శ్రీమద్ భగవద్గీత....అక్షర యోగం.. ఎనిమిదో అధ్యాయం.. పార్ధుని ప్రార్థన
శ్రీమద్భగవద్గీత....అక్షర యోగం.. ఎనిమిదో అధ్యాయం..
పార్ధుని ప్రార్థన
ఉ ll దేనిని యజ్ఞమందురు విధీగతి తెల్వక నే మనమ్ము నన్
దేనిని కర్మ, కర్త, క్రియ, దివ్య మనంగన దేది దైవమా
దేనిని యాత్మకన్న నధి దీరమనంగ నదేది బ్రహ్మమా
దేనిని పంచభూతములుఁ దేటగ భాష్యముఁ దెల్పు సారధీ
ఉ . దేనిని యాదియజ్ఞమని దీక్షల సర్వము యెక్కడేనియున్
దేనిని దేహ ధారణకుఁ దీరుగ నుండుట యెక్కడేనియున్
దేనిని కాలమీశునిగఁ దీర్పుల నేవియు సారధీ గతిన్
దేనిని యాదిదైవతముఁ దెల్పగ సత్యము నాకు నేస్తమై
శ్రీ కృష్ణ భగవాన్ వాణి
మ.పరమోత్తంబగు శాశ్వతంబగుట ద్వీపంబౌను సంభావ్యముల్
స్వరగానంబగు బ్రహ్మమై కళల విశ్వాసంబు భావార్ధముల్
పరమాధ్యాత్మము యందురే మనసుగా పాఠ్యమ్ము సేవార్ధముల్
చరమై జీవము చర్యలేయగుటయే చాతుర్య కర్మా ర్ధముల్
మ. అధి భూతంబు పదార్ధమే జనన దాహంబౌ వినాశమ్ముగన్
అధి దైవంబున దేహమై జననదేహంబున్ మహాత్మ్యమ్ము గన్
అధి కర్మంబున యంతరం బగుటయే యాత్మా గనే తత్త్వమ్మునన్
అధి యజ్ఞంబున వాసుదేవుడుగసాయమ్ముల్ సదా సత్యంబుగన్
చం. ఎవరి మృత్యువు తెల్సుకోకత నెవ్వరైనను దెల్పగన్
ఎవరి కర్మల బట్టి వారికి నెoచు మృత్యువు సత్యమై
ఎవరు నన్నుగఁ దల్చఁ గా, నపుడేను నేనుగ మోక్షమై
ఎవరు నన్నుగ విశ్వసించిన యాసఁ జూపిన మోక్షమున్
మం.కో.దేహ త్యాగముఁ జేయు వ్యక్తిగ తీర్పుఁ గోరిన వెంటనే
మోహమే మరు జన్మ లో నను మోయు భారము లక్ష్యమై
దాహమై నను వేడు కొనంగఁ ధన్య చిత్తపు సాధనే
దేహ మృత్యువు సర్వదా ననుఁ దల్చు యోగము మోక్షమే.
ఉ. జ్వాలినిఁ గాంచ లేక పలు జీవులు ప్రజ్వలనమ్ములుఁ దప్పకన్
కాలుని జార్చినా బ్రతుకు కాలము ప్రశ్నల పర్వమేయగున్
మేలునుఁ కూర్చగా ననుమమేకము నందున చిత్త శుద్ధిగన్
పాలనఁ జేయు ధర్మముల భాగ్యముఁ బొందిన ధన్య సేవలన్
ఉ. సర్వుల శోభ, శోకముల సార జనించిన లౌక్య మే యగున్
సర్వుల తత్త్వమే విహిత సాధన లక్ష్యము నాదు లీల లన్=
సర్వుల కర్మ, రూప, క్రియ సృష్టిగ యంతము దర్శనమ్ము గన్
సర్వుల పంచ కోశముల శాస్త్ర జగత్తున నేను నేనుగన్
శా. నాకంటేమరి యేది భిన్న మనగా నా యిష్ట వాక్కౌను లే
నీ కర్మే భువి నందు నేస్తముగ నేనెల్లన్ సహాయమ్ము గా
నా కంఠమ్ము న నుండు విశ్వముల మాన్యమ్ల్ముల్ విశిష్టమ్ముగన్
నాకార్యమ్మున మాల్య ధర్మము గనే నానుండి పొందేనులే
మ. జలమందున్ రస తన్మయా భవము సౌజన్యమ్ము నేనేయగున్
కళ, సూర్యా శశి నందునన్ వెలుగులౌ కార్యమ్
పలుకే వేదము మౌనమే తపసుగాఁ బాటింప నేనేయగున్
ఇల, ప్రాణోద్భవ కారణమ్ము ధరలో నెల్లన్నేను కాదం దువే!
చం ll పుడమిని గంధతన్మయము పూర్తిగ బాధ్యత గాను నేనుగన్
పుడమిని యగ్ని తేజమున, పూర్తిగ శక్తిగ నున్న నేనుగన్
పుడమిని ప్రాణ జీవమున పూర్తిగ, యుక్తియు, రక్తి నేనుగన్
పుడమిని యోగ తాపసుల పూర్తిగ రక్షతపస్సు నేనుగన్
చం. సకల చరాచరమ్ములలొ సామ్యము బీజముగాను నేనుగన్
సకలము రాగ రోగములు సాధన శోధన రక్ష నేనుగన్
సకలము తేజ సంపదయు సాధ్యపు ప్రజ్ఞ తపస్సు నేనుగన్
సకలము ధర్మ మార్గమున సాగు ప్రవృత్తి మనస్సు నేనుగన్
ఉ. ఏదియ యెల్ల వేళల నతీంద్రియ బోధలు చేయు చుందురో
ఏదియ బ్రహ్మచర్యమును నెంచగ కోర్కెలు మానుకొందురో
ఏదియ రాగభావముల నెల్లర సామ్యము కోరు చుందురో
నద్దియ గొప్ప సత్త్వము వినమ్రత వేద్యము ముక్తి మార్గమున్
మ. అవివేకమ్మును మార్చ నాది పురుషుండాద్యమ్ము సాధ్యమ్ముగా
కవివర్యుండు సనాతనమ్మెరుగు లోకాచార ధర్మమ్ముగన్
నవ విద్యాస్థితి సత్యమున్ సకల ప్రాణమ్ముల్ సహాయమ్ముగన్
రవి కాంతుల్ విధికృత్య వీక్షణలనారామమ్ముఁ గావించ గన్
మ. తుదికాలమ్మున నిశ్చలమ్ముగను సంతుష్టమ్ము జెందన్ ధరన్
మదియోగమ్మగు శక్తిబాధ్యతలుగా మార్గమ్ము తోడౌనులే
విధి ప్రాణాన్ని మనస్సులో కుదుప నీ విశ్వాన్ని చేర్చేనులే
యధి ధ్యానమ్మున భక్తితత్త్వముననేయాపేక్ష బంధమ్ములన్
శా. క్లేశాలున్ జగమంతటా విధిగసం క్లిష్టమ్ము కాకుండగన్
పాశాలీ తరుణమ్ము జిహ్వతపమే పాఠ్యమ్ము ప్రేమమ్ముగన్
దేశాలున్ ధనకాంక్షగా కదులుటన్ దీనాతి దీనుల్ గనన్
ధ్యాసాత్యాగమనేది ధర్మముగనే ధ్యానమ్ము నిర్ణీతి గన్
ఉ. వేయి చతుర్యుగమ్ముల వొ విద్య ప్రధాతగ నేటి బ్రహ్మకున్
రేయిఁ బవళ్ళు కాలమున రీతులు మారిన నమ్మశక్యమున్
కాయలు పండ్లు కావుటకు కాల పరంపర యోగ్యతేయగున్
మాయ యెరింగిసాధకుడు మానసయోగము తత్త్వమే యగున్
ఉ.జ్ఞానమనంగ దృష్టికళ నాణ్య వివేకము విద్దెలేయగున్
ప్రాణ గుణాలు సత్వ, రజ, పాటి తమోమయ మెల్లవేళలన్
ధ్యానమనంగ సంపదలు ధాతగ తీర్పులు చెప్పగల్గగన్
మానస సచ్చిదానమున మార్గసమన్విత బుద్ధి తత్త్వమున్
శా ll దేహమ్మున్ మనకర్మలేసలపగా దేహత్వ సద్భావ సం
దేహమ్మున్ సముదాయమే సహజమై దీక్షా లయమ్మున్ విధీ
దేహమ్మున్ దివరాత్రి సృష్టిలయ దివ్యమ్ముల్ విరాజిల్ల గన్
మోహమ్ముల్ పగలౌను సంతసముయే మోదంపు జీవమ్ముగన్
ఉ ll ఏదియ వక్తమవ్వనిది యేది విలక్షణ మైనదేదియో
ఏది పరమ్ముగా పదము నెంచక పూర్వము యైనదేదియో
ఏదియు మాత్రమేపురుషు నెంచువరంబగు లక్ష్యమేదియో
ఏదియు నిత్యమై జరుగు ఎవ్వరి శక్తియు ప్రాణులందునన్
ఉ ll ఏదియు సూర్యచంద్రకళ యెంచక నుండుట యేల కష్టమో
ఏదియ యోగ మూర్తికళ యెంచక జీవిత లక్ష్య మేమియో
ఏదియ యీశ్వరేచ్చకళ యెంచక లక్ష్యము సంపదల్ ధరన్
యద్దియ నేనునంతమును నెంచ మహత్మ్యము తానెరుంగగన్
ఉ. ఏల, సమోన్నతి కలుగ నెవ్వని పూజలుఁ జేయగా నగున్,
ఏలసుఖమ్ముసంతతియు నెంచెడి మోహము భావ తాపమున్,
ఏలమనస్సుయాసలకు యేవిజయమ్మున నేల నోర్పుగన్,
ఏల సమర్ధ తా విలువ లెల్లలు దాటగ విద్య యేదగున్
శా. దేహోత్సర్గమనంగ యోగ మహిమే దివ్యా భవమ్మున్ విధీ
స్నేహమ్మున్ సహనమ్ముగాను కదిలే శీఘ్రమ్ముసత్వమ్ముగన్
దేహమ్మున్ సహవాససేవకళలే ధీరత్వ బుద్ధిన్ గతిన్
దాహమ్మున్ సమయమ్ముఁ దీర్చ నదియే దాతృత్వ లక్ష్యమ్ముగన్
చం. జయమగు యుత్తరాయణము సన్నిధి జేరగ బ్రహ్మ వేత్తలే
లయమగు, దేహ కోర్కెలిటుల లాసిగదీరును, దైవ సన్నిధిన్
రయముగ యోగ దృష్టి మధురానుభవంబది, దేహ త్యాగమున్
లయమున జ్యోతిమార్గమున లక్ష్యము నెంచ నయమ్ము యోగ్యతన్
ఉ. నమ్ముము కర్మయోగుల మనస్సును నవ్వుచు దూమ్రమార్గమున్
నమ్ముము దేహధర్మము వినమ్రత సేవలు త్యాగమేయగున్
నమ్ముము కృష్ణపక్షమున ప్రాణము చేరిన స్వర్గ సౌఖ్యమున్
నమ్ముము కర్మదాహమగు నమ్మ ఫలమ్మగు జీవయాత్రగన్
శా. పార్ధా శుక్ల మనంగ దైవ వినతీ పక్షమ్ము సంతృప్తిగన్
పార్ధా, భాగ్యమనంగ నా కొసగ సమ్మాన్యుండ నై కృష్ణు గా
పార్ధా, కర్మల నమ్మి నాడను సదా పారమ్మున్ దీవించగన్
ప్రార్ధా, ధన్యము! బాదరాయణ! హరీ ! పాశమ్ము చక్రమ్ముగన్
ఉ. ఏ తప, యజ్ఞ, దానముల నెవ్వరనన్ విధి లక్ష్యమేయనన్,
ఏ తప లక్ష్యమున్, ఫలము నెంచ నిజమ్మున మాయయే యగున్,
ఈ తప తత్త్వకాంక్షల రహస్యము సర్వము తాపమేయగన్
దీపము కాంతి నీడలగు ధ్యానము నిత్యము కృష్ణ తత్త్వమున్
మ.ఎవరీమార్గము నెంచకున్న నది మాయామర్మ మంత్రమ్ముగన్
నవనాళమ్ముల నిర్గమా చరణ సన్మానమ్ము మోహమ్ముగన్,
అవకాశమ్మునఁ జేయుకర్మల సహాయమ్ముల్ విధేయమ్ముగన్
భవబంధమ్మున యోగలక్ష్యములు ప్రాభావ్యమ్ము స్నేహార్థిగన్
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (08)
కష్టాన్ని, దుఃఖాన్ని తొలగించి, పరమపదాన్ని ప్రసాదించే మార్గం
భగవద్గీత అష్టమాధ్యాయ పారాయణం..లక్ష్మీరమణ
మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది. మొదట "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదటి శ్లోకం . అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది మొదటి వాక్యం ఆ భగవానుని బోధలో. మళ్ళీ చిట్టచివరికి “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ! అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!” అంటారు భగవానుడు . దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని,చివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే కదా. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది. అటువంటి పరమ పావనమైన గీతలో దుఃఖాన్ని నశిపజేయగల, పరమపదాన్ని ప్రసాదించగల అష్టమాధ్యాయ పారాయణా మహత్యాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పరమేశ్వరుడు పార్వతీదేవితో భగవద్గీతలోని అష్టమాధ్యాయ ఫలమును ఈ విధంగా వివరిస్తున్నారు . “భగవద్గీలోని ఎనిమిదవ అధ్యాయమును కేవలం వినడం వలన అంతఃకరణము పవిత్రమవుతుంది. భావశర్మ కథే ఇందుకు ఉదాహారణ. కాబట్టి నీకిప్పుడా ఉందంతాన్ని వినిపిస్తాను. సావధానచిత్తంతో శ్రద్ధగా విను. దక్షిణ దేశంలో మందారమర్దక పురమనేటటువంటి పట్టణం ఒకటి ఉన్నది. అందులో భావశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పరమ వేశ్యా లోలుడై తిరుగుతూ, మాంసాన్ని భక్షిస్తూ, మద్యపానము చేస్తూ వేటాడమే జీవనోపాధిగా జీవించ సాగాడు. అతనికి విధించిన వేదకర్మములు విడిచి సురాపానం చేస్తూ ఉన్మత్తుడై ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకరోజు మితిమీరి మద్యాన్ని సేవించడం చేత కాలధర్మము చెందాడు.
ఆ తరువాత అతడు అనేక యమయాతనలను అనుభవించి, తిరిగి ఒక తాళ వృక్షమై జన్మించాడు. ఒకరోజు భార్యాభర్తలైన బ్రహ్మ రాక్షసులు ఆ తాళవృక్షము నీడలో సేదతీరాలనుకొని ఆ చెట్టుకింద కూర్చొన్నారు”.
పరమేశ్వరుని కథా వివరణకు అడ్డుతగులుతూ పార్వతీమాత ఇలా అడిగింది . “ స్వామీ! బ్రహ్మరాక్షసత్వము ఎంతో పాపం చేసుకుంటే కానీ వచ్చే జన్మ కాదుకాదా ! ఈ దంపతులు బ్రహ్మ రాక్షత్వాన్ని ఎలా పొందారు ? వారి వృత్తాంతము కూడా తెలియజేయండి?” అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడిలా చెప్పసాగారు. “ ప్రేయసీ! పూర్వకాలంలో కృషిబలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగములు అభ్యసించాడు. సమస్త శాస్త్రములు అధ్యయనం చేసి సదాచారుడై మెలుగుతూ ఉండేవాడు.
కానీ అతనికి ధనార్జన మీద మక్కువ పెరిగిపోయింది. ధనార్జన కోసం అతను మహిష దానాలను, అశ్వదానాలను, కాలపురుష దానాలను స్వీకరిస్తూ ఉండేవాడు . అతడి ఈ విధంగా దానాలను గ్రహించడమే కానీ ఏ రోజు కూడా ఒక్క ధర్మకార్యాన్ని అయినా చేసి ఉండలేదు. ఆయన భార్య పేరు కుమతి. కాలవశ్యములో వారిరువురూ కూడా మృత్యువాత పడి, బ్రహ్మ రాక్షసులై జన్మించారు. ఇదీ వారి జన్మ వృత్తాంతం. అయితే వారికి పూర్వజన్మ జ్ఞానం మాత్రం బ్రహ్మరాక్షస రూపంలోనూ అలాగే ఉంది.
ఆ తాళ వృక్షం నీడలో విశ్రమిస్తూ, భార్య భర్తతో “నాథా !ఈ బ్రహ్మ రాక్షస రూపము మనకు ఎలా పోతుంది? దీనికి తగిన సాధనం ఏమిటి? అని ప్రశ్నించింది.” ఆ బ్రాహ్మణుడు ఆమెకు సమాధానం ఇస్తూ, “దేవీ,ఈ బ్రహ్మ రాక్షసరూపము బ్రహ్మవిద్యోపదేశము వలన, ఆధ్యాత్మిక విచారణ వలన మనకు కలిగిన ఈ కర్మ తొలగిపోతుంది” అని సమాధానమిచ్చాడు . అప్పుడు సుమతి అప్రయత్నంగా “కిం తత్బ్రహ్మ కిం ఆధ్యాత్మమ్ కిం కర్మ పురుషోత్తమ” అంటే ఆ బ్రహ్మ ఎవరు? ఆధ్యాత్మికత ఆంటే ఏమిటి? ఈ కర్మ ఏమిటి” అని ప్రశ్నించింది.
అప్పుడా కృషి బలుడు భగవద్గీతలోని అష్టమాధ్యాయంలోని ప్రథమ శ్లోకమైన ఈ వాక్యాన్ని విన్నంతనే, తాళవృక్ష రూపంలో ఉన్న భావశర్మతో పాటు బ్రహ్మ రాక్షస రూపంలో ఉన్న కుమతి,కృషి బలుడు విముక్తులై స్వస్వరూపాలను పొందారు. అందులో కుమతి, కృషి బలులు మాత్రము దివ్యవిమానములను అధిరోహించి, వైకుంఠనికి వెళ్లిపోయారు.
అది చూసి భావశర్మ ఆశ్చర్య చెకితుడయ్యారు. ఇదంతా కూడా ఆ కుమతి పఠించిన అర్థశ్లోకములోని మహిమేనని గుర్తించిన భావశర్మ ఆ అర్థశ్లోకమునే ఒక మంత్రంగా జపిస్తూ, కాశీకి వెళ్లి అక్కడ శ్రీహరిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు.
ఆ సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రశ్నించింది. “నాథా! మీరు సదా నిద్రను కూడా విడిచి, ఈ విధంగా ఎందుకు చింతిస్తున్నారు” అని అడిగింది. అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్పారు. “ ప్రేయసి! కాశీ నగరంలో భావశర్మ అనే బ్రాహ్మణుడు నాయందు అమితమైన భక్తి కలిగి ఘోరముగా తపస్సు చేస్తున్నాడు అతడు దేహమును కూడా మరిచి గీతలోని అష్టమాధ్యాయములో ఉన్న అర్థశ్లోకము “కిం తత్బ్రహ్మ కిం ఆధ్యాత్మమ్ కిం కర్మ పురుషోత్తమ” అను మంత్రాన్ని జపిస్తున్నాడు. నేను అతని తపస్సుకు తగిన ఫలితముగా ఏమి ఇవ్వాలా ? అని ఆలోచిస్తున్నాను” అని చెప్పారు.
ఈ విధంగా చెప్పినటువంటి విష్ణుమూర్తి భావశర్మ పట్ల దయగలవాడై అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ భావశర్మ వలన నరక పతితులైన అతని వంశస్తులందరూ కూడా భావశర్మ చేసినటువంటి తపస్సు వల్ల తరించి పోయారు. కాబట్టి భగవద్గీత అస్టమాధ్యాయము పారాయణ చేయడం వలన బ్రహ్మ రాక్షసత్వం, వృక్షత్వము తొలగిపోవడమే కాక ముక్తి కూడా తప్పక కలుగుతుంది. సందేహమే లేదు” అని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు . శుభం .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
*ప్రాంజలి ప్రభ*
Comments
Post a Comment