వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
14. దృశ్య జగుత్తు ఉద్భవించుట పరమ పవిత్రమైన బ్రహ్మము నుండె, ఈ దృశ్యజగత్తు ఎట్లు యుత్పన్నమగు చున్నదో తెలుసుకొనుము. ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపమగు పరమాత్మ స్వరూపమే. ఈ బ్రహ్మం ఆకాశము కంటె సూక్ష్మం. ప్రథమమున అహం జ్ఞానముతో కూడి, అందుండి జ్ఞాన సంస్కారములన్నియు వెడలుచున్నవి. తదుపరి చిత్త వృత్తులతో కూడి క్రమముగా సంవేదనలు ఉత్పన్నమై ఆత్మభావము విస్మరించి, సంసార ఉపాధితో కూడిన జీవభావము పొందును. కాని బ్రహ్మ భావము తొలగిపొదు. క్రమముగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పదార్ధములతో పంచభూతము లేర్పడినవి. ఆకాశము నుండి తన్మాత్ర అయిన శబ్ధము ఉద్భవించినది. ఆ శబ్ధమే వేదములుగా వికసించినది. ఆ వేద శబ్ధముల అర్ధములే ఈ జగత్తు రూపములు. అందులో వాయువు ఏర్పడి, అందుడి చతుర్దశభువనములు, ప్రాణి స్వరూపములు జన్మించినవి. ఈ వాయువే స్పర్శ తన్మాత్రగ రూపొంది సర్వభూతములు స్పందన కార్యము. ఈ వాయువుచే నిర్వహించబడుచున్నది. ఈ వాయువు నుండి ప్రకాశాత్మకమైన తేజస్సు, తేజస్సు నుండి సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొ|| తేజోపదార్ధములు ఉత్పన్నమగుచున్నవి. ఈ తేజస్సు నుండి జలము ఉత్పన్నమై రుచి అను తన్మాత్ర ఏర్పడుచున్నది. తదుపరి ఈ తేజస్సు నుండి గంధ తన్మాత్ర అయిన పదార్ధము ఏర్పడి, పృధివిగా రూపొంది, ఈ పంచతన్మాత్రల సంయోగ వియోగములే జీవకోటిగా రూపొందుచున్నవి. అంకురము నుండి వెలివడుట, శతశాఖలతో ప్రకాశించుట, ఫలముల నొసంగుట మొదలగు నవన్నియు మాయయని గ్రహించవలెను. పరబ్రహ్మ కారణముగా మాయ, మాయ వలన పంచతన్మాత్రలు, వాని వలన జగత్తు క్రమముగ వికసించుచున్నది. ఆకాశము, తేజస్సు, తమస్సు ఇవన్నియు బ్రహ్మము యొక్క సత్త వలననే నిలబడియున్నవి. వీటికి స్వతంత్రత లేదు. ఇట్లు జగత్తంతయు బ్రహ్మమయము. సృష్ట్యాదిలో తన్మాత్ర పంచకము, జగత్తును సృష్టించుచున్నది. లింగదేహము, జ్ఞాన, చిత్త కల్పనలు, స్థూల శరీరమునకు కారణమగుచున్నది. పురుషుడు స్వప్నమున తన్నుపాంధునిగ తలచుచున్నట్లే, జీవుడు తన్ను శరీరిగ భావించుచున్నాడు. చిత్తము ఏ విషయముల ఆకారమును దాల్చుచుండునో, జీవుడు కూడ అట్టివేయగు ఉపాధుల ధరించుచుండును. సర్వగామియగు ఆత్మ, జ్యోతిర్మయమగు లింగ శరీరమున ''అహం'' అభిమానమును దాల్చి వెలయుచున్నది. స్వప్నమున, సంకల్పమును, ఈ శరీరమునకే జరుగుచున్నట్లు, జీవుడా స్వలింగ రూప యుపాధి శరీరము యందు అహంకారముతో కూడి, దాని యందు వున్నవానిగ భావించుకొని, కల్పనామయ దేహమును, అనుభవించుచున్నాడు. చిత్తము జీవుని నిజ గర్భ గృహము. అందుండియే కల్పనానుసారముగ కాలము, కార్యము, కల్పన, ద్రవ్యముల అనుభవము పొందుచున్నాడు. ఇది స్వప్న కల్పన వలె అసత్తు అగుట వలన అనుత్పన్నము. పరమాత్మ వాస్తవానికి వుత్పత్తి లేకున్నను, ఇట్లు యుత్పన్నమగుచున్నాడు. అతివాహిక దేహియగు ప్రభువు, దేహస్వరూపమై ప్రజాపతిగ పిలువబడుచున్నాడు. నిజానికి ఇందు ఏదియు ఉత్పత్తి అగుట లేదు, అగుపించుట లేదు. ఉన్నదంతా అనంతాకాశము వలె బ్రహ్మకాశమే, మహా ప్రళయ సమయమున బ్రహ్మదులు లయమగునట్లు, వారిచే సృష్టింపబడిన ఈ ప్రపంచము లయముగునదియె కదా! ఇవి బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నవి. మరల విలీనమగుచున్నవి. స్వప్నానంతరము అదంతయు లేనట్లే. జ్ఞానము కల్గిన ఈ సంసారము మిథ్యయని బోధపడును. అందువలన జ్ఞానాకాశమున అఖండము, అనాదియు అయిన బ్రహ్మమునే ధరించగలము. అది పాంచభౌతికము కాదు. దాని వలన ఉత్పన్నమయిన పంచభూతాలు కేవలము అసత్యములే. నిశ్చలమగు సముద్రమే తరంగములుగా మారునట్లు పరమాకాశము ఆ రూపమును త్యజింపకుండగానే జీవరూపముగా ప్రకాశించుచున్నది. కారణము సంకల్ప రూపమగు చిద్‌వృత్తియె. దీపము నుండి, దీపము వెలిగింపబడునట్లు, బ్రహ్మం నుండియె, జీవ సమూహము లన్నియు యుత్పన్నమగుచున్నవి. వృక్షము నుండి శాఖలు వెలువడునట్లు, అతని స్పందన వలనే జీవుడుతృత్తి అగుచున్నాడు.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
16. లీలోపాఖ్యానము
ఈ సందర్భమున వసిష్ఠుడు శ్రీరామునకు లీలోపాఖ్యానమును ఈ విధముగా తెలియజేసెను. పద్ముడను మహారాజొకడు ఈ భూమండలమును ఒకప్పుడు పరిపాలించెను. అతడు సకల గుణశోభితుడు, సర్వకళా సంశోభితుడునై, అతని భార్య లీలావతి భర్తకు తగిన ఇల్లాలు. మృధుబాషిణి పవిత్రతగల్గి, వసంతలక్ష్మివలె నొప్పుచు, భర్తకు ఛాయవలె సంచరించెడిది. ఇరువురు అపరిమిత ప్రేమతో, సర్వ ప్రదేశము లందును సంచరించుచు, రమణీయ క్రీడలతోను, పరిహాస వాక్యములతోను, శృంగార క్రీడలతోను సంచరించుచు పరమ సుఖమున తేలియాడుచుండ; ఆ రాజపత్ని లీలావతి ఇట్లు తలపోసెను. తాను తన ప్రియుడు శతయుగములు, జరామరణములు లేకుండ, యవ్వనముననుండ గల్గుటకు యుపాయమేమిటని భావించెను. తదుపరి అందులకై లీలావతి; యమ, నియ మాధ్యనుష్టానముల నవలంభించి, తపో, జపముల నాచరించి, తన భర్త తాను, జరామరణములు లేకుండా వుండునట్లు, యత్నింతునని భావించి అందుకు, జ్ఞానవృద్ధులను, తపోధనులను విద్యాధికులను పూజించి, అమరత్వమును పొందు మార్గమును తెలుపుమని కోరెను. అందుకు వారు జపతప నియమాదుల నాచరించిన, ఇతరములన్నియు లభించును గాని, అమరత్వము లభించదనిరి.అపుడు లీలావతి చింతించి, ఇట్లు తలచెను? తాను వెయ్యేండ్లుగడచిన పిదపనైనను, తన కంటే తన భర్త ముందుగ మరణించిన, అతని ప్రాణములు గృహము నుండి వెలువడకుండునట్లు చూచిన, యావజ్జీవము తాను సుఖముగ నుండ వచ్చునని భావించెను. తదుపరి ఆమె, తన భర్తకు తెలియకుండా శాస్త్రానుసారము, కఠోర నియమములాచరించి, తన భర్త అమరత్వమునకై సాధన మొదలుపెట్టెను.
ఆమె ఉపవాసముల ద్వారా, దేవ, బ్రాహ్మణుల పూజల ద్వారా, స్నాన,దాన, తపోధ్యానాది, క్లేశకర కార్యములకై తన శరీరమును, వినియోగించుచు శాస్త్రానుసారము యథా సమయమున, భర్తను సేవించుచు, అతనికి సంతోషమును గూర్చుచుండెను. ఇట్లు కఠోర తపమును ఆచరించుచు, త్రిరాత్రి శతవ్రతమును ఆచరించెను. ఆ తపః ప్రభావమున వాగ్దేేవి సరస్వతి ప్రసన్నమై తన కిష్టమైన వరమును కోరుకొమ్మనెను. అపుడు లీలావతి జయ వాచకములు పలికి రెండు వరములు కోరుకోనెను. 1) తన భర్త ప్రాణములు వదలినను, ఆ జీవాత్మ తన అంతఃపురము నుండి వెలువడకుండునట్లు 2) తాను తలచు కున్నపుడెల్ల తనకు దర్శనమీయ వలెనని చెప్పెను. అందుకు వాణి సమ్మతించి వరముల నొసగెను. అంత లీలావతి సంతసంబున భర్తతో కొంతకాలము గడిపిన తదుపరి, తన భర్త పద్ముడు ప్రాణమువదలెను. భర్త మృతుడగుట గని లీలావతి, దుఃఖముతో మృత్యుపాయమయ్యెను. విరహ పీడితమై తాను కూడ మరణించ నెంచుచుండెను. అపుడు ఆకాశవాణి ప్రసన్నమై ఇట్లు పలికెను. ''నీ భర్త శవము కూడ పాడవదు. ఇతడు మరల జీవించి, నీ అంతఃపురమును విడిచి ఎచ్చటకును వెళ్ళడు'' అది విని లీలాదేవి, ఇతర బంధువులు పూలతో అతని శరీరమును కప్పి దాచివుంచిరి.
తదుపరి లీలావతి ఆదినమున అర్ధరాత్రి, ధ్యాన పరాయణయై, దుఃఖముతో సరస్వతీ దేవిని ప్రార్థించెను. అంత సరస్వతి ప్రత్యక్షమై నీవేల దుఃఖించుచుంటివి, ఈ సంసారము భ్రమయనియు, మృగతృష్ణవలె మిధ్యయని తెలియదా! అని పల్కెను. అపుడు లీలావతి, తన్ను కూడ తన భర్త వద్దకు చేర్చుమని, అతడెచట వున్నాడో తెల్పమని కోరెను.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
15. సమిష్టి జీవనము, వ్యష్టిజీవనము
బ్రహ్మము చుట్టును ఆవరించి యుండు అజ్ఞానమును, ఆత్మజ్ఞానము వినాశన మొనర్చుచున్నది. బ్రహ్మమే సమిష్టి జీవ రూపము దాల్చి పిదప వ్యష్టి జీవ రూపమును, దాల్చుచున్నది. వ్యష్టి జీవి ఇఛ్చకు కారణము, సమిష్టి జీవేచ్చ.ఈశ్వర నియమమునకు వ్యతిరేకముగ ఏ కార్యము సిద్ధింపదు.అనగా సమిష్టి జీవి ఇచ్చ ఫల సిద్దికి అనుకూలముగ నున్న కార్యము సిద్ధించును. వ్యష్టి జీవి ఇచ్చ వలన నేదియు సిద్దింపదు. సమిష్టి జీవికి (బ్రహ్మ) కారణ,సూక్ష్మ శరీరములున్నవి. వ్యష్టి జీవికి ఈ రెండును కాక, క్రియాశీలమగు, స్థూల శరీరము కూడ వున్నది. అందువలన వృత్తి, ఇచ్చ ఫలముల తారతమ్యమునకు, స్థూల శరీరమే కారణమగుచున్నది. చైతన్య శక్తి వలన చిదాభాస చైతన్యము అభిన్నమైనను, పరిణామాది శబ్ధముల వలన విభిన్నమైనట్లు తెలియబడుచున్నది. జలము తరంగములు అభిన్నము. అలాగే చైతన్యశక్తి తనంతట తానే, అహంకార మూలక బ్రహ్మండమును, తనయందే ధరించుచున్నది. బుద్ధి లేక అహంకారము, చిత్‌శక్తి యొక్క కల్పన మాత్రమే. వాస్తవము కాదు. అలానే పంచతన్మాత్రలు, పంచభూతములు కూడ. కావున వాసనలు, కర్మలు పరిత్యజించి, నీవు, నేను అను భేదము త్యజించిన, సత్యము మాత్రమే మిగిలియుండును. మేఘములు ఆకాశమును కమ్మిన, ఆకాశము కనిపించనట్లు, మేఘములు తొలగిన ఆకాశము స్పష్టము. అట్టే దృశ్య ప్రపంచము తొలగిపోయిన, చిత్‌శక్తి యొక్క మూలస్ధితి అవగతమగును. మనస్సు, కర్మ, స్థ్ధూల దేహము, దేవతలు నివసించు బ్రహ్మండము, ఇవన్నియు శూన్యములే. చైతన్యము యొక్క మార్పులే. ఏ పదార్ధము ఎద్దాని నుండి ఉత్పన్నమో, దానికి భిన్నము కాదు. చిత్‌శక్తి స్వయం ప్రకాశము. దీనికి నామరూపములు లేవు. అహంకారము, ప్రాణము, కర్మలతో కూడినపుడే జీవుడు ఏర్పడుచున్నాడు.
అజ్ఞానికి మాత్రమే దృశ్య ప్రపంచము వికారములతో గోచరించుచున్నది. జ్ఞానికి అంతా భ్రాంతియని తెలుసు. జాగ్రత్, సప్న, సుషిప్తులందు బ్రహ్మమే స్ఫురించుచున్నది. ఆకాశము, వాయువు, భూమి, జలము, చంద్రుడు, సూర్యుడు మొదలగు రూపముల ద్వారా బ్రహ్మము ప్రకటితమగుచున్నది. దీపశిఖ ఆరిపోయిన మసి మిగిలినట్లు, జగత్తు నశించిన బ్రహ్మమే మిగిలియుండును. జగత్ చిత్ స్వరూపము యొక్క స్పందనము. ఆకాశమున నీలిరంగు కన్పించినను, అదిలేన్నట్లే, బ్రహ్మమున జగత్తు కన్పించుచున్నది. బీజము నుండి అంకురము వెలుడునట్లు, త్రిభువనములు బ్రహ్మము నుండే ఉద్భవించుచున్నవి. జగత్తు అజ్ఞాన దృష్టి యందు స్థూలమైనను, జ్ఞాన దృష్టి వలన జగత్తు యొక్క సూక్ష్మ జ్ఞానము తెలియగలదు.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
11. మనస్సు
శూన్యమగు ఆకాశమునకు పేరు మాత్రమే కలదు. వేరే రూపములేనట్లు, మనస్సుకు కూడ ఎటువంటి రూపము లేదు. అయినను ఆకాశము వలె మనస్సు సర్వత్ర విస్తరించియున్నది. చంచల శక్తితో కూడిన మనస్సొక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది, స్వర్గ, నరకములకు పోవుచున్నది, యోచించుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది, పతనమగుచున్నది లేక ముక్తి పొందుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనియే గాని, జగత్తు వేరుగ లేదు. సంకల్పమే మనస్సు. చలనము నుండి వాయువు, ద్రవ్యము నుండి నీరు వేరుకానట్లు, మనస్సు సంకల్పము కంటే వేరు కాదు. దేహ రూపియగు బ్రహ్మమే మనస్సనిజెప్పబడి, అది భౌతిక బుద్ధిని సృష్టించుచున్నది. దృశ్య ప్రపంచమే మనస్సు. చిత్త మాలిన్యముల వలెనే నీకీ దృశ్యమగు విశ్వము కనిపించుచున్నది. ఈ మాలిన్యం తొలగినచో, దృశ్యము అగుపడదు. అపుడు నిర్మల దర్పణము వలె స్వచ్ఛమగుదుము. గాలి వీచనిచో లతాదులు కదలవు. అలానే ఆత్మలో ఏకత్వముఏర్పడిన, చిత్త స్పందన ఆగి, రాగ ద్వేషములు వాసనలు దొలగిపోవును. అద్దము నందు ప్రతిబింబము లేకున్న అద్దము స్వచ్చమగునట్లు, నీవు ఈ జగత్తు కాదు అని భావించిన ద్రష్ట కూడ కేవలుడగును.
ఇదంతయు విన్న శ్రీరాముడు, వసిష్ఠు నీవిధముగా ప్రశ్నించెను. సత్తునకు వినాశము లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎడతెగక దోషములతో నిండి సద్వస్తువు వలె ప్రకాశించు ఈ జగత్తు, అసత్యమని ఎట్లు తెలుసుకొనగలమో తెలుపు మనగా, వసిష్ఠుడు ఇట్లు పల్కుచున్నాడు. ఈ దృశ్య ప్రపంచము శాంతించు మంత్రమును చెప్పుచున్నాను. దీని వలన దృశ్య భావము నశించును. ఆకాశాది భూతములు, వ్యవహారమందు మాత్రమే జగత్తు అనబడును. కాని పరమార్ధ దశ యందు బ్రహ్మమే కలదు. ఈ ప్రపంచము స్వప్నమున గాంచు గృహాదుల వలె, మనస్సు యొక్క కల్పనమే. ఈ మనస్సుకు యుత్పత్తి లేదు, శరీరము లేదు. స్వప్నము, స్వప్నమును గాంచలేనట్లు మనస్సు అసత్తయ్యి, నిజేచ్చ వలన, నిజ శరీరమును కల్పించుకొని, దాని వలన, ఇంద్రజాలము వలె జగత్తును విస్తరించుచున్నది. చంచల శక్తితో కూడిన మనస్సోక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది. స్వర్గ నరకములకు బోవుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది. ముక్తినందుచుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనే. మనస్సు గాక మఱి జగత్తులేదు. మహాప్రళయమున దృశ్య సృష్టి అంతయు లయమగును. అప్పుడు మిగిలేది బ్రహ్మ మొక్కటియే.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
6. సృష్టి
బ్రహ్మతత్వము స్వయం ప్రకాశము. అదియే పరమాత్మ మరియు ఆత్మతత్వము. ఆత్మతత్వము నుండి విష్ణువుదయించెను. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించెను. ఈ ప్రాణులు లాభా లోభములు కల్గి, అల్పాయుష్కులయి, విషయభోగముల వలన, దుఃఖితులై యుండిరి. బ్రహ్మ, వారి కష్టములు గాంచి కరుణించి, వారి మంచి కొరకై చింతించి, వారి దుఃఖ నివారణ కొరకు తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్ధములను, శుద్ధ సాధనములను సృష్టించెను. అయినను జ్ఞానమొక్కటే జీవుల తరుణోపాయమునకు మార్గమని తెలిపెను. అందుకుగాను బ్రహ్మం, సంకల్ప మాత్రమున బ్రహ్మను సృష్టించెను. నిర్మల స్వరూపియగు వసిష్ఠుని, బ్రహ్మ చంచలమగు నీ మనస్సులో ఒకింత అజ్ఞానము ప్రవేశించుగాక అని శపించెను. అంత వసిష్ఠుని బుద్ధి జడత్వము పొందగా, దీనుడై దుఃఖ శోకముల దగుల్కొనెను. అంతట తన దుఃఖమును గాంచిన బ్రహ్మ తన పుత్రుని సంసార దుఃఖము నుండి తప్పించుటకు, తత్వజ్ఞానముపదేశించెను. తదుపరి వసిష్ఠుడు తత్వజ్ఞానము నిర్మలమగు తత్వ జ్ఞానమున స్ధితుడైనాడు. అంతట బ్రహ్మ నేను నీ కొసగిన తత్వ జ్ఞానమును ప్రాజ్ఞులగు వారికి బోధించుమని పల్కెను. అంతట వసిష్ఠుడు, నిరహంకారముతో, అభిమానరహితుడై తత్వజ్ఞానమును రామునికి బోధించెను. వసిష్ఠుడు ధర్మార్థ కామమోక్షములు పొందు నిమిత్తమై ఋషులకు స్మృతి శాస్త్రము, యజ్ఞశాస్త్రములు రచించి బోధించెను. కాలక్రమమున జనులు ధనసంపాదన, భోగలాలసులై అందుకొరకు కలహించుచు, యుద్ధములలో మునిగి దీనులు కాదొడగిరి.అపుడు జ్ఞానులైన ఋషులు, ప్రజల దైన్యమును పోగొట్టుటకై ఆత్మతత్వమును ప్రచారము కావించిరి. రాజులు తత్వజ్ఞానమును పొంది దుఃఖరహితులైరి. కాని వివేకవంతులగు తత్వజ్ఞులు, వైరాగ్యమును పొందిరి. అట్లు వైరాగ్యమును పొందిన వారే దుస్తరమగు ఈ సంసార సాగరమును తరింతురు. అందువలన శ్రీరాముని విచారమును పోగొట్టుటకై జ్ఞానమును వసిష్ఠుడు బోధించెను.
మహర్షి వాల్మీకి విరచిత యోగ వాశిష్ట సారము
9. బంధము
బంధమునకు కారణము దృశ్య ప్రపంచము. దృశ్యము నశించిన బంధములు తొలగిపోవును. స్వప్నము సుషుప్తి యందు నశించునట్లు, ఈ దృశ్య ప్రపంచము ప్రళయమున లీనమైపోవును. అపుడు మిగిలిన సత్ పదార్ధమునకు నామ రూపములుండవు. నిష్క్రియము కాని లోక వ్యవహారము నిమిత్తము ఆ పరమాత్మ సత్యము, బ్రహ్మము మొదలగు నామములు కల్పించిరి. చైతన్యమైన ఈ బ్రహ్మ పదార్ధము మనస్సుగాను, క్రమముగా ప్రాణులుగ, అనగా జీవులుగా క్రమముగా పరిణామము చెంది సృష్టి, స్ధితి, లయములకు హేతువగుచున్నవి. ఇంద్రజాల మయమగు యీ జగత్తు అసత్యమయ్యి, మనస్సు యొక్క ప్రభావమున సత్యముగనున్నట్లే ప్రకటితమగుచున్నది. అందువలన పండితులు ఈ జగత్తును మాయ, మొహము, తమస్సు, అవిధ్యయని పిలుచుచున్నారు.
ద్రఫ్ణ యొక్క ప్రతిబింబ చైతన్యమునకును, దృశ్య పదార్ధమునకును గల సంబంధమే బంధము అని చెప్పబడుచున్నది. దృశ్య భావమే బంధమునకు కారణము. దృశ్యము తొలగిపోయిన బంధము నశించును. తర్కము వలన గాని, తీర్ధయాత్రల వలన గాని, సత్యము వలె తోచు ఈ జగత్తు నాశనము గాదు. అద్దమునందు కనిపించు ప్రతిబింబములు, అడవులు, పర్వతములు, నదులు, వస్తువులు బ్రహ్మము యొక్క సృష్టి స్ధితి, లయలు మాత్రమే. యదార్ధములు కాదు. యదార్ధ జ్ఞానము పొందినపుడు అవన్ని భ్రమలే అగును.
సమాధి స్ధితి యందు బాహ్య వస్తువు అదృశ్యమైనప్పటికి సవికల్ప సమాధి స్ధితిలో, అంతర్‌దృష్టి వలన సూక్ష్మశరీరము చిత్ రూప వస్తు ప్రపంచమును దర్శించును. కాని నిర్వికల్ప సమాధి స్ధితి యందు, సర్వదృశ్యములు అంతమై ఆత్మ నిశ్చలమై గాఢ సుషిప్త నిద్రలో వలె సర్వము అభావమై బ్రహ్మభావమును పొందును. కాని సమాధి నుండి బయటకు వచ్చిన వెంటనే మరల దృశ్య ప్రపంచములో, మాయలో దగుల్కొనును. మనస్సను మూల దృశ్యమున్నంత వరకు యోగులు సహితం సంపూర్ణ స్ధితిని పొందరు. ద్రష్ట తాను పాషాణముగా భావించినంత కాలము అట్లే యున్నప్పటికిని, ఆ స్ధితి నుండి తేరుకొనిన పిదప దృశ్యము మరల దర్శనమగును. కనుక దృశ్యము సత్యమైన అది ఎన్నటికీ నశించదు. తపోధ్యాన తపస్సుల వలన కూడ అది నశించదు. మర్రి విత్తు యందు వృక్షమున్నట్లు దృశ్యము కూడ సంస్కార రూపమున అణగియుండును. అలానే నువ్వుల యందు నూనె, పువ్వుల యందు వాసన దాగి యున్నట్లు, ద్రష్ట యందు దృశ్యమిమిడి యున్నది. చిత్తుతో కూడియున్న చిత్తమున సంస్కార రూపమున నున్న దృశ్యజ్ఞానము కూడ, దేశ కాల పరిస్ధితులననుసరించి వృద్ధి చెందును.
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
సాహితీమిత్రులారా!
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! అనే పేరున ఒక వ్యాసం డా. ఏల్చూరి మురళీధరరావుగారు ఈ మాట అంతర్జాల మాసపత్రికలో వ్రాసియున్నారు అందుండి ఈ పద్యాన్ని ఇక్కడ వారి వివరణను యథాతథంగా ఉంచుతున్నాను ఆస్వాదించండి-
వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —
కమలాకరకమలాకర కమలాకర కమల కమల కమలాకరమై కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.
ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.
అల్లంరాజు సుబ్రహ్మణ్యంగారి వివరణకంటే ఇందే బాగుందని నా అభిప్రాయం ఎందుకంటే అది నేను ఒకసారి చూసి ఉన్నాను. అందుకే ఇది ఇక్కడ ఉంచడం జరిగింది. -------------------------------------------------------- - ఏ.వి.రమణరాజు |
|
|
|
|
|
|
|
|
Comments
Post a Comment