*సతీదేవి శక్తి స్వరూపము. జగత్తును నడిపించు శక్తి. శక్తి నుండి ప్రకృతియు, సృష్టియు వ్యక్తమై శక్తి చేతనే నడచు చున్నది. శక్తి అయినా శివునితో అనుసంధానము చెంది ఉన్నంతసేపు శివుని గూర్చి అనుభూతిని పొందవచ్చు. శక్తి మరొక ప్రక్క చూస్తే శివుడు శక్తి వైపు చూడడు. ఆమె పంచభూతాత్మకమైన సృష్టిని ఏర్పరుస్తూ, సహస్రారము నుంచి మూలాధారం వరకు శివుడిని తనతో పాటు తెచ్చుకుంటుంది.
అందుకనే అన్నిటి యందు శివుడున్నాడని చెప్తారు. కాని దేని యందు ఆయనకి సంబంధము ఉండదు. సంబంధమంతా ఆమెదే. శివుడితో ఉన్ముఖడమైతే శివుడు మనకు ఉన్ముఖుడవుతాడు. మనము మరిచిపోతే అతను వదిలివేస్తాడు.
*బంధాల వలన భాధలు, లోభత్వం వస్తాయి. సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును. ఇట్లు తెలిసినవారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు.
🌺స్థానేష్టేవ నియోక్తవ్యా
భృత్యాశ్చాభరణాని చ |
న హి చూడామణిః పాదే
ప్రభవామీతి బధ్యతే ||🌺
(పంచతంత్రం, మిత్రభేదం)
సేవకులను మరియు ఆభరణాలను వారికి తగిన స్థానంలో ఉంచాలి. తనకు సామర్థ్యం ఉంది అని చెప్పుకుంటూ ఎవ్వరూ చూడామణిని కాళ్లకు కట్టుకోరు కదా?
🌺యో న నిర్గత్య నిఃశేషాం
విలోకయతి మేదినీమ్ |
అనేకాద్భుతవృత్తాంతాం
స నరః కూపదర్దురః ||🌺
(ఉపమితిభవప్రపంచ)
_"బయట అడుగుపెట్టగానే భూమిలో ఎన్నో ఆశ్చర్యాలు నిండివున్నాయని ఆశ్చర్యంతో గమనించని వాడు బావిలోనే ఉన్న కప్పలా ఉండిపోతాడు."_
సులభంగా లభించేదానిపట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. అయితే, మనం ప్రతిరోజూ అనుభవించే లాభాలు, సౌకర్యాల వెనుక ఎన్నో జీవుల కఠినమైన శ్రమ ఉందని సహనంతో పరిశీలించినప్పుడే మనం నమ్రతను అలవరచుకొంటాము.
ఒక కాఫీ అభిమాని తన ముందున్న కప్పు ద్రవ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, అర్థ ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో తెలుసుకున్నాడు. దీనిని యహూదీ పురోహితుడు జెలిగ్ ప్లిస్కిన్ లిఖిత రూపంలో ఉంచాడు. ఆ కాఫీ కప్పులోని ద్రవం కాఫీ గింజలనుండి తయారైంది, అవి బ్రెజిల్ లేదా మరెక్కడినుండో వచ్చాయి. ఆ మొక్కలను నాటిన, పెంచిన, కోసిన, గింజలను సేకరించిన, అవి మాగిన తరువాత వడకట్టి, దంచి, పొట్లం కట్టి, వాహనాల్లో మోసి, దుకాణాలకు చేర్చిన ఎంతో మంది శ్రమ దానిలో ఉంది.
ఇది కేవలం కాఫీ పొడి వరకు మాత్రమే కాదు. పొడి మన ఇంటికి రాగానే, దాన్ని తయారుచేయడానికి ఉపయోగించిన పొయ్యి, గ్యాస్ వెనుకున్న శ్రమ కూడా గణనీయమే. కాఫీకి అవసరమైన పాలకోసం పశువుల పెంపకం చేసే రైతులు ఎంతో శ్రమించారు. ఆ కాఫీని ఆస్వాదించడానికి మనం కూర్చున్న కుర్చీ, మన ముందున్న మేజా బల్ల కూడా వడ్రంగి ద్వారా... ఇలా ఎంతో మంది కష్టం వల్ల మనకు అందాయి.
ఈ కథనం ప్రాతినిధికమే కానీ సంపూర్ణం కాదు. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది: మనం సులభంగా పొందుతున్న సౌకర్యాల వెనుక వేలాది చేతుల శ్రమ ఉంది. దాని పట్ల మనకు కృతజ్ఞతా భావం కలగకపోవడం ఆశ్చర్యకరం. మనం ఒక్క నిమిషమైనా పరస్పర ఆధారపడకుండా గడిపామా?
న దేవాయ న విప్రాయ
న బంధుభ్యో న చాత్మనే |
కృపణస్య ధనం యాతి
వహ్నితస్కరపార్థివైః ||🌺
(సమయోచితపద్యరత్నమాలికా)
_"పిసినగొట్టువాడి ధనం దేవుడికోసం గాని, బ్రాహ్మణునికోసం గాని, బంధువులకోసం గాని, తనకోసం గాని ఉపయోగపడదు. అది చివరకు నిప్పు, దొంగలు లేదా రాజుల పాలు కావడమో జరిగి నశిస్తుంది!"_
సంపదను కూడబెట్టడంలో ఎవ్వరూ వెనుకబడరు. ఏమైనా సరే, ధనం కూడబెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అయితే, ʼఈ విధంగా ఆలోచించిన వారందరికీ ధనం చేరుతుందా?ʼ అన్నదానికి సమాధానం "కాదు", ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. కానీ, కొంతమంది మాత్రమే ఎక్కువగా ధనం కూడబెట్టగలుగుతారు. వారే పిసినారులు. ఒక్క పైసా కూడా వృథా కాకుండా భద్రంగా దాచుకుంటారు. కలిగిన ధనాన్ని లెక్కపెట్టడం, దానికి మరింత కలిపి పెద్ద మొత్తం చేయడం, దానిని మరింత రక్షించడం - ఇదే వారి పనిగా మారుతుంది. ఖర్చు చేయకుండా ఉండటమే వారి లక్ష్యం, అందుకే కేవలం పిసినారులే ధనాన్ని పెంచుకుంటారు.
ఇతరులకు ఇవ్వడం అన్న విషయమే వారికి తెలియదు. పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనే భావన కూడా వారిలో లేదు.
దేవునికి కానుకలు సమర్పించడం లేదా ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అసలే ఉండదు. ఎందుకంటే, అలాంటి పనులకు ధనం ఖర్చవుతుందని వారికి భయమే! ధర్మం, పాపం, పుణ్యం అన్న విషయాలు తెలియకపోవడం కాదు, కానీ ధనం పోతుందనే భ్రమ వారిని కమ్మేస్తుంది.
తనకే ఖర్చు పెట్టని వాడు బంధువులకు ఖర్చు పెడతాడా? అని ఊహించడమే తప్పు. తన అభివృద్ధి కోసం, భార్యా పిల్లల భద్రత కోసం కూడా ఖర్చు పెట్టని వాడు మరి బంధువుల విషయంలో ఎలా ఖర్చు చేస్తాడు? కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధువులపట్ల కూడా అతను దానశీలత చూపడు. పైగా, ఇతరులకు సహాయం చేయడం తప్పే అని భావించే అలవాటు కలిగిన వాడు, పాపపరిహారం కోసం బ్రాహ్మణులకు దానం చేస్తాడని అనుకోవడమే అసంభవం.
ఇలానే ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా డబ్బును దాచుకుంటూ చివరకు చనిపోతాడు. తాను ఉపయోగించని ధనం, ఇతరులకు ఇవ్వని ధనం చివరకు మూడో వ్యక్తులదైపోతుంది. ఎవరైనా దొంగిలించివేస్తారు, లేదా అగ్నికి ఆహుతవుతుంది. ఇవేమీ జరగకపోతే, చివరికి అది రాజుయొక్క చేతుల్లోకి వెళ్తుంది.
కాబట్టి, సంపద కూడబెట్టడమూ ముఖ్యమే, కానీ దానిని సద్వినియోగం చేయడం మరింత ముఖ్యమైనది. దానిని ఉపయోగించకుండా కేవలం కూడబెట్టడమే చేయాలనుకుంటే, చివరికి అది ఎవరో మూడో వ్యక్తులదైపోతుంది!
న ద్విషంతి న యాచంతే
పరనిందాం న కుర్వతే |
అనాహూతా న చాయాంతి
తేనాశ్మానోఽపి దేవతాః ||
(సుభాషితరత్నభాండాగార)
ద్వేషించరు; యాచించరు;
ఇంకొకరిని నిందించరు;
పిలువకపోతే రారు;
ఈ కారణాలవల్ల శిలలు కూడ దేవతలే!
పుణ్యం ప్రజ్ఞాం వర్ధయతి
క్రియమాణం పునః పునః!
వృద్ధప్రాజ్ఞః పుణ్యమేవ
నిత్యమారభతే నరః!!
పుణ్యకార్యాలు చేయడం వల్ల మనిషి బుద్ధి వికసించి స్థిరంగా ఉంటుంది. అప్పుడిక పుణ్యకార్యాలు చేయడం మాననే మానడు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. కాన, పుణ్యకార్యాలు పదేపదే చేయాలని భావన.
Comments
Post a Comment