192



సూర్యోదయము మనకు మేలుకొలుపు 
సుర్యాస్తమము మనకు నిద్రకు పిలుపు 
సుర్యకంతులే మన భవిషత్తుకు మలుపు 
సూర్యునితో మన పరుగు ఆరోగ్యానికి మెరుపు 

బంగారు కాంతుల భానుడు 
వెలుగు చూపే ముద్దకర్పూరుడు    
వేడినిపంచే హ్రుద్యానందభానుడు 
నిత్యము ప్రుద్విని తాకే మహనీయుడు 




అబ్బురమగు..
----------------------

కం.

సూర్యోదయములు ముదమిడు
సూర్యాస్తమయములవియునుఁ జూడఁగ మురువే
సూర్యుఁడె జగదాధారము
సూర్యునితో ముడివడినవి క్షోణిని బ్రతుకుల్‍

బంగరు కాంతుల భానుఁడు
రంగుగ వెలుఁగు కరములును రమణీయంబై
పొంగఁగఁ జేయును హృదయము
నింగికి నేఁ జేరినటుల నిత్యము రవితో

నిలువక పరుగిడఁ జీఁకటి
యిలపయి దిశదిశలు వెలిఁగి యింపుగ నుండన్‍
మిలమిల మెఱియఁగ జలములు
గొలఁకులలో నందమొలుకుఁ గుములగు తమ్ముల్‍ /గ్రొందామరలున్‍

తొలఁగును బద్ధకమంతయుఁ
గలుగఁగ నుత్సాహమదియుఁ గనినంత నినున్‍
సలుపుచుఁ దనదౌ ధర్మము
గలిగించును ధృతిని మనకుఁ గష్టించ సదా

ఫలమును గోరఁడు కొంచెము
సలిపియు హితవైన పనిని సతతంబిలకున్‍
కలఁగఁడు వొగడక యున్నను
నిలుపఁడు తన పనులనవియు నిముసంబయినన్‍

ఆరోగ్యకరుఁడు రవియని
తీరుగ శాస్త్రములు నుడువు, తెలిసినదె కదా
ఏ రోజు రాకయుండిన
గూరును దిగులేదొ, చెలునిఁ గోల్పోయినటుల్‍

లేచినవెంటనె నిత్యము
వేచెద నుత్కంఠఁ , జూడ వెలుఁగుల ఱేనిన్‍
బూచిన పూవే యగు మది
తోచిన వెంటనె ఖగుఁడఁట తూరుపు దిశలో

పరికించుచుండ నతనిని
గరముల వే బంపి నింపఁ గాంతుల ధరపై
నరుగుచునే మెల మెల్లఁగఁ
జిరునవ్వులఁ బలుకరించుఁ జేయకె వినతిన్‍

కూర్చొని యరయుచు నటులే
పర్చిన యా కాంతులన్ని పండుగఁ జేయన్‍
నేర్చిన శ్లోకము జదువుదు
నర్చనగాఁ దాను గూడ నలరఁగ దానిన్‍

ఊపున నేగఁగ నశ్వా
లాపక తనరథము వేగ నరుణుఁడు నడుపన్‍
బైపైన సాగుచుండును
రూపించుచుఁ బనిని శ్రద్ధ లోకంబునకున్‍

అరుగుచు నుండఁగఁ దానటు
మరువక తన ధర్మమెపుడు మాన్యుండగుచున్‍
గరములు జోడించి మరల
నరిగెద నా పనికి నేను నానందముతో

దబ్బర లాడని తత్త్వము
నిబ్బరముగ సాగు గుణము నియతపథంబున్‍
మబ్బులు గ్రమ్మియుఁ గ్రుంగఁడు
అబ్బురమగుఁ జూడ నతని యాధిక్యంబున్‍.

౦౮:౫౮ ఉదయము

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు