నేటి : విశ్లేషణ

అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌(కథ)

సాహితీమిత్రులారా!
అంతస్తుకు రెండు అపార్ట్‌మెంట్స్‌ చొప్పున మూడంతుస్తుల్లో ఆరు కాపురాలున్న అయిదారు వందల భవనాల కాలనీ మాది. తీర్చిదిద్దినట్టుండే వీధులు, పంచరంగుల కేకులతో కట్టిన మిఠాయి నిర్మాణాల లాంటి ముచ్చటైన భవంతులు, ఆగంతుకులెవరైనా వస్తే వచ్చిందెవరో తెలుసుకోవడానికి వీలుగా తలుపులో అమర్చి ఉంచిన ‘అద్దపు కన్నూ’, వచ్చిన వాళ్ళెవరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చి వుంటే చేయి మాత్రం బయటికి చాపి వాటిని తీసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన గొలుసు అమరిక.

పచ్చని చెట్లతో పూలమొక్కలతో పచ్చిక బయళ్ళతో ప్రశాంత మనోహరమైన వాతావరణం. కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్‌ రోడ్డు పైనుంచి లోపలకు రావడానికి ఏర్పాటు చేసిన ఏకైక ప్రధాన ద్వారం. అక్కడ అహర్నిశలూ కాపలా వుండే ఘూర్ఖాలు. ఇదంతా చూస్తే పూర్వకాలంలో ప్రాగ్జోతిషం, పాటలీపుత్రం, కన్యాకుబ్జం లాంటి మహా నగరాల కెట్టి రక్షణ ఉండేదో అంతటి భద్రత మాకాలనీకీ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కాలనీ వాళ్ళం కదా! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే సంబంధాలు ఉండవు. కిరాణాకొట్లు, ఫ్యాన్సీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సదుపాయాలు, పోస్టాఫీసు, లైబ్రరీ మొదలైన వన్నీ కాలనీలోనే ఉన్నాయి.

ఉద్యోగుల్ని తూర్పుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు తీసుకెళ్ళడానికి డిపార్టుమెంటు వారి ప్రత్యేక బస్సు సర్వీసులున్నాయి. ఉదయం ఎనిమిది కొట్టగానే మెట్లపైనుంచి ప్రారంభమయ్యే బూట్ల టకటకలు రోడ్లపైకి వచ్చి అక్కడనుంచి ముందుకు సాగి ప్రధాన ద్వారం దగ్గర ఆగిపోతాయి.

“ఏమండీ సుందర్రావు గారూ! నిన్న సాయంకాలం లైబ్రరీ దగ్గర కనిపించలేదే?”

“అయ్యా శ్రీనివాసన్‌ సార్‌! రండి రండి. ఆనందవికటన్‌ కావాలంటిరే, మాకోసరం తెస్తిని. తీసుకెళ్ళి సదువుకోండబ్బా!”

“అబ్బా నంజుండబ్బా! చిత్రదుర్గా నుంచి ఎప్పుడొస్తివి?”

“క్యాహైజీ అగర్వాల్‌?”

“ఈ రోజు పేపర్‌ చూశావా? అయినా చూసి ఏం లాభంలే. న్యూస్‌ పేపర్లలో ఈ కుంభకోణాల్ని గూర్చిన వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతుందయ్యా.”

ఇలా పలకరింపుల సంబరాలతోనే ఉద్యోగులు బస్సెక్కేస్తారు. సరే, ఉద్యోగప్రయాణం గురించి మనకెందుకు? వదలిపెడదాం. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోయాక, మగవాళ్ళు ఆఫీసుల కోసం బయలుదేరాక కాలనీ లోని సుగుణమణి, జలజలోచన, చారుమతి ఇళ్ళకు తాళాలు వేసుకొని పార్కులోకొచ్చి చెట్లనీడలో కూర్చుంటారు. శిరోమణి, దేవసేన, రాజేశ్వరి, విజయ, ప్రసూనలు సాధారణంగా రీడింగు రూములోనే కలుసుకుంటుంటారు.

అరవైయేళ్ళ భగీరథమ్మ వినాయకుడి గుడి మండువాలో ఆంధ్రవాల్మీకం చదివి పది పదిహేను మంది శ్రోతలకు (వీరిలో వయసు మళ్ళిన వాళ్ళతో బాటుగా వయసు మళ్ళని జిజ్ఞాసువులు గూడా వుంటారు) అర్థవివరణ చేస్తూ వుంటుంది. వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు చేరేది మధ్యాహ్నం పన్నెండుకే పన్నెండున్నరకు బడినుంచి పిల్లలొస్తున్నారు గదా! వాళ్ళకన్నాలు పెట్టి మళ్ళీ బడికి పంపించేశాక విశ్రాంతి. టీవీ చూడ్డమైనా, పుస్తకం చదవడమైనా అర్థంతరంగా ఆగిపోవడమే మామూలు.

నిద్రకునుకు తీసుకునేటప్పటికి గంట నాలుగు దాటి వుంటుంది. ‘అమ్మో! పిల్లలొస్తారు, ఆయనొస్తారు ఆవురావురుమంటూ. ఏదైనా టిఫిను చేసేయాలి.’ ఇక చూసుకోవలసిందే తమాషా. కాలనీ అనే యంత్రం అమాంతంగా స్టార్టయిపోతుంది. కొళాయిల్లోంచి నీళ్ళు దూకుతాయి, మిక్సీలు గొంతు విప్పుతాయి, గ్యాస్‌ స్టవ్‌లు క్రమబద్ధీకరించిన మంటల్ని విరజిమ్ముతాయి.

అలాంటి ఒక సాయంకాలపు వేళ చెట్ల నీడలు చూస్తూ, గాలి హాయిగా వీస్తూ, పక్షులు చెట్టు పైన్నుంచి చెట్టుపైకి ఎగురుతూ, పిల్లలు ఆటస్థలాల్లో ఆడుకుంటూ అందాలతో ఆనందాలతో ప్రకృతి పరవశించి పోతున్న వేళ చామన చాయతో, పొందికైన క్రాఫింగుతో, నశ్యం రంగు ప్యాంటుతో, తెలుపు పైన ఊదారంగు చారల చొక్కాతో, ఖాళీ క్యారియరు వాటర్‌ బాటిల్‌ ఉన్న ప్లాస్టిక్‌ బుట్ట చేతబట్టుకుని ఒక ముప్పై అయిదేళ్ళ ఉద్యోగి బస్సు దిగాడు.

బస్సు దిగేటప్పటికతడు గుంపులో గోవిందయ్య. పాపం వార్తల్లో కెక్కాలన్న ఊహగానీ, ప్రయత్నం గానీ లేనివాడు. ఆనాటి సంఘటన కతడి ప్రమేయం ససేమిరా లేదు. అయితే అది జరిగిన తర్వాత అతడి జీవితం అంతకు మునుపటి జీవితంతో పోల్చుకోవటానికి వీల్లేనంతగా మారిపోయింది. అతడు తనకు, ఊహకు, ప్రయత్నానికి అతీతంగా వార్తల్లోకెక్కిపోయాడు. వక్కపలుకు నోట్లో వేసుకొని కొరికినంతసేపట్లో అతడి ఊరూ, పేరూ, స్వభావం, హాబీలు, భార్యాబిడ్డల గుణగణాలు మొదలైనవన్నీ కాలనీలో ఒకరికొకరు చెప్పుకోవలసిన, చెప్పగా చెవి ఒగ్గి వినవలసిన ముఖ్యవిషయాలుగా మారిపోయాయి.

అతడిపేరు షణ్ముగసుందరం. స్వస్థలం చిదంబరం దగ్గర తిరుమంగళం. తండ్రి ప్రైమరీ పాఠశాల టీచరు. మేనమామ మద్రాసులో ఉండడం వల్ల అతడు పైచదువులు కొనసాగించ గలిగాడు. గిండీ ఇంజనీరింగు కాలేజీలో పట్టా పుచ్చుకున్నాడు. భార్య పేరు శివగామి. ఒక కూతురు, పేరు దేవయాని. వయస్సు తొమ్మిదేళ్ళు. కొడుకు ఏడేళ్ళవాడు, పేరు పార్థు. అన్యోన్య దాంపత్యం, కుదురైన బిడ్డలు. అతడి ఉద్యోగ జీవితం ప్రారంభం కావడం ఇక్కడే. కన్‌స్ట్రక్షన్‌ డిపార్టుమెంట్‌లో సెక్షన్‌ హెడ్‌. సాయంకాలం అతడిల్లు చేరుకునేటప్పటికి పిల్లలు ప్లేగ్రౌండుకు వెళ్ళి వుంటారు. ముఖం మాత్రం కడుక్కొని ఈవలికొచ్చేసరికి భార్య వేడిగా కాఫీ కప్పు చేతికిస్తుంది. కాఫీ సేవనంతో పిచ్చాపాటీ మొదలవుతుంది.

పత్రికలు చదువుకోవడం, టీవీ చూడ్డం, పిల్లలకు హోమ్‌వర్కులో సాయపడ్డం, తిరుమంగళం నుంచో మద్రాసునుంచో జాబులొస్తే ఒకొక్క వాక్యాన్ని చదివి అభిప్రాయాలు ప్రకటించడం ఈ మాత్రమే వాళ్ళ వ్యవహార జగత్తు. సరే, షణ్ముగసుందరం ఆరోజు సాయంకాలం బస్సు దిగాడన్నది ప్రస్తుతాంశం. ఉత్తరంగా వెళ్ళే రోడ్డుపైన కమ్యూనిటీ హాలుదాకా వెళ్ళి అక్కడ పడమరకు తిరిగితే సన్నటిరోడ్డుకు ఎడమవైపు వున్న కట్టడంలోని రెండో అంతస్తులోని ఒక వాటాలో అతడి కాపురం. ఇంటి నెంబరు సి123.

షణ్ముగసుందరం మెట్లెక్కాడు. ఎన్నడూ లేనిది మూసిన తలుపు బిగించిన తాళంతో వ్రేలాడుతూ ఉంది. “ఏమిట్రా ఇది. ఈ వేళప్పుడు ఈమె ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయింది?” అనుకున్నాడు షణ్ముగసుందరం. ఎదురింట్లో వాళ్ళనడుగుదా మనుకుంటూనే కాళ్ళ క్రిందనున్న తివాచీ పైకి తీశాడు. తాళం చెవి కన్పించలేదు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆమె తాళం చెవి తివాచీ క్రింద పెట్టి వెళ్ళడం మామూలే!

“ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళివుంటుందబ్బా?” అనుకుంటూ తన జేబులోని డూప్లికేటు తాళం చెవితో తలుపు తెరిచాడు. కథలో ఇక్కడిదాకా గీత గీస్తే ఇంతకు మునుపటిదంతా వెలుగనీ ఆపైన పరుచుకున్నదంతా చీకటనీ గుర్తించాలి.

లోపలి కెళ్ళిన షణ్ముగసుందరం రెండే రెండు నిముషాల్లో గావుకేకలు పెడుతూ బయటకు పారిపోయి వచ్చేశాడు.

ఏమిట్రా ఈ గగ్గోలు అన్నట్టుగా చుట్టుప్రక్కల కొన్ని ఇళ్ళలోని కిటికీలు తెరుచుకున్నాయి. కొందరు ధైర్యవంతులు గబగబా మెట్లెక్కి అపార్టుమెంటులోకి జొరబడ్డారు. క్రిందనే నిల్చుండి పోయిన వాళ్ళు, ఏమైంది ఏమైందని పైకి వెళ్ళిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళం!

వాస్తవం స్పష్టంగా అవగతం కావడానికి పదిపదిహేను నిముషాల కాలం పట్టింది. శివగామి వంటింట్లో అలమరాల నడుమ సన్నటి జాగాలో పొడవునా పడివుంది. అమ్మాయి బెడ్‌రూమ్‌లో మంచానికడ్డంగా పడివుంది. ముందువైపు హాల్లో కుర్రవాడు కుర్చీలోనే తల వాల్చేసి వున్నాడు. ముగ్గురి గొంతుకల చుట్టూ ఊపిరి తిరగకుండా ప్లాస్టిక్‌ తాడు లాంటి దానితో బిగించినట్టు కుశాగ్రబుద్ధులైన పరిశీలకులు పోల్చుకున్నారు. కాలనీ అన్నివైపుల నుంచీ కమ్యూనిటీ హాలు దిశగా జనసంచలనం ప్రారంభమైంది.

“ఏమండీ, ‘షణ్ముగసుందరం’ అంటున్నారు ఎలా వుంటాడతను? పొట్టిగా బొద్దుగా బట్టతలతో..”

“అబ్బే అయివుండదండీ! బస్సులో కొందరు ‘సుందరం, సుందరం’ అని పిలుస్తుండగా చూశాను. అతను సన్నగానే ఉంటాడు. లేదంటే క్రమబద్ధంగా పెంచిన గుబురు గడ్డంతో ఎలుగుబంటిలా కనిపించినట్టు జ్ఞాపకం.”

“పరవాలేదులెండి. మనిషి సజీవుడై వున్నాడు కదా! రేపో మాపో కనిపించక పోతాడా?”

“ఏం సజీవుడో! తగిలిన దెబ్బకింక కోలుకుంటాడా అనేదే అనుమానం. అయినా మానవ మాత్రుడికి రాదగిన కష్టమా?”

మరొకవైపు కాలనీ మహిళల ఆసక్తి ఇంకొక విధంగా కొనసాగుతోంది. “ఎవరో శివగామి అంటమ్మా! నాకైతే చూచిన జ్ఞాపకం లేదు. అరవావిడగదా! మిగిలిన వాళ్ళతో అంతగా కలిసేది కాదేమో…”

“చొరవ రెండు పక్కల నుంచీ వుండాలి గదమ్మా రాజేశ్వరీ! మనమే ఆమెను ఆంతరంగికంగా దగ్గరకి చేరనివ్వలేదేమో…?”

“ఇంతకూ మనిషెవరో తెలియకపోయినా ఊహాగానాలెందుకు? నాకు తెలిసి ప్రతి శుక్రవారం ఉదయం తలంటిపోసుకొని వదులు జారుముడిలో పువ్వులు తురుముకొని విభూది పట్టెలపైన ఇంతేసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఓ అరవావిడ వినాయకుడి గుడికొస్తుండేది. ఇదంతా మద్రాసు ఆడవాళ్ళ సాంప్రదాయం. ఆ శివగామి కూడా మద్రాసే అంటున్నారు గదా…” ఇలా ఈ పరామర్శలన్నీ ‘బీటింగ్‌ అరౌండ్‌ ది బుష్‌’గా పరిణమించాయే గానీ అసలు మనుషులెవరో చాలామందికి స్ఫురించలేదు.

ఇంతకూ ఆ షణ్ముగసుందరమనే దైవోపహతుడితోను, శివగామి అనే అల్పాయుషును అడిగివచ్చిన ఆవిడతోనూ ముఖపరిచయం కలిగిన వాళ్ళెందరు? పలకరించిన వాళ్ళెందరు? సన్నిహితంగా మిత్రత్వం కలిగిన వాళ్ళెందరు?

ఇంతకూ వాళ్ళు కొద్ది నెలల క్రితం వచ్చిన వాళ్ళేం గాదు. దాదాపుగా పదేళ్ళుగా వుంటున్న వాళ్ళ ఐడెంటిటీని గురించి కూడా కాలనీవాళ్ళు ఊహాగానాలు సల్పవలసి వచ్చిందంటే మానవతా సంబంధాలు మరమ్మత్తుకు వీలుబడనంతగా శైథిల్యం చెందినట్టు గాదా? ‘ఊరా, అడివా?’ అంటుంటారు. మా కాలనీ వ్యవహారం చూస్తుంటే ఈ రెండింటికీ అట్టే తేడా వున్నట్టులేదు మరి!

ఎదురు చూడని దారుణసంఘటన ఏదైనా సరే అది జరిగిన తర్వాత కాసేపటి వరకు దాని తీవ్రత ఏపాటిదో తెలిసిరాదు. మనసు తాత్కాలికంగా మొద్దుబారిపోతుంది. మళ్ళీ దానిలో కదలిక రావాలంటే షాక్‌ ట్రీట్‌మెంట్‌ లాంటిది మరొకటి అవసరమవుతుంది. పరిపరి విధాలుగా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకుంటున్న జనంలోకి ఒక పోలీసు జీపు చొచ్చుకురావడం అలాంటి సన్నివేశమే!

ఆగిన జీపులోనుంచి లాఠీ లూపుకుంటూ అయిదారుగురు పోలీసులు దిగారు. సబ్‌ ఇన్స్‌పెక్టరు ముందు సీటులోంచి క్రిందికి దూకినంత పనిచేశాడు. పోలీసులు “తప్పుకోండి తప్పుకోండి. అందరూ మీమీ ఇళ్ళకు వెళ్ళండి. వెళ్ళక పోయారో మా లాఠీలకు పని చెప్పవలసి వస్తుంద”ని హెచ్చరిస్తూ నేరస్థలాన్ని నిముషాల్లోనే నిర్మానుష్యం గావించారు.

ఇళ్ళకైతే వెళ్ళారుగానీ తలుపులు కిటికీలు బిగించుకున్నా జనానికి నిబ్బరం లేకపోయింది. లోకంలో ఎక్కడో ఉన్నారని భావించబడుతూ వచ్చిన హంతకులు ఇప్పుడు కాలనీలోనే వున్నారు. ఇప్పుడున్నా లేకపోయినా మధ్యాహ్నం పన్నెండూ ఒంటిగంటకు మధ్య ఇక్కడున్నారనడానికి మూడు నిర్జీవమైన శరీరాలు సాక్ష్యంగా వున్నాయి. ఈ స్పృహ కలగడంతో బయట ఏమాత్రం చిన్న అలికిడి అయినా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బిగ్గరగా మాట్లాడుకోడానికైనా నిబ్బరం లేకపోయింది. తలుపులకు తాళాలు బిగించి కాలనీ వాసులందరూ కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి అక్కడ అల్లీబిల్లీగా పడుకోగలిగితే ఎంత బాగుండునోననిపించింది. భయం భయంగానే మరునాటి ఉదయం తెల్లవారింది.

“ఏవండీ! ఈ రోజు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోగూడదూ?” ప్రతి ఇంట్లోని గృహిణి నోటి వెంట ఈ అభ్యర్థన వెలువడింది.

“పరవాలేదు. తలుపేసుకో. ఎవరైనా తలుపు తడితే గాజుకన్నులో నుంచి పరిశీలనగా చూసిగానీ తియ్యకు. పిల్లల్ని స్కూలుకు పంపొద్దు. ఎన్నో తతంగాలుంటాయి. వాళ్ళు జడుసుకోగలరు.” గృహస్థులు మెలకువలు చెబుతూనే మెయిన్‌ రోడ్డు వైపు నడిచారు. అప్పటికి షణ్ముగసుందరం బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి దిగేశారు. కమ్యూనిటీ హాలు ప్రాంతాలకు వెళ్తే అరవవాళ్ళ శోకాలు హృదయవిదారకంగా విన్పిస్తున్నాయి. అంతలో పోలీసులు కలగజేసుకొని కళేబరాలను పోస్టుమార్టంకి తీసుకెళ్ళిపోవడం కాలనీకంతా కొండంత రిలీఫయిపోయింది.

అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మగవాళ్ళనడిగి లాభం లేదని వాళ్ళకు తెలిసిపోయింది. ఆ సమయంలో ఆఫీసు డ్యూటీలో వుండిపోవడం వాళ్ళ పాలిటికొక వరమై పోయింది. ఎటొచ్చీ స్త్రీలను, వృద్ధుల్ని ఇంటరాగేట్‌ చేయడమే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటు ఉన్న పరిశోధనాప్రక్రియ అయిపోయింది.

“ఏమ్మా! నీపేరేంటి?”

“నా పేరా సార్‌… నన్ను రూపకళ అంటారండీ!”

“ఇది మీఇల్లే కదూ?”

“అవునండీ!”

“సి123 మీకెంత దూరంలో వుంది?”

“ఎంతో ఎక్కడిది సార్‌! మాపైనింటికి ఎదురువైపు ఇల్లేగదా!”

“మంచిదమ్మా! పోయిన బుధవారం పదో లేక పదకొండు గంటల ప్రాంతంలో నువ్వింట్లోనే వున్నావు గదా?”

“ఉన్నానండీ!”

“అప్పుడు నీకు ప్రాణాలు విలవిలలాడిపోయేటట్టుగా గావుకేక ఏదీ వినిపించలేదా?”

“అబ్బే, లేదండీ!”

“చాలా ముఖ్యమైన విషయమమ్మా! కాస్త జ్ఞాపకం చేసుకొని మరీ చెప్పు తల్లీ?”

కాసేపు మౌనం, మనసులోనే ఏవో తర్జనభర్జనలు చేసుకుంటున్నట్టు నిల్చున్న రూపకళ నోటిలోంచి ఒక మాట (అదైనా ఎంత భాగ్యం!) బయటపడింది.

“తలుపులు వేసుకొని వున్నానండీ. ఎవరో అరచినట్టే తోచింది. కోతి ఏదైనా ఇంట్లో దూరిందేమో అనుకున్నాను.”

“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకో తల్లీ!” అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఎదురింటి తలుపు తట్టాడు పోలీసు ఇన్స్‌పెక్టర్‌.

“అమ్మా! నీపేరు?”

“ఇందుమతి సార్‌!”

“సి123 మీకెంత దూరంలో వుంది?”

“ఎంతో దూరం ఎక్కడిది సార్‌ మాపై ఇల్లే కదా!”

“ఓహో పైదే కదూ. చూడండి ఇందుమతి గారూ, పోయిన బుధవారం పదీ పదకొండు గంటల ప్రాంతంలో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా?”

“ఉన్నానండీ!”

“ఆ సమయంలో మీపై ఇంట్లోంచి ప్రాణాలు పోయేట్టుగా అరచిన గావుకేక ఏదీ నీకు విన్పించలేదా?”

“అస్సలు విన్పించలేదండీ!”

“కొంచం ఆలోచించి చెప్పు తల్లీ!”

కాసేపు మౌన వ్రతం పాటించాక ఆమె నోటినుంచి ఒకమాట బయటపడింది. “ఆరోజు కాస్త ఎక్కువ టిఫిను తినడంతో ఆసమయంలో మంచి నిద్రలో ఉన్నానండీ…”

“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకొని నిద్రపో తల్లీ.” అని ఇన్స్‌పెక్టర్‌ అనడమే తరువాయి రిమోట్‌ కంట్రోల్‌ స్విచ్‌ నొక్కినట్టుగా తలుపులు మూసుకుపోయాయి.

“ఏవండీ మీపేరు?”

“తణిగాచలం!”

“వయసు?”

“అరువది”

“ఏం జేస్తుంటారు?”

“నేనేం జేద్దునండీ! మావాడుదా ఇక్కడ ఎంప్లాయీ.”

“మీరేంజేస్తుంటారు?”

“ఏంజెయ్యను సార్‌! ఏదో టిఫిను, హిందూ పేపరు, మధ్యాహ్నం భోజనం, నిద్ర…”

“సరే సరే. పోయిన బుధవారం ఉదయం పదికీ పదకొండుకీ మధ్య సి123 నుంచి ఏదైనా చావుకేక విన్పించిందా?”

“విన్పించలేదని చెప్పేదానికి ఎట్లా మాళును సార్‌? మాది ఎదురిల్లే గదా. పైగా అది నాను పేపరు సదివే టైం మా ప్లాట్‌ ముందర కుర్సీ వేసుకొని పేపరు సదువుతా వుంటిని. పదకొండు గాక ముందే అనుకుంటా, ఆ ఇంట్లో నించి ఎవురో ఆడమనిసి అరిసినట్టుదా అనిపించింది. ఆ యింటమ్మ బాత్‌ రూంలో గాన కాలుజారి పడిందేమో అనుకుంటిని.”

ఒకవైపు ఇలా పరిశోధన కొనసాగిస్తూ ఇంకొకవైపున కాలనీలో నివశిస్తున్న వారి భయాందోళనలు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పగటిపూట కూడ సాయుధ పోలీసుల గస్తీ కొనసాగుతోంది. కాలనీ ఆవరణలో ఏ అనుమానితుడు కనిపించినా పోలీసు గుప్పిట్లోంచి బయటపడేసరికి వాడికి తాత ముత్తాతలు కనిపిస్తున్నారు.

“మీరెవరు?”

“ఎక్కడికెళ్ళి వస్తున్నారు?”

“ఏ పని మీద వెళ్ళారు?”

“మీ అడ్రసేమిటి?”

“మీ ఇంటి నెంబరెంత?” అన్న ప్రశ్నల్ని అక్కడ ఏండ్లుగా పూండ్లుగా నివశిస్తున్నవాళ్ళు కూడా ఎదుర్కోక తప్పడం లేదు. పాలు, పళ్ళు, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు గూడా “ఇదేం గొడవరా బాబూ! ఈ పోలీసులతో తంటా మనకెందుకు?” అనుకుంటూ మెయిన్‌ గేటు దగ్గర నుంచే తిరిగి వెళ్ళిపోతున్నారు.

“దాదాపు రెండు వారాలు గడిచినా నేరస్తుల్ని పట్టుకోలేక పోతున్నారంటే వీళ్ళేం పోలీసులండే?” సంశయాత్ములు చెవులు కొరుక్కోసాగారు.

ఇంతలో ఒక ఘోరవార్త గాలిలో కలిసి ఇంటింటికీ ప్రాకి వచ్చింది. “తల్లినీ, బిడ్డల్నీ గుట్టు చప్పుడు గాకుండా మట్టుబెట్టే అవకాశం వుంటేగింటే ఒక్కడికే వుంటుందండీ!”

“ఎవరికి?”

“ఇంకెవరికండీ? ఆమె భర్తకే!”

“కారణం ..?” కారణం పైన ఊహాగానాలు సాగిపోతున్నాయి.

అయితే ఈ ఊహాగానాలన్నింటినీ వమ్ము చేస్తూ నెలరోజుల నాటికి దినపత్రికల్లో కాలనీ హత్యలకు సంబంధించిన హంతకుణ్ణి గురించిన ప్రముఖవార్తలు వెలువడ్డాయి.

“మూడు ఘోరమైన హత్యలు చేసింది ఒక్కడే!”

“కిరాతక హంతకుడు పట్టుబడిన వైనం!”

“పోలీసుల దగ్గర నేరం ఒప్పుకున్న హంతకుడు!”

వాడి పేరేమిటో అనవసరం. అత్యవసరంగా వాడికి కొంత పెద్ద మొత్తం లోనే డబ్బు కావలసి వచ్చింది. కాలనీలో తొమ్మిదింటి పైన మగవాళ్ళుండరనీ, ఆడవాళ్ళని బెదిరించి నగలు లాక్కోవడం సులభమనీ లెక్కగట్టాడు. ఓ ఇల్లాలు కిరాణాకొట్టుకు వచ్చి తిరిగి వెళ్తోంది. ముద్దాయి (?) గమనించాడు. ఆమెను తాను వెంబడిస్తున్నట్లు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ దూరం నుంచే ఆమెను వెంబడించి ఆమె ఇంట్లో కెళ్ళిన తరువాత తలుపు తట్టి రేషన్‌ కార్డులు పంపిణీ చేసే రెవెన్యూ బంట్రోతునని చెప్పుకున్నాడు. ఆమె లోపలికొచ్చి కూర్చోమంది.

“నీళ్ళు కాస్త ఇప్పిస్తారా?” అని అడిగాడు.

మంచి నీళ్ళు తేవడం కోసం ఆమె వంటగదిలోకి వెళ్ళగానే వీడు తటాలున ఆమెపైకి దూకి మెడలోని నగలు తెంచుకోబోయాడు. ఆమె బిగ్గరగా కేకపెట్టేసరికి జేబులోంచి నైలాను దారం తీసి దాంతో ఆమె గొంతు బిగించేశాడు. నగలు చేతికి చిక్కించుకోగానే బయటికొచ్చేసి తన దారిన వెళ్ళిపోయి వుండేవాడే… తలుపు కాస్త తీసి చూసే సరికి ఎదురింటి ముసలాయన గుమ్మం ముందర కుర్చీ వేసుకొని పేపరు చదువుకుంటున్నాడు. ఆయన లేచి లోపలికి వెళ్ళే దాకా అతడు లోపల వుండక తప్పదు. శవంతో పాటుగా ఇంట్లో ఒంటరిగా ఉండడంతో వాడి మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఇంతలో పన్నెండు కాగానే బడినుంచి పిల్లలొచ్చేశారు. వాళ్ళు తలుపు తడుతుంటే తీయకపోవడం ఎలా? అనుమానం రాదా? తలుపు తీసి వాళ్ళను లోపలకు రానిచ్చాడు. అపరిచితుడ్ని చూసి పిల్లలు కంగారు పడిపోయారు. “అమ్మా! అమ్మా!” అని ఎలుగెత్తి అరవబోయారు. హంతకుడికి మళ్ళీ నైలాన్‌ తాడుతో అవసరం తప్పలేదు. చంపాలనుకోలేదు. వాళ్ళ నోళ్ళు మూయించాలనుకున్నాడు. కానీ వాళ్ళే తొందరపడి పోయారు.

“అమ్మో! చూశారా? ఎలా జరిగిందో?! అబ్బబ్బ! ఆ గుండెలు తీసిన బంటు ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుండును కదండీ…!”

కాలనీవాసుల సంకల్పబలం చాలా గొప్పది. మరునాటి సాయంకాలం ఏడుగంటలప్పుడు ఎవరైనా పోల్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో చేతులకు బేడీలు బిగించి వున్న ముద్దాయిని (?) ఏడుగురు పోలీసుల రక్షణలో తీసుకొని కాలనీ వీధులన్నింటా త్రిప్పించాడు ఇన్స్‌పెక్టరు.

“అరరె… వీడేనా! భుజాన ఓ సంచీ తగిలించుకొని కాలనీలో తిరుగుతూ ఒకటి రెండు సార్లు కనిపించాడండీ!”

“సి123 లో దారుణం జరిగిన మరునాడు కూడా చూసిన జ్ఞాపకం!”

“అయినా మీసాలైనా సరిగ్గా రానివాడు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్ట గలడని ఎలా అనుకుంటాం సార్‌…?”

“అయ్యా! మీరు అనుకోవడానికి వీలున్నా ఏమీ అనుకోరు. చూడ్డానికి వీలున్నా చూడరు. స్పష్టంగా విన్పించినా వినిపించుకోరు. ఏమండీ సార్‌! అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి. ఇక్కడ జరిగిన ఘోర హత్యలకు ప్రత్యక్షంగా బాధ్యత వీడేనని నేను ఒప్పుకొంటున్నాను. మరైతే పరోక్షంగా బాధ్యత వహించాల్సిన వారి పరిస్థితి ఏమిటి?” నిక్కచ్చిగా ఓ ప్రశ్నను సంధించి జవాబు కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు ఇన్స్‌పెక్టర్‌.

కాలనీ వాసులకు మతిపోయినంత పనైంది. వాళ్ళొకరి మొహం ఒహరు చూసుకున్నారు. ఇన్స్‌పెక్టర్‌ ఆరోపణ ఏమిటో అర్థం అయినా ఏం జవాబు చెప్పాలో తోచక నీళ్ళు నమలసాగారు.

“అయ్యా! మీరేమీ చెప్పరని నాకు తెలుసు. నేనే చెబుతున్నాను వినండి. హత్యలు జరిగిన ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి చేత ఆర్తనాదం చేయించి ఆ తరువాత మేము వాకబు చేసి చూశాము. దాదాపు పది పన్నెండు ఇళ్ళ వాళ్ళకు ఆ కేక స్పష్టంగా వినిపించినట్టు తెలిసింది. అలా విన్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా తోటిమనిషి పట్ల కొంచం అక్కర, శ్రద్ధ చూపివుంటే మొదటి హత్య జరగగానే నేరస్తుడు దొరికిపోయి వుండేవాడు. కనీసం పిల్లలైనా బ్రతికి బయటపడి వుండేవారు.

ఆ ఇల్లాలును చంపినవాడు వీడే! సరే అందుకు అభిప్రాయభేదం లేదు. కానీ పిల్లల హత్యలకు బాధ్యత వహించవలసిన వాళ్ళు ఇక్కడ ఇంచుమించు ఇరవైమందైనా ఉన్నట్టు మా విచారణలో మేము తేల్చుకున్నాము. వాళ్ళ కెవరు శిక్ష విధిస్తారు?”

నాటికీ నేటికీ ఆ ప్రశ్న మా కాలనీలోనూ అంతకన్నా ఎక్కువగా నాలోనూ ద్వనిస్తూనే వుంటుంది. షణ్ముగసుందరం ఇంటికి సరిగ్గా వెనకవైపు ఇల్లు మాది. ఆరోజు నాకు మధ్యాహ్నం డ్యూటీ అవడంతో కాస్తంత తొందరగా భోజనాని కుపక్రమిస్తున్న వేళ లీలగా విన్పించిన కేక కలవరపెట్టినా ఎక్కడో గొడవలే అనుకొని తాపీగా భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోయిన సందర్భం నన్ను వెంటాడుతూనే వుంటుంది. పోలీసు విచారణలో నిర్ధారించుకున్న చట్టాతీత బాధ్యతాయుతమైన ఇరవైమంది నేరస్థుల్లో నేనూ ఒకడినన్న విషయాన్ని మాత్రం ఎన్నటికీ మరువను.
---------------------------------------------------------
రచన: పల్లేటి బాలాజీ, ఈమాట సౌజన్యంతో
--------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

విలేకరి(కథ)

సాహితీమిత్రులారా!
“సూర్యం గారిల్లిదేనాండీ?” అంటూ ఎవరిదో గొంతు వినిపించి మధ్య గదిలో టైపు చేసుకుంటున్నవాణ్ణి ఒక్కసారి ఆగాను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి త్వరగా ఈ వార్తని టెలిగ్రాం పంపించాలి. మూడింటిలోగా విజయవాడ అందితే రేపు పేపర్లో వచ్చేస్తుంది. నా పత్రికాఫీసు మా ఇంటికి దగ్గర్లోనే వుంది. అక్కడయితే వచ్చీ పోయేవాళ్ళ గోలతో పని కాదు. అందుకని ఇంటికొచ్చి మరీ టైపు చేసుకుంటున్నాను.

“సూర్యం గారూ! మీ కోసం ఎవరో వచ్చారు..” మా ఇంటి యజమాని గట్టిగా అరిస్తే లేచి వీధి గుమ్మం వైపు నడిచాను. అక్కడ ఒక కుర్రాడు కనిపించాడు. చామనచాయ రంగులో ఉన్న ఆ వ్యక్తి నన్ను చూడగానే నమస్కరించాడు. నేను ప్రతినమస్కారం చేసాను. వచ్చినతన్ని ఎప్పుడూ చూసినట్లు లేదు.

“నమస్కారమండీ. నేను మిమ్మల్ని కలవాలని మద్రాసు నుండొచ్చాను.”

“అలాగా!” అంటూ లోపలకి రమ్మనమన్నట్లు సంజ్ఞ చేసాను. కుర్చీలో కూర్చోమని చెప్పి నేను నా టైపు మిషన్ ముందు కూర్చున్నాను.

“ఎవరు మీరు? మిమ్మల్నెప్పుడూ..” అంటూండగానే అతనే చెప్పుకొచ్చాడు.

“నా పేరు రాఘవ. మాది మద్రాసు. మీరు ఆ మధ్య ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక ఆర్టికల్ చదివి మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను.”

“నా ఆర్టికల్ చదివి వచ్చారా? ఏదది?” అతను మద్రాసు నుండి వచ్చాడంటే ఆశ్చర్యం వేసింది.

“అవునండీ. నెల్లాళ్ళ క్రితం మీరు రాసిన ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న ఆర్టికల్ చదివి చాలా ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే పేపరుకి ఒక ఉత్తరం కూడా రాసాను. చూళ్ళేదా మీరు?” లేదన్నట్లు తలూపాను.

ఓ నెల ముందు నేను ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న పేరుతో ఇక్కడే కోనసీమలో జరిగిన ఒక సంఘటన్ని పేర్లు మార్చి ఆర్టికల్ రాసాను. అదేమిటంటే నందంపూడి వెంకట్రామయ్య కూతురి పెళ్ళిచూపులు. ముందు పెద్దవాళ్ళొచ్చి పిల్లని చూసారు. పెళ్ళికొడుకు విశాఖపట్నంలో ఉద్యోగం. పెళ్ళికొడుకుతో రెండోసారి వచ్చినప్పుడు పిల్ల నచ్చిందీ తాంబూలాలు అప్పుడే తీసుకుందామని ప్రస్తావించారు. అంతే కట్నాల దగ్గర పేచీ వచ్చింది. వెంకట్రామయ్యకీ సంబంధం తెచ్చింది నేనే! పెళ్ళికొడుకు తండ్రి మాకు దూరపు చుట్టం. ఆ మధ్య వైజాగెళ్ళినప్పుడు వాళ్ళబ్బాయి పెళ్ళికొడుకని తెలిసింది. వెంకట్రామయ్యా నేనూ చిన్నప్పటినుండీ స్నేహితులం. ఇద్దరం అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోనే వెలగ పెట్టాం. వాడు ఎయిత్ ఫోరంలోనే చతికిలబడితే చదువచ్చి రాలేదని వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకోమన్నాడు. నేను స్కూలు ఫైనలు వరకూ అక్కడే చదివాను. తరువాత మద్రాసులో కొంతకాలం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆఫీసులో పనిచేసాను. మా నాన్న పోరు పడలేక ఆ వుద్యోగం వదిలేసి ఇక్కడ అమలాపురంలో విలేకరిగా సెటిల్ అయ్యాను.

ఆ పెళ్ళి చూపుల్లో కట్నాల దగ్గర నేనే మధ్యవర్తిగా ఉన్నాను. ముప్పైవేలు కట్నం, లాంచనాలూ ఇవ్వడానికి వెంకట్రామయ్య సిద్ధపడ్డాడు. పెళ్ళికొడుకు మాత్రం ఏభైవేలకి తగ్గనని మొరాయించాడు. ఏభైవేలంటే చాలా ఎక్కువ.

వెంకట్రామయ్యకి దమయంతి పెద్ద కూతురు. మగపిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. దమయంతి మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది. స్కూలు ఫైనల్ దాకా చదివింది. కానీ పొట్టీ, కొంచెం లావూ! ఫొటోలో మొహం చూసి ఎవరైనా ఇట్టే పడిపోతారు. తీరా మనిషిని చూస్తే గతుక్కుమంటారు. దమయంతికి గతంలో చాలా సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోయాయి. వెంకట్రామయ్యకి కూతురి పెళ్ళి బెంగ.

పెళ్ళి మాటల్లో ‘ఏభయికి తగ్గేది లే’దని ఆ పెళ్ళి కొడుకు గట్టిగా అనడం లోపల్నుంచి దమయంతి వింది. విసురుగా పదిమంది మధ్యకూ వచ్చి – “సరే నువ్వు కోరినట్లుగానే మా నాన్న కట్నం ఇస్తాడు. కానీ ఒక షరతు. పెళ్ళయ్యాక నువ్వు నాకు వంట చేయాలి. దానికి నువ్వు రెడీ అయితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే ఇక్కణ్ణుండి వెళ్ళచ్చు.” అంటూ అనేసరికి అక్కడున్న పెద్దలందరమూ నోరెళ్ళ బెట్టాం. దమయంతి మాటలకి షాక్ తిన్నాడా పెళ్ళికొడుకు. మొత్తానికి ఆ సంబంధమూ చెడింది.

“నాన్నా! పెళ్ళి కాకపోతే ఇలాగే ఉండిపోతాను. అంతేకానీ ఈ వేలంపాటకి బలి కాను. నువ్వసలు నాకు సంబంధాలే చూడద్దు” అని తండ్రికి తెగేసి చెప్పింది. దమయంతి తెగువకి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ పదిమందిలోకీ రావడానిక్కూడా సిగ్గు పడే దమయంతి అందరి మధ్యా అలా అనేసరికి ఆశ్చర్యంతో పాటు, ఆమె ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాను.

ఈ సంఘటనే పేర్లు మార్చి రాసి పేపరుకి పంపాను. వాళ్ళకి నచ్చి మద్రాసు ఎడిషన్లో కూడా వేసారు. ఈ వ్యాసానికి వచ్చిన స్పందన చూసి మద్రాసు ఎడిటర్ నన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్తరం రాసాడు. అతను కూడా అది చదివి నన్ను అభినందించడానికొచ్చాడని అనుకున్నాను.

“మీ గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వాకబు చేసి మరీ వచ్చాను. మీరు జరిగిన సంఘటన ఆధారంగా రాసారని గ్రహించాను. మీరు ప్రస్తావించిన ఆ అమ్మాయిని కలుద్దామని వచ్చాను సార్! ఆ అమ్మాయి ధైర్యమూ, సంస్కారమూ చూసి ముచ్చటపడ్డాను. ఆ అమ్మాయిలా ప్రతీవారూ ఉంటే ఈ వరకట్నం అన్నదే పోతుంది.” అంటూ అతను వచ్చిన విషయం చెప్పాడు.

ఆ వచ్చినతను దమయంతిని కలవడానికొచ్చాడని గ్రహించాను. అతనికి జవాబేం చెప్పాలో తెలీలేదు.

నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దని స్నేహాన్ని తెంపేసాడు. నేనూ ఒక మధ్య తరగతి తండ్రినే! నాకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు. కట్నం ఇవ్వందే పెళ్ళి కాదన్న సంగతి నాకూ తెలుసు. వెంకట్రామయ్యకి నచ్చ చెప్పినా వినే స్థితిలో లేడని తెలిసి నేనూ రెట్టించలేదు. వారం క్రితం కొడుక్కి ఉపనయనం చేస్తే నన్ను పిలవలేదు. వాళ్ళ ఆడవాళ్ళు కూడా మాకు తెలుసున్న వాళ్ళందరినీ పిలిచారు కానీ మా ఆవిడ పూర్ణకి బొట్టు పెట్టి పిలవలేదు. పూర్ణ బాధ పడింది. నేనివేమీ పట్టించుకోలేదు.

జరిగినదంతా అతనికి చెప్పాను. అతను దమయంతిని కలుస్తాననీ, వాళ్ళ పెద్దలకి అంగీకారమయితే పెళ్ళి కూడా చేసుకుంటాననీ చెప్పాడు.

నేను దమయంతి పేరూ, వెంకట్రామయ్య పేరూ అతనితో చెప్పలేదు. పైకి నా స్నేహితుడనే చెప్పాను. అతను వాళ్ళ అడ్రసివ్వమని నన్ను బలవంతం చేసాడు. అసలే వెంకట్రామయ్యకి నేనంటే పీకల వరకూ ఉంది. ఇలా నేనే పంపించానని తెలిస్తే అగ్గిమీద గుగ్గిలమవుతాడు.

“తప్పయ్యా! నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అసలే మాకూ, వాళ్ళకీ చెడింది. ఇలా నిన్ను పంపానని తెలిస్తే…”

అతను బ్రతిమాలాడు. అతని మాట తీరు చూస్తే మంచి వాడిలాగే అనిపించింది. చివరకి వెంకట్రామయ్య ఎడ్రసిచ్చాను. నా పేరు ఎక్కడా ఎత్తొద్దనీ చెప్పాను. అతను వెంటనే వెళ్ళి కలవడానికి లేచాడు.

అతను వెళుతూండగా – “మీ ఇంటి పేరు?” వెనక్కి పిలిచి అడిగాను. చెప్పాడు. ఆ వచ్చినతని కులమూ, వెంకట్రామయ్య కులమూ ఒకటి కాదని అర్థమయ్యింది. వెంకట్రామయ్య ఈ పెళ్ళికొప్పుకోడన్న నిర్ధారణకొచ్చేసాను నేను.

ఆ తరువాత నన్ను తిరిగి కలుస్తానన్న రాఘవ రాలేదు. ఆర్నెల్ల తరువాత దమయంతికి పెళ్ళి కుదిరిందని తెలిసింది. ఈ సారీ వెంకట్రామయ్య నన్ను పిలవలేదు. అసలు పెళ్ళి కుదిరిందన్న సంగతి కూడా చాలా గుట్టుగా వుంచాడు. బహుశా నేను రాసిన వార్త గురించి తెలిసి ఎవరైనా ఈ పెళ్ళి చెడగొడతారనుకున్నాడో ఏమో? మొత్తానికి దమయంతికి పెళ్ళి కుదిరిందని సంతోషించాను.

దమయంతీ మా పెద్దమ్మాయి ఈడుదే! నేనూ మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మంచి సంబంధం దొరకడం కష్టంగానే అనిపించింది. మా అమ్మాయి రాధ బియ్యెస్సీ చదివింది. ఇహ పై చదువులకి పంపలేక ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సీటొచ్చినా స్తోమత లేక చదువాపించేసాను. సంక్రాతికి జగ్గన్నతోట తీర్థంలో దమయంతి కనిపించింది.

“మావయ్యగారూ బావున్నారా?” అంటూ పలకరించింది. కుశల ప్రశ్నలయ్యాక తనే చెప్పింది.

“మావయ్యగారూ, వచ్చే మాఘ మాసంలో నా పెళ్ళి. మీరందరూ తప్పకుండా రావాలి.” అని పెళ్ళికి పిలిచింది. అలాగేనని పైకి అన్నాను కానీ విషయం మా ఇద్దరికీ తెలుసు.

“బావుంది. చాలా సంతోషం! కట్నమూ, లాంఛనాలూ అవీ ఎంతేవిటీ?” అని పూర్ణ ఆసక్తిగా అడిగింది. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి చాలా ఆసక్తి.

“కట్నవాఁ? అది తీసుకోని వాణ్ణే చేసుకుంటానని మా నాన్నకి తెగేసి చెప్పేసాను. నాకీ కట్నాలూ అవీ అంటేనే అసయ్యం. కట్నం వద్దన్న వాణ్ణే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అంతే! మావయ్యగారికి నేను చేసింది నచ్చుతుంది. కదండీ?” అంటూ నా వైపు తిరిగి అంది.

దమయంతి అదృష్టవంతురాలు. అనుకున్నది సాధించింది. అదే చెప్పాను.

“మా నాన్నకీ, మీకూ… అదెందుకులెండి. మీరు తీర్థానికొస్తారని తెలుసు. అందుకే మీకోసం ఈ శుభలేఖ పట్టుకొచ్చాను. నాకోసమయినా మీరు పెళ్ళికి రండి,” అంటూ శుభలేఖ చేతిలో పెట్టింది.

మేం ఎవరూ ఏం మాట్లాడ లేదు. శుభలేఖ తీసి ఎవరా పెళ్ళికొడుకని చూసాను. పెళ్ళి కొడుకూ వాళ్ళది మధ్య ప్రదేశ్ అని చెప్పింది. తెలుగువాళ్ళేనని, అతని పేరు ప్రసాదు అనీ, బి.హె.ఈ.ఎల్లో పని చేస్తున్నాడని చెప్పింది. రాఘవ గురించి అడుగుదామా అనుకొని ఆగిపోయాను. అతని ప్రసక్తి ఇప్పుడనవసరం.

పెళ్ళికొడుకు పేరు “సత్య సూర్య సుబ్రహ్మణ్య నాగ శ్రీరామచంద్ర వరప్రసాద్” అంటూ పైకి చదువుతూ – “ఏమే దమయంతీ! మీ కాబోయే వాణ్ణి పూర్తి పేరుతో పిలిస్తావా? కొల్లేటి చాంతాడంత ఉంది. మొత్తం చదివితే ఆయాసం వచ్చేటట్లే ఉంది.” మా పెద్దమ్మాయి రాధ వేళాకోళం చేసింది. నిజానికి మా పెద్దాడి పేరు కూడా అక్షరం పొల్లు పోకుండా ఇలాగే ఉంటుంది. ఇదే విషయం పూర్ణ చెప్పి రాధని తప్పని కసురుకుంది.

దమయంతి మా అమ్మాయి రాధతో కబుర్లలో పడిపోయింది.

నేను దమయంతిని చూడ్డం అదే ఆఖరిసారి. ఫిబ్రవరిలో దమయంతి పెళ్ళయ్యింది. మేమెవరమూ వెళ్ళలేదు.

మా అమ్మాయి రాధకి పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టాను. రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ కుదర్లేదు. పిల్ల నచ్చలేదని ఒకరూ, మాకు ఆస్తులూ గట్రా లేవని ఇంకొకరూ, మాకిష్టమయితే రెండో అమ్మాయిని చేసుకుంటామని ఇంకొకరూ ఇలా చాలా ప్రహసనాలు జరిగాయి. నేనూ విసిగి వేసారి పోయాను. ఈలోగా ఎవరో దూరపు బంధువుల ద్వారా తిరపతి నుండి ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మద్రాసులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళు పిల్ల నచ్చిందనీ, కానీ కట్నం వద్దనీ అన్నారు. నాకూ వారి ఆదర్శం నచ్చి, ఈ పెళ్ళి ఖాయం చేద్దామనుకుంటూండగా వాళ్ళు చివర్లో చిన్న మెలిక పెట్టారు. అది – మా అమ్మాయి డిగ్రీ చదివింది కాబట్టి, పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలని.

ఇంతలో మా ఆవిడ తరపు బంధువొకరు వైజాగు బీ.హెచ్.పీ.వి సంబంధం ఒకటి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూనే చెప్పా పెట్టకుండా అమలాపురం బస్సు స్టాండునుండి పెళ్ళికొడుకుని తీసుకొచ్చానని కబురంపాడు. గత్యంతరం లేక సరే నన్నాను. పెళ్ళికొడుకు ఇంజనీరు. అప్పటికప్పుడు హడావిడిగా పెళ్ళి చూపులు ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ ఆ పెళ్ళికొడుక్కి పిల్ల నచ్చిందనీ, మర్నాడే తాంబూలాలు పుచ్చుకుందామనీ అన్నారు. నేను కాస్త తటపటాయించాను. అమ్మాయినడిగి చెబుతాననీ అన్నాను. వచ్చిన మా బంధువు ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ పెళ్ళి చూపుల్లో ఒక తమాషా ఉంటుంది. అన్నీ అతిశయోక్తులే ఉంటాయి. ఎవరెవరెంత మంచివారో, గుణవంతులో ఉలవలూ, పలవలూ చేసి చెప్పుకుంటారు. ఇంటికొచ్చి పూర్ణనడిగితే మద్రాసు సంబంధం పిల్లాడు బావున్నాడనీ, పైగా కానీ కట్నం లేకుండా చేసుకుంటున్నాడనీ, వైజాగు పిల్లాడు ఓ మోస్తరుగా ఉన్నాడనీ ఆవిడ వైపు లాజిక్కు లాక్కొచ్చింది. ఈ వైజాగు వాళ్ళు కట్నం మాత్రం పదిహేను వేలడిగారు. కాస్త ఎక్కువే అనిపించింది. మా అమ్మాయినడిగితే కాస్త ఆలోచించుకొని చెబుతానంది. ఇందులో మా అమ్మాయి నిర్ణయం ఏమీ ఉండదు. నికార్సుగా చెప్పాలంటే మా ఆవిడ మాటనీ నేను తోసిరాజంటానన్న విషయం వాళ్ళకి తెలుసు. నేనూ సందిగ్ధంలో పడిపోయాను. మర్నాడు చెబుతానని అంటే వాళ్ళు రాత్రికి అమలాపురంలోనే ఉండి మర్నాడు వెళతామన్నారు. స్నేహితులింట్లో విడిది ఏర్పాటు చేసాను.

రాత్రంతా ఆలోచన్లతో నిద్ర పట్టలేదు. తెల్లారి లేచి వంటింట్లో కాఫీ తాగుతూ పూర్ణతో పెళ్ళి విషయం చర్చిస్తూండగా రాధ వచ్చింది.

“నాన్నా! రాత్రంతా ఆలోచించాను. నాకు వైజాగు సంబంధమే నచ్చింది,” అంటూ మెల్లగా బాంబు పేల్చింది. నిజానికి నేను మద్రాసు సంబంధం మనసులో ఖాయం చేసేసుకున్నాను. ఒక్కసారి ఏమనాలో తెలీలేదు.

“అదేవిటే! మద్రాసు వాళ్ళు కానీ ఖర్చులేకుండా చేసుకుంటానంటే వైజాగు సంబంధం నచ్చిందంటావు? ఈ వైజాగు పిల్లాడు మోస్తరుగా ఉన్నాడు. పైపెచ్చు పదిహేను వేలడుగుతున్నారు. మీ నాన్న పదివేలు మించి ఇచ్చుకోలేరు. నీ తరువాత చెల్లెలొకత్తుంది. మద్రాసు పిల్లాడు బంగారంలా ఉన్నాడు,” అంటూ పూర్ణ గదవాయించింది.

పూర్ణ మా అమ్మాయిని ఒప్పించాలని ప్రయత్నిస్తోంది. నేనూ సమర్ధించాను. చివరకి రాధ మా వాదనలతో విసిగిపోయి, “నా ఇష్టం అడిగారు కాబట్టి చెప్పాను. అయినా పెళ్ళి చేసుకునేది నేను. మీరు కాదు. మద్రాసు అబ్బాయికి కట్నం అక్కర్లేదు. కాదనను. కానీ ఉద్యోగం చెయ్యాలన్న కండీషనే నాకు నచ్చలేదు. నాన్నా! అతనికి నాతో సంసారమే కాదు; సంపాదన కూడా కావాలి. పెళ్ళికి ముందే ఇన్ని షరతులుంటే పెళ్ళయ్యాక ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో? మద్రాసు సంబంధం చేసుకోను,” అంటూ మొండిగా అనేసి వెళిపోయింది.

చాలాసేపు మౌనంగా ఉండి లేచి వెళ్ళబోతూండగా “ఏం చెయ్యబోతున్నారని?” పూర్ణ అడిగింది. రాధ మనసుకి వ్యతిరేకంగా పెళ్ళి చెయ్యదల్చుకోలేదు. కట్నం ఇవ్వడం నాకిష్టం లేకపోయినా కూతురి ఇష్టాన్ని కాదనలేను. ఇష్టంలేని పెళ్ళీ, నమ్మకం లేని వైద్యమూ పట్టివ్వవు.

ఎందుకో అప్రయత్నంగా దమయంతి గుర్తుకొచ్చింది. డిగ్రీ చదివిన మా అమ్మాయికీ, అంత చదువుకోని దమయంతికీ ఆలోచన్లలో ఎంతో వ్యత్యాసం ఉంది. కాసేపు పూర్ణతో చర్చించి, నా నిర్ణయం చెప్పాను.

మా పెద్దమ్మాయి పెళ్ళికి నేనూ వెంకట్రామయ్యింటికెళ్ళి పిలవలేదు. వాడు చేసినట్లుగానే పోస్టులో శుభలేఖ వేసాను. దమయంతి అడ్రసు కనుక్కొని కార్డ్ పోస్టు చెయ్యమని మా అమ్మాయికి చెప్పాను. చూస్తూండగా మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యలో దమయంతి విషయాలే తెలీలేదు. మా రెండో అమ్మాయికీ పెళ్ళయ్యింది. రైతు సంఘం పనిమీద ఇందిరా గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్ళాల్సొచ్చింది. దాదాపు మూడు నాలుగు వారాలు అక్కడే ఉండిపోయాను. తిరిగొచ్చాక వెంకట్రామయ్య పోయాడని తెలిసింది. వెళ్ళి వెంకట్రమయ్య భార్యని పలకరించి వచ్చాం నేనూ, మా ఆవిడా. అప్పుడే తెలిసింది దమయంతి తండ్రి పోయినప్పుడు చూడ్డానికి రాలేదని. దమయంతి అత్తవారికీ, వెంకట్రామయ్యకీ ఏవో స్పర్ధలొచ్చాయని చెప్పారు. బహుశా అందువల్లేనేమో దమయంతిని పంపలేదనుకున్నాను. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్లుగా అయ్యింది దమయంతి స్థితనిపించింది నాకు. పెళ్ళికి ముందు జగ్గన్నతోట తీర్థంలో చూడ్డమే మరలా దమయంతిని చూళ్ళేదు.

మరో పదేళ్ళు గడిచాయి. మా పెద్దాడికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తెలుసున్న మినిస్టరు చేతులూ, కాళ్ళూ పట్టుకొని మొత్తానికి ఢిల్లీలో ఉద్యోగం వేయించాను. వాడికీ పెళ్ళయ్యింది. పిల్లలు పుట్టారు. ఓ సారి మనవల్ని చూడ్డానికని నేనూ మా ఆవిడా ఢిల్లీ వెళ్ళాం. ఓ సారి కరోల్బాగులో షాపింగుకని వెళితే “నమస్కారం సూర్యం గారూ! బావున్నారా?” అంటూ ఒకతను పలకరించాడు. అతనెవరో పోల్చుకోలేకపోయాను. చివరకి అతనే చెప్పాడు.

“నేనండీ! రాఘవని. పదిహేనేళ్ళ క్రితం మీరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టికల్ రాస్తే, మిమ్మల్ని కలవడానికి వచ్చాను…” అంటూ చెప్పబోయాడు. వెంటనే గుర్తొచ్చింది నాకు. గుర్తుపట్టలేకపోయానని ఏమీ అనుకోవద్దనీ చెప్పాను. తనూ పటేల్ నగర్లో ఉంటున్నాననీ, వాళ్ళింటికి రమ్మనమనీ బ్రతిమాలాడు. ఉన్న పళంగా రమ్మనమంటే ఎలాగాని అంటే తన కార్లో తీసుకెళతాననీ చెప్పాడు.

కాదనలేకపోయాను. అప్పట్లో నా ఆర్టికల్ చదివి దమయంతిని పెళ్ళి చేసుకుంటానని మద్రాసునుండి వచ్చాడనీ పూర్ణకి గుర్తు చేసాను. రాఘవ కారు వాళ్ళావిడ తీసుకెళ్ళిందనీ, కాసేపట్లో వస్తుందనీ చెప్పాడు. కొంతసేపటికి కారొచ్చింది. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె దమయంతి. కలా, నిజమా అన్నట్లు కళ్ళు నులుపుకు మరీ చూసాను. మమ్మల్ని చూసి తనూ ఆశ్చర్యపోయింది. మాకు సర్ప్రయిజివ్వడానికే దమయంతి గురించి చెప్పలేదని రాఘవ చెప్పాడు.

“ఏం కోయిన్సిడెన్స్ మాస్టారూ! పదేళ్ళక్రితం ఏదో ఆఫీసు పనిమీద ఢిల్లీ వచ్చాను. దమయంతినీ కలిసిన ఈ కరోల్బాగులోనే మిమ్మల్నీ కలవడం చాలా చిత్రంగా ఉంది.” అంటూ రాఘవ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.

కుశల ప్రశ్నల తరువాత కారెక్కి వాళ్ళింటికెళ్ళాం. ఎప్పుడూ ఎంతో బిడియంగా ఉండే దమయంతి అప్పట్లో పెళ్ళివార్ని నిలదీయడమే నాకు పెద్ద ఆశ్చర్యమయితే, ఇవాళ కారు నడుపుతూ చక చకా ఇంగ్లీషు మాట్లాడ్డం చూసి ఆశ్చర్యపోయాను. కొంతసేపటికి వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లూ అనడం కంటే భవంతి అంటే బావుంటుందేమో! దమయంతికి ఒక కూతురు. ఇంటినిండా పనివాళ్ళూ, హడావిడీ చూస్తే రాఘవా వాళ్ళూ బాగా ఉన్నవాళ్ళేనని అర్థమవుతోంది. దమయంతిలో వచ్చిన మార్పు చూసి చాలా ఆశ్చర్యపోయింది పూర్ణ. చిన్నపటి కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో మా పిల్లల ప్రస్తావనొచ్చింది. రాధ గురించడిగింది.

“మావయ్య గారూ! ఆరోజు మీరు నా మీద పెద్ద ఆర్టికల్ రాసారు కదా? మీరు మీ పిల్లలకి కట్నం ఇవ్వకుండానే పెళ్ళి చేసారా?” అనడిగింది. లేదన్నట్లు తలాడించాను. అంతే ఒక్కసారి ఉవ్వెత్తున కోపంతో లేచిపోయింది.

“చూసారా! ఆరోజు నేనేదో అనేసరికే మీరు ఉత్తేజితులయ్యి పేపర్లో రాసేసారు. మరి మీ పిల్లల వరకూ వచ్చేసరికి ఆదర్శాలు కనిపించలేదా?” అంటూ నన్ను గట్టిగానే కడిగేసింది. నేనేమీ మాట్లాడలేదు. స్వతహాగా నేను కోపిష్టివాణ్ణి. అలాంటిది మౌనంగా తలదించుకోడం పూర్ణకి ఆశ్చర్యం కలిగించింది. మధ్యలో రాఘవే అడ్డుకొని వేరే విషయాల్లోకి మాట మార్చాడు.

కొంతసేపయ్యాక వెళ్ళొస్తామని శలవు తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని దమయంతీ, రాఘవా అడిగారు. కానీ మా ప్రయాణం ఎల్లుండేనని చెప్పేసరికి వాళ్ళే మా ఇంటికి వస్తామని చెప్పారు. కారు డ్రైవరుని పంపించి మమ్మల్ని మా ఇంటి వద్ద దింపారు.

“ఉత్తప్పుడు ఎవరైనా అంటే అరికాలి మీద లేస్తారు. దమయంతి అలా మిమ్మల్ని అన్ని మాటలంటే నోరెత్తలేదే?” దార్లో ఉండగా ప్రశ్నించింది పూర్ణ.

“ఆఁ! చిన్న పిల్ల. ఏదో కుర్రతనం.” అని మాత్రం అనగలిగాను.

“దమయంతికి వాళ్ళ నాన్న చూసిన సంబంధం ఇది కాదండీ. ఇదేవిటీ? ఆ రాఘవా, దమయంతీ…” ఏం చెప్పేది? నాకూ వివరాలు తెలీవు. అప్పట్లో అత్తారింట్లో దమయంతికి ఆంక్షలెక్కువని విన్నానని పూర్ణే తిరిగంది.

ఎందుకో తెలీదు ఆ మర్నాడు దమయంతీ కానీ, రాఘవ కానీ రాలేదు. కనీసం ఫోను కూడా లేదు. జనతా ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణానికి రైలెక్కాం. హఠాత్తుగా అక్కడ రాఘవ మా బోగీ దగ్గర మాకోసం వెతుకుతూ కనిపించాడు.

“సారీ అండీ, నిన్న అర్జంటు పనొకటి వచ్చింది. దమయంతీ వద్దామనుకుంది కానీ రాలేకపోయింది. కనీసం మిమ్మల్ని కలుద్దావని తీరిక చేసుకొచ్చాను.” అంటూ యాపిల్ పళ్ళ బుట్ట అందించాడు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తామనీ చెప్పాను.

“సారీ అండీ. మొన్న దమయంతి మిమ్మల్ని అలా అనడం బాధకలిగింది. మీరు వెళ్ళాక నాలుగు చివాట్లు పెట్టాను. ఆమె తరపున నేను క్షమాపణ కోరుతున్నాను,” అంటూ చేతులు పట్టుకొన్నాడు.

“అయ్యో! పరవాలేదయ్యా! మాకున్న చనువుకొద్దీ అడిగిందంతే! అయినా, ఆదర్శం వేరూ, జీవితం వేరూ! ఆదర్శాలకంటే ముందు నేనొక మధ్యతరగతి తండ్రిని. నా ఆదర్శాల కోసం పెళ్ళికాని కూతుర్ని ఎంతకాలం ఇంట్లో ఉంచుకోగలం? కన్నందుకు వాళ్ళకీ జీవితం ఇవ్వాలి కదా? నేను చేసిదంతే!” నవ్వుతూ అన్నాను.

“దమయంతికి ఆవేశం ఎక్కువండీ. తేడా వస్తే తండ్రయినా ఊరుకోదు. పైకి పొక్కకుండా చాటుగా కట్నం ఇచ్చి తండ్రి తనని మోసం చేసాడని, పోయినా కూడా చూడ్డానికి వెళ్ళలేదు. మీరన్నట్లు ఎంతకాలం కూతురికి పెళ్ళి చేయకుండా ఉంటాడాయన? ఇవేవీ అర్థం చేసుకోదు. ఆ మనిషంతే! ఎంతో మంచిదే, కానీ…” అతని మాటల్లో నిస్సహాయత ధ్వనించింది.

“తండ్రి పోయినప్పుడు రాలేదని నేనూ విన్నాను. తప్పయ్యా! పిల్లల కోసం పెద్దాళ్ళు చేసినవి అన్నీ నచ్చకపోవచ్చు. పాపం తల్లేం చేసిందట? నేను చెప్పినట్లుగా చెప్పు. నందంపూడి వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవమని చెప్పు. పాపం ఆ తల్లి కళ్ళు వాచేలా ఏడుస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వే దగ్గరుండి తెసుకెళ్ళు.” అని నా మాటగా చెప్పాను.

అతను తప్పకుండా తీసుకెళతాననీ ప్రమాణం చేసాడు.

“బాబూ! నేనోటి అడుగుతాను. ఏవీ అనుకోవు కదా? దమయంతి పెళ్ళి శుభలేఖలో ఉన్న పేరు ప్రసాదో ఏదో ఉన్నట్లు గుర్తు. అప్పట్లో మా అబ్బాయి పేరు అతని పేరూ ఒకటేనని అనుకున్నాం కూడా…” అని పూర్ణ అడుగుతూండగా మధ్యలో నేనే తుంచేసాను.

“అవన్నీ ఇప్పుడు అవసరమా? దమయంతి సుఖంగా కాపురం చేసుకుంటోంది. అది ముఖ్యం. రాఘవ లాంటి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టం. మీ ఆడవాళ్ళకి అస్సలు ఎప్పుడేం మాట్లాడాలో తెలిసి చావదు.” కసురుకున్నాను.

“పరవాలేదు మాస్టారూ! మీరు వేసిన విత్తనమే మా ఈ సంతోషాలకి కారణం! ఆరోజు నేను మిమ్మల్ని కలవడం, నందంపూడి వెళ్ళడం ఇవన్నీ మా జీవితాల్నే మార్చేసాయి. మిమ్మల్ని నేనెప్పుడూ మర్చిపోను..” అతని కళ్ళల్లో నీటి తెరలు స్పష్టంగా కనిపించాయి. ఏం మాట్లాడాలో తెలియక అతనికేసి చూసాను.

“ఆనాడు మిమ్మల్ని కలిసాక నందంపూడి వెళ్ళాను. అప్పుడే దమయంతిని చూసాను. వెంకట్రామయ్యగారు కులాంతర వివాహం చెయ్యలేనని చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోయాను. అది జరిగిన మూడేళ్ళ తరువాత అనుకోకుండా ఒకసారి ఇక్కడే దమయంతిని చూసాను. ఆమె నన్ను గుర్తుపట్టకపోయినా నేను గుర్తు పట్టాను. అప్పుడే మాటల్లో తెలిసింది. మొగుడు ఒక శాడిస్టనీ, కూతురు కోసం ఇన్నాళ్ళూ సహనం చూపించిందనీ, అతనితో తెగతెంపులు చేసుకొని వచ్చేసిందనీ. తిరిగి ఇంటికెళ్ళడం ఇష్టం లేక ఎవరో పొరుగువారి సహాయంతో గుట్టుగా ఢిల్లీ కొచ్చింది, తన కాళ్ళమీద తను నిలబడ్డానికి. అప్పటికి నాకూ పెళ్ళి కాలేదు. దమయంతికి అభ్యంతరం లేకపోతే నేను పెళ్ళి చేసుకుంటాననీ చెప్పాను. ఇంటితో సంబంధాలు లేకపోడంతో ఈ సంగతులు అక్కడ తెలీలేదు.” మెల్లగా అతనే మళ్ళీ చెప్పాడు.

ఇంతలో రైలు పెద్దగా కూత కూసింది. రైలు ఫ్లాటుఫారం వదులుతున్నంత సేపూ మాకేసే చూస్తూ నమస్కరించాడతను.

“ఎందుకూ పనికి రాని ఈ విలేకరి ఉద్యోగం ఏవిట్రా? సుబ్బరంగా వ్యవసాయం చేసుకోక…” మా నాన్న మాటలు గుర్తుకొచ్చాయి.
----------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
కోనసీమకథలు, ఈమాటసౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌(కథ)
సాహితీమిత్రులారా!
అంతస్తుకు రెండు అపార్ట్‌మెంట్స్‌ చొప్పున మూడంతుస్తుల్లో ఆరు కాపురాలున్న అయిదారు వందల భవనాల కాలనీ మాది. తీర్చిదిద్దినట్టుండే వీధులు, పంచరంగుల కేకులతో కట్టిన మిఠాయి నిర్మాణాల లాంటి ముచ్చటైన భవంతులు, ఆగంతుకులెవరైనా వస్తే వచ్చిందెవరో తెలుసుకోవడానికి వీలుగా తలుపులో అమర్చి ఉంచిన ‘అద్దపు కన్నూ’, వచ్చిన వాళ్ళెవరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చి వుంటే చేయి మాత్రం బయటికి చాపి వాటిని తీసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన గొలుసు అమరిక.
పచ్చని చెట్లతో పూలమొక్కలతో పచ్చిక బయళ్ళతో ప్రశాంత మనోహరమైన వాతావరణం. కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్‌ రోడ్డు పైనుంచి లోపలకు రావడానికి ఏర్పాటు చేసిన ఏకైక ప్రధాన ద్వారం. అక్కడ అహర్నిశలూ కాపలా వుండే ఘూర్ఖాలు. ఇదంతా చూస్తే పూర్వకాలంలో ప్రాగ్జోతిషం, పాటలీపుత్రం, కన్యాకుబ్జం లాంటి మహా నగరాల కెట్టి రక్షణ ఉండేదో అంతటి భద్రత మాకాలనీకీ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
కాలనీ వాళ్ళం కదా! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే సంబంధాలు ఉండవు. కిరాణాకొట్లు, ఫ్యాన్సీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సదుపాయాలు, పోస్టాఫీసు, లైబ్రరీ మొదలైన వన్నీ కాలనీలోనే ఉన్నాయి.
ఉద్యోగుల్ని తూర్పుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు తీసుకెళ్ళడానికి డిపార్టుమెంటు వారి ప్రత్యేక బస్సు సర్వీసులున్నాయి. ఉదయం ఎనిమిది కొట్టగానే మెట్లపైనుంచి ప్రారంభమయ్యే బూట్ల టకటకలు రోడ్లపైకి వచ్చి అక్కడనుంచి ముందుకు సాగి ప్రధాన ద్వారం దగ్గర ఆగిపోతాయి.
“ఏమండీ సుందర్రావు గారూ! నిన్న సాయంకాలం లైబ్రరీ దగ్గర కనిపించలేదే?”
“అయ్యా శ్రీనివాసన్‌ సార్‌! రండి రండి. ఆనందవికటన్‌ కావాలంటిరే, మాకోసరం తెస్తిని. తీసుకెళ్ళి సదువుకోండబ్బా!”
“అబ్బా నంజుండబ్బా! చిత్రదుర్గా నుంచి ఎప్పుడొస్తివి?”
“క్యాహైజీ అగర్వాల్‌?”
“ఈ రోజు పేపర్‌ చూశావా? అయినా చూసి ఏం లాభంలే. న్యూస్‌ పేపర్లలో ఈ కుంభకోణాల్ని గూర్చిన వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతుందయ్యా.”
ఇలా పలకరింపుల సంబరాలతోనే ఉద్యోగులు బస్సెక్కేస్తారు. సరే, ఉద్యోగప్రయాణం గురించి మనకెందుకు? వదలిపెడదాం. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోయాక, మగవాళ్ళు ఆఫీసుల కోసం బయలుదేరాక కాలనీ లోని సుగుణమణి, జలజలోచన, చారుమతి ఇళ్ళకు తాళాలు వేసుకొని పార్కులోకొచ్చి చెట్లనీడలో కూర్చుంటారు. శిరోమణి, దేవసేన, రాజేశ్వరి, విజయ, ప్రసూనలు సాధారణంగా రీడింగు రూములోనే కలుసుకుంటుంటారు.
అరవైయేళ్ళ భగీరథమ్మ వినాయకుడి గుడి మండువాలో ఆంధ్రవాల్మీకం చదివి పది పదిహేను మంది శ్రోతలకు (వీరిలో వయసు మళ్ళిన వాళ్ళతో బాటుగా వయసు మళ్ళని జిజ్ఞాసువులు గూడా వుంటారు) అర్థవివరణ చేస్తూ వుంటుంది. వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు చేరేది మధ్యాహ్నం పన్నెండుకే పన్నెండున్నరకు బడినుంచి పిల్లలొస్తున్నారు గదా! వాళ్ళకన్నాలు పెట్టి మళ్ళీ బడికి పంపించేశాక విశ్రాంతి. టీవీ చూడ్డమైనా, పుస్తకం చదవడమైనా అర్థంతరంగా ఆగిపోవడమే మామూలు.
నిద్రకునుకు తీసుకునేటప్పటికి గంట నాలుగు దాటి వుంటుంది. ‘అమ్మో! పిల్లలొస్తారు, ఆయనొస్తారు ఆవురావురుమంటూ. ఏదైనా టిఫిను చేసేయాలి.’ ఇక చూసుకోవలసిందే తమాషా. కాలనీ అనే యంత్రం అమాంతంగా స్టార్టయిపోతుంది. కొళాయిల్లోంచి నీళ్ళు దూకుతాయి, మిక్సీలు గొంతు విప్పుతాయి, గ్యాస్‌ స్టవ్‌లు క్రమబద్ధీకరించిన మంటల్ని విరజిమ్ముతాయి.
అలాంటి ఒక సాయంకాలపు వేళ చెట్ల నీడలు చూస్తూ, గాలి హాయిగా వీస్తూ, పక్షులు చెట్టు పైన్నుంచి చెట్టుపైకి ఎగురుతూ, పిల్లలు ఆటస్థలాల్లో ఆడుకుంటూ అందాలతో ఆనందాలతో ప్రకృతి పరవశించి పోతున్న వేళ చామన చాయతో, పొందికైన క్రాఫింగుతో, నశ్యం రంగు ప్యాంటుతో, తెలుపు పైన ఊదారంగు చారల చొక్కాతో, ఖాళీ క్యారియరు వాటర్‌ బాటిల్‌ ఉన్న ప్లాస్టిక్‌ బుట్ట చేతబట్టుకుని ఒక ముప్పై అయిదేళ్ళ ఉద్యోగి బస్సు దిగాడు.
బస్సు దిగేటప్పటికతడు గుంపులో గోవిందయ్య. పాపం వార్తల్లో కెక్కాలన్న ఊహగానీ, ప్రయత్నం గానీ లేనివాడు. ఆనాటి సంఘటన కతడి ప్రమేయం ససేమిరా లేదు. అయితే అది జరిగిన తర్వాత అతడి జీవితం అంతకు మునుపటి జీవితంతో పోల్చుకోవటానికి వీల్లేనంతగా మారిపోయింది. అతడు తనకు, ఊహకు, ప్రయత్నానికి అతీతంగా వార్తల్లోకెక్కిపోయాడు. వక్కపలుకు నోట్లో వేసుకొని కొరికినంతసేపట్లో అతడి ఊరూ, పేరూ, స్వభావం, హాబీలు, భార్యాబిడ్డల గుణగణాలు మొదలైనవన్నీ కాలనీలో ఒకరికొకరు చెప్పుకోవలసిన, చెప్పగా చెవి ఒగ్గి వినవలసిన ముఖ్యవిషయాలుగా మారిపోయాయి.
అతడిపేరు షణ్ముగసుందరం. స్వస్థలం చిదంబరం దగ్గర తిరుమంగళం. తండ్రి ప్రైమరీ పాఠశాల టీచరు. మేనమామ మద్రాసులో ఉండడం వల్ల అతడు పైచదువులు కొనసాగించ గలిగాడు. గిండీ ఇంజనీరింగు కాలేజీలో పట్టా పుచ్చుకున్నాడు. భార్య పేరు శివగామి. ఒక కూతురు, పేరు దేవయాని. వయస్సు తొమ్మిదేళ్ళు. కొడుకు ఏడేళ్ళవాడు, పేరు పార్థు. అన్యోన్య దాంపత్యం, కుదురైన బిడ్డలు. అతడి ఉద్యోగ జీవితం ప్రారంభం కావడం ఇక్కడే. కన్‌స్ట్రక్షన్‌ డిపార్టుమెంట్‌లో సెక్షన్‌ హెడ్‌. సాయంకాలం అతడిల్లు చేరుకునేటప్పటికి పిల్లలు ప్లేగ్రౌండుకు వెళ్ళి వుంటారు. ముఖం మాత్రం కడుక్కొని ఈవలికొచ్చేసరికి భార్య వేడిగా కాఫీ కప్పు చేతికిస్తుంది. కాఫీ సేవనంతో పిచ్చాపాటీ మొదలవుతుంది.
పత్రికలు చదువుకోవడం, టీవీ చూడ్డం, పిల్లలకు హోమ్‌వర్కులో సాయపడ్డం, తిరుమంగళం నుంచో మద్రాసునుంచో జాబులొస్తే ఒకొక్క వాక్యాన్ని చదివి అభిప్రాయాలు ప్రకటించడం ఈ మాత్రమే వాళ్ళ వ్యవహార జగత్తు. సరే, షణ్ముగసుందరం ఆరోజు సాయంకాలం బస్సు దిగాడన్నది ప్రస్తుతాంశం. ఉత్తరంగా వెళ్ళే రోడ్డుపైన కమ్యూనిటీ హాలుదాకా వెళ్ళి అక్కడ పడమరకు తిరిగితే సన్నటిరోడ్డుకు ఎడమవైపు వున్న కట్టడంలోని రెండో అంతస్తులోని ఒక వాటాలో అతడి కాపురం. ఇంటి నెంబరు సి123.
షణ్ముగసుందరం మెట్లెక్కాడు. ఎన్నడూ లేనిది మూసిన తలుపు బిగించిన తాళంతో వ్రేలాడుతూ ఉంది. “ఏమిట్రా ఇది. ఈ వేళప్పుడు ఈమె ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయింది?” అనుకున్నాడు షణ్ముగసుందరం. ఎదురింట్లో వాళ్ళనడుగుదా మనుకుంటూనే కాళ్ళ క్రిందనున్న తివాచీ పైకి తీశాడు. తాళం చెవి కన్పించలేదు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆమె తాళం చెవి తివాచీ క్రింద పెట్టి వెళ్ళడం మామూలే!
“ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళివుంటుందబ్బా?” అనుకుంటూ తన జేబులోని డూప్లికేటు తాళం చెవితో తలుపు తెరిచాడు. కథలో ఇక్కడిదాకా గీత గీస్తే ఇంతకు మునుపటిదంతా వెలుగనీ ఆపైన పరుచుకున్నదంతా చీకటనీ గుర్తించాలి.
లోపలి కెళ్ళిన షణ్ముగసుందరం రెండే రెండు నిముషాల్లో గావుకేకలు పెడుతూ బయటకు పారిపోయి వచ్చేశాడు.
ఏమిట్రా ఈ గగ్గోలు అన్నట్టుగా చుట్టుప్రక్కల కొన్ని ఇళ్ళలోని కిటికీలు తెరుచుకున్నాయి. కొందరు ధైర్యవంతులు గబగబా మెట్లెక్కి అపార్టుమెంటులోకి జొరబడ్డారు. క్రిందనే నిల్చుండి పోయిన వాళ్ళు, ఏమైంది ఏమైందని పైకి వెళ్ళిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళం!
వాస్తవం స్పష్టంగా అవగతం కావడానికి పదిపదిహేను నిముషాల కాలం పట్టింది. శివగామి వంటింట్లో అలమరాల నడుమ సన్నటి జాగాలో పొడవునా పడివుంది. అమ్మాయి బెడ్‌రూమ్‌లో మంచానికడ్డంగా పడివుంది. ముందువైపు హాల్లో కుర్రవాడు కుర్చీలోనే తల వాల్చేసి వున్నాడు. ముగ్గురి గొంతుకల చుట్టూ ఊపిరి తిరగకుండా ప్లాస్టిక్‌ తాడు లాంటి దానితో బిగించినట్టు కుశాగ్రబుద్ధులైన పరిశీలకులు పోల్చుకున్నారు. కాలనీ అన్నివైపుల నుంచీ కమ్యూనిటీ హాలు దిశగా జనసంచలనం ప్రారంభమైంది.
“ఏమండీ, ‘షణ్ముగసుందరం’ అంటున్నారు ఎలా వుంటాడతను? పొట్టిగా బొద్దుగా బట్టతలతో..”
“అబ్బే అయివుండదండీ! బస్సులో కొందరు ‘సుందరం, సుందరం’ అని పిలుస్తుండగా చూశాను. అతను సన్నగానే ఉంటాడు. లేదంటే క్రమబద్ధంగా పెంచిన గుబురు గడ్డంతో ఎలుగుబంటిలా కనిపించినట్టు జ్ఞాపకం.”
“పరవాలేదులెండి. మనిషి సజీవుడై వున్నాడు కదా! రేపో మాపో కనిపించక పోతాడా?”
“ఏం సజీవుడో! తగిలిన దెబ్బకింక కోలుకుంటాడా అనేదే అనుమానం. అయినా మానవ మాత్రుడికి రాదగిన కష్టమా?”
మరొకవైపు కాలనీ మహిళల ఆసక్తి ఇంకొక విధంగా కొనసాగుతోంది. “ఎవరో శివగామి అంటమ్మా! నాకైతే చూచిన జ్ఞాపకం లేదు. అరవావిడగదా! మిగిలిన వాళ్ళతో అంతగా కలిసేది కాదేమో…”
“చొరవ రెండు పక్కల నుంచీ వుండాలి గదమ్మా రాజేశ్వరీ! మనమే ఆమెను ఆంతరంగికంగా దగ్గరకి చేరనివ్వలేదేమో…?”
“ఇంతకూ మనిషెవరో తెలియకపోయినా ఊహాగానాలెందుకు? నాకు తెలిసి ప్రతి శుక్రవారం ఉదయం తలంటిపోసుకొని వదులు జారుముడిలో పువ్వులు తురుముకొని విభూది పట్టెలపైన ఇంతేసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఓ అరవావిడ వినాయకుడి గుడికొస్తుండేది. ఇదంతా మద్రాసు ఆడవాళ్ళ సాంప్రదాయం. ఆ శివగామి కూడా మద్రాసే అంటున్నారు గదా…” ఇలా ఈ పరామర్శలన్నీ ‘బీటింగ్‌ అరౌండ్‌ ది బుష్‌’గా పరిణమించాయే గానీ అసలు మనుషులెవరో చాలామందికి స్ఫురించలేదు.
ఇంతకూ ఆ షణ్ముగసుందరమనే దైవోపహతుడితోను, శివగామి అనే అల్పాయుషును అడిగివచ్చిన ఆవిడతోనూ ముఖపరిచయం కలిగిన వాళ్ళెందరు? పలకరించిన వాళ్ళెందరు? సన్నిహితంగా మిత్రత్వం కలిగిన వాళ్ళెందరు?
ఇంతకూ వాళ్ళు కొద్ది నెలల క్రితం వచ్చిన వాళ్ళేం గాదు. దాదాపుగా పదేళ్ళుగా వుంటున్న వాళ్ళ ఐడెంటిటీని గురించి కూడా కాలనీవాళ్ళు ఊహాగానాలు సల్పవలసి వచ్చిందంటే మానవతా సంబంధాలు మరమ్మత్తుకు వీలుబడనంతగా శైథిల్యం చెందినట్టు గాదా? ‘ఊరా, అడివా?’ అంటుంటారు. మా కాలనీ వ్యవహారం చూస్తుంటే ఈ రెండింటికీ అట్టే తేడా వున్నట్టులేదు మరి!
ఎదురు చూడని దారుణసంఘటన ఏదైనా సరే అది జరిగిన తర్వాత కాసేపటి వరకు దాని తీవ్రత ఏపాటిదో తెలిసిరాదు. మనసు తాత్కాలికంగా మొద్దుబారిపోతుంది. మళ్ళీ దానిలో కదలిక రావాలంటే షాక్‌ ట్రీట్‌మెంట్‌ లాంటిది మరొకటి అవసరమవుతుంది. పరిపరి విధాలుగా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకుంటున్న జనంలోకి ఒక పోలీసు జీపు చొచ్చుకురావడం అలాంటి సన్నివేశమే!
ఆగిన జీపులోనుంచి లాఠీ లూపుకుంటూ అయిదారుగురు పోలీసులు దిగారు. సబ్‌ ఇన్స్‌పెక్టరు ముందు సీటులోంచి క్రిందికి దూకినంత పనిచేశాడు. పోలీసులు “తప్పుకోండి తప్పుకోండి. అందరూ మీమీ ఇళ్ళకు వెళ్ళండి. వెళ్ళక పోయారో మా లాఠీలకు పని చెప్పవలసి వస్తుంద”ని హెచ్చరిస్తూ నేరస్థలాన్ని నిముషాల్లోనే నిర్మానుష్యం గావించారు.
ఇళ్ళకైతే వెళ్ళారుగానీ తలుపులు కిటికీలు బిగించుకున్నా జనానికి నిబ్బరం లేకపోయింది. లోకంలో ఎక్కడో ఉన్నారని భావించబడుతూ వచ్చిన హంతకులు ఇప్పుడు కాలనీలోనే వున్నారు. ఇప్పుడున్నా లేకపోయినా మధ్యాహ్నం పన్నెండూ ఒంటిగంటకు మధ్య ఇక్కడున్నారనడానికి మూడు నిర్జీవమైన శరీరాలు సాక్ష్యంగా వున్నాయి. ఈ స్పృహ కలగడంతో బయట ఏమాత్రం చిన్న అలికిడి అయినా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బిగ్గరగా మాట్లాడుకోడానికైనా నిబ్బరం లేకపోయింది. తలుపులకు తాళాలు బిగించి కాలనీ వాసులందరూ కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి అక్కడ అల్లీబిల్లీగా పడుకోగలిగితే ఎంత బాగుండునోననిపించింది. భయం భయంగానే మరునాటి ఉదయం తెల్లవారింది.
“ఏవండీ! ఈ రోజు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోగూడదూ?” ప్రతి ఇంట్లోని గృహిణి నోటి వెంట ఈ అభ్యర్థన వెలువడింది.
“పరవాలేదు. తలుపేసుకో. ఎవరైనా తలుపు తడితే గాజుకన్నులో నుంచి పరిశీలనగా చూసిగానీ తియ్యకు. పిల్లల్ని స్కూలుకు పంపొద్దు. ఎన్నో తతంగాలుంటాయి. వాళ్ళు జడుసుకోగలరు.” గృహస్థులు మెలకువలు చెబుతూనే మెయిన్‌ రోడ్డు వైపు నడిచారు. అప్పటికి షణ్ముగసుందరం బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి దిగేశారు. కమ్యూనిటీ హాలు ప్రాంతాలకు వెళ్తే అరవవాళ్ళ శోకాలు హృదయవిదారకంగా విన్పిస్తున్నాయి. అంతలో పోలీసులు కలగజేసుకొని కళేబరాలను పోస్టుమార్టంకి తీసుకెళ్ళిపోవడం కాలనీకంతా కొండంత రిలీఫయిపోయింది.
అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మగవాళ్ళనడిగి లాభం లేదని వాళ్ళకు తెలిసిపోయింది. ఆ సమయంలో ఆఫీసు డ్యూటీలో వుండిపోవడం వాళ్ళ పాలిటికొక వరమై పోయింది. ఎటొచ్చీ స్త్రీలను, వృద్ధుల్ని ఇంటరాగేట్‌ చేయడమే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటు ఉన్న పరిశోధనాప్రక్రియ అయిపోయింది.
“ఏమ్మా! నీపేరేంటి?”
“నా పేరా సార్‌… నన్ను రూపకళ అంటారండీ!”
“ఇది మీఇల్లే కదూ?”
“అవునండీ!”
“సి123 మీకెంత దూరంలో వుంది?”
“ఎంతో ఎక్కడిది సార్‌! మాపైనింటికి ఎదురువైపు ఇల్లేగదా!”
“మంచిదమ్మా! పోయిన బుధవారం పదో లేక పదకొండు గంటల ప్రాంతంలో నువ్వింట్లోనే వున్నావు గదా?”
“ఉన్నానండీ!”
“అప్పుడు నీకు ప్రాణాలు విలవిలలాడిపోయేటట్టుగా గావుకేక ఏదీ వినిపించలేదా?”
“అబ్బే, లేదండీ!”
“చాలా ముఖ్యమైన విషయమమ్మా! కాస్త జ్ఞాపకం చేసుకొని మరీ చెప్పు తల్లీ?”
కాసేపు మౌనం, మనసులోనే ఏవో తర్జనభర్జనలు చేసుకుంటున్నట్టు నిల్చున్న రూపకళ నోటిలోంచి ఒక మాట (అదైనా ఎంత భాగ్యం!) బయటపడింది.
“తలుపులు వేసుకొని వున్నానండీ. ఎవరో అరచినట్టే తోచింది. కోతి ఏదైనా ఇంట్లో దూరిందేమో అనుకున్నాను.”
“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకో తల్లీ!” అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఎదురింటి తలుపు తట్టాడు పోలీసు ఇన్స్‌పెక్టర్‌.
“అమ్మా! నీపేరు?”
“ఇందుమతి సార్‌!”
“సి123 మీకెంత దూరంలో వుంది?”
“ఎంతో దూరం ఎక్కడిది సార్‌ మాపై ఇల్లే కదా!”
“ఓహో పైదే కదూ. చూడండి ఇందుమతి గారూ, పోయిన బుధవారం పదీ పదకొండు గంటల ప్రాంతంలో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా?”
“ఉన్నానండీ!”
“ఆ సమయంలో మీపై ఇంట్లోంచి ప్రాణాలు పోయేట్టుగా అరచిన గావుకేక ఏదీ నీకు విన్పించలేదా?”
“అస్సలు విన్పించలేదండీ!”
“కొంచం ఆలోచించి చెప్పు తల్లీ!”
కాసేపు మౌన వ్రతం పాటించాక ఆమె నోటినుంచి ఒకమాట బయటపడింది. “ఆరోజు కాస్త ఎక్కువ టిఫిను తినడంతో ఆసమయంలో మంచి నిద్రలో ఉన్నానండీ…”
“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకొని నిద్రపో తల్లీ.” అని ఇన్స్‌పెక్టర్‌ అనడమే తరువాయి రిమోట్‌ కంట్రోల్‌ స్విచ్‌ నొక్కినట్టుగా తలుపులు మూసుకుపోయాయి.
“ఏవండీ మీపేరు?”
“తణిగాచలం!”
“వయసు?”
“అరువది”
“ఏం జేస్తుంటారు?”
“నేనేం జేద్దునండీ! మావాడుదా ఇక్కడ ఎంప్లాయీ.”
“మీరేంజేస్తుంటారు?”
“ఏంజెయ్యను సార్‌! ఏదో టిఫిను, హిందూ పేపరు, మధ్యాహ్నం భోజనం, నిద్ర…”
“సరే సరే. పోయిన బుధవారం ఉదయం పదికీ పదకొండుకీ మధ్య సి123 నుంచి ఏదైనా చావుకేక విన్పించిందా?”
“విన్పించలేదని చెప్పేదానికి ఎట్లా మాళును సార్‌? మాది ఎదురిల్లే గదా. పైగా అది నాను పేపరు సదివే టైం మా ప్లాట్‌ ముందర కుర్సీ వేసుకొని పేపరు సదువుతా వుంటిని. పదకొండు గాక ముందే అనుకుంటా, ఆ ఇంట్లో నించి ఎవురో ఆడమనిసి అరిసినట్టుదా అనిపించింది. ఆ యింటమ్మ బాత్‌ రూంలో గాన కాలుజారి పడిందేమో అనుకుంటిని.”
ఒకవైపు ఇలా పరిశోధన కొనసాగిస్తూ ఇంకొకవైపున కాలనీలో నివశిస్తున్న వారి భయాందోళనలు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పగటిపూట కూడ సాయుధ పోలీసుల గస్తీ కొనసాగుతోంది. కాలనీ ఆవరణలో ఏ అనుమానితుడు కనిపించినా పోలీసు గుప్పిట్లోంచి బయటపడేసరికి వాడికి తాత ముత్తాతలు కనిపిస్తున్నారు.
“మీరెవరు?”
“ఎక్కడికెళ్ళి వస్తున్నారు?”
“ఏ పని మీద వెళ్ళారు?”
“మీ అడ్రసేమిటి?”
“మీ ఇంటి నెంబరెంత?” అన్న ప్రశ్నల్ని అక్కడ ఏండ్లుగా పూండ్లుగా నివశిస్తున్నవాళ్ళు కూడా ఎదుర్కోక తప్పడం లేదు. పాలు, పళ్ళు, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు గూడా “ఇదేం గొడవరా బాబూ! ఈ పోలీసులతో తంటా మనకెందుకు?” అనుకుంటూ మెయిన్‌ గేటు దగ్గర నుంచే తిరిగి వెళ్ళిపోతున్నారు.
“దాదాపు రెండు వారాలు గడిచినా నేరస్తుల్ని పట్టుకోలేక పోతున్నారంటే వీళ్ళేం పోలీసులండే?” సంశయాత్ములు చెవులు కొరుక్కోసాగారు.
ఇంతలో ఒక ఘోరవార్త గాలిలో కలిసి ఇంటింటికీ ప్రాకి వచ్చింది. “తల్లినీ, బిడ్డల్నీ గుట్టు చప్పుడు గాకుండా మట్టుబెట్టే అవకాశం వుంటేగింటే ఒక్కడికే వుంటుందండీ!”
“ఎవరికి?”
“ఇంకెవరికండీ? ఆమె భర్తకే!”
“కారణం ..?” కారణం పైన ఊహాగానాలు సాగిపోతున్నాయి.
అయితే ఈ ఊహాగానాలన్నింటినీ వమ్ము చేస్తూ నెలరోజుల నాటికి దినపత్రికల్లో కాలనీ హత్యలకు సంబంధించిన హంతకుణ్ణి గురించిన ప్రముఖవార్తలు వెలువడ్డాయి.
“మూడు ఘోరమైన హత్యలు చేసింది ఒక్కడే!”
“కిరాతక హంతకుడు పట్టుబడిన వైనం!”
“పోలీసుల దగ్గర నేరం ఒప్పుకున్న హంతకుడు!”
వాడి పేరేమిటో అనవసరం. అత్యవసరంగా వాడికి కొంత పెద్ద మొత్తం లోనే డబ్బు కావలసి వచ్చింది. కాలనీలో తొమ్మిదింటి పైన మగవాళ్ళుండరనీ, ఆడవాళ్ళని బెదిరించి నగలు లాక్కోవడం సులభమనీ లెక్కగట్టాడు. ఓ ఇల్లాలు కిరాణాకొట్టుకు వచ్చి తిరిగి వెళ్తోంది. ముద్దాయి (?) గమనించాడు. ఆమెను తాను వెంబడిస్తున్నట్లు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ దూరం నుంచే ఆమెను వెంబడించి ఆమె ఇంట్లో కెళ్ళిన తరువాత తలుపు తట్టి రేషన్‌ కార్డులు పంపిణీ చేసే రెవెన్యూ బంట్రోతునని చెప్పుకున్నాడు. ఆమె లోపలికొచ్చి కూర్చోమంది.
“నీళ్ళు కాస్త ఇప్పిస్తారా?” అని అడిగాడు.
మంచి నీళ్ళు తేవడం కోసం ఆమె వంటగదిలోకి వెళ్ళగానే వీడు తటాలున ఆమెపైకి దూకి మెడలోని నగలు తెంచుకోబోయాడు. ఆమె బిగ్గరగా కేకపెట్టేసరికి జేబులోంచి నైలాను దారం తీసి దాంతో ఆమె గొంతు బిగించేశాడు. నగలు చేతికి చిక్కించుకోగానే బయటికొచ్చేసి తన దారిన వెళ్ళిపోయి వుండేవాడే… తలుపు కాస్త తీసి చూసే సరికి ఎదురింటి ముసలాయన గుమ్మం ముందర కుర్చీ వేసుకొని పేపరు చదువుకుంటున్నాడు. ఆయన లేచి లోపలికి వెళ్ళే దాకా అతడు లోపల వుండక తప్పదు. శవంతో పాటుగా ఇంట్లో ఒంటరిగా ఉండడంతో వాడి మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఇంతలో పన్నెండు కాగానే బడినుంచి పిల్లలొచ్చేశారు. వాళ్ళు తలుపు తడుతుంటే తీయకపోవడం ఎలా? అనుమానం రాదా? తలుపు తీసి వాళ్ళను లోపలకు రానిచ్చాడు. అపరిచితుడ్ని చూసి పిల్లలు కంగారు పడిపోయారు. “అమ్మా! అమ్మా!” అని ఎలుగెత్తి అరవబోయారు. హంతకుడికి మళ్ళీ నైలాన్‌ తాడుతో అవసరం తప్పలేదు. చంపాలనుకోలేదు. వాళ్ళ నోళ్ళు మూయించాలనుకున్నాడు. కానీ వాళ్ళే తొందరపడి పోయారు.
“అమ్మో! చూశారా? ఎలా జరిగిందో?! అబ్బబ్బ! ఆ గుండెలు తీసిన బంటు ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుండును కదండీ…!”
కాలనీవాసుల సంకల్పబలం చాలా గొప్పది. మరునాటి సాయంకాలం ఏడుగంటలప్పుడు ఎవరైనా పోల్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో చేతులకు బేడీలు బిగించి వున్న ముద్దాయిని (?) ఏడుగురు పోలీసుల రక్షణలో తీసుకొని కాలనీ వీధులన్నింటా త్రిప్పించాడు ఇన్స్‌పెక్టరు.
“అరరె… వీడేనా! భుజాన ఓ సంచీ తగిలించుకొని కాలనీలో తిరుగుతూ ఒకటి రెండు సార్లు కనిపించాడండీ!”
“సి123 లో దారుణం జరిగిన మరునాడు కూడా చూసిన జ్ఞాపకం!”
“అయినా మీసాలైనా సరిగ్గా రానివాడు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్ట గలడని ఎలా అనుకుంటాం సార్‌…?”
“అయ్యా! మీరు అనుకోవడానికి వీలున్నా ఏమీ అనుకోరు. చూడ్డానికి వీలున్నా చూడరు. స్పష్టంగా విన్పించినా వినిపించుకోరు. ఏమండీ సార్‌! అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి. ఇక్కడ జరిగిన ఘోర హత్యలకు ప్రత్యక్షంగా బాధ్యత వీడేనని నేను ఒప్పుకొంటున్నాను. మరైతే పరోక్షంగా బాధ్యత వహించాల్సిన వారి పరిస్థితి ఏమిటి?” నిక్కచ్చిగా ఓ ప్రశ్నను సంధించి జవాబు కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు ఇన్స్‌పెక్టర్‌.
కాలనీ వాసులకు మతిపోయినంత పనైంది. వాళ్ళొకరి మొహం ఒహరు చూసుకున్నారు. ఇన్స్‌పెక్టర్‌ ఆరోపణ ఏమిటో అర్థం అయినా ఏం జవాబు చెప్పాలో తోచక నీళ్ళు నమలసాగారు.
“అయ్యా! మీరేమీ చెప్పరని నాకు తెలుసు. నేనే చెబుతున్నాను వినండి. హత్యలు జరిగిన ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి చేత ఆర్తనాదం చేయించి ఆ తరువాత మేము వాకబు చేసి చూశాము. దాదాపు పది పన్నెండు ఇళ్ళ వాళ్ళకు ఆ కేక స్పష్టంగా వినిపించినట్టు తెలిసింది. అలా విన్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా తోటిమనిషి పట్ల కొంచం అక్కర, శ్రద్ధ చూపివుంటే మొదటి హత్య జరగగానే నేరస్తుడు దొరికిపోయి వుండేవాడు. కనీసం పిల్లలైనా బ్రతికి బయటపడి వుండేవారు.
ఆ ఇల్లాలును చంపినవాడు వీడే! సరే అందుకు అభిప్రాయభేదం లేదు. కానీ పిల్లల హత్యలకు బాధ్యత వహించవలసిన వాళ్ళు ఇక్కడ ఇంచుమించు ఇరవైమందైనా ఉన్నట్టు మా విచారణలో మేము తేల్చుకున్నాము. వాళ్ళ కెవరు శిక్ష విధిస్తారు?”
నాటికీ నేటికీ ఆ ప్రశ్న మా కాలనీలోనూ అంతకన్నా ఎక్కువగా నాలోనూ ద్వనిస్తూనే వుంటుంది. షణ్ముగసుందరం ఇంటికి సరిగ్గా వెనకవైపు ఇల్లు మాది. ఆరోజు నాకు మధ్యాహ్నం డ్యూటీ అవడంతో కాస్తంత తొందరగా భోజనాని కుపక్రమిస్తున్న వేళ లీలగా విన్పించిన కేక కలవరపెట్టినా ఎక్కడో గొడవలే అనుకొని తాపీగా భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోయిన సందర్భం నన్ను వెంటాడుతూనే వుంటుంది. పోలీసు విచారణలో నిర్ధారించుకున్న చట్టాతీత బాధ్యతాయుతమైన ఇరవైమంది నేరస్థుల్లో నేనూ ఒకడినన్న విషయాన్ని మాత్రం ఎన్నటికీ మరువను.
---------------------------------------------------------
రచన: పల్లేటి బాలాజీ, ఈమాట సౌజన్యంతో
--------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

LikeShow More Reactions
Comment
Comments
నాయం హంతి న హన్యతే (అనువాద కథ)

సాహితీమిత్రులారా!
చక్రవర్తి కావాలనుకుంటున్న ఆసీరియా రాజు ఎసర్‌హాడన్‌కి తలనెప్పిలా తయారైనది పక్కరాజ్యం రాజు లైలీ ఒక్కడే. మిగతా చిన్నచిన్న రాజ్యాలు అన్నీ ఎసర్‌హాడన్‌కి లొంగిపోయినా రాజు లైలీ మాత్రం లొంగకుండా యుద్ధాలు చేస్తూ, ధైర్యంగా ఎసర్‌హాడన్‌ ప్రణాళికలు తిప్పి కొడుతూనే ఉన్నాడు యుద్ధం ప్రకటించినప్పుడల్లా.

పక్కరాజ్యాన్ని ఏదో విధంగా తమ రాజ్యంలో కలుపుకుంటే దాని సంపదతో ఎసర్‌హాడన్‌ చుట్టుపక్కల అడ్డులేని సార్వభౌముడౌతాడు. మంత్రులతో చర్చించాక ఎసర్‌హాడన్‌ సైన్యం ఓ రోజు ముందు ఉరుమూ మెరుపూ లేని పిడుగులాగా ఒక్కసారి మెరుపుదాడితో రాజు లైలీ కోట మీద పడింది రాత్రికి రాత్రి. ఎంత అప్రమత్తంగా ఉన్నా రాజు లైలీ, మంత్రులు పట్టుబడిపోయారు. సైన్యాధికారుల్నీ, సైన్యాన్నీ ఊచకోత కోసి అందినంతమందిని మట్టుపెట్టాక, కోటనూ రాజ్యాన్నీ స్వాధీనం చేసుకుని రాజు లైలీని బందీగా పట్టుకుంది ఆసీరియా సైన్యం. రాజు అని అయినా చూడకుండా చేతులూ కాళ్ళూ కట్టేసి పశువులా తమ రాజ్యానికి ఈడ్చుకుపోయారు లైలీని. ఇదంతా ఎసర్‌హాడన్‌ చూస్తూనే ఉన్నా అడ్డుచెప్పలేదు. ఇంతవరకూ తనకి లొంగలేదనే కోపం అడ్డు చెప్పనివ్వలేదు. ఆ తర్వాత శత్రునిశ్శేషానికి, మరో రెండు మూడు రోజుల్లో లైలీనీ, అతని మంత్రుల్నీ, ఆప్తులనీ ఉరి తీయడానికి కూడా నిశ్చయం అయిపోయింది.

లైలీని మర్నాడు ఉరి తీస్తారనగా ఎసర్‌హాడన్‌ అంతఃపురంలో మంచం మీద పడుకున్నప్పుడు మెల్లిగా పట్టిన నిద్రలో కల. కలలో ఎవరిదో ఒక అపరిచిత కంఠం వినిపిస్తోంది.

“ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?”

“రేపు లైలీని ఉరి తీయబోతున్నారు. ఇంతకాలం నాకు లొంగకుండా ప్రతిఘటించిన అతన్ని మరో విధంగా, కర్కశంగా ఎలా చంపితే బాగుంటుందా అని.”

“నువ్వు నిజంగానే లైలీని చంపగలవా?”

“అదేం ప్రశ్న? ఇంతకు ముందు వాడి సైన్యాన్నీ, ఆక్రమించుకున్న మిగతా రాజ్యాలలో రాజుల్నీ, సైనికుల్నీ చంపలేదా? అలాగే లైలీని.”

“చంపేశావు అని నీకెలా తెలుస్తుంది?”

“వాడి శరీరంలో ప్రాణం పోతుంది, అచేతనం అయిపోతాడు. ఆ శరీరాన్ని దహనమో, పాతిపెట్టడమో చేస్తారు కదా? ఆ తర్వాత లైలీ అన్నవాడు మనకి కనిపించడు. జనాలకి కొన్నేళ్ళ తర్వాత అసలు లైలీ అంటే ఎవరో తెలియనే తెలియదు.”

“అంటే నీ కళ్ల ముందు కాని, నీ ప్రజలకి కాని, మరెవరికీ కానీ కనిపించకపోతే వాడు లేనట్టేనా?”

“కాదా? ప్రాణమే పోయాక ఇంకెవరు మిగిలేది?”

“అలా కాదే, ప్రాణం పోతోంది అని నువ్వే అంటున్నావు కదా? ప్రాణం శరీరంలోంచి పోతోంది. ఎక్కడికిపోతోంది? అది తెలుసా?”

“…”

“నువ్వే లైలీవి. నువ్వు నిన్నే ఎలా చంపుకుంటావు?”

“నేను లైలీ అనడం ఏవిటి నీ పిచ్చి కాకపోతే? నేను ఎసర్‌హాడన్‌ని. నేను నేనే. వాడు వేరే.”

“కాదు. నువ్వూ లైలీ వేరువేరని అనుకుంటున్నావు కానీ మీరిద్దరూ ఒకటే”

“అది మీకెలా తెలుసు?”

“తెలుసు, కావలిస్తే నీకు చూపించగలను కూడా. చూడాలని గానీ తెలుసుకోవాలని కానీ ఉందా?”

“చూపించు చూద్దాం.”

“సరే ఇలా వచ్చి ఈ నీళ్ళతొట్టెలో నిల్చో. నేను నీ తల మీద నీళ్ళు పోస్తూ ఉంటా. నేను చెప్పేవరకూ తలెత్తకుండా కళ్ళు మూసుకుని ఉండు.”

తలమీద నీళ్ళు పడడం మొదలవ్వగానే ఎసర్‌హాడన్‌ కంటికి లైలీ రాజ్యం, అంతఃపురం కనిపించాయి. తాను రాజులాగా లోపలకి నడుస్తూంటే వందిమాగధులు కూడా వస్తున్నారు – లైలీ మహారాజుకీ జై అంటూ. అదేమిటి, తాను ఎసర్‌హాడన్‌ అయితే తనని లైలీ అంటున్నారిక్కడ? రాణి ఎదురుగా వచ్చి లోపలకి తీసుకెళ్ళి చెప్పింది రాజుకి, “రాత్రి ఎసర్‌హాడన్‌ మెరుపుదాడిని తిప్పికొట్టి వచ్చారు కదా? అందువల్ల రాజ్యం అంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. వెళ్ళి సభలో అందర్నీ పలకరించి రండి.”

సరిగ్గా అప్పటినుంచే ఎసర్‌హాడన్‌కి తాను ఎసర్‌హాడన్‌ అన్న జ్ఞానం పూర్తిగా పోయింది. ఆ జ్ఞానం పోయినట్టు గానీ పోయినందుకు ఏ చింతా ఉన్నట్టు గానీ లేదు. తాను ఇప్పుడు రాజు లైలీ. రాణి చెప్పినట్టు రాజదుస్తులు ధరించి లైలీ సభలోకి వెళ్ళాడు.

సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే ఎసర్‌హాడన్‌ ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఈసారి ఎసర్‌హాడన్‌ యుద్ధం ప్రకటించేదాకా ఆగడం అనవసరం. రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్‌హాడన్‌ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది.

దీనికి లైలీ ఒప్పుకోకుండా సభకి సమాధానం చెప్పాడు, “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్‌హాడన్‌తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”

ఎసర్‌హాడన్‌ దగ్గిరకి పంపాలనుకునే అయిదుగురినీ ఎంచడం అయ్యాక, మరో అయిదారు గంటలు రాజ్యానికి సంబంధించిన విషయాలు చూసి లైలీ సభ చాలించాడు. రాజ్యం గురించి ఇంత కష్టపడుతూ అలసిపోయిన రాజుగారి వినోదం కోసం వేట ఏర్పాటు చేయబడింది.

రాజు లైలీ మందీమార్బలంతో వేటకి బయల్దేరాడు. వేట అద్భుతంగా సాగింది. రాజు రెండు జింకల్ని బాణాలతో గురి చూసి కొట్టి చంపాడు. సాయంత్రం బాగా పొద్దుపోయాక రాజ్యానికి తిరిగి వచ్చిన లైలీ స్నానం చేసి కాసేపు మరో వినోదం చూశాడు – ఈసారి ఎవరో నర్తకీమణులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూంటే. ఆ రోజు అలా గడిచిపోయాక మర్నాడు మళ్ళీ సభ.

ఈసారి సభలో నేరస్తులకి శిక్ష విధించడం, పన్నుల వ్యవహారాలూ, వగైరా వగైరా సవాలక్ష పనులు. ఇలా సాయంత్రం వరకూ రాజు లైలీ తీరిక లేకుండా గడిపాడు. ఇంత కష్టపడిన రాజుకి మరోసారి వేట ఏర్పాటు చేయబడింది. ఈసారి కూడా వేట అద్భుతంగా సాగింది. ఒక ఆడసింహాన్ని చంపి దాని పిల్లలని పట్టుకొచ్చాడు. సాయంత్రానికి అంతఃపురంలో యధావిధిగా మళ్ళీ పాటలూ, నృత్యం.

రాజు లైలీకి వారాలూ నెలలూ గడిచిపోతున్నాయి. ఎసర్‌హాడన్‌ దగ్గిరకి పంపిన శాంతిసందేశం మోసుకెళ్ళిన అయిదుగురి సభ్యుల కోసం ఏరోజుకారోజు చూడడమే కానీ చాలాకాలం వాళ్ల జాడే లేదు.

ఇలా కొన్నాళ్ళు గడిచాక ఓ రోజు ముక్కుచెవులు నరకబడిన ఈ అయిదుగురు శాంతిదూతలూ ఎసర్‌హాడన్‌ దగ్గిర్నుంచి ఓ వార్త మోసుకుని తిరిగొచ్చారు. వీళ్ళ ద్వారా పంపిన సందేశం ఏమిటంటే – వెంఠనే ఎసర్‌హాడన్‌ని చక్రవర్తిగా అంగీకరించి బంగారం, వెండి, డబ్బు, రాజ్యంలో ఉన్న మణులూ మాణిక్యాలు బహుమతిగా పంపించాలి. లేని పక్షంలో ఈ శాంతిదూతలకి అయినట్టే రాజు లైలీకి కూడా చెవులూ ముక్కూ కోయబడతాయి.

కాస్త కంగారుగానూ కొంచెం భయంతోనూ రాజు లైలీ సభలో అందరితోనూ చర్చించాడు ఏమి చెయ్యాలో. సభ మొత్తం ఒప్పుకున్నది ఏమిటంటే ఎసర్‌హాడన్‌ ఆగడాలు ఇంక ఒప్పుకునేది లేదు. వెంఠనే తామే యుద్ధం ప్రకటించాలి. ఈ సారి లైలీకి ఒప్పుకోక తప్పలేదు. వెంఠనే యుద్ధం ప్రకటించబడింది. ఎసర్‌హాడన్‌ సైన్యం లక్షల్లో ఉంటే లైలీ సైన్యం వేలల్లో ఉంది. ఎంత ధైర్యంగా పోరాడినా చివరికి లైలీకి ఓటమి తప్పలేదు. యుద్ధంలో లైలీ రథం తిరగబడిపోయి తునాతునకలైంది. ఎసర్‌హాడన్‌ లైలీని బందీగా పట్టుకున్నాడు. లైలీతోపాటు అతని మంత్రుల్నీ సైన్యాన్నీ అందర్నీ పశువుల్లా కట్టేసి ఆసీరియాకి ఈడ్చుకుపోయారు. లైలీ తనకు లొంగిపోలేదనే కసి తీర్చుకునే సమయం ఎసర్‌హాడన్‌కి వచ్చిందిప్పుడు. రోజుకింతమంది చొప్పున అతని మంత్రులనీ, సైన్యాధికారుల్నీ లైలీ కళ్ళముందే చంపమని ఎసర్‌హాడన్‌ ఆజ్ఞలు జారీ చేశాడు. అందరూ చచ్చిపోయాక జీవచ్ఛవంగా మిగిలిన లైలీని అప్పుడు చంపుతారు. అలా ఎసర్‌హాడన్‌ కసి పూర్తిగా తీరుతుంది.

కలలో లైలీగా ఉన్న ఎసర్‌హాడన్‌కి ఇదో నరకం. ఒకప్పుడు రాజఠీవితో ఉన్న లైలీ ఇప్పుడో దిక్కులేనివాడు. ఎసర్‌హాడన్‌ సైన్యం ఓ ముద్ద పడేస్తే తినాలి అంతే. వంటిమీద ఉన్న కనీసపు బట్టలు కూడా ఎసర్‌హాడన్‌ పెట్టే భిక్షే. రోజూ తన కళ్ల ముందు జరిగే తన ఆప్తుల చావులు చూడవల్సి రావడం మరో నరకం. లైలీ ఇదంతా ఓర్చుకుంటూ ధైర్యంగా ఉందామనుకున్నాడు కానీ ఎసర్‌హాడన్‌ సైన్యం అది కుదరనివ్వలేదు. లైలీని మరింత ఏడిపించడం కోసం అతని ఆప్తులని చంపేముందు చేతులూ కాళ్ళు నరకి, నీకు కూడా ఇలాగే అవుతుంది సుమా అనే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఎసర్‌హాడన్‌ సైన్యాధిపతులు. ఆ చావులన్నీ చూసినా ఏడవలేని స్థితిలోకి వచ్చిన లైలీని మరింత ఏడిపించడానికి అతని భార్యని కొరడాలతో కొడుతూ ముక్కూ చెవులూ కోసి ఉరి తీశారు.

ఇంత దారుణం కళ్లముందు జరుగుతూంటే లైలీ, “ఇది అన్యాయం, అమానుషం” అని గొంతెత్తి అరిచాడు కానీ పట్టించుకునే నాథుడు లేడు.

అలా ఒక్కొక్కరూ చచ్చిపోయాక లైలీ వంతు వచ్చింది. రాజు బట్టలు ఊడదీసి నగ్నంగా ఉరికంబం ఎక్కించే ముందు ఎసర్‌హాడన్‌ సైనికుడు మొహం మీద ఉమ్మేసి వెక్కిరిస్తూ “నువ్వు ఇంతకు ముందో మహారాజువి. మరిప్పుడో?” అన్నాడు.

లైలీకి ఏమనడానికీ నోరు పెగల్లేదు. ఇద్దరు సైనికులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకెళ్ళి ఉరితాడు మెడకి తగిలించారు. కంఠం చుట్టూ ఉరితాడు బిగుసుకుంటూంటే ఊపిరి ఆడని లైలీ యమయాతనపడుతూ కాస్త గింజుకున్నాక మత్తులోకి జారుకున్నాడు. మరి కాసేపటికి అతని శరీరం నిశ్చేతనం అయింది.

‘ఇదంతా మాయ; నిజం కాదు, నేను లైలీని కాదు, నిజానికి నేను ఎసర్‌హాడన్‌ని’ అనే ఆలోచన తట్టి, లైలీగా చచ్చిపోయిన ఎసర్‌హాడన్‌ కళ్ళు తెరిచాడు. అయితే ఇప్పుడు తాను ఎసర్‌హాడన్‌ కాదు, లైలీ కూడా కాదు. అడవిలో గడ్డి మేస్తున్న ఒక జింక. ఇదంతా అర్ధమయ్యేసరికి మరో జింకపిల్ల తన దగ్గిర పాలు తాగడానికి ప్రయత్నం చేస్తోంది. అసలు సంగతి చూస్తే అసలు ముందు తన రాజ్యంలో తన స్వంత అంతఃపురంలో నిద్రపోయిన ఎసర్‌హాడన్‌ కలలో రాజు లైలీ. ఆ లైలీ ఉరి తీయబడ్డాడు. కానీ ఉరితీయబడిన లైలీ ఇప్పుడొక తల్లి జింక; తోడుగా తనకో చిన్న జింకపిల్ల కూడా. అది పాలుతాగుతోంటే, ‘ఇదేమిటి నేను ఎసర్‌హాడన్‌ని కదా, ఇలా జింకలా ఉన్నాను?’ అనే స్పృహే లేదు. ఆ సంగతి అలా ఉంచితే తన పిల్ల పాలు తాగుతోంటే అదొక రకమైన అనిర్వచనీయమైన ఆనందం అనుభవంలోకి వస్తోంది.

ఈలోపునే ఒక బాణం వచ్చి జింకపిల్ల పొట్టలో దిగబడింది. అది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసరికి ఆ పిల్లని వదిలి తాను ప్రాణం రక్షించుకోవడానికి పరుగుపెడుతూంటే మరో బాణం తన పొట్టలో వేగంగా వచ్చి గుచ్చుకుంది. బాణం తాలూకు గాయం, రక్తం తోడేస్తూంటే ప్రాణం పోతోందనేది కట్టెదుట కనబడే సత్యం.

లైలీగా ఉన్నప్పుడు తనకి అమానుషమైన ఉరి, జింకగా ఉన్నప్పుడు పొట్టలో గుచ్చుకున్న గాయం – దారుణంగా నెప్పెడుతూంటే ఓర్చుకోలేక బాధతో కేకలుపెడుతూ, చేతులు ఆడిస్తూ ఎసర్‌హాడన్‌ తల ఒక్కసారిగా పైకెత్తాడు.

ముసలాయన ఇంకా తలమీద నీళ్ళు పోస్తున్నట్టే ఉంది. ఎసర్‌హాడన్‌ తలపైకెత్తడం చూసి, ‘ఏమిటి సంగతి’ అన్నట్టు చూశాడు.

“ఎంత భాధ పెట్టారు! ఇదంతా ఎలా సంభవం? ఎన్ని ఏళ్ళు గడిచాయి మీరు నా తలమీద నీళ్ళు పోయడం మొదలుపెట్టి?” ఎసర్‌హాడన్‌ అడిగేడు.

“ఏళ్ళా? ఇలా వచ్చి నిల్చున్నావు, నేను పోయడం మొదలుపెట్టాను అంతే. ఇంకా అయిదు నిముషాలు కాలేదు. నేను పోసే నీటి కుండలో నీరు ఇంకా పదోవంతు కూడా పోయందే?”

ఎసర్‌హాడన్‌కి నోట మాట రాలేదు. కళ్లప్పగించి ఆలా చూస్తూ ఉంటే నీళ్ళు పోసిన ముసలాయన చేత్తో నీళ్ళు మొహం మీద చిలకరిస్తూ అడిగాడు “ఇప్పుడర్థం అయిందా ఇదంతా ఏమిటో?”

ఒక్కసారి ఎసర్‌హాడన్‌కి జ్ఞానోదయం అయినట్టయింది. ఇదన్న మాట సంగతి. తాను చంపాలనుకున్న రాజు లైలీ, తాను చంపిన జింకలు, సింహాలూ ఆత్మస్వరూపులే. తాను వాళ్ళకి చేయబోయే గాయాలు, నొప్పి మొదలైనవన్నీ తనకి స్వంతంగా చేసుకున్నట్టే.

చిలకరించిన నీళ్ళు మొహం మీద పడగానే కల చెదిరిపోయి చటుక్కున ఎసర్‌హాడన్‌కి మెలుకువ వచ్చింది. మిగతా రాత్రి అంతా తెల్లవారరడం కోసమా అన్నట్టు మంచం మీద దొర్లుతూ గడిపేడు.

మర్నాడు తెల్లవారుతూనే రాజసభలో ఎసర్‌హాడన్‌ లైలీకీ, మిగతావాళ్లకీ జరగబోయే ఉరి శిక్షలన్నీ రద్దు చేయమని మంత్రులకి పురమాయించాడు. ఆ తర్వాత రెండు రోజులు రాజ్యంలో ఎవరి కంటా పడకుండా ఏకాంతంగా తన మందిరంలో ఆలోచిస్తూ గడిపిన ఎసర్‌హాడన్‌ మూడవనాడు రాజ్యాన్ని కొడుకు ఎసర్‌బనిపల్ చేతికిచ్చి రాజమందిరంలోంచి హఠాత్తుగా మాయమయ్యాడు. ఎసర్‌హాడన్‌ హత్య చేయబడ్డాడని, పిచ్చెక్కి రహస్యంగా రాజమందిరంలోనే ఒంటరిగా బతుకుతున్నాడని, తనని విడిచిపుచ్చాక రాజు లైలీ ఎసర్‌హాడన్‌ని ఖైదు చేయించాడని, ఇలా నమ్మశక్యంకాని వార్తలు ఒకదాని వెంట ఒకటి తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఎసర్‌హాడన్‌ ఏమయ్యాడో మాత్రం ఎవరికీ తెలియలేదు.

ఇది జరిగిన చాలా సంవత్సరాలకి ఊరూరా తిరిగే ఓ మహనీయుడు రాజ్యంలోకి వచ్చి జనాలకి త్యాగం, అహింస అనేవాటి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ ఎన్నిసార్లు ఏం చెప్పినా దాని సారం మాత్రం ఇదే – ప్రాణం, ఆత్మ అనేవి ఎప్పుడూ అందరికీ ఒకేలాగ ఉంటాయి. ఆత్మవత్సర్వభూతాని అన్నట్టు ఎవరూ కూడా మరొకరి నుంచి వేరుగా లేరు. నీలో ఉన్న ఆత్మే నాలోనూ ఉంది; ఆ పరమాత్మే నేను. నాయం హంతి న హన్యతే – ఆత్మ అనేది చనిపోయేదీ కాదు, ఇతరులచేత చంపబడేదీ కాదు. ఎవరైనా మరొకరికి హాని చేస్తే అది తనకి చేసుకున్న హాని మాత్రమే. అహింసా పరమో ధర్మః
----------------------------------------------------------
(మూలం: Leo Tolstoy – Esarhaddon, King of Assyria, 1903.)
రచన: ఆర్. శర్మ దంతుర్తి , ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
----------------------------------------------------------

ఒక ఉన్మాది మనస్సినీవాలి

సాహితీమిత్రులారా!
సీ. నిండారు తెగగొని నిగిడించు తూపుల
వైరి మర్మంబులు వ్రచ్చి వ్రచ్చి
బిగితంపు ముష్టి కంపితమైన యసిధార
విమత కంఠాస్థులు విఱిచి విఱిచి
అనువొంద నల్లార్చి యందంద పెనుగద
శత్రుదేహంబులు చదిపి చదిపి
చదల వమ్ముగ బర్వు శక్తిశులాదుల
బగఱ పీనుగు లుర్వి బఱపి పఱపి

తే. ఏ దినంబును వృథవోవనీని కడిమి
యొదవ బోరాడునాట చెన్నొందెనేని
కూడు చవి యగుగాక నిష్క్రోధమైన
దర్పమూరక యూరింప దరమె దేవ!

పద్యాలనగానే లలితమనోహర దృశ్యాలూ సుందరవర్ణనలే అని కొందరు భ్రమపడుతూ ఉంటారు. అలాంటి భ్రమని పటాపంచలు చేసే పద్యం ఇది. మృదుమధురమైన సంగీతాన్నే కాదు ‘ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకం కేక’ని కూడా వినిపిస్తుంది కవిత్వం. ప్రాచీన పద్యకవిత్వం కూడా అందుకు సమర్థమైనదే. కొన్ని కావ్యాలలో కథలూ వాటిలోని పద్యాలూ చదువుతూ ఉంటే, ఈనాడు ప్రపంచాన్ని ఉడికెత్తిస్తున్న హింసాప్రవృత్తీ యుద్ధోన్మాదమూ అనాదిగా మానవుని అంతరంగంలో దట్టంగా అలనుకొన్న చీకట్లేనన్న సంగతి స్పష్టంగా తెలిసివస్తుంది. మనిషి అంతరంగంలో దాగిన ఆ ఉన్మాదాన్ని బహిరంగంగా ఆవిష్కరించే కథ బాణాసురవృత్తాంతం. ఆ బాణాసురుని పోరాటకండూతిని నగ్నంగా ప్రదర్శించే పద్యమిది!

నాచన సోమన రచించిన ఉత్తరహరివంశం పంచమాశ్వాసంలో వస్తుంది బాణాసురుని కథ. బాణాసురుడు ఒక విపరీత మనస్తత్వం కలిగినవాడు. ఇతను బలిచక్రవర్తి కుమారుడు. బహుశా యితని చిన్నతనంలోనే తండ్రి పాతాళానికి వెళ్ళిపోయాడేమో! ఇతని చిన్నతనం గురించి అంతగా తెలియదు కాని కొంత పెద్దవాడయ్యాక గొప్ప శివభక్తుడవుతాడు. ఒకనాడు శివుడు కుమారస్వామిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకోడం చూసిన బాణునికి సంతోషమూ విచారమూ ఒకేసారి కలుగుతాయి. తన తండ్రి ఉండుంటే తనని కూడా అలా లాలించేవాడు కదా అనుకొంటాడు. ఈశ్వరుడినే తన తండ్రిగా పొందాలని తపస్సు చేస్తాడు, సాధిస్తాడు. పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి తన కొడుకుగా ఆదరిస్తాడు. కుమారస్వామి అతడిని తమ్మునిగా గౌరవిస్తాడు. మంచి నగరాన్నీ, గొప్ప శక్తి సంపదలనీ ప్రసాదిస్తాడు. భక్తితో శివుని మెప్పించి తన నగరానికి కాపలావానిగా కూడా చేసుకొంటాడు. తండ్రి బలిచక్రవర్తి దుర్గానికి విష్ణువు కాపలాదారయితే కొడుకుకి శివుడన్న మాట! పైగా వేయిచేతులు కూడా వరంగా పొందుతాడు బాణుడు. ఇంకేవుంది! వాడి గర్వానికి మితి లేకుండా పోతుంది. త్రిలోకాలనూ ఎనిమిది దిక్కులనూ జయిస్తాడు. అయితే, బాణుడి బలానికి భయపడి అందరూ యుద్ధం చేయకుండానే అతనికి లొంగిపోతారు. అందువల్ల యుద్ధకాంక్ష తీరక అతని చేతులు తీటపుడుతాయి. తిరిగి పరమశివుని దగ్గరకి వెళ్ళి తన బాధను వెళ్ళబోసుకొంటాడు. ఆ సందర్భంలో వచ్చే పద్యమిది.

పూర్తిగా అల్లెతాటిని లాగి (నిండారు తెగగొని) ప్రయోగించే బాణాలతో పగవారి ఆయువుపట్టులు (వైరిమర్మంబులు) చీల్చి చీల్చి, బిగించిన పిడికిట కదిలే కత్తి వాదర చేత శత్రువుల మెడల ఎముకలు (విమత కంఠ + అస్థులు) విఱిచి విఱిచి, పెద్ద గదను అనువైన విధంగా త్రిప్పుతూ తిరిగి తిరిగి శత్రువుల శరీరాలను నలగగొట్టి నలిపి నలిపి, ఆకాశంపై (చదలన్) అంతటా వ్యాపించే శక్తి శూలాల వంటి ఆయుధాలతో శత్రువుల శవాలను (పగఱ పీనుగులు) నేలపై పడేసి పడేసి, ఏ రోజూ వృధాగా పోకుండా (వృధ + పోవనీని) పరాక్రమం (కడిమి) చూపించగలిగేటట్టు యుద్ధమనే ఆట (పోరాడు+ఆట) అమరినప్పుడు కదా, తిండి రుచిస్తుంది (కూడు చవి యగుగాక.) ఎవరిపైనా కోపం చూపించలేని నా యీ గర్వం లోలోపల ఉట్టినే ఊరిపోతూ ఉంటే భరించడం శక్యమా!

అదీ బాణుని బాధ! యుద్ధం చేయడమంటే అలాంటి యిలాంటి యుద్ధం కాదు వాడికి కావలసింది. ఎదుటి వారిని నానా రకాలుగా చిత్రవధ చేస్తే కాని ఆ యుద్ధ దాహం తీరదు. అప్పుడు కాని అసలు తిండి కూడా సహించదట! కంటకుడైన శత్రువు తనంతటి వాడు ఒకడుంటే, ‘కంటికి నిద్రవచ్చునె, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్ వంటక మిందునే’ అని కాశీఖండంలో వింధ్యుడు వాపోతాడు. ఈ బాణాసురుని బాధ ఇంకాస్త విపరీతమైనది. తనంతటి శత్రువు కలిగి, అతనితో యుద్ధం చేస్తేనే కాని వీడికి తిండి రుచించదు!

బాణాసురిని రాక్షసోన్మాదం అంతా మనకి చాలా స్పష్టంగా స్ఫురింపజేసేలా సాగింది నాచన సోమన పద్యరచన. ఆ పైశాచికస్వభావాన్ని విపులంగా ఆవిష్కరించడంలో కవి ఎలాంటి మొహమాటమూ చూపలేదు. అందుకే సీసపద్యం ఎన్నుకొన్నాడు. నిండారు, బిగితంపు, మొదలైన విశేషణాలూ; వ్రచ్చి వ్రచ్చి, విఱిచి విఱిచి, అంటూ సీసపద్య పాదాల చివర ఆమ్రేడితమైన క్రియలు, బాణాసురుని కోరిక తీవ్రతను సంపూర్ణంగా ధ్వనింపజేస్తున్నాయి. బాణాసురునికి యుద్ధం ఒక క్రీడ. అది లేని రోజు వృధాగా పోయినట్టే! ‘కూడు చవి యగుగాక’ అన్నది పదునైన అచ్చ తెనుగు ప్రయోగం. బహుశా ఇది తిక్కనగారి ఒరవడి. ఇలా ఒక వ్యక్తి స్వరూప స్వభావాలను మనసుకెక్కేట్టుగా వర్ణించడం మంచి కవిత్వ లక్షణం. అయితే అందులోంచి ఒక సార్వజనీనమైన అంశమేదయినా వ్యంజింప జేయగలిస్తే అది మరింత గొప్ప కవిత్వం అవుతుంది. అది తర్వాతి పద్యంలో కనిపిస్తుంది. బాణాసురుని చేత యింకా యిలా అనిపించాడు సోమన.

దేవా! కయ్యముతోడి వేడుక మదిం దీండ్రింప మర్త్యుండు నే
త్రోవం జేతులతీట వుత్తునని కోరున్ దానువుండైన నా
కీ వే చేతులు చేసి తీ కసిమి రింకెట్లోర్తు నోర్తున్ రిపు
గ్రీవాఖండనమండనస్ఫురదసిక్రేంకారముల్ గల్గినన్

‘కయ్యముతోడి వేడుక’ అంటే యుద్ధకాంక్ష. యుద్ధకాంక్ష మనసులో తీండ్రిస్తూ (చెలరేగుతూ) ఉండే మనిషి (మర్త్యుండు), ఎలాగయినా సరే తన చేతుల తీట తీర్చుకోవాలని (పుత్తునని) ఆరాటపడుతూ ఉంటాడు. మనిషికయితే రెండే చేతులు. నువ్వు నాకు ఈ వేయి చేతులు చేశావు (చేసితి). ఈ కసిమిరి (తీట) ఇంక నేనెలా ఓర్చుకోగలను. ‘రిపు గ్రీవా ఖండన మండన స్ఫురత్ అసి క్రేంకారముల్ గల్గినన్’ ఓర్చుకోగలను. శత్రువుల కంఠాలు నఱకడమనే అలంకారంతో ప్రకాశించే ఖడ్గపు క్రేంకారాలు (తలలు నరికేటప్పుడు, అవి విరిగి పడేటప్పుడూ వచ్చే శబ్దాలు) వినగలిగినప్పుడు తన చేతుల తీట తీరుతుందని చెపుతున్నాడు బాణాసురుడు. రెండు చేతులున్న మనిషికే తీవ్రమైన యుద్ధకాంక్షతో చేతులు తీటపెడుతూ ఉంటే, వేయిచేతుల దానవుడైన తనకు మరెంతగా ఆ పోరుతీట ఉంటుందోనని సమర్థింపు కూడానన్న మాట! ఇక్కడ బాణాసురుని స్వభావాన్ని వ్యక్తపరచడంతో పాటుగా నిరంతరమైన మనిషి యుద్ధోన్మాదంపై ఒక వ్యంగ్యాస్త్రాన్ని కూడా సంధించాడు సోమన. పద్యమంతా అచ్చతెలుగు పొడి మాటలతో నడిపించి, చివరికి ఒక దీర్ఘసంస్కృత సమాసం ప్రయోగించడం ఒక పద్యరచనా శిల్పం. అది చదువరులలో ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా, సందర్భోచితంగా వాడినట్లయితే, చెప్పే విషయాన్ని మరింత దీప్తిమంతం కూడా చేస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న బాణాసురునిలో, శత్రువుల తలలు నఱకడమనే తలపు వచ్చేసరికల్లా, ఒక్కసారిగా ఉప్పొంగిన ఉత్సాహావేశాలు చివరి సమాసం ద్వారా అద్భుతంగా స్ఫురిస్తాయి.

శివుడు కానీ శివుడంతటి యోధుడు కానీ తనతో యుద్ధం చేస్తే తప్ప తనకి తృప్తి కలగదని బాణుడు కోరుకొంటాడు. శివుడు భక్తుని వెఱ్ఱితనానికి నవ్వుకొని అలాగే జరుగుతుందని వరమిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణునితో బాణాసురునికి యుద్ధం సంభవిస్తుంది. విశేషం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇతర రాక్షసుల్లాగా, బాణాసురుడిని చంపడు. అతని చేతులన్నిటినీ నరికేసి, నాలుగు చేతులు మాత్రం మిగులుస్తాడు. దానితో బాణుని ఉన్మాదం నశిస్తుంది. తన కూతురుని కృష్ణుని మనవడికిచ్చి పెళ్ళి చేస్తాడు.

ఈనాటికీ వేయి చేతులున్న బాణాసురులకి కొదవేమీ లేదు. అయితే మనిషిని చంపడం కన్నా మనిషిలోని ఉన్మాదాన్ని చంపడం కష్టతరం, కానీ అదే మేల్తరం కూడాను అన్న సందేశాన్ని మనం బాణాసురవృత్తాంతం నుండి తీసుకోవచ్చునేమో!
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు,
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

నేటి : విశ్లేషణ 
ప్రాంజలి ప్రభ 

నవ్వినా ఏడ్చినా అది ఓఅక సౌందర్యం 
మురిపాల ముచ్చట్లు ముగ్ద సౌందర్యం 
ముద్దు ముద్దు మాటలు మనోహర సౌందర్యం 
బాలకృష్ణుని గుణ గణాలను వర్ణించటం ఎవరితరం 

వర్ణనలలో ఉన్న అర్ధాన్ని తెల్లుపేది సౌందర్యం 
గుణాలను తెలిపేది జీవన మధుర  సౌందర్యం 
పిల్లలు చేసే మధ్రుమైన చేష్టలు కుఉడా సౌందర్యం 
బాల ముగ్ధత్వాన్ని మురిసే లోకమంతా సౌదర్యం 

నోరన్ జేతులు రెండు గ్రుక్కుకొనుచున్మోమెల్ల బాష్పాంజన 
స్మేరంబై తిలకింపనేర్చుచు, బొరిన్ మీజేతులన్ గన్నులిం 
పారం దోముచు, చేవబూని పిఱుదొయ్యన్ మీది కల్లార్చుచున్ 
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజుకొనుచున్ జెల్వంబు రెట్టింపగన్ 

పాపం ఈ పసివాడిని ఏ బూచాడో భయపెట్టాడు కాబోలు. గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు! నోటిలో రెండు చేతులు కుక్కుకొంటూ మరీ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి అతని మొగమంతా ‘బాష్పాంజన స్మేరంబు’ అయ్యింది. కన్నీటికి కరిగిన కాటుక ఆ పాపాయి ముఖమంతా అలముకొన్నది. ఎంత చిక్కని పదమో అంత చక్కని పదచిత్రం! మాటిమాటికీ మీజేతులతో (అంటే చేతుల పైభాగం) కన్నులు నులుముకొంటున్నాడు. చేవబూని – అంటే కాస్త బలం తెచ్చుకొని, పిఱుదు మెల్లిగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పసివాని పాదాలు శ్రీరమ్యంగా ఉన్నాయి. అంటే ఎంతో శోభతో మనోహరంగా ఉన్నాయి. ఆ లేలేత పాదాలను గింజుతూ తంతూ ఉంటే అతని అందం రెట్టింపవుతోంది! 

స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా 
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో 
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ 
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ 

ఆ నందనందనుడు నందగోపునికి కనిపించిన తీరిది. స్తన్యమనే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందమైన చిరునవ్వొకటి ఆతని మోమును వెలిగిస్తోంది. విచ్చుకున్న తామరాకుల్లాంటి కన్నుల కాంతులు అమ్మవైపు ప్రీతితో ప్రసరిస్తున్నాయి. దానివల్ల ఆమె ముఖం చంద్రబింబంలా ప్రసన్నంగా ఉంది. ఇంతటి పసిబాలుడు, ప్రసన్నమూర్తి, కొద్ది క్షణాల ముందొక పెద్ద రక్కసుణ్ణి సంహరించాడంటే ఎవరు నమ్మగలరు! 
--((**))--

వసంతునితో వెన్నెలఱేడు పోటీ! 

సాహితీమిత్రులారా! 
చం. క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం 
భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస 
న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె; 

ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా మధుమాసం వచ్చింది. వసంత ఋతువుని వసంతునిగా సంభావించడం కవిసమయం. అతను మన్మథుని చెలికాడు కదా. వసంతుడు వస్తూనే చక్కగా భూమిపై మోడువారిన చెట్లనన్నింటినీ చిగురింపజేశాడు. మామూలుగా చిగురించాయా అవి! రస ఉపగుంభిత పద వాసనల్ నెఱప – చిగురించాయి. రసవంతమైన (ఫలపుష్పాల వంటి) సామగ్రితో, వాటినుండి వచ్చే సుగంధాలు నలువైపులా వ్యాపించేట్టుగా చిగురించాయి. అలా చిగురింపజేశాడు వసంతుడు. వసంతుడు అంతటి ఘనకార్యాన్ని చేసినా పైనుండి చూస్తున్న చంద్రుడు మెచ్చుకోలేదు. సరికదా, అతనితో స్పర్థ బూనాడు. అతని కంటే ఘనుడనని నిరూపించుకోడానికి ప్రసన్నమైన, సుకుమారమైన తన వెన్నెలజల్లు కురిపించి రాళ్ళను సైతం కరగింపజేశాడు! శరత్తులాగే వసంతంలో కూడా వెన్నెల విరగకాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది కాబట్టి. పైగా వేడెక్కే పొద్దులనుండి చల్లని ఉపశమనాన్ని కూడా యిస్తుంది. అంచేత మధుమాసం కూడా వెన్నెల మాసమే. ఈ రెండంశాలనూ కలపోస్తూ, వసంతునికీ చంద్రునికీ మధ్య స్పర్థనొక దాన్ని కల్పించాడు కవి. కవి చమత్కారానికి హద్దేముంది! పైగా ‘ప్రతి పద్యమునందు జమత్కృతి గలుగన్ జెప్పనేర్తు’నని ప్రతినబూనిన కవి కూడాను. 

ఈపాటికే ప్రాజ్ఞులయిన పాఠకులకి ఈ కవి ఎవరో ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు. 

ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా! 

పద్యం తెలియని చాలామందికి కూడా తెలిసే వాక్యం ఇది. తెలుగు సాహిత్యంలో అంతగా ప్రసిద్ధికెక్కింది. వసంత వర్ణనలో విశేషమైన కల్పన చేయడమే కాకుండా దానిని ఉదాహరణగా తీసుకొని, సామాన్యంగా మనుషులలో ప్రత్యేకించి కవులు కళాకారులలో, కనిపించే ఒకానొక లక్షణాన్ని ఎత్తిచూపిస్తున్నాడు చేమకూర కవి. ఈ కవి ప్రతి పద్యం లోనే కాదు ప్రతి పదంలో కూడా చమత్కారం గుప్పించగల దిట్ట. చివరి పాదం చదివిన తర్వాత మళ్ళీ పద్యమంతా తిరిగి చదివితే, చివరి పాదం హఠాత్తుగా ఊడిపడింది కాదని, పద్యం మొదటినుంచీ కవి ఆ విషయాన్ని తాను ప్రయోగించిన పదాల ద్వారా స్ఫురింపజేశాడనీ అర్థమవుతుంది. ‘రసోపగుంభిత పదవాసనలు’ అంటే నవరసాలతో శోభిల్లే పదభావాలు. అలాంటి శబ్దార్థాలు కూడిన కవిత్వాన్ని రచించి, ఒక కవి మోడువారిన హృదయాలను చిగురింపజేశాడు. మరొక కవి దానిని మెచ్చకుండా పంతంతో తను కూడా కావ్యరచన చేశాడు. ప్రసాదము, సౌకుమార్యము అనే గుణాలతో ప్రకాశిస్తూ, రాతి గుండెలను సైతం కరిగించే కావ్యం అది. ప్రసాదము, సౌకుమార్యము అనేవి కావ్యగుణాలు. ఆలంకారికులు మొత్తం పది కావ్యగుణాలను చెప్పారు – శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి. ప్రసాదము అంటే అందరికీ అర్థమయ్యే పదాలతో సులువుగా సాగిపోయే గుణం. సౌకుమార్యం అంటే అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉండే లక్షణం. ఇలా ఒకవైపు వసంతాన్ని వర్ణిస్తూనే మరొకవైపు ఒకానొక లోకస్వభావాన్ని స్ఫురింపజేయడం కవి ప్రతిభ. రసోపగుంభిత పదవాసనలు, ప్రసన్నత, సౌకుమార్యము మొదలైన పదాలలో శ్లేష ద్వారా దీన్ని సాధించాడు వేంకటకవి. అయితే పద్యం మొత్తం మీద ఉన్న అలంకారం శ్లేష కాదు. ఎందుకంటే ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు. ఇటువంటి అలంకారాన్ని సమాసోక్తి అంటారు. శ్లేష ఎక్కువగా శబ్దప్రధానమైనది. సమాసోక్తి అర్థప్రధానమైనది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, భావప్రధానమైనది. అది మనసుని మరింతగా హత్తుకుంటుంది. 

ఏదయితేనేమి, ఆ యిరువురి స్పర్థ, వారి రచనలను అనుభవించేవారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది! అది కవుల విషయమైనా సరే, చంద్రవసంతుల విషయమైనా సరే. స్పర్థయా వర్ధతే విద్య అని అన్నారు కదా. అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు. పద్యాన్ని మరొకసారి జాగ్రత్తగా చదివితే, చంద్రుడు వసంతుడిని తక్కువ చేయడం మనకి కనిపిస్తుంది. ‘వట్టి మ్రాకులు చిగిర్ప’ అన్న పదబంధంలో ‘వట్టి’ అనే పదం మోడువారిన అనే అర్థంతో పాటు, విడిగా చదివితే ‘కేవలం’ అనే హేళన భావం కూడా ధ్వనిస్తుంది. కేవలం చెట్లని మాత్రం చిగురింపజేయడమే వసంతుడు చేసే పని అని, తాను మాత్రం రాళ్ళను సైతం కరిగించగలడనీ- చంద్రుని పరంగా అన్వయించుకోవచ్చును. అలాగే వసంతుడు తన కార్యాన్ని సాధించడానికి ‘క్షితిపయి’కి వెళ్ళవలసి వచ్చింది. మరి తానో, ఆకాశంలో ఉండే తన కార్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి పదాన్ని సార్థకంగా ప్రయోగించడం చేమకూర ప్రత్యేకత. తాపీ ధర్మారావుగారు విజయవిలాసానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యలో ఈ ప్రత్యేకతను అద్భుతంగా పట్టి మనకందించారు. వేంకటకవి పద్యాలలో అధికాధికం శబ్దచమత్కార బంధురమైనవి. అర్థచమత్కారంతో సున్నిత భావాన్ని స్ఫురింపజేయడం ఈ పద్యంలో నన్ను ఆకట్టుకొన్న అంశం. సాధారణంగా కవుల కావ్యాలలో ఋతువర్ణనలు విస్తారంగా సాగుతాయి. అయితే వేంకటకవి విడిగా ఋతువర్ణన చేయలేదు. సాయంకాల వర్ణనతో కలిపి వసంతాన్ని వర్ణించడం ఇక్కడున్న విశేషం. పై పద్యంలో చంద్రుని ప్రసన్నతకూ సౌకుమార్యానికీ కారణం వసంతకాలం ఒక్కటే కాదు. అది పున్నమిరేయి కూడానూ. దీని ముందరి పద్యాలను చదివితే ఆ విషయం బోధపడుతుంది. అది కూడా కవి నేరుగా చెప్పడు, సాయంకాల దృశ్యాన్ని చిత్రించడం ద్వారా మనకి ప్రత్యక్షం చేస్తాడు. ఆ పద్యాన్ని కూడా ఆస్వాదించి వసంతుని ఆగమనాన్ని స్వాగతిద్దాం. 

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే 
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా 
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో 
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్ 

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది. 

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని. 

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. వాటినే ఆలావర్తములని (ఆలవట్టములు) కూడా అంటారు. ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా! జగజ్జేత అయిన మన్మథుడు. అతనికి బొమ్మలతో పని లేదు. అచ్చంగా చంద్రసూర్య బింబాలే మేలిమి (జాళువా) బంగారు ఆలవట్టములయ్యాయి అన్నట్టుగా అటూ యిటూ, తూర్పుపడమటి కొండలపై (పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధరాగ్రముల) ప్రకాశించాయి. తోయజశాత్రవుడు అంటే పద్మాలకు శత్రువు – చంద్రుడు. తోయజమిత్రుడు సూర్యుడు. చంద్రబింబం తూర్పుకొండపైన, సూర్యబింబం పడమటికొండపైన వెలుగుతోంది. అందుకే అది సాయంసమయం. సూర్యాస్తమయమూ చంద్రోదయమూ ఒకేసారి అవుతున్నాయంటే అది పున్నమి అన్నమాట. అది మధుమాసమనీ పున్నమినాటి సాయంసంధ్యా సమయమనీ ఎక్కడా నేరుగా చెప్పకుండా కేవలం దృశ్యచిత్రీకరణ ద్వారా తెలియజేయడం కవి రచనలోని చమత్కారం! అంగజరాజు అనే పదానికి కూడా గొప్ప సార్థకత ఉందని వివరించారు తాపీవారు. దీనికి అంగదేశంలో పుట్టిన రాజు అనే అర్థం కూడా వస్తుంది. అంగదేశం భరతఖండంలో ఉత్తరాన ఉంది. అందువల్ల అంగజరాజు ఉత్తరదిక్కు నుండి బయలుదేరుతున్నాడని ఊహించవచ్చు. అప్పుడు సరిగ్గా అతని కుడిపక్క (అంటే పడమట) సూర్యపాను, ఎడమపక్క (అంటే తూర్పున) చంద్రపానూ ఉన్న దృశ్యం మనకి చక్కగా సాక్షాత్కరిస్తుంది. 
----------------------------------------------------------- 
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో 
---------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

24. నియమబద్ధత(నియతి) 
11 భోగములందు జీవునకు ఏ మాత్రము విరాగము గల్గిన, అతడు ఉత్తమ మగు పదము పొందునని శ్రుతిపల్కుచున్నది. సంపూర్ణ విరాగము వలన జీవస్ముక్తి కల్గును. స్వప్నమునను ఇంద్రజాల మందు కనిపించు పర్వతములు, పట్టణములు, మిధ్య అయినట్లు, సృష్టి మిధ్య అయినను, సంకల్ప బలము వలన, అనుభవ యోగ్యములగు చున్నవి. దేహి యొక్క దేహము నుండి, హస్త పాదాది అంగములు వేరుగా కనబడుచున్నవి. దీనినే దైవ మందురు. ఇది సర్వకాల వ్యాప్తి, సకల వస్తు వ్యాప్తి, చైతన్య రూపమగు ఈశ్వర సంకల్పము. దీని చలనమిట్లుండును. ఈ సమయమున, ఈ విధముగా ఇదియుత్పన్నమగు నియతియె దైవము. ఈ నియతి పురుషాకారము, పురుష ప్రయత్నము వలన ఏర్పడును. నేను చెప్పుట నీవు వినుట ఆచరించుట మొదలగువన్ని నియతి యొక్క ఫలమే. ఈ బ్రహ్మమును, నియతియు, సృష్టియు ఒక్కటే. కల్పారంభము నుండి, ప్రళయము వరకు జరిగెడి వన్నియు నియతి వలననే జరుగుచున్నవని గ్రహించవలెను. జరుగవలసినది నియతి ప్రకారము జరుగక మానదు. అగ్ని తాపము నిచ్చుట, నీరుపల్ల మునకు ప్రవహించుట నియతికి నిదర్శనము. పురుషాకారము నియతి ప్రకారమే ఆచరింపవలెను. ఎవడైన నియతి ననుసరించి భోజనాధులను వర్జించిన అతనికి క్షుద్బాద తప్పదు. అయినా కొంత కాలము జీవించును. కాని ఉశ్వాస, నిస్వాస రూపమగు పురుషాకారము త్యజించిన నతడు మరణించును కదా! నిర్వి కల్ప సమాధి యందు, వాయువును నిరోధించి, ముక్తి నందుట పురుషాకారము వలననే, అందువలన నియమ బద్ధత ననుసరించి పురుషాకారము ననుసరించవలెను. నీటి వలననే తృణ, లత, వృక్షాది రూపములు ప్రకాశించునట్లు, సర్వగామి యగు బ్రహ్మమే నియతి రూపమున ప్రకాశించుచున్నది. బ్రహ్మతత్వము సర్వకాల సర్వావస్ధల యందును శక్తివంతమై వెలయుచున్నది. ఈ బ్రహ్మమే ఆత్మ. సాత్విక ఉపాధులందు శాంతమును, తామసిక ఉపాధులందు జడశక్తిని, రాజస ఉపాధు లందు రాగద్వేషములను, ప్రకటించును. ప్రళయ, సుషిష్తికాలమున నేమియు ప్రకటించబడదు. ఈ బ్రహ్మం ఎచ్చట ఏ రూపమున నుండునో అచ్చట ఆ లక్షణములు ప్రకటించును. బుద్ధి మంతులు లౌకిక వ్యవహారము లందు నానాత్వము కల్పించినప్పటికి, ఆత్మ యందు ఎట్టి భేదము లేదు. ఏది బుద్ధికి తోచునో, అది అట్లే గోచరించును. కాన పరమార్ధ దృష్టికి అంతా ఒకటే. చిచ్చక్తియె వివిధములుగ ప్రకాశించుచున్నది. బ్రహ్మం ఒక్కటియె సత్యం.
--((**))--

వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

23. భావనా జగత్తు 
లీలావతి వృత్తాంతము తరువాత వసిష్టుడు శ్రీరాము నుద్దేశించి ఇట్లు చెప్ప దొడగెను. దృశ్య పదార్ధములు, అసత్యములని లీలావతి వృత్తాంతము తరువాత తెలియుచున్నది. జ్ఞానులు దృశ్య పదార్ధములు మిధ్యయని ఎంచుదురు. చైతన్య రూపుడగు స్వయం ప్రభువు ఎట్లు భావించునో అట్లే జరుగును. సృష్టి, స్ధితి, లయములు అతని అభీష్టములే.నిర్మలాకాశమున ఈ జగత్తు, బ్రహ్మత్మకముగ ప్రతిభాసించుచున్నది. ఇయ్యది బుద్ది వికాసమగుట వలన జీవుని యందే ప్రకటితమగుచున్నది. అంతయు కేవలము భ్రాంతియె. ఎప్పుడు విజ్ఞానము పోందునో,అప్పుడు అతని కట్టి అనుభవమే కల్గును. నిరంతరము, అమృతమని భావించిన విషము కూడ అమృతమైపోవును. మిత్రుడని భావించిన శత్రువు మిత్రుడగును. పదార్ధములు ఏ భావమున భావించబడిన, భావనా ప్రభావము వలన, అట్లే ప్రకటితమగును. బుద్ధి చిత్తముననుసరించి సంకల్పించునట్లు పదార్ధములు అట్లే ప్రకటించును. ఒక్క నిముషమున పెక్కు కల్పములు భావించి, అట్టి బుద్ధిబడయగల్గిన, ఆ నిముషమే కల్పముగ తోచును. స్వప్నమున మరణించి మరల జన్మించి తాను, యువకుడ నైతినని, శతయోజనములు నడచితిననితోచును. హరిశ్చంద్రుడు ఒక రాత్రి యందు పది రెండు వర్షములు గడిపినట్లు అనుభవించినాడు. లవణుడను రాజు ఒక రాత్రి యందు నూరేండ్లు అయ్యెనని అనుభవించినాడు. నారదుడు కొద్ది సమయములోనే వివాహము, పిల్లులు, సంసారము, దుఃఖములను అనుభవించాడు. ప్రజాపతి ముహూర్త కాలము మనువుకు జీవిత కాలము. బ్రహ్మ యొక్క జీవితకాలము, విష్ణువునకు దినము. విష్ణువు యొక్క జీవిత కాలము శివునికి ఒక్క దినము. నిర్వకల్ప సమాధి యందులీనుడైన యోగికి దివారాత్రి భేదము లేదు. అతనికి ఆత్మ పదార్ధము ఒక్కటియె సత్యము. దుఃఖము, ఆనందము, వైరాగ్యము అప్రియములు. మధురమైన భావమున చింతించిన కష్టతరమగు మనోరధము మధురమగును. విషయభోగములు అనుభవింప సాయపడు బంధు మిత్రులు పురుషార్ధమునకు అడ్డంకులై శత్రువులగుదురు. కావున ఈ జగత్తు భావనామయము. శాస్త్ర పాఠములు, జపాదులు, సాధనలేనిచో కఠినములుగను, సాధన చేసిన వారికి తేలికగను తోచును. ఆకాశయానము చేయువానికి చెట్లు, గ్రహములు, భూమి కదలుచున్నట్లు తోచును. అజ్ఞానము వలన స్వప్నము నందువలె, శూన్యము కూడ పూర్ణముగ తోచును. 
గ్రహించుట యందలి దోషము వలనే పచ్చని పదార్ధములు నీలముగను, లేక తెలుపుగనో తోచును. స్వప్నము నందు వనిత రతిని గూర్చి నట్లు, జాగ్రత్తలో గూడ జరుగు రతి చివరకు భ్రాంతియె. మనో స్పందన వలెనే ఆకాశములో జగత్తు కనబడుచున్నది. బాలుడు మనోవికారము వలెనే, పిచాచమును గాంచును, తత్వజ్ఞులు మాయా కల్పితమైన ఈ జగత్తును అనిద్రితుడగువాడు కాంచు అపూర్వ స్వప్నమని ఎఱుంగును. జీవాత్మ బ్రహ్మము నుండి వేరు కాదు. ఒకడు యద్దమొనర్చుచున్నట్లు కాంచును, అప్పుడది సత్యమే అని తలచును. తదుపరి అతనికి అది మిధ్య అని తెలియును. ఈ జగత్తు స్మృతిజ్ఞప్తుల నుండి కలుగుట వలన సంస్కారయుతమే. వాస్తవము కాదు. 
ఈ జీవులలో నెయ్యది బ్రహ్మకారమున వెలయుచు, విషయదోషములను గ్రహించి, అట్లే అది విదేహముక్తి వరకు ఉండి బ్రహ్మమున లీనమగుచున్నది. సముద్రమున కరుగు మహానది, ఇతరములగు ఉపనదులను తన యందు కలుపుకొనునట్లు, సత్యమగు బ్రహ్మాకార జ్ఞానము మాయను జగత్తును లోబరుచుకొని, ముక్తిని పొందును. అత్యంత ధృడముగా బ్రహ్మ భావనకు ప్రయత్నించువారు, విజయమును పొందుచున్నారు. ఇతరులు ప్రయత్నములో నున్నారు. పరమాణు కణముల నుండి, భ్రాంతియగు ఈ సృష్టి వెలువడి నశించుచున్నది. లేని వస్తువులు లభించుట గాని, లభించకపోవుట గానిలేదు. చిదాకాశము ఒక్కటియె యున్నది. అవివేకమైన ఈ స్వప్నము బ్రహ్మసాక్షాత్కారమగు వరకు అగుపించుచున్నది. ఈ స్వప్నము పూర్వానుభూతము మిధ్యయె.వృక్షము, ఆకులు, పూలు, పండ్లలో నిండివున్నప్పటికి వృక్షములోని భాగములే. అట్లే నా నా విధాకారములు ఈ సృష్టిలో స్పురించుచున్నను బ్రహ్మమొక్కటియె. ఈ బ్రహ్మమును ఒకసారి గ్రహించిన మరల మరువజాలము. ఆకాశము శూన్యమే అయినను అందు ముత్యములు, భ్రాంతి వలన గోచరించునట్లు, బ్రహ్మమున ఈ జగత్తు గోచరించుచున్నది. 
నీటి యందు తరంగములు లేచుచు లీన మగుచున్నవి. అవి నీటి యందు వేరు కావు. అట్లే బ్రహ్మమున సృష్టితరంగములు లేచుచు లీనమగుచున్నవి. అవి బ్రహ్మము నుండి భిన్నము కావు. ప్రకృతి నుండి వాయువు యుత్పత్తి అగుచున్నది. అది బ్రహ్మము కన్న వేరుకాదు. వాయువు నుండి తేజము; తేజము నుండి జలము వేరగుచున్నది. అలానే జలము నుండి పదార్ధము వేరగుచున్నది. ఇట్లు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, అను పంచభూతములు ఏర్పడుచున్నవి. ఇవన్నియు బ్రహ్మమునకు వేరు కాదు. అలానే ఆకాశము శబ్దముతో కూడియున్నది. వాయువు స్పర్శ జ్ఞానము కల్గియుండగా; అగ్నిరూపము; జలము రుచి; భూమి వాసన లక్షణములు కల్గియున్నవి. 
తేజము ప్రకాశము అను బుద్దితో చూచిన అది సత్యము. అలానే బ్రహ్మము, జగత్తు ఒకటే అనుకొనిన అది సత్యమే అగును. గింజ నుండి మొక్క ఎట్లు ఏర్పడుచున్నదో, చివరికి ఆ మొక్క నుండే గింజ రూపొందుచున్నది. అలాగే బ్రహ్మము నుండి ప్రకృతి. ఆ ప్రకృతియె అంతర్గతముగ భ్రమై యున్నది. పాల యందు తీపి, మిరియము నందు కారము, గాలి నందు చలనము కలిసియున్నట్లు, బ్రహ్మము ప్రకృతి యందు ఇమిడి యున్నది. ఎట్టి కారణము లేకుండ గనే బ్రహ్మము జగ దూపమున ప్రకాశించుచున్నది. ఈ ప్రకాశము బ్రహ్మము నుండి వేరుకాదు. వాసనలు చిత్తము. జీవులు, మనస్సు నుండి యుత్పన్నమగుచున్నవి.జ్ఞాన యోగము, ధృడ అభ్యాసము, పురుషప్రయవ్నము వలన మనస్సు నాశనమయిన, బ్రహ్మము వ్యక్తమగును. సర్వాత్మకము, శాంతము, అజము, చిన్మయమునగు బ్రహ్మము నిత్య ప్రకాశమై, జనన మరణ రహితమైయున్నది. ఈ సృష్టి పరంపర యంతయు పరమాణువులతో కూడుకొని యున్నది. పరము నందు స్వప్నములుండవు. కావున అవన్నియు మిధ్యయె. నీటి యందు అలలు వెలువడును. అవి అణగి యుండును. అలానే జీవుని యందు జగత్‌, స్వప్న సుషిప్తి వ్యవస్థలు వెలయుచుండెను.

--((**))--

లీలామోహనుని ముగ్ధ సౌందర్యం 

సాహితీమిత్రులారా! 
ఎన్నటికీ వసివాడని సౌందర్యం అంటే అది పసిపాపలదే. వారు నవ్వినా ఏడ్చినా అందంగానే ఉంటారు. అందులోనూ చిన్నికృష్ణుడయితే యిహ చెప్పాలా! బాలకృష్ణుని మురిపాల ముచ్చట్లు అనగానే తెలుగువాళ్ళకి గుర్తుకొచ్చే కవి పోతన. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని బాలలీలలు ఆపాతమధురాలు. ‘అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెఱ్ఱినో’ అంటూ చిన్నారి కృష్ణుడు పలికే ముద్దు ముద్దు మాటలు మనోహరాలు. అయితే, కృష్ణలీలలను వర్ణించే గ్రంథం మరొకటి కూడా ఉంది. అది ఎఱ్ఱన రచించిన హరివంశం. ఒక రకంగా పోతనకు ఎఱ్ఱన మార్గదర్శి అని అనుకోవచ్చు. ఎఱ్ఱన రచించిన నృసింహపురాణ, హరివంశాలలో కొన్ని పద్యాలకి నగిషీలు దిద్ది మరింత అందంగా పోతన తన భాగవతంలో ప్రయోగించాడు. ఎఱ్ఱన అరణ్యపర్వశేషంలోని ‘అంబ నవాంబుజోజ్వల కరాంబుజ’ అనే సరస్వతీస్తుతి తన భాగవత అవతారికలో పొందుపరచడం, పోతనకి ఎఱ్ఱనపైనున్న గౌరవానికి సూచనగా భావించవచ్చు. అయినా కథ నడిపే తీరులోనూ, చేసే వర్ణనలలోనూ ఎవరి ప్రత్యేకత వారిదే! 

హరివంశము భారతానికి పరిశిష్ట గ్రంథం. అంటే హరివంశముతోనే భారతానికి సంపూర్తి. కాబట్టి ఎఱ్ఱన అరణ్యపర్వశేషాన్ని పూరించడమే కాకుండా, హరివంశ రచనతో తెలుగులో భారతానికి పూర్ణత్వాన్ని చేకూర్చాడన్న మాట. ఎఱ్ఱన యితర రచనలు నృసింహపురాణము, రామాయణమూను. వీటిలో రామాయణం మాత్రం లభించలేదు. భారత హరివంశాల ద్వారా ఇతిహాసాన్ని, నృసింహపురాణం ద్వారా పురాణాన్నీ, రామాయణం ద్వారా కావ్యాన్నీ – యిలా ముత్తెరంగుల సారస్వతాన్ని మొదట తెనిగించిన ఘనత కూడా ఎఱ్ఱనకి దక్కుతుంది. తిక్కన లాగనో పోతన లాగనో, ఎఱ్ఱన కవితామార్గం యిదీ అని నిర్ణయించడం అంత సులభం కాదు. నేను చదివినంతలో నాకు కనిపించిన ప్రత్యేక గుణాలు రెండు. ఒకటి – వర్ణనలలో శబ్దంపై కన్నా అర్థం పైనా, చిత్రాన్ని రూపుకట్టించడం పైనా అతనికి దృష్టి యెక్కువ. రెండు – సామాన్యుల జీవితాలలో కనిపించే సాధారణ దృశ్యాలూ సంఘటనలూ సంభాషణలూ ఎఱ్ఱన కవిత్వంలో అక్కడక్కడ తొంగిచూస్తూ, మన మనసుల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. అలా కట్టిపడేసే ఒక అపురూప వర్ణన యిప్పుడు చూద్దాం. 

నోరన్ జేతులు రెండు గ్రుక్కుకొనుచున్మోమెల్ల బాష్పాంజన 
స్మేరంబై తిలకింపనేర్చుచు, బొరిన్ మీజేతులన్ గన్నులిం 
పారం దోముచు, చేవబూని పిఱుదొయ్యన్ మీది కల్లార్చుచున్ 
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజుకొనుచున్ జెల్వంబు రెట్టింపగన్ 

పాపం ఈ పసివాడిని ఏ బూచాడో భయపెట్టాడు కాబోలు. గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు! నోటిలో రెండు చేతులు కుక్కుకొంటూ మరీ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి అతని మొగమంతా ‘బాష్పాంజన స్మేరంబు’ అయ్యింది. కన్నీటికి కరిగిన కాటుక ఆ పాపాయి ముఖమంతా అలముకొన్నది. ఎంత చిక్కని పదమో అంత చక్కని పదచిత్రం! మాటిమాటికీ మీజేతులతో (అంటే చేతుల పైభాగం) కన్నులు నులుముకొంటున్నాడు. చేవబూని – అంటే కాస్త బలం తెచ్చుకొని, పిఱుదు మెల్లిగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పసివాని పాదాలు శ్రీరమ్యంగా ఉన్నాయి. అంటే ఎంతో శోభతో మనోహరంగా ఉన్నాయి. ఆ లేలేత పాదాలను గింజుతూ తంతూ ఉంటే అతని అందం రెట్టింపవుతోంది! 

అమ్మ దూరంగా వెళ్ళేసరికి ఉంగా ఉంగా అంటూ గుక్కపట్టి ఏడ్చే పసివాని రూపం ఈ పద్యంలో మన కళ్ళముందుంచాడు ఎఱ్ఱన. ‘చాలుంజాలు కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో’ అన్నాడు ధూర్జటి, దైవస్వరూపాన్ని గురించి చెపుతూ. సరిగ్గా పసిపాపల విషయంలో కూడా అదే వర్తిస్తుందేమో అనిపిస్తుంది యీ పద్యం చదివితే. ఎక్కడా శబ్దాడంబరం కానీ, అలంకార అతిశయం కానీ లేకుండా, సహజసుందరంగా రూపుదిద్దుకొన్న యీ చిత్రం లీలామోహనం. ఇది అచ్చంగా ఆ లీలామోహనుని రూపమే! కథాసందర్భాన్ని బట్టి ఆ విషయం బోధపడుతుంది. అయితే, విడిగా పద్యాన్ని పద్యంగా చదివినా కూడా యిందులోని పాపడు చిన్నికృష్ణుడే అని పోల్చుకోనేట్టుగా ఒక పదాన్ని ప్రయోగించాడు ఎఱ్ఱన. ఇలాంటి సార్థక పదప్రయోగాలు భాషపై కవికి ఉన్న పట్టుని పట్టిస్తాయి. కవిత్వానికొక కొత్త మెరుపుని చేకూరుస్తాయి. ఇంతకీ ఆ పదాన్ని మీరీపాటికి పోల్చుకొనే ఉంటారు. అవును, అది ‘శ్రీరమ్యాంఘ్రియుగము.’ ఈ పదానికున్న మరొక అర్థం – శ్రీకి రమ్యమైన అంఘ్రియుగము, అంటే లక్ష్మీదేవికి ప్రీతినిగూర్చే పాదయుగం. ‘ప్రేమపు శ్రీసతి పిసికేటి పాదము’లు ఆ శ్రీహరివే కదా! 

ఎఱ్ఱన కవిత్వంలోని గడుసుదనం తెలియాలంటే, హరివంశంలో యీ పద్యం వచ్చే సన్నివేశం తెలియాలి. కంసుడు పంపిన రాక్షసులలో రెండవవాడైన శకటాసురుని కృష్ణుడు సంహరించే సన్నివేశంలో వచ్చే పద్యమిది. యశోద స్నానానికని గోపసతులతో నదీతీరానికి వస్తుంది. తాము వచ్చిన బండి క్రింద పక్కవేసి కృష్ణయ్యను పడుకోబెట్టి, నది దగ్గరకి వెళుతుంది. ఆ బండిని శకటాసురుడు ఆవహిస్తాడు. ఇంతలో కృష్ణుడు మేలుకొంటాడు. తల్లి దగ్గర లేకపోయేసరికి ఏడుపు లంకించుకొంటాడు. అప్పుడా బాలకృష్ణుని ముగ్ధస్వరూపాన్ని వర్ణించే పద్యం ఇది. బహుశా శకటాసురునికి కూడా అలాగే కనిపించి ఉంటాడు. అందుకే అవలీలగా అతని పైబడి ప్రాణాలు తియ్యడానికి పూనుకొంటాడు. కాలితో ఒక్క తాపు తన్నుతాడు శ్రీకృష్ణుడు. ఆ దెబ్బతో అసురుని అసువులు గాలిలో కలసిపోతాయి. ఇంత చేసీ మళ్ళీ ఏమీ ఎరగనట్లు చంటిపాపలా యశోదాదేవి ఒడిలో ఒదిగిపోతాడు శ్రీకృష్ణస్వామి. ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని మరొక అందమైన పద్యంలో యిలా ముర్తికట్టాడు ఎఱ్ఱన. 

స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా 
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో 
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ 
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ 

ఆ నందనందనుడు నందగోపునికి కనిపించిన తీరిది. స్తన్యమనే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందమైన చిరునవ్వొకటి ఆతని మోమును వెలిగిస్తోంది. విచ్చుకున్న తామరాకుల్లాంటి కన్నుల కాంతులు అమ్మవైపు ప్రీతితో ప్రసరిస్తున్నాయి. దానివల్ల ఆమె ముఖం చంద్రబింబంలా ప్రసన్నంగా ఉంది. ఇంతటి పసిబాలుడు, ప్రసన్నమూర్తి, కొద్ది క్షణాల ముందొక పెద్ద రక్కసుణ్ణి సంహరించాడంటే ఎవరు నమ్మగలరు! 

శకటాసురవధ వంటి అమోఘకార్యాన్ని యీ రెండు అందమైన పద్యాల నడుమా బిగించడం ద్వారా, కృష్ణుడు చేసే కార్యాలకూ అతను పైకి కనిపించే తీరుకీ ఎంతటి వ్యత్యాసమున్నదో మనకి స్పష్టంగా ఆకళింపు చేశాడు ఎఱ్ఱన. కృష్ణుడెంతటి లీలామానుషస్వరూపుడో మనకీ సన్నివేశం చక్కగా నిరూపిస్తుంది. ఎంత అమాయకంగా కనిపిస్తాడో అంత మాయగాడు కదా మరి కృష్ణుడు! 

తన మాయాజాలంబుల 
మునిగి సకలలోకములును ముగ్ధంబులుగా 
దనరెడు ప్రౌఢుడు, లోకము 
తన మౌగ్ధ్యంబునకు బ్రముదితంబగుచుండన్ 

ఇది కూడా ఆ సందర్భంలో ఎఱ్ఱన రచించిన పద్యమే. నిజానికి తన మాయలో మునిగిన లోకులందరూ అమాయకులు. కానీ ఆతని ముగ్ధత్వాన్ని చూసి లోకమంతా మురిసిపోతుంది, అదే పరమచిత్రం! 
----------------------------------------------------------- 
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట అంతర్జాల మాసచత్రిక సౌజన్యంతో 
---------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

కైలాసాన్నే కాదన్న వీరవనిత

సాహితీమిత్రులారా!
కథలూ కవిత్వమూ అంటే చాలా జాగ్రత్తగా చెక్కాలని, అయితే మృదువుగానో లేదా పదనుగానో ఉంటేనే అవి మన మనసుని తాకుతాయని, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఇప్పటి దాకా ఈ వ్యాస పరంపరలో చూసిన పద్యాలన్నీ ఇంచుమించుగా ఆ కోవకు చెందినవే. వీటన్నిటికీ భిన్నంగా, చాలా కటువుగా, ఒక రకంగా చెప్పాలంటే బండగా, అయినా బలంగా తాకే ఒక కథని ఈసారి చెప్పుకుందాం. సుకుమార స్వభావులు చదివి తట్టుకోలేరేమో, కాస్త గుండె దిటవు చేసుకొని ముందుకు సాగడం మంచిది. ఆ కథలో ఒక వ్యక్తి పలికే ఘాటైన మాటలివి:

ద్వి. అనవుడు, “నట్లగు నగు నాటదాన
ననియె చూచెదవయ్య! యయ్య నీ మాయ
లెఱుగుదు నెఱుగుదు నే బేల గాను
కఱకంఠ! యిది యేల కథలు వన్నెదవు?
నను జూచి సిరియాలు డని తలంచితివొ?
పనియు లే దారగింపక పోవరాదు
ప్రామిడియై మేడుపడియెడు దాన
గామి నీ వెఱుగవే కడయింటి పొడువ
కామించి సుతు జంపి క్రమ్మఱ బిలువ
గామారి! నీ యిచ్చు కైలాస మొల్ల;
దన ద్రోహమున జేసి తా బోయె బొలిసి
గొనకొని యా ద్రోహి గూడునే తలప?”

తెలుగు కావ్యాలతో పరిచయం ఉన్నవారికి కూడా ఈ ఛందస్సు ఏమిటో చప్పున తెలియకపోవచ్చు. అయినా తెలుగు భాషలో చాలా ప్రాచీనమైన ఛందస్సు ఇది. జో అచ్యుతానంద, జోజో ముకుంద గీతం తెలియని తెలుగువాళ్లు ఇంకా ఉండరనే అనుకుంటాను. ఆ గీతం ఈ ఛందస్సులోనే ఉంది. మామూలుగా పద్యానికి నాలుగు పాదాలైతే, దీనికి రెండే పాదాలు. అందుకే దీని పేరు ద్విపద. మూడు ఇంద్రగణాలు, తర్వాత ఒక సూర్యగణం- అనే లక్షణం తెలియనివాళ్ళు కూడా హాయిగా ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, ఏడిస్తె నీ కళ్ళు నీలాలు గారు అని పాడుకోడానికి వీలైన ఛందస్సు ఇది.

పాటల్లో పాడుకొనే ఈ ఛందస్సుకు కావ్యస్థానం అందించిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. పైగా, అదియునుగా కైహికాముష్మికద్విపద హేతువవుట ద్విపద నాగ బరఁగు అంటూ- ఐహిక ఆముష్మికములనే రెండు స్థానాలకు (పదము అంటే స్థానం అనే అర్థం కూడా ఉంది) హేతువు అవుతుంది కాబట్టి దానిని ‘ద్విపద’ అన్నారు అనే చిత్రమైన వ్యుత్పత్తిని చెప్పి ఈ ఛందస్సుకు ఉత్కృష్టమైన స్థానాన్ని అందించాడు. పాల్కురికి సోమనాథుని కాలం పన్నెండవ శతాబ్ది చివర, పదమూడవ శతాబ్ది మొదటి భాగం. ఇతను గొప్ప పండితుడు, తత్త్వవేత్త, కవి. విస్తృతమైన తన రచనలతో వీరశైవ మతాన్ని విస్తరింపజేశాడు. అనుభవసారము, చతుర్వేద సారము, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చెన్నమల్లు సీసాలు, బసవ రగడ, బసవోదాహరణం, ఇంకా మరెన్నో రగడలు, ఉదాహరణలు, గద్యలు, తెలుగు, సంస్కృత, కన్నడ భాషల్లో చేశాడు. భక్తి రచనలే కాకుండా, వీరశైవ మతానికి వేద ప్రామాణ్యాన్ని అందించడానికి రుద్రభాష్యము, సోమనాథ భాష్యము (దీనికే బసవరాజీయం అని కూడా పేరు) అనే రెండు గ్రంథాలను సంస్కృత భాషలో రచించాడు. ఈ భాష్య రచనల ద్వారా శ్రుతి స్మృతి పురాణేతిహాసాల ప్రమాణాలతో శైవ మతాన్ని సమర్థించాడు సోమనాథుడు.

ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సోమనాథుడు రచించిన బసవపురాణం లోనిది. బసవడు వీరశైవ మతాన్ని ఉద్ధరించి దానికి రాజపోషణ అందించి వ్యాప్తి తీసుకువచ్చిన వ్యక్తి. ఇతను బిజ్జల రాజు కొలువులో దండనాయకునిగా పనిచేశాడు. తమిళనాట వ్యాప్తిలో ఉన్న శైవ మతం నుండి వీరశైవ మతాన్ని స్థాపించింది ఈ బసవేశ్వరుడే అని కొందరి నమ్మకం. వీరశైవులు ఇతన్ని నందీశ్వరుని అవతారంగా కొలుస్తారు. బసవేశ్వరుని కథ ప్రధాన నేపథ్యంగా, వీరశైవ మత ప్రాశస్త్యాన్ని చాటే అనేక భక్తుల కథల సమాహారం బసవపురాణం. ఇది వ్యాస విరచితమైన అష్టాదశ పురాణాల మార్గంలో నడిచే రచన కాదు. జైన సంప్రదాయంలో కనిపించే పురాణం దీనికి ఆధారం. జైన పురాణ ప్రభావంతోనే తమిళనాట శైవ మతంలో పెరియపురాణం వెలిసింది. ఆ దోవలో వచ్చినదే బసవ పురాణం కూడా. పెరియపురాణంలో కనిపించే భక్తుల కథలు కొన్ని బసవ పురాణంలో కూడా కనిపిస్తాయి. శైవ వైష్ణవ మతాలు రెండూ భక్తిని ఆధారం చేసుకొని వ్యాప్తి చెందిన మతాలే. భక్తి అంటే భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం, ఆత్మార్పణ. అయితే వైష్ణవులది చాలా వరకూ మృదువైన, మధురమైన భక్తి. విష్ణువు శాంతాకారుడు, మోహనాకారుడు కదా. మరి శివుడో – అతను రుద్ర స్వరూపుడు, వీరభద్రుడు! అందుకే కాబోలు శైవులది కాస్త తీవ్రమైన భక్తి. దాన్ని అతి తీవ్ర స్థాయికి తీసుకుపోయినది వీరశైవం. ఆ భక్తి తీవ్రతని తట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఆ శివుడే తబ్బిబ్బవుతాడు, ఇక మామూలు మానవుల సంగతి వేరే చెప్పాలా! వీరశైవ మతంలోని మరొక ప్రత్యేకత, లింగ జంగమాలకున్న అత్యంత ప్రాధాన్యం. వీరశైవులు శివుడిని లింగ రూపంలోనూ, జంగమ రూపంలోనూ కొలుస్తారు. లింగమంటే గుడిలోనో, కనీసం పూజా మందిరంలోనో పెట్టి పూజించే మూర్తి కాదు. గొలుసు చివర తగిలించుకొని, నిరంతరం మెడలో ధరించే లింగం. జంగములు మానవ రూపంలో ఎల్లప్పుడూ అంతటా సంచరించే శివ స్వరూపులు. వాళ్ళని ఎటువంటి సాంఘిక కట్టుబాట్లు బంధించలేవు. జంగముల సేవ వీరశైవులకు అన్నింటికన్నా ముఖ్యమైన ఆచారం. ఆ సేవలో వారు ఇసుమంత అపచారాన్నయినా సహించరు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి తెగింపుగల ఒక భక్తురాలు నిమ్మవ్వ. పై ద్విపద ఖండికలో ఉన్న మాటలు ఈ నిమ్మవ్వవే.

నిమ్మవ్వ కథ చెప్పుకొనే ముందు సిరియాళుని కథ చెప్పుకోవాలి. భక్త సిరియాళుని కథ ప్రసిద్ధమైనదే. ఇది తమిళ పెరియపురాణంలో ఉంది. శ్రీనాథుని హరవిలాసంలో కూడా ఈ కథ వస్తుంది. సిరియాళుని భక్తిని పరీక్షించడానికి శివుడు జంగముని రూపంలో అతని ఇంటికి వస్తాడు. సిరియాళుడు వీరశైవ వ్రతాచారుడు. జంగముడు కోరినది ఏదైనా తీర్చక తప్పదు. వచ్చిన జంగముడు తనకు నరమాంసం వండి వడ్డించాలని కోరుకుంటాడు. అప్పుడా సిరియాళు ‘సర్వలక్షణ గుణవంతుడైన వరపుత్రుడు నాకున్నాడు. ఇంక నరమాంసం కోసం పొరుగింటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. తప్పక వండి పెడతాను రండి,’ అని అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. వ్రతాచారంలో సిరియాళుని భార్య సంగళవ్వ కూడా అంతటి వీర వనితే! జరిగింది సిరియాళుని నోట విని, ‘నువ్వెందుకు సంకోచిస్తావు, అలాగే వండి పెడతా’నని చెప్తుంది. ఇద్దరూ కలిసి తమ ఒక్కగానొక్క కొడుకుని చంపి అతని మాంసాన్ని వండి వడ్డిస్తారు. తినడానికి కూర్చున్న శివుడు వాళ్ళని ఇంకా పరీక్షించడానికి, విస్తట్లో శిరోమాంసం లేకపోవడాన్ని గుర్తించి, ‘అది లేకుండా ఎలా తింటాను, దాన్ని దాచేసుకున్నారా?’ అని అడుగుతాడు. అదేమీ లేదని, తల కేశదుష్టం అని సందేహించి వండలేదని చెప్పి, దాన్ని కూడా వండి వడ్డిస్తారు. అప్పుడు శివుడు సిరియాళుని సహపంక్తి భోజనానికి కూర్చోమంటాడు. సరేనని కూర్చుంటాడు. ఇంతా అయ్యాక, ‘నీ కొడుకుని కూడా పిలువు భోజనానికి, పిల్లలు లేని ఇంట అన్నదానం స్వీకరించ’నని పట్టుబడతాడు ఆ కపట జంగముడు. అప్పుడు సిరియాళుడు కొడుకుని పిలవమని భార్యకి చెపుతాడు. సంగళవ్వ నాలుగు దిక్కుల చూస్తూ కొడుకుని రమ్మని ఎలుగెత్తి పిలుస్తుంది. అప్పుడా బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి కౌగిలిలో చేరిపోతాడు. శివుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై ఆ దంపతులను దివ్య విమానంలో కైలాసానికి తీసుకువెళ్లిపోతాడు. ఇది సిరియాళుని కథ. అటు పెరియపురాణం లోను, ఇటు హరవిలాసం లోను, ఇంత దాకనే ఉంటుంది ఈ కథ. అయితే సోమనాథుడు ఈ కథను ఒక చిన్న మలుపు తిప్పి దీనిని నిమ్మవ్వ కథతో అనుసంధానం చేశాడు.

కైలాసం చేరిన సిరియాళునికి ఒకింత గర్వం కలుగుతుంది. వ్రతాచారానికి కన్నకొడుకునే బలిచేసి కైలాసవాసం పొందిన తనవంటి భక్తుడు మరెక్కడా ఉండడు కదా అని ఆ గర్వం. ఆ సంగతి శివుడు గ్రహించి, చిఱునవ్వు నవ్వుతూ అతని చెయ్యి పట్టుకొని మళ్ళా భూలోకానికి తీసుకు వస్తాడు. సరాసరి నిమ్మవ్వ అనే భక్తురాలి యింటికి వస్తారు జంగముల రూపాలలో. వచ్చిన వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తుంది నిమ్మవ్వ. వాళ్లకు పంచ భక్ష్య పరమాన్నాలు వండుతుంది. ప్రయాణపు బడలిక అనే మిషతో శివుడు, సిరియాళుడు పడుకోడానికి వెళతారు. పూజ సామగ్రిని కొనడానికని బయటకు వెళుతుంది నిమ్మవ్వ. గోవులు కాచి, అలసటతో ఆకలితో వచ్చిన ఆవిడ కొడుకు, వంటింట్లోకి దూరి, బాల్య చాపల్యంతో ఒక బూరె తీసుకొని నమలడం మొదలుపెడతాడు. అంతలో నిమ్మవ్వ తిరిగివచ్చి, జంగములకు చేసిన ప్రసాదాన్ని కొడుకు తీసుకు తినడం చూసి సహించలేక, ‘ఛీ కుక్కా!’ అని తిట్టి శివద్రోహం చేసిన వాడు బతకకూడదని, పచ్చి చెక్కలు తెచ్చి కొడుకు తలను మోది చంపేస్తుంది. చచ్చిన పీనుగుని చరచరా ఈడ్చుకుపోయి పెంటకుప్పలో పడేస్తుంది. తిరిగి వచ్చి, ఏమీ కానట్టు వంట ప్రయత్నాలలో పడుతుంది. ఇదంతా శివుడు సిరియాళునికి చూపిస్తాడు. అతను చూసి ఆశ్చర్యపోతాడు. సరే వంట పూర్తయ్యాక వాళ్ళని భోజనానికి పిలిచి వడ్డిస్తుంది నిమ్మవ్వ. శివుడు మళ్ళీ తన నాటకాన్ని మొదలుపెడతాడు. ‘ఇంతకు ముందే ఇక్కడ నీ కొడుకుని చూశాను. పాపం అలసిపోయి వచ్చినట్టున్నాడు. పిల్లలను ఆకలితో ఉంచి ఎవరైనా అన్నం తింటారా. వాడిని కూడా భోజనానికి పిలువు’ అంటాడు. అప్పుడు నిమ్మవ్వ అతనికిచ్చిన ఘాటైన జవాబులో భాగమే పైన ఇచ్చిన పద్యఖండిక.

అట్లు అగు, అగు (అవునవును అలాగేనేం!). నాతో ఆడుకుందామని చూస్తున్నావు కదా నువ్వు? ఓ అయ్యా! నీ మాయలన్నీ నాకు తెలుసు తెలుసు లేవయ్యా! నేనేం అమాయకురాలిని కాను. ఓ కఱకంఠుడా! ఇలా కథలెందుకు అల్లుతావు. నేను కూడా సిరియాళుడిని అనుకున్నావేమో. నీ నాటకాలు నా దగ్గర సాగవు. ఇప్పుడు నువ్వు తినకుండా వెళ్ళడానికి లేదు. నీ కుటిలత్వానికి (ప్రామిడి) లొంగి మోసపోయే (మేడుపడు) దాన్ని కాను నేను. అయినా నా సంగతి నీకు తెలియదా. పరలోకం పైనున్న వ్యామోహంతో కొడుకుని చంపి మళ్ళీ వెంటనే పిలిచే దాన్ని కాను నేను. నువ్వు ఇచ్చే కైలాసం నాకు అక్కరలేదు (ఒల్లను). తాను చేసిన శివద్రోహం కారణంగా వాడు చచ్చిపోయాడు (పోలసి అంటే చచ్చి అని అర్థం). ఆ ద్రోహిని తిరిగి పిలిచే ప్రసక్తే లేదు– అని కుండబద్దలు కొట్టేస్తుంది నిమ్మవ్వ. ఈ మాటలు వినేసరికల్లా సిరియాళుడు బాధతో సిగ్గుతో నిశ్చేష్టుడై తలవంచుకుంటాడు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన నిజస్వరూపంతో దర్శనమిస్తాడు. అయినా ఆవిడ ఎక్కడా తగ్గదు! అంటుంది కదా –

అఱిముఱి చన్నుపా లర్థించి ఏడ్చు చిఱుత చే నొక పిండికఱుడిచ్చి తల్లి
తన చన్ను మఱపించుకొనిపోయినట్లు చనరాదు…

చనుబాల కోసం ఏడుస్తున్న పిల్లాడికి ఒక పిండిముద్ద ఇచ్చి మాయ చేసే తల్లిలా నన్ను మాయ చేసి పోదామని అనుకుంటున్నావా. నీకు మూడు కళ్ళు ఉన్నా లేకున్నా, నువ్వు హర రూపంలో వచ్చినా నర రూపంలో వచ్చినా నాకు ఒకటే. అంచేత నీ చమత్కారాలు చాలించి నే పెట్టిన భోజనాన్ని బుద్ధిగా ఆరగించి వెళ్ళు – అని శివుడినే గదమాయిస్తుంది ఆ మహా భక్తురాలు!

అదీ నిమ్మవ్వ కథ, ఆమె వ్యక్తిత్వం, వీరభక్తి తత్త్వం. వీరశైవులు కాని వారికి ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా, మొరటుగా, జుగుప్సగా, మూర్ఖంగా అనిపించడం సహజమే. అయినా ఆమెలోని తెగింపు, ఒక లెక్కలేనితనం మనల్ని బలంగా తాకుతుంది. అంత సులువుగా జీర్ణించుకోడానికే కాదు మరిచిపోడానికి కూడా కుదరని వ్యక్తిత్వం ఆమెది. తను నమ్మిన వ్రతం ముందు కొడుకే కాదు కైలాసమైనా ఆమెకు తృణప్రాయమే. ప్రపంచంలో తల్లికి బిడ్డతో ఉన్న బంధంకన్నా సహజమైన దృఢమైన బంధం మరొకటి ఉండదు. ఆ బంధాన్ని తెంచుకోవడం అంత సులువు కాదు. అలాంటి బంధాన్ని కూడా అతి సహజంగా వదులుకుంది సిరియాళుని భార్య సంగళవ్వ. కానీ గర్వపడ్డది మాత్రం సిరియాళుడు! కొడుకు అనే లౌకిక బంధాన్నే కాదు, కైలాసమనే పారమార్థిక ఫలాన్ని కూడా వ్రతనిష్ఠకై కాదనుకున్న వీర వనిత నిమ్మవ్వ. అందుకే పరమశివునితో కూడా పరమధైర్యంగా అలా ఎదిరించి మాట్లాడగలిగింది.

వీరశైవుల కథనాలన్నీ చాలా వరకూ ఇలాగే ఉంటాయి. సూటిగా, ఎలాంటి కవితాత్మక సున్నితత్వాలకు చోటివ్వకుండా, ఆ కథలను చెపుతాడు పాల్కురికి సోమనాథుడు. కావ్యం కాంతాసమ్మితమని, పురాణం మిత్ర సమ్మితం అని ప్రసిద్ధమైన మాట ఒకటుంది. అంటే కావ్యం భార్యలా రమ్యంగా మంచిని చెపితే, పురాణం ఒక మంచి మిత్రునిలా ఉపదేశిస్తుందని అర్థం. అయితే నాకు తోచిన ప్రత్యేకత ఏమిటంటే, బసవపురాణం అటు రమ్యంగా కానీ, ఇటు మిత్రునిలా సున్నితంగా కానీ, ‘ఉపదేశించే’ రచన కాదు. వేదాల మాదిరి ‘ఆదేశించే’ కథలు!

వైష్ణవం, భక్తిని ఒక ఉన్నతమైన లోకోత్తరమైన భావనగా అభివర్ణిస్తుంది. భక్తిని ఒక అలౌకికమైన రసంగా ఉన్నతీకరించినది వైష్ణవ భక్తి సంప్రదాయమే. వీరశైవం అలా కాదు. అందులో భక్తి ఇహకర్మలలో ఒక భాగమే. ఒక రకంగా చెప్పాలంటే వీరశైవుల భక్తి నేలవిడిచి సాము చెయ్యదు. దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. భాగవతంలో- మందార మకరంద మాధుర్యమున దేలు, అనే పద్యం ప్రసిద్ధమే. విష్ణుభక్తిలోని దివ్యత్వాన్ని, మాధుర్యాన్ని, ఉగ్గడించడానికి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన పద్యమిది. ఇందులో చివర ‘అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు’ అంటాడు ప్రహ్లాదుడు. ఇదంతా చాలా అమూర్తమైన, అలౌకికమైన భావం. సరిగ్గా ఇలాంటి పద్యమే బసవపురాణంలో కూడా వస్తుంది. ఇవి బసవడు బిజ్జలునితో చెప్పే మాటలు:

పరమేశు భక్తియన్ సురతరువుండ హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ సోమార్ధధరు భక్తి సురధేను వుండ
బగుతు డాసించునే పరధనంబునకు? మృగపతి యెద్దెస మేయునే పుల్లు?
క్షీరాబ్ధిలోపల గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ?
జూత ఫలంబులు సుంబించు చిలుక భ్రాంతి బూరుగు మ్రానిపండ్లు గన్గొనునె?
రాకామాల జ్యోత్స్న ద్రావు చకోర మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?

యరుదగు లింగ సదర్థుల యిండ్ల వరవడు నాకొక సరకె యర్థంబు?
పుడమీశ మీ ధనంబునకు జేసాప నొడయల కిచ్చితి నొడయల ధనము
పాదిగ దఱిగిన భక్తుండ గాను గాదేని ముడుపు లెక్కల జూడు మనుచు

ఇక్కడ సందర్భం పూర్తిగా లౌకికమైనది! తన భాండాగారంలోని డబ్బు జంగములకు దోచి పెడుతున్నాడని బసవనిపై వచ్చిన ఫిర్యాదును బిజ్జలుడు విచారిస్తున్న సందర్భం. బసవనిపై మోపబడిన నేరాన్ని బిజ్జలుడు నమ్మి అతన్ని నిలదీస్తాడు. అప్పుడు బసవడు చెప్పిన సమాధానం ఇది. ఇందులో జాగ్రత్తగా గమనిస్తే, బసవడు చెపుతున్నది శివభక్తి వల్ల కలిగే ఐహిక ప్రయోజనాలే! ఇందులో ఎక్కడా అమూర్త భావన లేదు. శివభక్తి తనకు సకల సంపదలను తెచ్చిపెడుతుందని, అంచేత అతనికి రాజధనంతో పని లేదనీ చెప్పడానికి ఆ ఉపమానాలన్నీ వాడుకున్నాడు బసవడు. చివరకు ‘కావాలంటే లెక్కలు చూసుకో’ అనే పూర్తి లౌకికమైన విషయంతో పూర్తవుతుంది ఆ సంభాషణ!

వైష్ణవ, వీరశైవ భక్తితత్త్వాలలోని ఈ వైవిధ్యానికి కారణం బహుశా వాటి వెనుకనున్న సాంఘిక వ్యవస్థలలోని భేదమే కావచ్చు.

పాల్కురికి సోమనాథుడు రాజాస్థానాలలో పండిత కవుల కోసం కాకుండా, సామాన్య జనుల కోసం, దేశీయమైన ఛందస్సులో, జానుతెనుగులో, బసవపురాణం, పండితారాధ్య చరితం వంటి రచనలు చేశాడని చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. పైగా అలాంటి ప్రయోగాన్ని సంప్రదాయ కవులు ఆమోదించక అణగద్రొక్కారని, అందుకే ద్విపద ఛందస్సుకు విస్తృత కావ్య గౌరవం దక్కలేదనీ కొందరు వాపోతూ ఉంటారు కూడా. అయితే ఇందులో నాకు పూర్తి సత్యం ఉన్నట్టు తోచదు. పాల్కురికి తన రచనలను ద్విపద ఛందస్సులో కూర్చిన మాట నిజమే. స్వయంగా ‘ఉరుతర గద్య పద్యోక్తుల కంటె సరసమై పరగిన జానుదెనుంగు చర్చింపగా సర్వసామాన్య మగుట గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱ’, అని స్వయంగా చెప్పుకొన్నాడు. అయితే ఆ మాటలను మనం యథాతథంగా స్వీకరించాల్సిన అవసరం ఏముంది? అతని రచనలను పరిశీలించి, వాటినతను ఎవరికోసం చేశాడు, ఎలాంటి భాషలో, ఎలాంటి శైలిలో నడిపించాడు అని తెలుసుకోవడం సరైన పని. దీనికి విస్తృతమైన పరిశోధన అవసరం. ప్రస్తుతానికి ముఖ్యమైన మూడు విషయాలను స్థాలీపులాక న్యాయంగా ప్రస్తావించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. ఆసక్తిగల పరిశోధకులు దీనిని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. పరిశీలించాల్సిన మూడు అంశాలు – సోమనాథుడు వాడిన భాష, ద్విపదను నడిపించిన తీరు, కావ్య రచనా శైలి.

బసవపురాణంలో భాషను పరిశీలిస్తే, అది జనసామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోగించిన భాష కాదని కచ్చితంగా తెలుస్తుంది. బసవపురాణంలో చాలా చోట్ల దేశీయమైన పదాలు, పలుకుబళ్లు కనిపించే మాట నిజమే. అంత మాత్రం చేత రచన మొత్తం జనసామాన్యానికి అందుబాటులో ఉంటుందని అనుకోవడం పొరపాటు. కావ్య ప్రారంభమే ఇలా ఉంటుంది:

శ్రీ గురుదేవు నంచిత గుణోత్తంసు యోగీంద్ర హృదయపయోజాత హంసు
బరమ కృపామూర్తి భక్త జనార్తిహరు ద్రిజగత్ స్ఫూర్తి నానంద వర్తి
భవరోగ విచ్ఛేది భక్త వినోది, శివతత్త్వ సంపాది జిరతరామోది

ఇలా సాగుతుంది. ఇది జన సామాన్యానికి అర్థమయ్యే భాషా? పోనీ కావ్యం మొదలు ఇలా ఉంది అనుకొందామన్నా, ఇలాంటి తత్సమ సమాస భూయిష్టమైన రచన కావ్యం మొత్తమ్మీద చాలా చోట్ల కనిపిస్తుంది. అందువల్ల ఇది కేవలం పామరజనం కోసం రచింపబడిన కావ్యం అనుకోవడం సరికాదు.

ఇక ద్విపద ఛందస్సు విషయానికి వస్తే, ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టుగా, అసలది పాటలు కట్టడంలో ఉపయోగించే మాత్రా ఛందస్సు. పాటలలో నడక ప్రధానం కాని, గణ యతి ప్రాసలు కాదు. మాత్రా బద్ధమైన ఛందస్సుని గణ బద్ధంగా మార్చి ద్విపదకు ‘మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం’ అనే లక్షణం చెప్పారు లాక్షణికులు. పాటల్లో అది కుదరదు. ఉదాహరణకు ‘ఏడవకు ఏడవకు నా చిట్టి కన్న’ అనే పాదంలో ద్విపద గణ లక్షణం భంగమయింది. అయినా మాత్రా ఛందస్సుగా అది ద్విపదే! సోమనాథుడు ద్విపద ఛందస్సును గణబద్ధ ఛందస్సుగానే స్వీకరించాడు. మాత్రా ఛందస్సులో నడక ప్రధానం కాబట్టి, అందుకోసం మధ్యలో యతి స్థానం దగ్గర, పాదాంతంలోను, పదం పూర్తి కావాలి. కానీ సోమనాథుని ద్విపదలో చాలా చోట్ల అది కనిపించదు. ఉదాహరణకు ‘ఇమ్ముల సింహాసనమ్మిడి తత్ క్షణమ్మ విభూతి వీడ్యమ్ము లర్పించి’ అనే పద్య పాదాలలో ‘తత్ క్ష’ అన్న దగ్గర పాదం విరిగింది! ఇలా చాలా ఉదాహరణలు చూపించ వచ్చును. కాబట్టి బసవపురాణం జనసామాన్యులు పాటల్లాగా పాడుకోదగ్గ రచన కాదు. ఈ కావ్యం ఇటు దేశి సంప్రదాయమైన గేయ స్వరూపానికీ అటు మార్గ సంప్రదాయమైన పఠన యోగ్యతకూ చెందని విధంగా తయారయిందని నా అభిప్రాయం.

ఇక కావ్య రచనా శైలిని చూస్తే, అది ముమ్మూర్తులా మార్గ సంప్రదాయాన్ని అనుసరించింది. కావ్య ప్రారంభాన్ని శ్రీ-కారంతో చేసి, నాందిలో నమస్క్రియ చేసి, మొత్తం పురాణాన్ని ఆశ్వాసాలుగా విభజించాడు. ఇవన్నీ కావ్య సంప్రదాయ విశేషాలే. ప్రతి ఆశ్వాసం శ్రీకారంతోనే మొదలవుతుంది. బసవ స్తోత్రంతో, ‘సుకృతాత్మ పాలకురికి సోమనాథ సుకవి ప్రణీతమైన’దని చెప్పుకుంటూ, ముగుస్తుంది. కావ్యం మొదట సుకవి స్తుతి (శివకవుల గురించి), కుకవి నింద (ఇతర కవుల గురించి) కూడా ఉన్నాయి! అందువల్ల బసవపురాణాన్ని సోమనాథుడు కచ్చితమైన మార్గ కావ్య సంప్రదాయంలోనే నిర్మించాడు అన్నది సుస్పష్టం.

ఈ మూడు విషయాలనూ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, సోమనాథుడు ఏ మార్గంలో ఎవరికోసం ఈ కావ్యం రచించినట్టు? మార్గ సంప్రదాయంలో పండితుల కోసమే రచించిన కావ్యం అని భావించక తప్పదు. అందువల్ల కావ్య సంప్రదాయంలో వచ్చిన శాస్త్రవిమర్శ దీనికి వర్తింపజెయ్యడం తప్పు కాదు. అలా చేసినప్పుడు అది కావ్యంగా నిలుస్తుందా అన్నది పరిశీలించ వలసిన ప్రశ్న. మొత్తం మీద, సోమనాథుడు అనుసరించిన ద్విధా మార్గం వలన, అటు దేశి వ్యవహారంలో కాని, ఇటు మార్గ సంప్రదాయంలో కాని, ఇది నిలువలేక పోయిందన్నది నా ప్రతిపాదన. ఇంతకు ముందే విన్నవించుకున్నట్టు, దీని గురించి మరింత విస్తృత పరిశీలన అవసరం.
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
-----------------------------------------------------------

ఏమిటి రాధా యీ వింత
ఎదలో కలిగిన గిలిగి౦త!

మనసున పొంగగ వలపంత
తనువే కోరెను కౌగిలింత!

విరిసిన కమలమె నీ వదనం
తిరిగే భ్రమరమె నా హృదయం!

పున్నమి వెన్నెల నవ్వై కురిసె
పులకింతలతో మనసే మురిసె!

అందమంత నీ అభినయ మైతె
ఆనందమె నా గీతము కాద !

ప్రణయ నాదమె వేణు వూదిన
జగతికి ప్రేమే ప్రాణము పోయద!

ఏమిటి రాధా యీ వింత
ఎదలో పొంగిన గిలిగింత!

శ్రీనివాసమూర్తి గంజాం
17-6-18

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు