మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబు రోతరా

   
   

జంధ్యాల పాపయ్య శాస్త్రి
గారి తెలుగు బాల శతకము*
1
తెనుగుదనమువంటి తీయందనము లేదు,
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
2.
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్నదైవసన్నిభులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
3.
డేశసేవకంటె దేవతార్చన లేదు
స్వార్దపరతకంటె చావు మేలు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
4.
అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాల మానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
5.
రక్తిలేని యాట రాత్రి నిద్దురచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
నీతిలేని చదువు జీతాలచేటురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
6.
వినయ, మార్జవంబు, నీరత్వ, మనుకంప
దీక్ష, సత్యసూక్తి, డేశభక్తి
మండనమ్ము లివ్వి మంచి విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
7.
మదము, దొంగతనము, మంకుబుద్ది, అసూయ
విసుగు, పిరికితనము, విరుగబాటు
సహజ వుణము లివ్వి చవట విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
8.
మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబు రోతరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
9.
ఎద్దు నెక్కె శివుడు, గ్రద్ద నెక్కెను విష్ణు
హంస నెక్కె బ్రహ్మ అందముగను
బధ్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
10.
బడికి నడువలేడు, పాఠాలు వినలేడు
చిన్నపద్య మొప్ప జెప్ప లేడు
రాజ రాజుబిడ్డ నేటి విద్యార్థిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!




 
11.
పరమ సుందరంబు ఫలములు, సంసార
విష మహీజమునకు వెలయు రెండు
సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
12.
అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్రి "జీవస్మ్రుతుం"డని
లలిత సుగుణజాల! తెలుగుబాల!
13.
జనులకొరకు ధర్మశాలలు గట్టించి
బీదసాద నెంతొ యాదరించి
పేరుగన్న కర్మవీరుడమృతజీవి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
14.
హంసలందు బకము హాస్యాస్పదంబగు
మణుల గాజుపూస గణుతి గనదు
చదువురాని మొద్దు సభల రాణింపదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
15.
జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
కలిమి గలిగి, విద్య గనని జనులు
గంధరహిత కింశుక ప్రసూనంబులు
లలిత సుగుణజాల! తెలుగుబాల
16.
బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుటె గాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
17.
జూలు చుట్టు కొన్న వాలమల్లార్చిన
కొండకొమ్మ మీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలిత సుగుణజాల! తెలుగుబాల!
18.
తగిలినంతమేర దహియించుకొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని మైత్రి మలయమారుత వీచి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
19.
అది పయోధి దోష మడుగున మణు లిడి
తృణగ ణమ్ము తల ధరించు టనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
20.
ఫణిని మట్టుపెట్టి బాలు గాపాడిన
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు
మంద మతుల కెపుడు ముందుచూ పుండదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
21.
సాధుసంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రిహించుచుండు
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
22.
అడవి గాల్చువేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీప మార్పి వేయు
బీద పడిన వేళ లేదురా స్నేహంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
23.
మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప
కాంచ లేరు జడులు కావ్య సౌందర్యంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
24.
విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చంద మామతోడ సరస మాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
25.
నీట, కుంజరమును నిలబెట్టు మొసలిని
బైట పిచ్చికుక్క పరిభవించు
స్థానబల మఖండ శక్తి ప్రదమ్మురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
💐********💐*******💐*******💐******💐


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు