ప్రాంజలి ప్రభ ..(1) శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి
...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము
దృతరాష్ట్రుని ప్రశ్న
ఉ. ధర్మజు తోడఁ దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్
కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్
ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా
నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్ (01)
సంజయ వ్యాఖ్యానము
ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్
తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్
గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,
ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్ (02)...
ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్
బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో
సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్
యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్ (03)
ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్,
అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్
దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్
వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్ (04)
శా . ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్
సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్
భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్
ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్ (05)
ఉ. పాండు కుమారులున్ తమరి పాశమునేమది జూపనుండగన్
పాండవ మధ్యముండు మరి బాల ప్రవీరులు ధర్మ యుద్ధమున్
కండబలంబునన్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్
నిండుగ యుద్ధవీరులకు నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్ (06 )
ఉ. ఎందరు భూసురుల్ కలసి వెల్గుల నెత్తగ జోరుగుండగన్,
అందరిలోను మిన్నగన నాద్యుగ నీవన విజ్ఞతేయగున్
సందడి యుద్ధకారణమె సంజయ! యీవిధిఁ జేరగా నగున్
గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్ (07 )
ఉ. కేరున, భీష్మ, కర్ణ, శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్
వీర వికర్ణ విశ్వస వివేకులు మీరును మాన్యు లేయగున్
భూరి శ్రవుండు నీదుసుత భూసుర శ్రేష్ఠులు వీరతేజమున్
వీరులు యేకమై సమయ విద్దెలు గాకురు క్షేత్రయుద్ధమున్ (08)
ఉ. ఇంకను పెక్కుమంది బల హేతుక విద్యల యుద్ధ కౌశ మున్
జంకక నన్నుఁ గోరి తమ జాడలుఁ దెల్పియు దేహమొడ్డియున్
వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధముఁ దీరి యుండగన్
సంకట మేమిలేకనటు సాయముఁ జేయగ శూర సైనికుల్ (09)
చం. అపరి మితమ్ము సేన తతి యాశయ లక్ష్యముగాను కౌరవుల్
అపజయమేయెరుంగనిటు యర్జును భీష్ముల నిల్వరించగన్
నిపుణత మేలు జూపుచు వినిర్మల పాండవ మూక గెల్వగన్
అపజయమౌను సత్యముయు నాదిగ వాక్కులు నమ్ముసైన్యమున్ (10)
ఉ.కావున మీరు ధైర్యము సకాలము తోడుగ నుండ గల్గగన్
కావగ భీష్ము వెంట నని కార్య విశిష్టత లందు తోడుగన్
నావిజయమ్ములే మొదట నాదగు ధైర్యము సంపదేయగున్
కావున విశ్వసించ గల కార్యము యుద్ధము నిర్ణయమ్ముగన్ (11)
ఉ. భీష్మ సుయోధనా పలుకు ప్రీతిగ నెంచియు యుద్ధ భేరితో
భీష్మ నినాద విస్మయ విభేద్యము తెల్పగ ధైర్యమే బలమ్
భీష్ముడు సింహనాదమను భీకర శంఖము పూరణార్థముల్
భీష్ముడు తాను సర్వులకు ప్రేరణ నివ్వగ వ్యూహ మెంచగన్ (12 )
ఉ. అప్పుడె శంఖనాదపు మహారవ తప్పెట శబ్ద భేరులన్
చప్పుడు వాద్యముల్ విను ప్రచారపు భీతినిఁ గల్గఁ జేయగన్
డప్పుల చప్పుడే వినుము డంగగు యుద్ధ కళా సమర్ధతే
గొప్పగ గెల్పుఁ గోరికల కొండలు పిండిగ చేయఁ దల్చగన్ (13 )
ఉ. తెల్లని వెల్గులన్ రథము తీర్చిన సాధ్యము యుద్ధమేయగున్,
ఉల్లమునన్ కిరీటిగనుచుండగ ధైర్యము పెచ్చరిల్లగన్
నల్లని ధాత కృష్ణుడు సనాతన ధర్మము నిల్ప గల్గగన్,
గొల్లున శంఖ రావముల ఘోరనినాదము యుద్ధ విద్యగన్ (14 )
ఉ. కృష్ణుడు పాంచజన్యమున కృత్యముఁ జేసెను శంఖరావమున్
కృష్ణుని తోడు నర్జునుడు కృత్యకఠోరపు శంఖమూదగన్
కృష్ణుని వెంట భీముడును కృత్య మొనర్చగ పౌoడ్ర శంఖమున్
జిష్ణుడితోను పాండవులు చిన్మయ చేష్టల శంఖమూదగన్ (15)
శా . కుంతీపుత్రుడు ధర్మరాజు జయమే కోరాడు భావమ్ము లన్
శాంతమ్ముల్ కదనాంత సాధ్యములనన్ సద్యమ్ము ఘోషించగన్
సాంతమ్మున్ సహదేవుడంతమణిపుష్పాశంఖ మున్ నింపగన్
కుంతీపుత్రులమేయవిజ్జయములన్ కూర్మిన్ రొదల్ జేయగన్ (16 )
మ. శరవిద్యావిధి నేర్పు పాటవ మహా శౌర్యున్ శిఖండీయనన్
వరపుత్రాదులు సాత్యకీ భుజబలుల్ వారైన కాశీప్రభున్
ధరమాహాత్మ్యములెన్న జేసెడి సుభద్రాపుత్రుడేమార్చగన్
ధరణీతత్త్వముఁ దెల్పగన్ దృపదు శ్వేతాంబాద్య శంఖాలిడెన్ (17)
చం. అపజయమే నెరుంగనిట సాత్యకిసేవ మహా ప్రభున్ సుధీ
ద్రుపద మహాప్రభున్ యపర దూకొను యుద్ధ సమర్ధతల్ సుధీ
స్వపరము యుద్ధ కౌశలము సాగెడి విద్యలుగాను యుద్ధమున్,
అపర సుధీరమందునను యాసలుగానిటు శంఖమూదగన్ (18)
ఉ ll పాండవ యోధులిట్లనెడి పాటవముల్ పెను శంఖనాదముల్
మెండుగ మిన్నుముట్టిన ప్రమేయపు రోదన భీకరమ్ముగన్
మొండి సుయోధనుం డడరి మూకల వ్యూహము మార్చుచుండగన్
గుండెలు ముక్కలైనసమ గుర్తుగ యుద్ధ నినాదచేష్టలన్... (19)
ఉ. సోద మనస్కుడై తెలియు చోద్యములన్ ధృత రాష్ట్రు డీ విధిన్
మోదము తోడ పార్ధుడు సమూహముతోడుగ సైన్యమంతటన్
నాదముఁ జేయుచూ ధనుసు నారిబిగించిసమూల మెల్లెడల్
మీదగు సేన నిల్వలను మీసుతు లెల్లర వీక్ష జేయగన్ (20)
శా . హేకృష్ణా యనుచున్ కిరీటి పలుకుల్ హెచ్చైన చోద్యమ్ములన్
హేకృష్ణా యెవరెవ్వరీ మొనలనన్ హేయంపు వీక్ష్యమ్ము లన్
హేకృష్ణా కదనమ్ముమధ్య నిలుపన్, ఇంపార వీక్షించగన్
హా కృష్ణా మనవీరులన్ యెదుటి వీ రావేశులన్ యుద్ధమున్ (21 )
ఉ. వైరులు నేనుగాగనెద వైనము యేమియు తేల్చగల్గగన్
పోరున నెవ్వరో ననగ బుద్ధిగ నెంచెడి యుద్ధవీరులన్
వారల నెంచ శక్తిగను వాలును వీలును కల్గఁ జేయగన్
సారధి మధ్యనే రథము సాచుము జూచెద నెవ్వరెవ్వరో - (22)
చం. ఒకపరిచూచెమానసము నొక్క విధమ్మును గాంచ యుద్దమున్
సకల సుయోధనా ప్రియులు సఖ్యపు రాజుల గాంచ యుద్దమున్
నికరపు బుద్దిగూర్చుటకు నిక్కువ మైనది యుద్ధ క్షేత్రమున్
మకతిక రాజులేకలరు మానసమేనుసమమ్ము గాంచెదన్ (23 )
ఉ. దివ్య శతాంగ మెక్కిసువిధేయసుయోధను భీష్మ ద్రోణులన్
భవ్య పథమ్మునన్ మలిపి బంధన నీతిని రాజులియ్యడన్
నవ్య పథమ్మునన్ గదలి నమ్మిన వీరుల నెంచగల్గగన్
సవ్యరథమ్మునన్ నిలుపు సాధ్యము జేయుము ముందుగా నిటన్ (24 )
మ. పరికించన్ కదనాంతరమ్మునిటు సంప్రాప్తమ్ము లెన్నన్గడున్
కురువీ రుల్ జయకాంక్షలన్ తలపగా కూర్పౌను నేస్తమ్ములన్
తరుణమ్మే పరమావిధిన్ విజయమే తత్త్వమ్ము వైనమ్ములీ
మరులందే పడి పాండు మధ్యముడు సామర్థ్యమ్ము లెక్కించ గన్ (25 )
ఉ. పిమ్మట పార్ధుడే యుభయ బిందము లందున మేనమామలున్
ముమ్మరసేనలందు గురుమూర్తులు, తండ్రులు, తాతలుండగన్
నమ్మిన పౌరులెంచగవినమ్రులు మిత్రులు బంధులుండగన్
చెమ్మగిలంగ యర్జునుడు చింతన జేయుచు పల్కెనిట్టులన్ (26 )
చం. గురుజన, మేనమామలును, గుర్తుకుఁ దెచ్చెడి బంధు వర్యులన్
వరుసకుసోదరుల్ సుతులుబావలు మామలు, మిత్రులెందరో
పరిచయనేస్తులన్ గనుము పాశము బంధముగాను చూడగన్
సరిగమ యుద్ధ వీరులనుసారధు లౌను ప్రయుక్త బారులన్ (27 )
పార్ధుని ప్రార్ధన
చం. సమరము సేయ వచ్చిన సుసాధ్య జయమ్మును గోరు రాజులున్
తమతమబంధుమిత్రులు కదాయని నెమ్మ మనమ్ము క్రుంగగన్
మమతను వీడ విజ్ఞతలు మాయగ కయ్యము జేయగాఁ గనన్
సమతను జూపలేనివిధి సంగమసాధ్య విషాద హేతువుల్ (28)
మ. సహబంధాఢ్యుల పోరు సల్ప జయముల్ సాధ్యమ్ము సిద్ధించగన్
సహధాయమ్ముల శోకమేయగుటలో సామ్యమ్ము లేదెందుకో
సహదేహమ్ము విధేయిగా వణకగా సాగే విశేషమ్ముగన్
సహవాక్కుల్ విన ధైర్యముల్ సడలగా సంగ్రామ మందున్ గనన్ .... (29)
ఉ. మర్మము తెల్పలేనిగతిమాయల విస్తృత తత్త్వమే యనన్
శర్మద సాక్షిగా మనసు సంగర మార్పుల చిత్తమందగన్
ధర్మపు యుద్ధమే స్థిరము, దారులు వేరుగ లేక నిల్వగన్
కర్మల తోడుగా చలన కాలము వ్యర్థము జేయకుండగన్ (30)
మ. కనుచుండన్ విభవమ్ము సూచనలనన్ కాలమ్ము కర్మమ్ము గన్
రణరంగాన మదీయ సైన్యము లిలన్ రంజిల్లగా నెల్లెడన్
మనమేగెల్పుల లాభమంద గలుగన్ మాత్రాద్య ప్రశ్నేయగున్
మనసేమాన్యగుణమ్ముగాసకలమున్ మాయాను సారమ్ములన్ (31 )
ఉ. కోరను నేనుగా జయము కూర్మిని బాపెడు యుద్ధమందునన్
కోరను రాజ్యభోగములు కుచ్చిత సౌఖ్యములెన్న హీనముల్
కోరను భాగ్యముల్ కదన కోరిక లేదన వాదమెందుకో
పోరును చేయనే ననుచు పూర్తిగ మారితి నేనునేనుగన్ (32 )
మ. సుకమేధ్యాసగ నెంచుపోరులెనయన్ సూత్రమ్ము లన్ యుద్ధముల్
సకలమ్మే భయమేమిలేక నిటులన్ సంగమ్ములన్ బోరగా
వికసించేయువవీరులేపెనవులన్ విద్యార్థులై తీరగన్
ప్రకటించే పలు వీరులే సమరమున్ ప్రావీణ్య ముల్ నేర్పగన్ (33)
చం. కలహపు యాస లందున వికాస విభావ విజేయముల్గనన్
గలరిటమేధసంపదల గమ్యముజూపు మనస్సు శ్రేష్ఠతల్
గలరిట శక్తిమంతులు సగౌరవమొంది రణమ్ము జేయఁగన్
గలరిట నిల్ప యుద్ధపు సకార్య వివేక సుధర్మ కార్యముల్ (34)
శా . ముల్లోకా లొకటై నఘోర సమరమ్ముల్ ముఖ్య సాధ్యమ్ముగా
ముల్లోకాలను ధిక్కరించదలచన్ ముప్పేట పోరాటముల్
కల్లోలమ్ము విధించు యుద్ధమిదియే కష్టమ్ము లెచ్చించ గన్
ఉల్లమ్మున్ కదిలించు రక్త సెలయేరుల్ గుర్తు తెచ్చేవి గా (35)
ఉ. చంపుట పాపమంచు మన చెంతన జేరగ బంధు వీరులన్
జంపు తలంపులన్ వలదు సంగర మెంచగ దుఃఖమే కదా
తంపులు మానినన్ మనకు దక్కును బంధుజనమ్ము ప్రాణముల్
రంపున ధార్త రాష్ట్రులది రాజ్యము దోచిన పాపమే యగున్ (36 )
ఉ. చుట్టములౌను కౌరవలు చోద్యము వారిని కయ్యమందునన్
మట్టును బెట్టగా వలదు మానెద యుద్ధపు హింససంగతుల్
జట్టుల వీరులన్ ప్రతిగ జంపుట మంచిది కాదుపోరునన్
పట్టున సౌఖ్యముల్ కదన పాటున కోరగ నేలనోఁ గదా (37 )
ఉ. వీఱ కులక్షయమ్ములగు విగ్రహ విద్యల జేయ మానగన్
శూరుల ధ్యాస రోషముల జూపెడి దుర్బల మానసమ్ములన్
వారి విశేషబంధముల వాద్యపు బుద్దుల మార్పులేక యే
ఘోరమనన్ రణాంతర నిగూఢ విధానపు కృష్ణతత్త్వమున్ (38 )
మ. జనవాంఛా పరిశోధనా పటిమలన్ జాగ్రత్త చోద్యమ్ము గా
మనచిత్తంబున మంచినెంచగనుటే మార్గమ్ము సాధ్యమ్ముగా
మనబంధుత్వములన్ మధించ గలిగే మర్మమ్ము తీర్పుల్ గనన్
గుణముల్ దోషపు పాడిగా యగుటచే ఘోరాతి పాపమ్ములన్ (39 )
ఉ. ధర్మము సంతరించనగు దానము జేయక పాపమేయగున్
కర్మల బాధ్యతే క్రియగ కాలమనస్సున వక్రబుద్ధితో
నిర్మలమైన జీవమున నిత్యముగా కమలాక్షు నేస్తముల్
మర్మము మాయలై బరగ మాన్యుల బాటల నెంచ నెప్పుడున్ (40 )
కులమున కర్మ ధర్మముల కూటమి జేయు పరిస్థితుల్ గనన్
బలములు లేని బంధములు భారములై మది జంకు జేయగన్
కులములనెంచఁ బాపమన కూరిమి చెందు ఘనంపు చోద్యముల్
తలపులు మారి దోషములు తప్పగ వచ్చు సుఖాల పొందులన్ (41 )
మ. కులసౌకర్యము లేకజీవ సుఖముల్ గూలే విధానమ్ము గాఁ
గులఘాతన్ బ్రతుకే ప్రకారములుగాఁ గూర్చంగ పోరేలనో
కులకర్మల్ మరిచే విధిన్ మలుపులం గూర్పన్ సజీవమ్ముగా
కుల బాధ్యాంతర లెల్ల వేద్యలనగన్ కొట్లాట లింకెందుకో (42 )
ఉ. కౌరవసేన వీరులకు గర్వపు భావము లేచ్చ యుద్ధమున్
ధీరము పెంపు క్రూరమున తీవ్రపు దౌష్ట్యము పొంచియుండగన్
బోరులఁ ద్రోవలన్ రభస పొంగులు రేపిన రౌద్ర రూపముల్
వార భయంబునే వరలు వర్తన వైనము లేమి చెప్పగన్ (43)
మ. కులధర్మానికి నష్టముల్ జరుపగా కోరేటి చిత్తమ్ములన్
కులధర్మాలను శాశ్వతమ్ము లను దృక్కోణమ్ము మూలమ్ములన్
కలనమ్మే కుల నాశనమ్మగుట సాకారమ్ము సాగించ గన్
కలకాలమ్ములు ప్రాప్తిగా నరకముల్ కామ్యమ్ము క్షేత్రమ్ముగన్ (44 )
శా. మేథావుల్ దిగి చేయు యుద్ధములనన్ మేలైన మోక్షమ్ములన్,
ఈ ధర్మాలవనీ విధాన గమనా నీమమ్ము పాపమ్ముగాఁ
భూధర్మమ్ము లనన్ నిధాన ములు సంపూజ్యమ్ము రాజ్యమ్ము గన్
బాధల్ యుద్ధములన్ పెనంగ ప్రజ సంపాతమ్ము సంభావ్యముల్ (45 )
ఉ. ఆయుధ హీనుడై మనసు యాశయ మేవిడువంగ సాధ్యమున్
సాయుధ సేనయుద్ధమున శక్యము జేయగ శస్త్ర మేలనన్,
ఆయువు వీడనున్నమెయి హార్దపు తోడుగ పోరువద్దనన్
మాయ వధింపులన్ సకల మాత్రల శస్త్రము లొప్పకుండగన్ (46 )
ఉ. శోకము లేని మాససము సోద్యము నంతయు జూడగల్గగన్
శోకముచెంద బందుగుల శూరజనమ్ముల గావ లేకనే
శోకముతోడుగా రధము చోదకముల్ వదిలేయు సామ్యముల్
శోకవిలాపమే కలచు సొక్కుల యుద్ధము మాని వేసెదన్ (47 )
అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము
మల్లప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
**
అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము
****
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (1)
1)ప్రథమాధ్యాయం రోజూ చదివితే పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది.
భగవద్గీత ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు శ్లాఖించాయి. పద్మపురాణంలో ఉత్తరఖండంలో పరమేశ్వరుడు పార్వతి దేవి తో సంభాషిస్తూ, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్టుగా వివరించినట్టు ఉంది. దీనిలో ప్రతి గీతాధ్యాయం యొక్క పారాయణ వలనా కలిగే ఫలితాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో భగవద్గీత నారాయణుని స్వరూపమని స్యయంగా ఆ పరమాత్మే పేర్కొనడం విశేషం. భగవద్గీత లోని మొదటి 5 అధ్యాయములు ముఖములుగాను, తరువాతి పది అధ్యాయములు భుజాలుగాను, ఒక అధ్యాయము ఉదరము గాను, రెండు అధ్యాయములు పాదములు గాను ఇలా మొత్తం 18 అధ్యాయములు కలిసి ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఈ పురాణం వర్ణిస్తుంది . అష్టాదశాధ్యాయమైన ఈ గీత జ్ఞానశక్తి అనే సాధనము చేత మహాపాతకాలని కూడా నాశనం చేస్తుంది. గీతా పారాయణాన్ని పూర్తిగా గాని, ఒక అధ్యాయమును గాని, ఒక శ్లోకమును గాని, శ్లోక అర్థమును గాని, పాదమును గాని చివరికి గీతలో ఒక పదాన్ని గాని భక్తి పూర్వకంగా ఎవరైతే స్మరిస్తారో వారు సుశర్మ లాగా ముక్తికాంత ని వరిస్తారనడంలో సందేహం లేదు. ఆ చరిత్రని ఇక్కడ చెప్పుకుందాం.
సుశర్మ ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ద్విజుడు. కానీ అతను వేదాభ్యాసం చేయకుండా,జపతపాదులైన వైదిక కర్మలని వదిలి, చెడు సావాసాలు పట్టి , క్రూరడుగా ప్రవర్తిస్తూ విషయలాలసుడై తిరుగుతూండేవాడు. వ్యవసాయము, ఆకులు అమ్ముకోవడం ముఖ్య వృత్తులుగా జీవితం సాగిస్తూ మాంసాహారి అయ్యాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది.
