శ్రీమద్భగవద్గీత.... గణ త్రయ విభాగయోగము...14వ అధ్యాయము....తెలుగులో వృత్త పద్యాలు

శ్రీమద్భగవద్గీత.... గణ త్రయ విభాగయోగము...14వ అధ్యాయము....


మ. మును లేజ్ఞానముఁ బొంది వాక్కులగుటన్ ముఖ్యమ్ము సంసారమున్ 

తన యజ్ఞానము దాటి ధన్యతన  స్వాతంత్రమ్ము పొందన్ విధిన్ 

వినుమావిజ్ఞత సర్వమున్ మనసులో విఖ్యాత కాలమ్ముగన్ 

విని  పించన్ సమ విద్యలే పరముగా విశ్వాస మే పంచగన్              (01 )


శా. ఈ జ్ఞానంబుగనన్ నిగూఢ మగునాపేక్షా సమర్థమ్ము గన్ 

ఈ జ్ఞానంబునుబొందు వారు సుఖమున్స్వీకార సత్యమ్ముగన్ 

ఈ జ్ఞానంబున జన్మ లేని తనమే నీరూప మేఁ బొందగన్ 

ఈజ్ఞానమ్ము విపత్తువేదనకళాయిచ్ఛాను సారమ్ముగన్                     (02 )


చం. ప్రకృతియె జన్మ స్థానమగు ప్రాణులబీజమునందు దైవమున్ 

ప్రకృతియె బ్రహ్మరూపమున ప్రజ్ఞ లనంత సమస్త భూతముల్ 

ప్రకృతియె చేతనాపరము బంధపరాత్పరమౌను స్థాపనన్ 

ప్రకృతియె జీవ మార్గమగు ప్రాభవ మేనులొసంగు సంగముల్          (03 )


శా. నానా యోగ్య సుధర్మ  కర్మములు నాయంశల్ విశాలమ్మునన్ 

నానా జీవుల సృష్టి నా ప్రకృతిగా నాబీజమే సత్యమున్ 

నేనాశక్తిగ తల్లి బీజమగుటే నే తండ్రి గా సేవలున్ 

నేనేయుంచెద నిత్యవిద్య కళలే నేపంచు వేదమ్ముగన్                    (04 )


మ. త్రిగుణాలే మనసౌను జన్యములుగా దివ్యమ్ము సాధించ గన్  

సుగుణాలే విధి విక్రమమ్ములుగ శాస్త్రోక్తమ్ము లేజీవముల్ 

తగుసత్యమ్మునుఁజూపుటే సదరు తత్త్వమ్ముల్ సహాయమ్ముగన్ 

సుగుణాలన్నియు నేస్తమే యగుట నీ సూత్రమ్ము  జ్ఞానమ్ముగన్       (05 )


ఉ. నిర్మల మైనసత్వగుణ నీడలు నిత్యము కాంతి వంతమున్ 

కర్మవికారహేతువగు కాలతమోగుణ సంపదేయగున్ 

ధర్మ మనస్సుగాను సుఖ ధార్మిక సత్వగుణమ్ము జ్ఞానముల్ 

మర్మ ప్రకాశమే మనిషి మాయల సంగమ బుద్ధి తత్త్వమున్            (06 )  


ఉ. ఏది రజోగుణమ్మనగ నీశ్వర ధర్మము ధ్యానమేయగున్ 

ఏదియనంగ రాగ మగు నెల్లల రాజస యోగమేయగున్ 

ఏది నెరుంగు కర్మఫల మెంతని పించిన బంధమే యగున్ 

ఏది యనంతజీవమగు దేహమగత్యము నేలఁ జెప్పగన్                 (07 )


ఉ. ఏ యభిమానమౌ గుణము లేమనిఁ  జెప్పెద నెల్ల వేళలన్ 

ఏ యభి లాషియో గుణము నీమది మోహము చెంతఁ జిక్కుటన్

ఏ యవకాసమౌ గుణము నిర్ణయ భావము తత్వమే యనన్ 

ఏ యది జ్ఞానమో మనిషి నేది సుషుప్తిగ నెంచ లేకయున్              (08 )


మ. నిరతంబౌ సుఖ సత్వమున్ మనిషిగా నెంచన్ యశక్తుండగున్  

నిరతమ్మున్ విధి కర్మలన్ మనిషిగన్ నీడన్ రజోమార్గమున్ 

మరి, జ్ఞానమ్మును కప్పివేయు గుణమే మానంతమోహమ్ముగన్,  

తెరువున్  ప్రార్ధమహత్మ్యమున్ గుణములే జీవమ్ సుఖంబౌనులే   (09 )


