మల్లాప్రగడ సూచించిన సూత్రం —(1)

“యథానుభూతానుమితశ్రుతార్థా విసంవాదివచనః పుమాన్ ఆప్తః”

— సోమదేవుని నీతివాక్యామృతం, విచార సముద్దేశం, 15వ సూత్రం


పదచ్ఛేదం

యథా–అనుభూత–అనుమిత–శ్రుత–అర్థాః

అనుభవంతో తెలిసినవి, తర్కంతో నిర్ధారించినవి, శాస్త్ర/వేద వచనాల ద్వారా తెలిసిన అర్థాలు

విసంవాది–వచనః

విరుద్ధం కాని, సత్యానికి తగిన మాటలే చెప్పువాడు

పుమాన్

వ్యక్తి

ఆప్తః

ఆప్తుడు (నమ్మదగినవాడు, విశ్వసనీయుడు)

సరళ భావార్థం

తన అనుభవం, తర్కం, శాస్త్రజ్ఞానం — ఈ మూడు ఆధారాలపై నిలిచి, వాటికి విరుద్ధం కాని సత్యవచనాలే పలికే వ్యక్తి “ఆప్తుడు” అవుతాడు.

తాత్పర్య విశ్లేషణ

సోమదేవుడు ఇక్కడ ఆప్తత్వం (Authority / Trustworthiness) ఎలా ఏర్పడుతుందో స్పష్టంగా చెబుతున్నాడు.

ఆప్తుడికి మూడు మూలాలు అవసరం:

అనుభవం (అనుభూతి) – జీవనంలో ప్రత్యక్షంగా తెలిసిన సత్యం

తర్కం (అనుమానం) – వివేకంతో పరీక్షించిన నిర్ణయం

శాస్త్రం (శ్రుతి) – సంప్రదాయ జ్ఞానానికి అనుసరణ

ఈ మూడు పరస్పరం విరుద్ధం కాకుండా ఒకే సత్యాన్ని సూచించినప్పుడు,

అటువంటి మాటలు చెప్పేవాడే ఆప్తుడు.


తే. గీ

మనసు ననుభవ పదములు మలుపు గతియు

చలన తర్కవితర్కపు చాప తీరు

శాస్త్ర ము సమన్వయ పలుకు సాగ నెంచ

జీవన శృతులు సెలయేరు గీత మైయు 


సరళ భావం:

మనసుకు వచ్చిన అనుభవాలు మన జీవనానికి దారి చూపుతాయి.

తర్కం–వితర్కాలు ఆ దారిలో మలుపుల్లా సహాయపడతాయి.

శాస్త్రజ్ఞానం వాటన్నిటినీ సమన్వయం చేస్తూ సరైన మాటను పలికిస్తుంది.

అలా అనుభవం, తర్కం, శాస్త్రం కలిసినప్పుడు జీవితం ఒక సుస్వరమైన గీతంలా ప్రవహిస్తుంది.

*****

ఆ.

ఎద్ది తా విని గనె నద్దియే చెప్పుచు 

కల్పనంబు లేవి కదియకుండ 

పిదప తగవు రాని వివధమేర్పరచెడు 

నట్టి వాడె చెప్ప నాప్తుడౌను  


కల్పనము=ఉన్నవి లేనివి చెప్పుట; కదియకుండ=జోడింపకుండ; వివధము=('వి'పూర్వక 'వధ్>వహ్' ధాతువునకు కృదంత 'అప్' ప్రత్యయం-వస్తువులను చేరవేయటానికి ఉపయోగపడేది) మార్గము, త్రోవ.  

 

తాను వినటం వలన –కనటం వలన గ్రహించిన దానిని –ఉన్నది ఉన్నట్లుగా- ఏ విధమైనా కల్పనలు చేయకుండా తరువాత కలహాలకు కారణాలు కానట్లుగా-ఎవడైతే చెపుతాడో అతడే ఆప్తుడని పిలువబడతాడు.

****

మల్లా ప్రగడ సూచించిన సూత్రం —(2)

“సందిగ్ధవిషయే త్రయాణామ్ ఐకవాక్యే సంప్రత్యయః”


— సోమదేవుని నీతివాక్యామృతం, దూత సముద్దేశం, 5వ సూత్రం


పదచ్ఛేదం

సందిగ్ధ విషయే — సందేహం కలిగిన విషయములో

త్రయాణామ్ — ముగ్గురికి (మూడు ఆధారాలకు)

ఐక వాక్యే — ఒకే మాటగా ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడు

సంప్రత్యయః — నిశ్చయ జ్ఞానం, విశ్వాసం కలుగుతుంది


సరళ భావార్థం

సందేహకరమైన విషయంలో, మూడు వేర్వేరు ఆధారాలు ఒకే మాటను చెప్పినప్పుడు, ఆ విషయం నిజమేనన్న నిశ్చయం కలుగుతుంది.

తాత్పర్య విశ్లేషణ (దూత సముద్దేశ సందర్భం)

ఇక్కడ సోమదేవుడు దూతకు అవసరమైన ముఖ్య గుణాన్ని చెబుతున్నాడు.

దూత చెప్పే విషయం —

ప్రత్యక్ష అనుభవం,

తర్కబద్ధమైన పరిశీలన,

ఆధారబద్ధమైన వాక్యం

ఈ మూడు పరస్పరం విరుద్ధం కాకుండా ఒకే అర్థాన్ని సూచిస్తే,

అప్పుడు రాజుకు లేదా స్వీకర్తకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

అందుకే — 👉 సందేశం చెప్పేటప్పుడు ఒక ఆధారమే కాకుండా,

👉 బహుళ ఆధారాల ఏకాభిప్రాయం దూతకు ప్రాణం.

నీతిశాస్త్ర సారం

ఒక్కరి మాట సందేహమే

ముగ్గురి ఏకవాక్యం నిశ్చయం

దూత వాక్యం నమ్మదగినదిగా ఉండాలంటే —

ఏకస్వరత తప్పనిసరి


''త్రిమూర్తి సంగమవ్వరీతి నిత్య భావమేయగున్

సమూల్య లక్ష్యతర్కమౌను సన్నుతాంతధారిగన్

ప్రమాణ ముగ్గురవ్వసఖ్య పాఠ్యమౌనునిశ్చయా

త్రయాణ సంప్రదాయమౌను తత్వ జ్ఞానమేయగున్


సరళ భావం:

త్రిమూర్తుల సంగమంలా మూడు ఆధారాలు కలిసినప్పుడు,

అది నిత్యమైన భావసత్యంగా నిలుస్తుంది.

లక్ష్యం, విలువ, తర్కం — ఇవన్నీ ఒకే ధారగా ప్రవహిస్తే

ఆ మాటకు గౌరవం, నమ్మకం సహజంగా కలుగుతాయి.

మూడు ప్రమాణాలు స్నేహంగా ఏకమైతే

అది బోధించదగిన స్పష్టమైన నిశ్చయమవుతుంది.

ఇదే త్రయసంప్రదాయం —

తత్వజ్ఞానానికి దారి చూపే సంపూర్ణ మార్గం.


వేగులుండ వలె ముగురు విభుని చెంత

వార్త రాబట్టు సమయాన వారి మతులు   

వేరువేరుగా గ్రహియించి విచితిజేసి 

ఒక్కవాక్యమై నిలుచుచో నొప్పవలయు 


వేగులు=గూఢచారులు; విభుడు=రాజు; మతులు=అభిప్రాయాలు; విచితి=విశ్లేషణ, విచారణ, పరిశోధన.


రాజు వద్ద ముగ్గురు గూఢచారులు పనిచేయాలి. వారు సేకరించిన వార్తలను రాజు వారినుండి వేర్వేరుగా సేకరించాలి. వారు ముగ్గురు చెప్పేది ఒక్కటైతే రాజు ఆ వార్తను నిజమని నమ్మాలి.

*******

మల్లాప్రగడ సూత్రం.. 3..

“అప్రియమప్యర్థవశాత్ బ్రూయాద్ దూతః సుభాషితమ్”

(దూత సముద్దేశానికి చెందిన ప్రసిద్ధ సూత్రం)

పదచ్ఛేదం

అప్రియమపి — ఇష్టం కాని మాటైనా

అర్థవశాత్ — అవసరం ఉంటే

బ్రూయాత్ — చెప్పవలెను

దూతః — దూత

సుభాషితమ్ — మంచిగా, సంస్కారంతో

సరళ భావం

దూత చెప్పవలసిన విషయం ఇష్టంకానిదైనా, అవసరమైతే అది సత్యంగా, సంస్కారంగా చెప్పాలి.

నీతిసారం...దూతకు ముఖ్యమైనది సత్యం,

ఆ సత్యం చెప్పే విధానం సుభాషితం కావాలి

ఇష్టమా కాదా అన్నది ద్వితీయం

రాజకార్యంలో సత్యవాక్యమే ప్రథమం


మ. కో.

ఇష్టమావని తప్పదన్నది యిచ్ఛతెల్ప శుభోదగన్

స్పష్టతాభవ సంధి జేయగ పాఠ్యమేయగు దూతగన్

దృష్టి దోషము నెంచగుండగ తృప్తినిచ్చెడి ధర్మమున్

పుష్టి యన్నది మంచిసంపద పుణ్యమేయగు నిత్యమున్


సరళ భావం:

ఇష్టం లేకపోయినా చెప్పాల్సిన సత్యాన్ని

దూత శుభంగా, సంస్కారంతో వెల్లడించాలి.

అస్పష్టత లేకుండా విషయం కలిపి చెప్పగలగడం

దూతకు అవసరమైన ప్రధాన గుణం.

వ్యక్తిగత దృష్టిదోషం లేకుండా,

ధర్మాన్ని ఆశ్రయించి మాట పలికితే

అది వినేవారికి తృప్తినిచ్చి,

మంచి సంపదలా నిత్యం పుణ్యాన్ని పెంచుతుంది.

******


Comments

Popular posts from this blog

శార్దూల పద్యాలు

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు