ఆటవెలది
*చ* క్రపాణి! శేషశయన! మాపై నీవు
*కి* నుక నొందకు హరి! దనుజ హరణ!
*తు* ష్టిగ నిను గొలుతు దురిత దూర! కృపతో
*డు* ల్చుమయ్య నా చెడు గుణములను
భావము:
ఓ హరి! నీవు సుదర్శన చక్రధారివి, శేష తల్పముపై శయనించువాడవు, రాక్షస సంహారకుడవు, పాపములను దూరము చేయువాడవు, నిన్ను సంతోషముతో ఆరాధించుచున్నాను, నీవు మాపై కోపము వహించక, కృప చూపి నా చెడు గుణములను తొలగించుమయ్యా
విశ్వ మయము సత్య వింత పలుకు తీరు
శ్వాస హృదయ వాంఛ విలువ సాగు
మిరప విలువ నమ్మ బ్రతుకు మిధ్యగ తీరు
త్రత్వ తన్మయ శుభయోగ ద్రవ్య తీరు
**పాదాది న్యస్తాక్షరి (వి–శ్వా–మి–త్ర)**
🌿 పద్య విశ్లేషణ→ విశ్వమంతటా వ్యాపించిన సత్యం అనేక రూపాల్లో, వింతలతో వ్యక్తమవుతుంది.→ మన శ్వాసలో, హృదయ వాంఛలోనే జీవన విలువలు ప్రవహిస్తాయి.→ బాహ్య మెరుపులను నమ్మితే జీవితం మిధ్యగా మారుతుంది.→ త్రత్వ (త్రిగుణ/త్రిమూర్తి భావం)లో లీనమై శుభయోగ దృష్టిద్రవ్యం పొందాలి.
*****
విమలచరిత సీత విశ్వంభరాజాత
శ్వాస యాడకున్న బ్రతుకు లేదు
మిత్ర వాక్కు వినిన మేలు చేకూరును
త్రప యంద మొసగును తరుణులకును.
,(త్రప::సిగ్గు)
🌼 సరళ భావం
🔹 విమలమైన చరిత్ర గల సీతాదేవి వంటి పవిత్రత జీవితం నిలబెడుతుంది.
🔹 శ్వాస లేకుండా జీవితం ఉండదే, అలాగే నీతి లేకుండా జీవితం అసార్థకం.
🔹 మిత్రుల మంచి మాటలు వినితే మనకు మేలు జరుగుతుంది.
🔹 సిగ్గు (త్రప) అనేది యువతకు అలంకారం — అది వారిని తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది.
👉 *పవిత్రత, ప్రాణం, మంచి సలహా, సిగ్గు — ఇవి జీవనానికి అవసరమైన ముఖ్యమైన విలువలు*.
✨
*పో* రులధిక మయ్యె పొరుగు రాజ్యములందు
*క* లియుగేశ! ప్రజల గరుణ గనుమ
*లా* వు గలిగి చెలగు రాజ్యాధికారుల
*డు* లుచు మయ్య నీవె జలధిశయన!
[ లావు = బలము, చెలగు = దండెత్తు, విజృంభించు, డులుచు = పతనము చేయు, నాశనము చేయు, జలధిశయన = క్షీరసాగరంలో శయనించు వాడు విష్ణువు ]
భావము:
పొరుగు రాజ్యాలలో యుద్ధాలు పెరిగి ప్రజలు బాధపడుతున్నారు; కాబట్టి ఓ జలధిశయనా! కలియుగనాథా! బలంతో దండెత్తుతున్న రాజ్యాధాకారులను పతనము చేసి ప్రజలపై కరుణ చూపుమయ్యా!
పోరు వద్దు మనకు పొరుగు రాజ్యములతో
కలసి యుండుటే మేలు కరుణ జూపి
లావు రాజ్యముల బలములేని వారిని
డులచ వలదు నెప్పుడును విను మోయి
సరళ భావం..మనకు పొరుగు దేశాలతో యుద్ధం అవసరం లేదు. కరుణతో, సఖ్యతతో కలసి ఉండటం మంచిది. బలహీనమైన దేశాలను బాధించడం తగదు. ఎప్పుడూ శాంతి మార్గమే అనుసరించాలని ఉపదేశం చెబుతోంది.
*ప్రా* ర్థనల సలిపెద భక్తజనావనా!
*కా* మితముల దీర్చు కమలనాభ!
*ర* మ్యసుగుణ ధామ! ప్రగతి పథము జూపి
*ము* దము నొసగు మయ్య పుష్కరాక్ష!
భావము:భక్తజనులకు రక్షణ కల్పించి, వారి కోర్కెలను తీర్చు ఓ కమలనాభ! రమ్యమైన సద్గుణములకు నిలయమైన వాడా! కమలముల వంటి సుందర నేత్రములు కలవాడా! నీకు ప్రార్థనలను భక్తితో సలిపెదను. నాకు ప్రగతి పథమును చూపి ఆనందమును ప్రసాదించుమయ్యా!
వేద విధుల విడిచి వినయ గుణము లేక
సత్య ధర్మములను జగతి యందు
నాచరింప మనుచు ననిశము పెక్కు *శా*
*పాలు బొందు చుంద్రు పాపులెల్ల*
భావము:
పాపులు ఈ లోకంలో వేదము చెప్పిన విధులను విడిచిపెట్టి, వినయ గుణము లేక, సత్య ధర్మాలని పాటించమని తిరస్కరిస్తు ఎల్లప్పుడు చాల శాపాలను పొందుచుంటారు
చెప్పు మాటతీరు చేసెది పనిమాయ
తప్పు యనియు యన్న తప్పక యను
ముప్పు తెచ్చునట్టి ముందర పలుకులె
పాలు బొందు చుంద్రు పాపులెల్ల
సరళ భావం..పాపులు మొదట మధురంగా, మంచిగా మాట్లాడుతారు. వారు తప్పు చేసినా కూడా అది తప్పు కాదని చెప్పి మోసం చేస్తారు. కానీ చివరకు వారి మాటలు కష్టాలను తెస్తాయి. అందుకే వారు ముందుగా పాలు ఇచ్చేలా మంచిగా కనిపించినా లోపల చెడు ఉద్దేశం ఉంటుంది.
పసిడి ధర యేమొ నింగికి పరుగు లిడెను,
రాళ్ళపాలయ్యె నరయంగ రజసిరులగు,
భరతదేశమె మిక్కిలి భవ్య మగును,
వట్టి మాటలు మాటాడవలదు మిత్ర!
సరళ భావం..బంగారం ధరలు ఆకాశానికెగసినా, విలువైన సంపదలు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా రాళ్లలా పడిపోతాయి. అయినప్పటికీ భారతదేశం గొప్పతనం, భవ్యత కలిగిన దేశం. అందుకే ఖాళీగా మాటలు మాట్లాడకుండా నిజమైన కార్యాలతో దేశాభివృద్ధికి కృషి చేయాలని మిత్రునికి ఉపదేశం చెబుతోంది.
*ప్రా* ర్థనల సలిపెద భక్తజనావనా!
*కా* మితముల దీర్చు కమలనాభ!
*ర* మ్యసుగుణ ధామ! ప్రగతి పథము జూపి
*ము* దము నొసగు మయ్య పుష్కరాక్ష!
భావము:భక్తజనులకు రక్షణ కల్పించి, వారి కోర్కెలను తీర్చు ఓ కమలనాభ! రమ్యమైన సద్గుణములకు నిలయమైన వాడా! కమలముల వంటి సుందర నేత్రములు కలవాడా! నీకు ప్రార్థనలను భక్తితో సలిపెదను. నాకు ప్రగతి పథమును చూపి ఆనందమును ప్రసాదించుమయ్యా!
కాల మాయలన్ని కళలుగా కదులుతూ
మేళవింపు తీరు మీన మిధ్య
హేళనంబు మనిషి హీన బతుకుగాను
పాప పంకిలమ్ము పారు నదులు
భావం :కాలం అనేక మాయలతో నిండినది. జీవితం ఎన్నో కళల మేళవింపులా కదులుతూ ఉంటుంది; వాటిలో చాలావరకు మాయామయమైనవి. ఈ సత్యాన్ని గ్రహించకుండా మనిషి ఇతరులను హేళన చేస్తూ హీనమైన జీవితం గడుపుతాడు. అప్పుడు అతని పాపాలు మురికినీటి ప్రవాహంలా పెరుగుతూ నదుల్లా పారుతుంటాయి.
*కా* మిత వరద! హరి! కలియుగ దైవమా!
*త్యా* గముగ సలిపెడి దాన గుణము
*య* శము నొసగుమయ్య యంబుజోదర! శ్రీశ!
*ని* న్నె ప్రస్తుతింతు నీరజాక్ష!
భావము:ఓ హరి! కలియుగ దైవమా! భక్తుల కోరికలను తీర్చువాడా! నాకు త్యాగ బుద్దితో దానం చేసే సద్గుణాన్ని, మంచి కీర్తిని ప్రసాదింపుము. ఓ కమలనాభ! శ్రీలక్ష్మీపతి! పద్మముల వంటి అందమైన కన్నులు కలవాడా! నేను నిన్నే భక్తితో స్తుతిస్తున్నాను
*ఇం* దుమౌళి! శూలి! నందివాహన! శివా!
*దు* రిత దూర! మమ్ము గరుణ జూపు
*మ* దన వైరి! భర్గ! మహిమాన్వితుడ! నిన్నె
*తి* రముగ గొలిచెదము దేవదేవ!
భావము:ఓ శివ! మహేశ్వరా! నీవు తలపై చంద్రుణ్ని, చేతిలో త్రిశూలాన్ని ధరించినవాడవు, నంది వాహనుడవు; పాపములను దూరము చేయువాడవు ; కంటి చూపుతో మన్మథుని సంహరించిన వాడవు! భర్గ! మహిమాన్వితుడా! దేవదేవా! నిన్ను మేము ఎల్లప్పుడూ భక్తితో ఆరాధించెదము.
*యో* గపురుష! చక్రి! యో! వేంకటేశ్వర!
*గా* రవమున నిను జేరి కొలుతు
*స* రసిజాక్ష! శ్రీశ! నిరతము కృపజూపి
*నం* దమొసగు మయ్య! నరహరి! హరి!
భావము:యోగపురుషుడవైన ఓ హరి! సుదర్శన చక్రధారి! వేంకటేశ్వర! లక్ష్మీపతి! కమల నేత్రుడా! ప్రహ్లాదుని రక్షించిన నరహరి! నీ చెంత చేరి ప్రేమతో నిన్ను ఆరాధించెదను. కరుణ చూపి నిరతము ఆనందమును ప్రసాదించుమయ్యా!
*యో* గ విద్య నొసగు మో! పరమేశ్వర!
*గా* ములదొర! శూలి! గరళకంఠ!
*స* న్ను తింతు నిన్ను సదమల భక్తితో
*నం* దివాహన! శివ! నాగభూష!
భావము:ఓ పరమేశ్వర! భూత గణములకు అధిపతివైన గాములదొర! త్రిశూలధారి! జగతిని రక్షింప గరళమును కంఠమున నిలిపిన గరళకంఠ! నంది వాహన! నాగులను ఆభరణములుగా ధరించు నాగభూషణ! ఓ శివ! నిన్ను నిర్మల భక్తితో ఆరాధించెదను! ఆరోగ్య రక్షణకు ఉపయుక్తమైన యోగ విద్యను ప్రసాదింపుము.
*క్షు* ద్రకృత్యములకు స్రుక్కు సుజనులకు
*ర* క్షణంబు నొసగు ప్రమథనాథ!
*కు* వలయమున నిన్ను గొలుచు చుంటి దయతో
*డు* ణ్డుకులను వడిగ డుల్చుమయ్య!
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
[ క్షుద్రుడు = నీచుడు, దుర్మార్గుడు
డుణ్డుక = దుష్టుడు, క్రూరుడు
డుల్చు = పతనము చేయు ]
భావము:ప్రమథగణాధిపతియైన ఓ పరమేశ్వరా! నీచుల క్రూరచేష్టలవల్ల భయపడి దుఃఖించు సుజనులను రక్షించువాడవు నీవే. ఈ లోకములో నిన్ను ఆరాధించుచున్న నన్ను కాపాడి, ఆ దుష్టులను త్వరగా పతనము చేయుము.
*మా* ధవ! హరి! నీదు స్మరణమున మిగుల
*తృ* ప్తి నొందు చుంటి తిరుమలేశ!
*భా* ర మనక నీవె భవము నీదగ నాకు
*ష* డ్గుణముల నిమ్ము శార్ఙ్గపాణి!
భావము:-ఓ మాధవా! నీ స్మరణతో నేను పరమ తృప్తి నొందుచున్నాను, తిరుమలేశా! ఈ సంసారభారము అంతా నీ ఆధీనమే. ఈ భవసాగరాన్ని ఈదుటకు అవసరమైన షడ్గుణసంపత్తిని నాకు ప్రసాదించుము, శార్ఙ్గపాణీ!
*మా* ధవ! హరి! నీదు స్మరణమున మిగుల
*తృ* ప్తి నొందు చుంటి తిరుమలేశ!
*భా* ర మనక నీవె భవము నీదగ నాకు
*ష* డ్గుణముల నిమ్ము శార్ఙ్గపాణి!
భావము:-ఓ మాధవా! నీ స్మరణతో నేను పరమ తృప్తి నొందుచున్నాను, తిరుమలేశా! ఈ సంసారభారము అంతా నీ ఆధీనమే. ఈ భవసాగరాన్ని ఈదుటకు అవసరమైన షడ్గుణసంపత్తిని నాకు ప్రసాదించుము, శార్ఙ్గపాణీ!
*ప* రమ పురుష! గరుడవాహన! భక్తుల
*ర* క్షకుడవు నీవె బ్రహ్మనాభ!
*మా* ధవ! హరి! నిన్ను స్మరియింతు నిర్మలా
*త్మ!* కరుణాకర! వనమాలి! చక్రి!
భావము: బ్రహ్మను నాభియందు కలిగిన ఓ విష్ణుమూర్తి! హరి! నీవు గరుడ వాహనుడవు, మెడలో వనమాలను ధరించిన వాడవు, చేతిలో సుదర్శన చక్రమును ధరించిన వాడవు, ఉత్తమోత్తముడవు, భక్తుల రక్షకుడవు, కరుణాకరుడవు, నిర్మలాత్ముడవు, నిన్ను భక్తితో స్మరించెదను.
ఆ.వె.
*పాం* డురంగ విఠల! భక్తవత్సల! నీవె
*డు* ణ్డుకులను వడిగ డుల్చుమయ్య!
*రం* జిత హృదిని నిను బ్రస్తుతించెద మము
*గా* వుమ నిరతంబు కరుణతోడ
[ డుణ్డుకులు = క్రూరులు, డుల్చు = పతనము చేయు, నాశనము చేయు ]
భావము:
ఓ పాండురంగ విఠల! ఇతరులను బాధించెడి క్రూరులను, భక్తవత్సలుడవైన నీవే, త్వరగా నాశనము చేయుమయ్యా! ఆనందభరిత హృదయంతో నిన్ను స్తుతిస్తున్న మమ్మల్ని ఎల్లప్పుడు కరుణతో కాపాడుము.
శుభము దెల్పు నదియ శుభలేఖ యగు,నశు
భమును పల్క రాదు వైరి యైన,
లేమి వల్ల మనిషి లేనివాడౌనుగా
ఖరము పాలు క్షేమకరము సుమ్ము
శుభసూచకము శుభలేఖ అశుభము పలుకరాదు విరోధియైన, లేనివాడయనాఉన్నవాడైనా గాడిదపాలు క్షేమకరం
ఆ.వె.
*శు* భకరా! యనంత! యభయ దాతా! భవ
*భ* యహర! నిజ భక్తపాల! వరద!
*లే* మి బాపు మయ్య శ్రీనివాస! ముకుంద!
*ఖ* లులను దెగటార్చు జలధిశయన!
భావము:
పాల సముద్రముపై శయనించు ఓ శ్రీనివాస! నీవు శుభకరుడవు, అనంతుడవు, అభయప్రదాతవు, భవభయహరుడవు, నిజమైన భక్తులను రక్షించి కోరిన వరములను మరియు మోక్షమును ప్రసాదించువాడవు, అటువంటి నీవు కరుణతో నా లేమిని తొలగించు మయ్యా!
.
దిట్టకవి శ్రీనివాసాచార్యులు పాదాది న్యస్తాక్షరికి పూరణ
==========
చక్రము ధరియింప చక్రధారి యగును,
క్రతువు లెల్లను శుభకరము లగును,
ధాతవ్రాత జగతి తప్ప దెవ్వరికిని,
రీతి దప్పకున్న నీతియుతుడె.
పాం, డు, రం, గా, పాదాది న్యస్తాక్షరి నాయత్నం
ఆ. వె.
పాండురంగ నిన్ను ప్రతినిత్యముకొలుతు
డులుచు మయ్య నాది డుముల నీవు
రంగ నాథ పాహి రంగ పుర నివాస
గాదిలి పతి మమ్ము గాచు సతము
*ద* నుజ హరణ! చక్రి! ధరణీధరా! నిన్ను
*గా* దిలి దరిచేరి కలియుగేశ!
*కో* రి కొలుచు చుంటి కొండలరాయ! మా
*రు* జల బాపి వడిగ బ్రోవుమయ్య!
[ ధరణీధరుడు = భూమిని మోసేవాడు లేదా ధరించేవాడు, విష్ణువు; గాదిలి = ప్రేమతో, దరిచేరి = దగ్గఱచేరి, కొండలరాయ = తిరుమల కొండలందు వెలసిన వాడు, శ్రీనివాసుడు; రుజలు = రోగములు. ]
భావము:
సుదర్శన చక్రధారివైన ఓ విష్ణుమూర్తి, రాక్షస సంహారక! ధరణిధర! కలియుగేశ్వరా! ప్రేమతో నీ సమీపానికి వచ్చి, నిన్నే కోరి కొలుచుచున్నాను, ఓ తిరుమల కొండలరాయా! కరుణించి త్వరగా మా రోగములను తొలగించి మమ్ము రక్షింపుమయ్యా!
[*****
స్త్రీలు లేక భువిని జీవులు పుట్టవు
వెలది లేని ధరణి వెలవెల యగు
సుదతి లేక పోవ సూన్యమగుధరణి
ముదిత సృష్టి కంత మూల మగును
******
*వే* దవేద్య! వేదవినుత! వేంకటపతీ!
*ప* ద్మనాభ! భక్తవరద! శ్రీశ!
*పూ* జ సలిపి నీకు మ్రొక్కుచుంటిని భవ
*త* రణ! కరుణ గనుమ త్వరితముగను
భావము:ఓ వేంకటపతీ! పద్మనాభ! వేదములచే తెలియబడువాడవు, వేదములచే స్తుతింపబడువాడవు. భక్తులకు వరములను ప్రసాదించువాడవు, ఓ శ్రీలక్ష్మీ పతి! నేను నీకు పూజలు సమర్పించి, వినయముతో నమస్కరిస్తున్నాను. ఓ భవతరణ (సంసారసాగరాన్ని దాటించువాడా)! దయచేసి నాపై కరుణ చూపి, త్వరగా నన్ను అనుగ్రహింపుము.
Comments
Post a Comment