ఉ. చిక్కి నరుండు బాధలను చిన్మయ భావన జ్ఞానమేయగున్ 

నెక్కడ శక్తియున్న గుణ నెంచక లేకయు నక్కడే విధిన్  

ఒక్కగుణమ్ము వృద్దియగు నోర్పున సాయముఁ జేయు నీవుగన్ 

ఒక్కగుణమ్ము రెండను వి మోచన లీగతి వృద్దిఁ జెందుటన్           (10 ) 


ఉ. జన్మను సార్ధకమ్మగుట జ్ఞానముపాసన మూలమేయగున్ 

జన్మము సత్వమున్ మనసు జాడ్యమనంతము లెక్కఁ జేయగన్

జన్మ జలమ్ము శాస్త్రమగు జాతి ప్రదేశము కర్మలేయగున్ 

జన్మలు కాల మంత్రమగు జాతర సాత్విక భోగమేయగున్              (11 )


ఉ. భౌతిక సౌఖ్య లోభములు బాధ్యత మార్పున నిష్టరాజ్యమున్ 

నూతన కర్మలే తలచు నుత్సవ హింస ప్రవృత్తి కల్గుటన్ 

చేతన మందు శాంతి కళ చింతల దాహము కర్మలేయగున్ 

నేత రజోగుణం కలుగ నేర్పడు సంపద గర్వమేయగున్                (12)


ఉ. ఒప్పున చిత్తమొల్లక ప్రయోగము జేసెడి మంద బుద్ధిగన్, 

ఇప్పుడ కర్మలే పరమ నిష్ఠగ నమ్ముచు భక్తి తాపమున్ 

గొప్పగ యోగ నిద్రలకుఁ గోరిక గల్గియు బద్ధకమ్ము నన్ 

మెప్పుగ చెప్పినట్లగుటఁ మీకు ప్రమోద తమోగుణమ్ముగన్           (13 )


ఉ. ఉత్తమ సాత్వికార్థ ద్విగుణోన్నతిఁ  జెందుట లక్ష్యమేయగున్ 

చిత్తము వృద్ధిఁ జేయ కళ సిద్ధపడన్ విధిసర్వమేయగున్ 

బిత్తిరి మృత్యువే జరుగ బిగ్గున శాంతిగ స్వర్గమాయగన్,  

ఉత్తమ లోకనిర్మలము నున్నతి బొందుట సాత్వికమ్ముగన్           (14 )


మ. జనియించేమన జాడ్యమే యగుట నీ చాతుర్యమే జీవమున్ 

తనధర్మమ్ము రజోగుణంబుయగుటే తత్త్వమ్ము మృత్యోహలే 

జనియించేజన జాతి నీచమవుటేజాతస్య మూలమ్ముగన్ 

ధనయాశేమదితీరుగన్ గలిగి సాధ్యాసాధనమ్ముల్ విధిన్              (15 )


శా. పాద్యమ్మే సుగుణంబు గా జనకళా పాఠమ్ము సామాన్యమున్   

విద్యా నాధుడుగా తపించిన మనో విశ్వాస సారూప్యతన్  

సాధ్యాసాధ్యునిగా మనస్సు మథనా సత్త్వమ్ము చాపల్యతన్  

విధ్యాభోధుడుగా సహాయ వినయా విజ్ఞాన మార్గమ్ములన్              (16 )


సీ. సత్త్వ గుణము నున్న సమయ జ్ఞానముఁ బొంద

విధి రజో గుణమున  వింతలోర్చ

మనిషి ప్రమాదము మనసుమోహాదుల  

నిది తమో గుణమగు నిచ్ఛ యందు,  

ఉత్పన్న మగుచున్న నున్నతి కోరిక 

నజ్ఞానమైనట్టి యాజ్ఞ చేత  

కానన న్యాయముల్ కారణమ్ముతరలఁ   

జెల్లని లోభముఁ జేరు నిలను  


సత్వ గుణ జ్ఞానమును పెంచు సమయ మందు 

లోభము రజో గుణము చెంత లోల కమ్ము 

భ్రాంతి నజ్ఞానము తమస్సు బాధఁ జేర్చు, 

చేయు కర్మలు గుణముగాఁ జింతఁ దీర్చు                       (17)


ఉ. ఉత్తమ సాత్వికా గుణము నుత్తమ లోకము జేర్చ గల్గగన్,  

ఎత్తు రజో గుణాల నరులెంచగ రాజసమైన జన్మగన్ 

చిత్త తమోగుణాల పశు*జిహ్వరదమ్ముల జన్మ లందగన్, 

ఉత్తమ లోకమే యనుచు నున్నత సాత్త్విక లక్ష్యమేయగున్   (18)


ఉ. కర్తగనే కనంగ మది కారణ గమ్యము దృష్టమేయగున్ 

కర్త మహేశుడే ఘనత కాలము నెంచెడి తత్త్వమేయగున్ 

కర్త గుణాలతీతమగు కాల మహత్యము నేను నేనుగన్ 

కర్తగ నాదురూపమునుఁ గాంచగ సర్వము మోక్షమేయగున్     (19 )


ఉ. పుట్టుట గిట్టుటే మనిషి పూజ్యముఁ గాంచుటఁ జేయు నీవుగా  

నిట్టి గుణాలు మాకును ననేకము నేరుగ నేర్పు నీవుగన్ 

కొట్టుకొనంగఁ బోవు మదిఁ గూడిన బాధలు పాప హేతువుల్ 

పట్టును గట్టి నిన్నుకళ పాఠ్యము నిత్యము నేను నేనుగన్        (20 )


సీ. దేవమూడుగుణాలు దీప్తిగా దాటినా 

నెల్ల లక్షణముల నేలఁ జెప్ప?

అసలు గుణాతీత మాశయమేది యో?

దానిని దాటగా దారి యేల?

త్రిగుణాలధికమగు త్రికరణ సిద్ధిని  

సందేహ ముఁ దొలచు సమయ మేది?

సత్వ గుణమువల్ల సమయ జ్ఞానమునంద

కార్య ప్రవృత్తి రజోరవమ్ము 


తే. గురువు చెప్పిన విషయాలు గుర్తు యేల?

శ్రద్ధతో విన నాశయ సిద్ధ మేల?

సంశయాలు సందేహాలు సరయు వేళ 

సాధ్య విశ్వాస ముంచుటే సాధనములు.                          (౨౧)


ఉ. సత్త్వ గుణాల కార్యములు సాధన మార్గము దివ్య బుద్ధిగన్ 

తత్త్వ రజోగుణమ్మున శతాధిక కాంక్షలు శక్తి యుక్తిగన్ 

సత్త్వ తమోగుణమ్ములకు సాధ్యమె మోహము తృప్తి గాంచగన్ 

సత్త్వ మయమ్ముగాస్థితము సాధ్య నివేదన దైవ మార్గమున్   (22 )


ఉ. ఎవ్వడు సాక్షిగా గుణములే చలనమ్మగు సత్య నిష్ఠగన్ 

ఎవ్వని కర్తగాఁ దలపనీసుగుణాలకు సఖ్యతల్ గనన్ 

ఎవ్వని రక్షణా కళల నేకమనస్సున లక్ష్యమేయగున్ 

ఎవ్వని బుద్ధిమాన్యతల నెల్లరు గుర్తుగ భక్తిభావమున్             (23 )  


చం. తనువు నిరంతరాంతరపు తత్త్వముగా త్రిగుణాల లక్ష్యమున్ 

గన సుఖదుఃఖముల్ విలువ గమ్యము చిత్తముఁ బాటి సాగుటన్ 

కనకము మట్టి రాయి సమ కామ్యపు ధీరుడుగాను జ్ఞానమున్ 

క్షణమున నిందలెన్నియన క్షామమునన్ తొలచేను ధీరుడున్  (24 )


ఉ. బుద్ధి కతీతమైనిలిచి ముక్తికి నాత్మగ నుండువాడుగన్ 

సిద్ధికి నాత్మభావన వసించెడి మానస కర్మగా విధిన్  

సద్దుకు పోవుమిత్రునకు శత్రువు నైనను తాను నేస్తమున్ 

పద్దులె యేకమై త్రిగుణ పాఠ్యము మాన్యుని మార్చగల్గగన్      (25 )


మ. ఎవరైతేమనసిచ్చి పొందెదరొ ధ్యేయమ్మున్ సమానమ్ము గన్ 

భవ బంధాలన శ్రద్ధ భక్తిగను ప్రాబల్యమ్ము నేనిచ్చెదన్ 

నవ పూజా విధిగాను చేయగల జ్ఞానమ్ముల్  విధానమ్ము గన్ 

వివరాలే విధి బ్రహ్మమేయగుట జీవేచ్ఛా స్వ ధర్మమ్ముగన్    (26 )


ఉ. శాశ్వత బ్రహ్మగా సకల శాంతికి విశ్వము నంత నేనుగన్ 

 శాశ్వత ధర్మమై నిజము సత్య ప్రకాండము నావరించియున్ 

 శాశ్వత  భక్తి తత్త్వము సనాతన మార్గము సౌఖ్య కాంతిగన్ 

 శాశ్వత మోక్షమార్గమగు సాధన మార్గము నవ్య యమ్ముగన్   (27)


శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగయోగము 14 వ అధ్యాయం సమాప్తం


****


శ్రీ శ్రీ సీ కృష్ణ వాణి .. (14 )

 

     స్త్రీ హత్యా పాతకము, జారత్వదోషము మొదలైన పాపాల నుండీ ముక్తినిచ్చే భగవద్గీత పదునాల్గవ అధ్యాయ పారాయణ మహత్యం . 

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వము,రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు జీవాత్మను శరీరములో  బంధించి ఉంచుతాయి. మన అందరిలోనూ ఉన్న ఈ త్రిగుణాల  ప్రభావం వలననే జీవులు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి, క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. అంటూ ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును పరమాత్మ భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయంలో వివరిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యమూ పారాయణ చేయడం వలన కలిగే ఫలితాన్ని పరమేశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . 

“ఓ దేవీ ! బ్రహ్మాండమంతా భగవంతుని సృజనే ! అయితే త్రిగుణాత్మకమైన ఆ సృష్టిలో సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేసేది.  జీవునికి సుఖంపట్ల కన్నా జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు. అని పరమాత్మ భగవద్గీతలో అర్జనునికి త్రిగుణాల గురించి వివరిస్తారు .

ఓ పర్వతపుత్రి! ఇప్పుడు భవ బంధాల నుండీ విముక్తిని పొందేందుకు ప్రధానమైన ఈ దివ్యమైన అధ్యాయాన్ని  వలన కలిగే ఫలితాన్ని చెబుతాను.  శ్రద్ధగా విను” . అని పరమేశ్వరుడు ఇలా చెప్పడం కొనసాగించారు . 

 “పూర్వము శౌర్యవంతుడైన శౌర్యవర్మ అనే రాజు  కాశ్మీర మండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.  అదే కాలంలో సింహళ ద్వీపాన్ని పరాక్రమ వంతుడైన విక్రమవేదాలుడనే మహారాజు ఏలుతూ ఉండేవాడు.  వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉండేది.   ఒకనాడు సౌర్యవర్మ తన మిత్రుడైన విక్రమ వేదాలుని సందర్శించడానికి వెళ్లి ఆయనకీ రెండు ఆడ కుక్కలను కానుకగా ఇచ్చాడు .  విక్రమ వేతాళుడు ఆ కుక్కలను స్వీకరించి, తన స్నేహితునికి ఒక మదపుటేనుగుని , మంచి జాతి అశ్వముని,   మణిభూషణాలనూ కానుకలుగా పంపించాడు. 

ఆ తర్వాత విక్రమ వేతాళుడు ఒకరోజు రాజకుమారులతో కలిసి ఆ కుక్కలను వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఆ విధంగా అడవిలో ప్రవేశించి వేటాడుతూ ఒక కుందేలుని పట్టుకొబోయారు రాజుగారు . దాన్ని పట్టుకునేందుకు తన దగ్గరున్న కుక్కల్లో ఒకదాన్ని విడిచిపెట్టారు . ఆ కుందేలు వాళ్ళని ఒక ఆశ్రమ ప్రాంతానికి తీసుకుపోయింది . అక్కడ జంతువులన్నీ చాలా మర్యాదగా , జాతివైరాలని మరిచి మరీ ప్రవర్తిస్తున్నాయి . పాములు భయాన్ని వదిలి నెమళ్ళ రెక్కల్లో నిద్రిస్తున్నాయి.  ఏనుగులు సింహాలతోటి ఆడుకుంటున్నాయి . అక్కడికి దగ్గరలోని ఆశ్రమంలో ఒక మునీశ్వరుడు నివసిస్తూ ఉన్నారు. అతడు నిత్యము గీతా చతుర్దశాధ్యాయం పారాయణ చేస్తూ, శిష్యులకు కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. 

ఆ ముని శిష్యులు అప్పుడే బయటినుండీ ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమ ప్రాంగణంలో కాళ్ళు కడుక్కొన్నారు. ఆ నీళ్ళ చేత తడిసిన భూమి అక్కడ బురదగా మారి ఉంది. కుక్కచేత తరమాబాదుతున్న కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బురదలో పడింది .  అలా ఆ శిష్యులు కాళ్ళు కడుక్కున్నా నీళ్లు  కుందేలు శరీరాన్ని తాకగానే, అది తన దేహాన్ని విడిచి దివ్య రూపాన్ని ధరించింది. అది దివ్య విమానాన్ని అధిష్టించి, దివికి వెళ్ళింది.  ఆ కుందేలుని వెంబడిస్తూ వచ్చిన  కుక్క కూడా దైవకృప చేత ఆ పదప్రక్షాళనా జలంలో జారిపడి దాని జంతు శరీరాన్ని విడిచిపెట్టింది .  దేదీప్యమానమైన ఒక దివ్యగంధర్వ స్త్రీ రూపాన్ని ధరించి, అఖిల గంధర్వుల చేత కీర్తించబడుతూ, దివ్య విమానాన్ని అధిరోహించి, స్వర్గానికి వెళ్ళింది. 

విక్రముడు ఇదంతా చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.  ఆ మునివర్యుని శిష్యులకి ప్రణామం చేసి , ఇలా ప్రశ్నించాడు. “ ఓ మహాత్మా! పశువులుగా జన్మించి,  జ్ఞానము అంటే ఏమిటో కూడా తెలియని ఈ జంతువులూ దివ్య రూపాలను ధరించి ఉత్తమ గతిని పొందడానికి కారణమేమిటి? దయతో తెలియజేయండి” అన్నారు . 

అప్పుడు ఆ మునీశ్వరుని శిష్యులు ఈ  విధంగా చెప్పారు.  “ఓ రాజా! ఈ ఆశ్రమములో మా గురువుగారు రోజూ గీతా చతుర్ధశాధ్యాయాన్ని భక్తితో పారాయణ చేస్తూ, మాకు కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. వారి ఆజ్ఞానుసారముగా మేము కూడా  గీత చతుర్దశాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము .  ఇంతకు ముందర మేము ఇక్కడ కాళ్లు కడుక్కున్నాము.  మేము నిత్యము చతుర్దశాధ్యాయాన్ని పఠిస్తూ ఉండడం చేత పునీతమైన దేహాన్ని కడిగిన నీళ్లలో పడినందువల్ల  కుక్క కుందేలు కూడా పరమ పరమపదాన్ని పొందాయి. 

 రాజా! ఈ జంతువుల  పూర్వ వృత్తాంతాన్ని కూడా చెబుతాను.  జాగ్రత్తగా విను” అంటూ ఇలా చెప్పసాగాడు.  పూర్వకాలంలో మహారాష్ట్ర దేశంలో  కపట శీలుడైనటువంటి కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.  అతనికి తగిన భార్యే  విలోభన. ఆమె కామోన్మత్తంతో విచ్చలవిడిగా ప్రవర్తించేది. ఒకసారి ఆమె ప్రవర్తనకి  కేశవునికి పట్టలేని కోపం వచ్చింది . దాంతో ఆమెని హత్య చేశాడు . ఆ స్త్రీహత్యాపాతకము వలన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా కుందేలై జన్మించాడు. ఆ కుందేలుని తరిమిన ఆడకుక్క అతని భార్యయైన విలోభనే కాక వేరుకాదు .” అని వివరించాడు . 

అటువంటి దుష్ట స్వభావం కలిగి, పాపాలు చేసి, జంతు జన్మలు పొందిన దంపతులు కేవలం ఆ శిష్యులు కాళ్ళు కడుక్కున్నా నీటిలో పడడం వలన పొందిన ఉత్తమ గతులు చూసి రాజుగారు విస్మయులయ్యారు. ఆరోజు నుండీ భక్తితో తాను కూడా భగవద్గీత లోని చతుర్ధసాధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టారు .  ఆవిధంగా ఆ విక్రమవేతాల మహారాజు  కూడా చివరికి మోక్షాన్ని పొందారు. 

కాబట్టి ఈ 14వ అధ్యాయాన్ని రోజూ పారాయణం చేయడం చేత మానవులు స్త్రీ హత్యా పాతకాన్ని, జారత్వ దోషము మొదలైన పాతకములుగా చెప్పబడిన పాపాలని కూడా నశింపజేసుకుని, ఉత్తమ గతులను పొందగలరు. ఇందులో ఎంత మాత్రం కూడా సందేహము లేదు.”  అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు. 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! ప్రాంజలి ప్రభ

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు