""అన్నమాచార్య సంకీర్తనామృతం"
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం : భావము :సర్వస్వము భగవంతునిది అయినప్పుడు తిరిగి ఆయనకు ఆయన సంపద సమర్పించడం ఏమిటి _____________________________________________ తాళం :గుండక్రియ నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే యీవల నీ సొమ్ము నీకే - యియ్య సిగ్గయ్యీ నయ్యా ఆలుబిడ్డలఁగని - యటు దనమగనికి సీలాన సమర్పణ - నేయవలె నటయ్యా తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు యే లీల సమర్పించి - నిందుకే నవ్వు వచ్చీనయ్యా! ||నీవే|| అంకెలు గన్నకొడు - కటు దమ తండ్రికిని తెంకి నీ వాఁడనని - తెలుపఁగవలె నటనయ్యా నా లోపల నున్న - లక్ష్మీశ నే నీకు పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా! ||నీవే|| తన నీడ యద్దములోఁ - దానే యటు చూసి పనివడి వూరకే - భ్రమయవలె నటయ్యా అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలనయ్యా! ||నీవే|| _____________________________________________ దేవా! నీ ప్రేరణచే నేను చేసే పనులకు ఫలితం ధనం, సంపద, వస్తు రూపం లో నీవే నాకిస్తున్నావు. తిరిగి నీవిచ్చిందే నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. ...