శ్రీమద్ భగవద్గీత. శ్రద్ధాత్రయ విభాగ యోగము... పదునెడువ అధ్యాయము..
శ్రీమద్ భగవద్గీత. శ్రద్ధాత్రయ విభాగ యోగము... పదునెడువ అధ్యాయము..శ్రీమద్ భగవద్గీత.
01.హేదేవా సహనమ్ములేక విధిగా హృద్యమ్ము లన్ కొందరున్
హేదేవా సమరమ్ములందు మదిలో హేరమ్ము భక్తిన్ గనున్
హేదేవా విధి యజ్ఞమున్ విడువగా హేయమ్ము సత్త్వమ్ములా?
హేదేవా విధి సాధ్య రాజసహమో, యేమో, జగత్సాక్షి నిన్
02.వినుమా నాపలుకే గుణమ్ము విధిగా విద్యా లయమ్మే సుధీ
మనుజుల్ చేతన సహ్యముల్ త్రిగుణమేమార్గమ్ము జీవమ్ముగన్
గన శ్రద్ధామది సత్త్వ రాజస తమోకామ్యమ్ము భాగ్యమ్ముగన్
వినుమా వాక్కులు నాదు నోటఁ గళలే విశ్వాసముల్ గల్గగన్
03.శ్రద్ధయు జన్మనుండి పలు సాధన రీతులఁ దగ్గ నుండగన్
శ్రద్ధయు వ్యక్తి జీవనము సఖ్యత విద్యల నిచ్ఛయేయగున్
శ్రద్ధయు గుర్తుగా మనిషి సాక్షిగఁ జేతల నేస్తమేయగున్
శ్రద్దయు నంతరాత్మగను శక్తిగ నున్నత సేవ నేనుగన్
04.ఒకనాడాగుణ సాత్త్వికం మనిషిగానోయంచు నిన్పూజలన్,
అకలంకస్థితి రాజసం మనసుగా రాక్షస్య గమ్యమ్ముగన్
వక పూజించెడి ప్రేత భూతగణమే వారున్ సజీవమ్ముగన్
సకలమ్మున్ విధి జీవమున్ గుణముగా శక్యమ్ము నేనేయనన్
05.బలదేహమ్మున గర్వవాంఛలుగనన్ బంధమ్ము సర్వమ్ముగన్
బలమెవ్వారును పొంద దుర్గుణములే భవ్యార్ధ సమ్మోహముల్
కళ సంపాదన కార్యముల్ సహనమే కావ్యమ్ము నేస్తమ్ముగన్
నిలజీవంబగు విద్యలే విధిగనే నిర్వాహ మేనేనుగన్
06.జీవాత్మా నను నేనుగావిదితమై జీవమ్ము చిత్తమ్మునన్
జీవమ్మున్ మనసార చిత్త విధులన్ జీవాంశ ముగ్ధమ్ములన్
కైవారమ్ము ల రక్ష సేయనగుటే కైవల్య మోక్షమ్ము గన్
గావన్నన్ జనలక్ష్యమేనగుటచే కావేష మార్గమ్ముగన్
07.అర్ధమొసంగుభోజనము హారతి సేవకు మూడు పద్ధతుల్
స్వార్ధము లేని దానమును సఖ్యత కూర్చగఁ బ్రీతి జెందుమా
వ్యర్థము కాని యజ్ఞసమ యమ్ముల సద్వినియోగ పర్చగన్
స్పర్ధలు వీడమర్త్యులకు శాంతతపస్సులె భోజనమ్ముగన్
08.అర్హత లున్న హ్లాదమున నార్ద్ర బలమ్మగు పాలు, చెక్కెరన్
యర్హత వెన్ననేయి మము హార్ధపదార్ధము యోగ్యతేయగున్
గర్హణ మేదిచేయకుము గమ్యము హృద్య పదార్ధమేయగున్
గర్హణ లేనిసాత్త్వికముఁ గాలము నిత్యము మానవాళికిన్
09.ఉప్పుయుఁ గారముల్ పులుపు నూరుచులెన్నగు జిహ్వచాపమున్
తొప్పగు వేడి చల్ల గుణ దోరగ మాడిన కూర పచ్చడిన్
దప్పిక నున్న వానికివి దారులు మేలగు తిండి తిప్పలున్
తప్పదు భోజనం రజస తత్త్వ గుణాలగు జీవ మార్గమున్
10.ఉడకని కూర వాసనల నుండు రుచుల్ గన లేని తిండిచే
గడచినరోజు నెంగిలిది కారము నుప్పుయులేని తిండులా,
పడని పదార్ధ మేయదియు బాధను పెంచగ శక్యమేయగున్
తడబడకే భుజించెదరధాటున తామసశీలురంధులై
11.విశ్వమునందుఁ బ్రేమలివి విత్తము యజ్ఞము సాత్త్వికమ్ముగన్
శాశ్వతమైన ప్రేమగన శక్యమనస్సగు నిశ్చ యమ్ముగన్
శాశ్వత మై ప్రసన్నఫల సాగు నుపేక్షయు లేకయుండగన్
శాశ్వత శాస్త్రయజ్ఞమగు సఖ్యత కోరుచు సాత్త్వికమ్ముగన్
12.అవసర మున్ననిష్టమున నందరు నెంచక నాచ రించుటన్,
అవసరమేది లేకయు ననాది ఫలమ్ముల గర్వ మేయగున్
ఎవరికి వారు యజ్ఞమున నెంచుట రాజస యోగ మేయగున్
భవములుఁ జేరగా నొసగు వాక్కులు రాజస మౌను జీవమున్
13.ఆంక్షలు వేదమంత్రమున నన్నియు జేయగ కార్య సిద్ధికిన్,
కాంక్షల తోను దానములఁ గాంచెడి యజ్ఞము లన్నదానముల్,
కాంక్షల తోను దక్షణల కాలము నెన్నగ శ్రద్ధ లేకయున్
గాంక్షల నెల్ల గూర్చ గల కామన యజ్ఞము నిత్య జీవమున్
14.సాధ్యము బ్రహ్మచర్య కృప సన్నుతి సల్పుచు నున్న మాత్రమున్
బాధ్యత లందు దక్షతల భాషణ సల్పెడి దేహ తత్త్వ మా
రాధ్యము జ్ఞానులౌ గురు వరమ్ము లొసంగెడి బ్రహ్మ జ్ఞానమున్
తధ్య మహింస సూపులగు తత్త్వ తపస్సులు శౌచకర్మలున్
15.ప్రియహిత బాషణంబగు వరేణ్యపు భాగ్యము తండ్రి వీవులే
స్వయమున వాక్కు శాస్త్రమగు సాధ్య సతంబున సత్య భక్తిగన్
భయమును లేక సత్యమును భాద్యతగామిత భాషణంబుగన్
రయమున నమ్మ కమ్ములు సరాగము రాగమయమ్ము సత్యమున్
16.ప్రియహిత బాషణంబగు వరేణ్యపు భాగ్యము తండ్రి వీవులే
స్వయమున వాక్కు శాస్త్రమగు సాధ్య సతంబున సత్య భక్తిగన్
భయమును లేక సత్యమును భాద్యతగామిత భాషణంబుగన్
రయమున నమ్మ కమ్ములు సరాగము రాగమయమ్ము సత్యమున్
17.ఫలముల కెన్నియో విధివిభావన పుంతల భాగ్య యజ్ఞముల్
గలసిన యోగ వాచికముకాల శరీర ఫలమ్ము వేగమున్
చలనము తోన నీక్షణముసాగుట మార్పుల నేర్పు నోర్పుగన్
జెలిమికి శ్రద్ధతో సహనఁ జెంతన హాయి మనస్సు సాత్వికన్
ఉ.గౌరవ కోర సేవలను గర్వము లేకయ స్వార్ధ బుద్ధిగన్
కోరిక తీర్చ నేస్తమగు గొప్పదనంబును గల్గి యుండగన్
గోరెడి గమ్య చంచలము కోపము తాపము చూపు లీలగన్
పోరు సమానమే రజస బుద్ధిసులక్షణ మౌను జీవమున్ (18)
ఉ.మొండిగ పట్టుబట్టుటకు మొగ్గు సమర్థత వాక్కుయేయగున్
మెండుగ బాధతీర్చుటకు మేలును కీడును చేయ గల్గగన్
నిండుగ మోస పల్కులన నిత్యము వేదన గల్గఁ జేయగన్
దండన బుద్ధితామసము దారి తపస్సగు నిత్య జీవిగన్ (19)
ఉ.నావిధి దానమే యనుచు నమ్మకమేబల మౌను సేవగన్
భావముతోను కాలగతి భాధిత మార్పుకు నేస్తమేయగున్
ఏవియు గోరకుండగను నెల్లరి క్షేమము జూడ గల్గుటన్
కావలి గాను సాత్వికము కామ్య మనస్సగు కాల జీవిగన్ (20)
చం.మనసున బాధ బొందుచు సమానముగాను తలంచి దానముల్
కన గుణమెంచి నొత్తిడులు గాయము జేసిన జీవ మోహముల్
మనసగు వేళ రాజసము మన్నన జూప మనస్సు మార్గమున్
తన కనుకూల మేలును సుధాబలమౌనని లాభ జీవిగన్ (21)
ఉ.దానము నిచ్చి పుచ్చుకొను తత్త్వ
మ గౌరవ భావ మేయగున్
దాన మపాత్రమే కదన దాశ్యమనస్సునఁ జూపగల్గగన్
మానని బుద్ధిమాధ్యమగు మానస దానము లేకనుండగన్
కానగ దేశకాలమది కామ్యపు దానము తామసమ్ముగన్ (22)
శా.ఓం తత్ సత్ నను నిత్య భక్తి మన సోంకారమ్ము నాదమ్ముగన్
ఓం తత్ సత్ నను తత్త్వ భూషణముగా నోమ్ సర్వ బ్రాహ్మణ్యముల్
ఓం తత్ సత్ ననశక్తియున్ మనసుతో నోన్కార యజ్ఞమ్ముగన్
ఓం తత్ సత్ ననగన్ గిరీంద్రనిలయమ్మోన్కార సర్వజ్ఞునిన్ (23)
శా.వేదాకారణ మోం ఫలించు విధిగన్ విద్యా వికాసమ్ము గన్
వేదోక్తమ్మన వేత్తలెప్పుడుసదా విద్యా విధానమ్ముగన్
వేదారక్షము సామరస్యతఁ గనన్ వేదోక్త భావమ్ముగన్
వేదార్ధమ్ముగనన్ తపస్సుల విధిన్ విశ్వమ్ము నోన్కారమున్ (24)
మ.పరమాత్మే స్వరలోకమున్ దలచుటేపాఠ్యమ్ము శాస్త్రమ్ము గన్
పరమోత్తమ్మగు యజ్ఞమున్ సకలమున్ పాఠ్యమ్ము సేవార్ధమున్
వర దాహమ్మగు వేదమంత్రములుగన్ వశ్వమ్ము నోన్కారమున్
మరి తత్త్వమ్ముఁ దలంపులంమరలుటే మార్గమ్ము దానమ్ముగన్ (25)
ఉ.సద్గతి నామముచ్ఛరణ సత్యపు భావము కాలమేయగున్
సద్గమ, యజ్ఞ, దానములు శ్రద్ధనుఁ బెంచగ లీలఁ గ్రాలముల్
సద్గతి మోక్ష కాంక్షగల సాక్షిగ మాయల నెల్ల వేళలున్
సద్గమమోత్తముం దలఁచు సాధ్యము ధ్యానము కర్మయేయగున్ (26)
ఉ.కష్టము యజ్ఞ యోగములు కర్మ విలోలము సాధ్యమందగన్,
ఇష్టపు దానమే నిజము నిశ్చయ సంపద గాపరం పరల్
పుష్టిగ నిత్య కర్మలను పూర్తిగ జేయుట లోకమందునన్
స్పష్టత నిశ్చలాత్మలగు సద్గమ శబ్దము యుక్తమేయగున్ (27)
శా.సద్దేలేకయె హోమమున్ జరుపుటన్ శాంతీ యగమ్యమ్ముగన్
బుద్దేలేకయె దానమున్ జరుపుటన్ ముఖ్యమ్ము కానేరదున్
విద్దే లేకయె కర్మలం జరుపుటన్ విశ్వమ్ము జీవించగన్
సద్దేలేకయె జేయ నేపనులనన్ సామాన్య సూత్రమ్ముగన్ (28)
శ్రీమద్ భగవద్గీత... శ్రద్ధాత్రయ విభాగయోగము... 17వ అధ్యాయము... సమాప్తము
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (17)
మహామొండి వ్యాధుల్ని కూడా తగ్గించే భగవద్గీత పదిహేడవ అధ్యాయ పారాయణ మహత్యం .
భగవద్గీతలోని సప్తదశాధ్యాయముకి భక్తిత్రయ విభాగమని పేరు . వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞాలు , దానాలు చేస్తారనే విషయాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో వివరిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యమూ పారాయణ చేయడం వలన వచ్చే ఫలితం ఎటువంటిది అనేది పద్మ పురాణంలో వివరంగా చెప్పారు . పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించిన ఆ విశేషమైన ఉదంతం ఇక్కడ తెలుసుకుందాం .
పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నారు “ప్రేయసి ఇంతకు ముందర పదహారవ అధ్యాయ మహత్యాన్ని చెప్పుకున్నాం కదా ! అందులో చెప్పుకున్నట్టు మహారాజు ఖడ్గబాహుడు తన పుత్రునికి రాజ్యం అప్పజెప్పి తానూ పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ , కైవల్యాన్ని పొందారు. వారి దగ్గర దుశ్శాశనుడు అని ఒక సేవకుడు ఉండేవాడు. రాజుగారికి మాత్రమే లొంగిన ఆ మత్తగజాన్ని తానూ ఎలాగైనా లొంగదీసుకోవాలని అతని కోరిక . కానీ అది దైవంశ సంభూతమా అన్నట్టు సామాన్యులకి లోంగే రకం కాదు. ఆ దుశ్శాశనుడు ఆ గజాన్ని లొంగదీసుకొనే ప్రయత్నంలో దాని పాదఘాతాలకి తాళలేక అక్కడే పడి మృతి చెందాడు .
గజాన్ని అధిరోహించాలనే తీవ్రమైన కాంక్ష కారణంగా తిరిగి అతను గజమై జన్మించాడు. అలా గజమై జన్మించిన ఆ దుశ్శాశనుడు దైవానుగ్రహం చేత , గీతలోని పదిహేడవ అధ్యాయ పారాయనని వినడం చేత ముక్తిని పొందాడు .” అని చెప్పి పరమేశ్వరుడు ఆగారు .
అప్పుడా దేవదేవి మరింత కుతూహలంతో ఈశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించింది .
“ఓ నాథా! అసలు ఈ దుశ్శాశనుడు ఎవరు? అతనికి ఈ గజతత్వము కేవలం గజాన్ని లొంగదీసుకోవాలనే కాంక్ష వల్ల మాత్రమే ప్రాప్తించిందా? సప్తదశాధ్యాయమును వినగలగడానికి అతను సుకృతం ఎటువంటిది ? ఇదంతా కూడా తెలుసుకోవాలని ఉంది . దయచేసి వివరంగా తెలియజేయండి” అని కోరారు .
సమాధానంగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగారు. “పూర్వము ఆ దుశ్శాశనుడు మాండలిక రాజపుత్రుల తోటి ఒకసారి పందెము వేసి, గజాన్ని అధిష్టించి అతివేగంగా పోతూ ఉన్నాడు. ఆ విధంగా వెళుతూ ఉండగా అతడు ప్రమాదవశాత్తూ జారీ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ గజము అతణ్ణి తొక్కి , అతి కోపంతో అతని శరీరము నుండి పేగులను, అస్థికలను కూడా పెకలించి మరీ ప్రాణాలు తీశింది.
ఆ తరువాత అతడు సింహలాదీశ్వరుడైన జయదేవుని ఆస్థానములో గజమై జన్మించి చాలా కాలము గడిపాడు. ఒక సారి ఆ జయదేవుడు గజాన్ని తనకు పరమ మిత్రుడైన ఖడ్గబాహునుకు కానుకగా పంపించాడు. ఆ ఖడ్గబాహుడు తన ఆస్థానముకి వచ్చిన ఒక కవీశ్వరుడు వినిపించిన శ్లోకములకి సంతోషించి, ఆ గజాన్ని అతనికి బహుకరించాడు. ఆ కవిశ్వరుడు ఆ గజమును మాలవదేశాధీశ్వరులకు దాన్ని విక్రయించాడు.
అలా ఆ గజము మాళవదేశం చేరింది . ఒకనాడు ఆ గజానికి భరింపనలవిగాని జ్వరము వచ్చింది. ఆ బాధ వల్ల ఏనుగు ఆహారము, నిద్ర, నీళ్లు వదిలి అలా అచేతనంగా పడివుండి కన్నీరు కార్చసాగింది. అది తెలుసుకున్న మాళవదేశాధీశుడు గజ చికిత్సలో నిపుణులైన వైద్యులని తీసుకొని ఆ ఏనుగుని చూడడానికి వచ్చారు .
మహారాజును చూసి, ఆ గజము ఆశ్చర్య ముట్టిపడే విధంగా మనుష్య భాషలో ఇలా చెప్పసాగింది . “ఓ భూపాలా ! ఈ వైద్యుల వల్ల, ఔషధాల వల్ల ఏమిటి ప్రయోజనం? నువ్విప్పుడు తక్షణము ఒక బ్రాహ్మణున్ని ఇక్కడకు రప్పించు. భగవద్గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేయించు . ఆ సప్త దశాధ్యాయ జపము చేత నాకు వచ్చినటువంటి ఈ రోగము ఖచ్చితంగా విశ్రాంతి పొందుతుంది” అని చెప్పింది. అప్పుడు ఆ రాజుగారు అదే విధంగా ఒక విప్రుని పిలిచి, అతని చేత గీత సప్తదశాధ్యాయమును జపం చేయించాడు. వెంటనే ఆ గజము తన దేహాన్ని విడిచి, దివ్య రూపాన్ని దాల్చి, దివ్య విమానాన్ని అలంకరించింది.
రాజది చూసి ఆశ్చర్యాన్వితుడై, ఒక దివ్య రూపాధారి అయిన దుశ్శాశనుని పూర్వవృత్తాంతం అంతా కూడా అతని ద్వారానే తెలుసుకున్నాడు. ఆతర్వాత దుశ్శాశనుడు వైకుంఠాన్ని పొందాడు. అప్పటి నుండీ ఆ మాళవ భూపతి కూడా గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ, అత్యల్ప కాలములోనే మోక్షాన్ని పొందాడు.
కాబట్టి ఓ పర్వత రాజపుత్రి! ఈ గీతా సప్తదశాధ్యాయాన్ని పారాయణ చేయడం చేత పశువులుగా జన్మించిన వారు కూడా ముక్తిని పొందుతారు. ఎన్ని ఔషధాలకు నివారణ కాకుండా ఉండేటటువంటి మహా మొండి వ్యాధులు కూడా ప్రశాంతత పొందుతాయి.” అని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!!
*ప్రాంజలి ప్రభ*
Comments
Post a Comment