము నేర్పు బోధనలనన్ సౌలభ్య నేస్తమ్ముగన్ (50)
చం. పరమపదమ్ము పొందెదరుపార్థివ వాంఛలు నిర్వికారమై
మరణపు వీత ముక్తులగుమానవ కర్మ ఫలమ్ము త్యాగమై
తరుణపు బుద్ధియుక్తులగు తన్మయ భావముతోడు ముక్తులై
నిరతము సాధ్యమే యనగ నిశ్చయ భావమునందు స్వర్గమై (51)
శా. నీమోహంబునకాలమేజరుగుటన్ నీర్నేత చిత్తమ్ములన్
నీమాయా మరులే సమగ్ర కదనా నిర్దుష్ట చేష్టమ్ము లై
నీమాత్రా సమయాను కూల సరముల్ నేయార్థ భావమ్ములై
ప్రేమార్థమ్ము లనన్ విధాన విధులన్ పేరేన్ను సత్యమ్ములై (52)
చం. ప్రచలితమైన మాటలన ప్రాణ సమస్యలుఁ దెచ్చు బుద్ధులన్,
పచకచ నిశ్చలమ్మగుట బాధల వేధ్య తపస్సు సాగగన్
విచలితమైన బుద్ధులను విద్యల యోగ్యపరాత్పరమ్ములన్
అచలమునందు నాత్మగన హార్దము లెన్న మనో విధానమున్ (53)
ప్రార్ధుని ప్రార్ధన
చం. తెలుపుము కేశవా పురుష తేజ స్వధర్మ పరమ్ము లేవియో ?
పలుకుము కేశవా గుణము భాషణ భావపు బంధ మేదియో ?
తెలుపుము కేశవా మనసు ధీస్థితినెట్లు వసించు మూలమో ?
పలుకుము కేశవా పరమ ప్రాప్తపు రీతి నెరంగు నీతులన్ (54)
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
మ.కోll పూర్తిగా తొలగించకోరిక పూజ్యమేయగు నిత్యమున్
స్ఫూర్తిగా పరమాత్మ యోగము సూత్రమేయగు విద్యగన్
మూర్తిగా స్థిత కాలధర్మము ముఖ్య యాత్మగ జీవమున్
కీర్తి ప్రజ్ఞతఁ బట్టి నెంచుట కీలకమ్మగు యర్జునా (55)
ఉ. భేద మనస్సునన్ సమయ పేరిమి లక్ష్యము జేసిఁ జూడగన్
మోదములందగన్ మనసు మోహపు మాయల జిక్కి భ్రాంతులన్
క్రోధము వీడి నేస్తముల కూటము లందున శాంతిబొందగన్
కాదన ధీవరా సమర కాలము నేదియ తెల్పు మర్జునా (56)
మ. మమ తాసక్తులు లేనివానినెడ నేమాన్యత్వ మేలాగునన్
సమతాభావము సానుకూల మయముల్ సహ్యమ్ముకాదేలనో
క్షమయా గుణ్యపు సామ్య బుద్ధులనయన్ కర్మమ్ము లీదారులన్
స్థిమితమ్ముల్ గమనించునీవుమహితా శ్రేయమ్ము లే యర్జునా (57)
మ. తన యంగమ్ములు లోనికై ముడుచు వృత్తమ్మెంచు సామ్యమ్ముగా
మనయాశల్ ఫలియించు కీలకములౌ మార్గమ్ము శోధించగన్
జనధర్మమ్ము విధానవిద్య చరితా జ్ఞానమ్ము పొందంగనే
మనబుద్ధుల్ స్థిర మైనవే యనగ నేమార్చేమహాజ్ఞానిగన్ (58)
మ. విషయమ్ముల్ భవదీయ హృద్య వచ నల్ విశ్వాసముల్ పొందుగన్
విషయార్థాలను వీడగల్గు విధులే విశ్వమ్ము వ్యాపించగన్
విషయాలన్ పురుషార్థ కర్మలనగావేసారి వేధించగన్
విషయాసక్తిని మోక్షమందగలుగన్ విద్యా వివేకమ్ములన్ (59)
ఉ. ఈమహమ్మగు కాలమేమన ఇంద్రియాలకు లొంగకన్,
ఈ మనోహర వాంఛలన్నియు నేపుగా చకితమ్ము లై,
ఈమనుష్యులు నిగ్రహమ్ముల నెంచినన్ పరివేదనే
క్షేమమన్నది రాక పోవు నికృష్టమౌ నిహ లోకమున్ (60)
ఉ. సాధకుడే శరీరమును సాధన తీర్పుల నిశ్చయించగన్
బోధన సర్వకాలముల పొంగెడు కోర్కెల చిత్త యుక్తులన్
శోధనతో ప్ర సాదితపు చోద్యపు మార్చులెనంగబుద్ధిగన్
సాధనతో వినూత్న మగు సత్యములన్గన సంభవమ్మగున్ (61)
మ. విషయాలే మనమందు నార్ద్రతల సర్వేశుండు దీపించగన్
విషయాసక్తులఁ దీరి యాశయములేవిద్యా విశేషమ్ముగన్
విషయాలన్నియు పేరుకే వరదలై విడ్డూర ప్రాప్తమ్ము లై
విషయమ్ముల్ బొడ జూపగా భవితనే వీక్షించు వైనమ్ముగన్ (62)
మ. కో.సాధకుండిటు కోపగించిన సాధనల్ కడు ప్రశ్న లై
క్రోధమే మది క్రమ్ము నీడల కుప్ప లెల్లడ దుఃఖమై
వేదనల్ స్మృతి భ్రష్టమై ప్రతి విద్య వ్యర్థము గా చనన్
రోదనేయగు బుద్ధి హీనత రోషవాక్కుల చేర్చగన్ (63)
మ. హృదయానందము పొందగల్గు మదిలో హృచ్ఛోక మోహమ్ములన్
మదిరాగార్థ విశేష భావములలో మాయా విలోలమ్ములన్
విధి వ్రాతల్ గ్రహణమ్ముగా తలుపగా విజ్ఞాన మేరీతులన్,
అది యేమైనను శాంతి జీవనములే యానంద భాగ్యమ్ముగన్ (64)
మకో. కర్మ యోగిగ బుద్ధిమారగ కాలనిర్ణయమేనగున్
ధర్మ చింతన తోడు సాగిన ధ్యాన మందున ధ్యాసతో
మర్మమేతెలియాల్సియుండగ మాయ ఛేదనఁ జేయగా
నిర్మలా కరుణాంత రంగుని నిత్య సేవల తీర్చగన్ (65)
మ.స్థిర చిత్తమ్మున జీవనాశయములన్ చేకూర్చు చోద్యమ్ము లన్
పరమాత్మన్ గమనించలేక ప్రతిగా ప్రశ్నార్థ కార్యార్థ మై
నరయన్ విస్తృత శాంతులే ప్రముఖ మౌ నారాధ్య భాగ్యమ్ము, మీ
చరణాలే శరణమ్ములై విధిగ విస్తారార్థ పుణ్యమ్ములై (66)
ఉ.నీటనఁ దేలు నావలకు నేర్పుగ గాలియె తీర్పు లీయగన్
వాటముగా పరాత్ప రుని వాక్కుల మాటున చిత్త శుద్ధిగా
చాటువు లైనగీత వర సారములే కదనాంత రార్థమై
పాటు పడంగమానవుల పావన ధర్మము ముక్తిఁ బొందగన్ (67)
ఉ.సాధకు డింద్రియమ్ములను సాధనఁ జేయగ మోక్ష మార్గమున్
శోధన లే వివేకములు శూరుల యుద్ధపు నీతులందునన్
సాధన లే విరోధి జయ సాధ్యపరంపర పోరువిద్యలన్,
ఆదర ప్రత్యయాద్యముల నాశ్రిత నేయము మన్న విచ్చటన్ (68)
ఉ.జీవులు రాత్రులన్ నిదురఁ జెందుట యోగ్యపరమ్ము రీతులన్
జీవుల దివ్యకాలమున చిన్మయ జీవన విద్య లార్జనన్
జీవులు యుద్ధ విద్య లను జీవన పోరుల జిత్వరీతముల్
జీవుల న్యాయసమ్మతము, జీవము, జీనము సత్త్వ యుగ్మముల్ (69)
మ.నదులెల్లన్ ప్రవ హించి సంద్రముననే నాణ్యంపు సంగమ్ము లై
కదిలించే నల సంగరమ్ము తెలిపే కర్తవ్య తీరుల్ గనన్
మదమాత్సర్యములందునన్ నరుల సమ్మాదమ్ము పెంపొందగన్
మది సంతృప్తిగ జీవనార్థ వరముల్ మన్నింపు మాయావిధుల్ (70)
చం. ఎవడు సదాశయమ్మున వివేక వివేద్య విధాన భాగ్యమున్,
ఎవడుసమత్వమున్ వర సమీక్ష సమూహపు పాటవమ్ములన్,
ఎవడు మనో ప్రశాంతతనునిల్పి నిగర్విగనుండు వానిగన్,
అవని మదీయ భాగ్యముల సాక్షిగ నిత్య ప్రశాంత జీవనల్ (71)
మ. ఇదియే బ్రహ్మము ప్రాప్తిబట్టికళలే నిత్యమ్ము సంభావ్యతన్
పదిలమ్మున్ గల మానవుండుగనునే బ్రహ్మమ్ము నంత్యమ్మునన్
మది బ్రహ్మస్థితిమోహమున్ తరుమగా మంత్రమ్ము యోగమ్ముగన్
మది శాంతించిన కాలమే మనుగడన్ మార్గమ్ము లానందముల్ (72)
శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం.సమాప్తము
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
**శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (2)
2) భగవద్గీత రెండవ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేయడం వలన జ్ఞానం సిద్ధిస్తుంది .
భగవద్గీత ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు శ్లాఖించాయి. పద్మపురాణంలో ఉత్తరఖండంలో పరమేశ్వరుడు పార్వతి దేవి తో సంభాషిస్తూ, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్టుగా వివరించినట్టు ఉంది. దీనిలో ప్రతి గీతాధ్యాయం యొక్క పారాయణ వలనా కలిగే ఫలితాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ద్వితీయాధ్యాన్ని ప్రతిరోజూ పారాయణం చేయడం వలన జ్ఞానసిద్ధి కలుగుతుందని పాద్మపురాణం తెలియజేస్తోంది . గీతలోని ద్వితీయాధ్యాయ పారాయణా మహత్యాన్ని వివరించే ఉదంతాన్ని ఈ విధంగా పేర్కొంది .
“లక్ష్మీ! భగవద్గీత ద్వితీయ అధ్యాయ ప్రభావాన్ని చెప్తాను ఏకాగ్రచితంతో విను” అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పసాగారు. “ దక్షిణదేశంలో పురంధరము అనే పట్టణం ఉంది. అక్కడ వేదవేత్త, అతిధులను పూజించేవాడు, ఋషులంటే ప్రేమ కలిగిన వాడు, అనేక యజ్ఞాల చేత దేవతలను తృప్తి పరిచిన దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎన్ని విధాల సత్కార్యాలు చేసినప్పటికీ మనసుకి తృప్తి లేక, పరమ కళ్యాణాత్మకమైన తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత గలవాడై నిత్యము సాధుసేవ చేస్తుండేవాడు. ఈ విధంగా చాలా కాలం గడిచిపోయింది. ఒక రోజున నిత్యానందుడు, పరమ సాధువు, అనుభవజ్ఞుడు అయిన ఒక ఋషి సాంగత్యం ఆయనకి లభించింది. దేవశర్మ భక్తితో ఆయన్ని పూజించితన జ్ఞానాకాంక్షని ఆయనకీ తెలియజేశాడు. ఆత్మజ్ఞానం కలిగే ఉపాయాన్ని బోధించమని అర్థించాడు. అప్పుడాయన దేవశర్మమీది వాత్సల్యంతో సౌపురం అనే గ్రామంలో మిత్రవాసుడనే గొర్రెల కాపరిని కలవని , ఆయన నీకు ఉపదేశము చేయగలడు అని చెప్పాడు.
వెంటనే దేవశర్మ సౌపురము బయల్దేరి వెళ్లారు. ఆ పురమునకు ఉత్తరమున ఒక విశాల వనములో, నదీ తీరంలో ,ఒక రాతి మీద కూర్చుని నిశ్చల దృష్టితో చూస్తున్న మిత్రవానుని చూశాడు . ఆయనున్న ప్రదేశంలోని మృగాలన్నీ కూడా మిత్ర భావంతో సంచరిస్తూ ఉన్నాయి. వాయువు మెల్లగా వీస్తున్నాడు. ఆ ప్రాంతమంతా శాంతమై, మంగళాత్మకంగా అలరారుతోంది. దేవశర్మ ధ్యాననిష్ట లో ఉన్న మిత్రవానుని సమీపించి ‘మహాత్మా తమ వలన నాకు ఆత్మ జ్ఞానము సిద్ధిస్తుందని ఇక్కడ వరకు వచ్చాను. అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను’ అని పలికాడు. దేవశర్మ మాటలని విన్నటువంటి మిత్రవానడు అర్థనిమీలిత నేత్రుడై ఇలా చెప్పసాగాడు.
“ఓ విద్వాంశుడా! గోదావరి తీరంలో ప్రతిష్టాపురమనే ఒక పురము ఉన్నది అందులో విక్రముడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను వేరే కులానికి చెందిన కన్యను వివాహమాడి, అనేక దుష్కార్యములు, దుష్కర్మములు ఆచరిస్తూ నిత్యము ఉదర పోషణకై అనేక దానములను గ్రహిస్తూ ఉండేవాడు. జాతి వ్యతిరేకతములైన పనులను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.
భర్త యొక్క దరిద్రాన్ని, ప్రవర్తనను చూసి అతని భార్యకి విసుగువచ్చేది . దాంతో ఆమె అతన్ని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది. వార్ధక్యంలో అనేక బాధలను అనుభవించి మృతి చెంది పూర్వకర్మ ఫలాల చేత డాకినిగా జన్మించింది. దుర్మార్గురాలై నర మాంసాన్ని తింటూ తిరుగుతూఉండేది. ఒకనాడు మనుషుల చేత బలవంతంగా చంపబడి, నరకయాతనలు అనుభవించి మరు జన్మలో పెద్దపులిగా జన్మించింది. ఆ జన్మలో అనేక ప్రాణులను హింసించి మృతి చెంది, తిరిగి ఒక గృహములో మేకగా పుట్టింది. అని వివరించాడు మిత్రవానుడు. ఇంకా ఇలా చెప్పసాగాడు .
ఇదిలా ఉంటె , ఆమె భర్తయిన విక్రముడు వయసు మీద పడడంతో అనేక కష్టాలను అనుభవించి, చివరకు కాలధర్మము చెంది యమలోకం చేరాడు . అక్కడ యమయాతనలను అనుభవించిన తరువాత, పెద్దపులిగా జన్మించాడు. ఒక రోజు వనములో నేను గొర్రెలను కాస్తూ ఉండగా, పెద్దపులి రూపంలో ఉన్న విక్రముడు అక్కడకు వచ్చాడు. దానిని చూసి గొర్రెలన్నీ చిందర వందర కావడంతో నేను ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాను. ఇంతలో వనములోనే ఉన్న ఆ మేక భయము వదిలి, ఆ పులికి ఎదురుగా వెళ్ళింది . గంభీరముగా ‘ఓ పులీ ! ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఆకలి అవ్వడం లేదా ? నీకు ఆహారంగా నేను తగను అనుకుంటున్నావా ? నన్ను నిర్భయంగా ఆరగించు ‘ అన్నది . అప్పుడా పెద్దపులి ‘ఓ చాగమా (మేకా !) నీవు ఇక్కడకు వచ్చేంత వరకు నేను ద్వేష భావాన్ని కలిగి ఉన్నాను. కానీ నీవు దగ్గరికి రాగానే నాలోని ద్వేష భావము నశించిపోయింది. ఆకలి దప్పికలు దూరమయ్యాయి. నేనింక నిన్ను తినను.’ అని చెప్పింది.
‘నీకు ద్వేషము ఆకలి దప్పికలు ఎలా పోయాయి? అని పులిని అడిగింది మేక .వారిద్దరికీ కూడా సమాధానం దొరకక వారు నా దగ్గరకు వచ్చి నన్ను తమ సందేహానికి కారణాన్ని చెప్పమని కోరాయి. నేను ఆశ్చర్యపోతూ నాకు తెలియదని పలికి వారిని వెంటబెట్టుకుని, చెట్టు కింద ఉన్న ఒక వానరోత్తముడిని దగ్గరకు వెళ్లి మా ముగ్గురికీ ఉన్న సందేహాన్ని తీర్చమని కోరాను. అప్పుడా వానరరాజం మాకు ఇతిహాసాన్ని వివరించారు.
‘ఈ సమీపంలో మీ ఎదురుగానే దేవాలయం ఒకటున్నది. అందులో బ్రహ్మచేత స్థాపించబడిన శివలింగం ఉన్నది. పూర్వము సుకర్మఈ మందిరములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ వనములోని పుష్పముల చేత జలము చేత ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ అతడు ఈ మందిరములో చాలా కాలము నివసించాడు . ఇలా ఉండగా ఒకనాడు అతని ఆశ్రమానికి ఒక అతిధి వచ్చారు. అప్పుడు సుకర్మ అతనిని ఆదరించి ‘మహాత్మా ఇక్కడ నేను చాలా కాలము నుండి తత్వ జ్ఞానమును పొందగోరి ఈశ్వరోపాసన చేస్తున్నాను. ఈరోజు తమ రాక చేత నా ఈశ్వరారాధనము సఫలమైంది. మీ అనుగ్రహం కూడా నాకు లభించి నట్లయితే, నేను ఎంతో ధన్యుడనవుతాను అని పలికాడు . అప్పుడు ఆ అతిథి చాలా సంతోషించినవాడై ఒక రాతి పలకము మీద గీతా ద్వితీయ అధ్యాయంను రాసి ఇలా పలికాడు ‘ సుకర్మ! రోజూ నీవు ఈ అధ్యాయాన్నితప్పక పారాయణం చేస్తూ ఉండు. దీనిని పఠించడం చేత తప్పక నీ మనోరథము తీరుతుంది. అని చెప్పి ఆ అతిథి అక్కడే అంతర్దానమయ్యాడు.
సుకర్మ ఆశ్చర్యపోయి, అంతలోనే తేరుకొని అతని ఆజ్ఞనుసారంగా నిత్యము గీతా ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా పారాయణ చేస్తూ ఉండగా కొంత కాలానికి అతని అంతఃకరణము పరిశుద్ధమై, ఆత్మ జ్ఞానము లభించింది. క్రమంగా సుకర్మ ఎక్కడైతే అడుగు పెడతారో ఆ ప్రదేశాలన్నీ కూడా ప్రశాంతంగా మారడం ప్రారంభించాయి. ఆయా ప్రదేశములలో సుఖదుఃఖాలు, శీతోష్ణములు, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వ భావములు దూరం కాసాగాయి. ఆ ప్రదేశములలోని జీవులకు ఆకలి దప్పికలు అంతరించి భయము పటాపంచలైనదని’ ఆ వానర రాజు చక్కగా ఆ కథనంతా కూడా వివరించారు.
ఆ కథను విన్న నేను, మేకను పులిని వెంటబెట్టుకుని సుకర్మ నిత్యమూ పారాయణ చేసిన ద్వితీయాధ్యాయం చెక్కి ఉన్న ఈ రాతి ఫలకం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఉన్న గీతా ద్వితీయ అధ్యాయాన్ని చదివి వారికి వినిపించాను. అలా కొంత కాలము ఆ అధ్యాయమును రోజూ పారాయణ చేయగా నా తపస్సు ఫలించింది. కాబట్టి, అదే విధంగా నీవుకూడా భగద్గీత రెండవ అధ్యాయాన్ని పారాయణ చెయ్యి. నీకు ముక్తి తప్పక కలుగుతుంది. నీకు తప్పక జ్ఞానము సంప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు.
లక్ష్మీ ! ఈ విధంగా మిత్రవానుని ఉపదేశాన్ని గ్రహించి దేవశర్మ తన పురంధర పురానికి చేరుకున్నాడు . నిత్యము తాను గీతా ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ, ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. చివరకు ఆయన పరమపదాన్ని పొందాడు’ . అని నారాయణుడు లక్ష్మీ దేవికి చెప్పాడు. కాబట్టి ఓ పార్వతీ ! ఎవరైతే ఈ విధంగా భవద్గీతలోని ద్వితీయ అధ్యాయము భక్తితో పారాయణ చేస్తారో వారు ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొంది, తుదకు ఉత్తమ గతులను పొందుతారని’ మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
ప్రాంజలి ప్రభ
Comments
Post a Comment