ఒకనాడు ఆ సుశర్మ ఒక ఋషి వాటికలో ఆకులు కోస్తూ ఉండగా, ఒక పెద్ద సర్పము అతన్ని కాటువేసింది . వెంటనే అక్కడికక్కడే అతను మరణించాడు. పాప ఫలమైనటువంటి నరక బాధలను అనుభవించి మరు జన్మలో అతడు ఒక వృషభంగా (ఎద్దుగా) జన్మించాడు. ఒక కుంటివాడు దానిని వాహనంగా చేసుకొని చాలా భారమైన పనులు చేయిస్తూ, మోయలేనంత బరువులు మీద వేసి మోయిస్తూ ఉండేవాడు. 10 సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. ఎత్తయిన పర్వత ప్రదేశాలలో ఒకనాడు ప్రయాణం చేస్తూ ఆ వృషభము భారాన్ని భరించలేక కిందపడి మరణించింది.
దైవవశాన కొందరు సాధువులు ఆ మార్గాన వెళ్తూ, అక్కడ చచ్చిపడిఉన్న వృషభాన్ని చూసి జాలిపడి దానికి సభ్యత్తులు కలగాలని తమ తప ఫలాల నుంచి కొంత ధారపోశారు. వారిలో ఒక వేశ్య కూడా ఉంది. నేను చేసిన పుణ్యం ఏమిటా అని ఆలోచించి, ‘ నేను ఏ పుణ్యాన్ని చేశానో దాన్నే ఈ వృషభానికి ధారపోస్తున్నానని‘ పలికి తన పుణ్యం ధార పోషింది . ఆ తరువాత యమదూతలు యముని దగ్గరికి ఆ వృషభాన్ని తీసుకుపోయారు. అప్పడు యముడు ‘వేశ్యధార పోసిన పుణ్యం చేత దీని కర్మ నశించిపోయింది’అని చెప్పాడు. ఆ తర్వాత అది పుణ్యలోక సుఖాలను పొంది పూర్వజన్మ జ్ఞానము కలిగినదిగా , తిరిగి బాహ్మణ కుటుంబమే జన్మించింది.
సుశర్మ పూర్వజన్మ జ్ఞానము వలన క్రిందటి వృషభజన్మలో తన సుకృతమును ధార పోసిన వేశ్యని వెతుక్కుంటూ, ఆమె ఇంటికి వెళ్ళాడు. ‘తల్లి నీ సుకృత దానము చేత నేను కృతకృత్యుడనయ్యాను. నీవు ఇచ్చిన ఈ సుకృతం ఎలాంటిది? అని ప్రశ్నించాడు . అప్పుడామె , ‘అయ్యా! ఇదిగో నా చిలుక . ఈ పంజరంలో చిలుక పలికిన పలుకులు రోజూ వినండం వల్లనే నీకు ధారపోయగలిగిన సుకృతం నాకు ప్రాప్తించింది. నా అంతఃకరణమును పవిత్రము చేసిన ఆ సుకృతమనే నీకు ధారపోశానని’ చెప్పింది.
సుశర్మ అమితమైన ఆశ్చర్యముతో ఆ చిలుకను సమీపించి, ఆ చిలుక పలికే పలుకులు ఎలాంటివని తెలుసుకొనే ప్రయత్నం చేశాడు . అ పూర్వజన్మ శ్మృతి గల ఆ చిలుక ఇలా చెప్పసాగింది.’ పూర్వజన్మలో విద్వాంశుడనైన నేను చాలా అహంభావిగా, మోహితుడునై రాగద్వేషయుక్తుడునై గురువులను దూషిస్తూ తిరుగుతుండేవాడిని. కాలానుసారముగా మృత్యువు కబళించింది. ఆ తర్వాత సద్గురు దూషణము చేయడంవలన నానావిధ నరకయాతనలు అనుభవించి, తిరిగి ఇలా చిలుకనై జన్మించాను. బాల్యంలోనే నా జననీ జనకులు కాల ధర్మాన్ని పొందారు. కాలము గడుస్తూ ఉండగా, ఒకనాటి గ్రీష్మ కాలంలో దాహంతో అలమటిస్తూ మూర్ఛపోయి ఒక చెట్టు మొదట్లో పడిపోయాను.
ఒక ముని నన్ను అనుగ్రహించి తనకు తన ఆశ్రమానికి తీసుకుపోయి, ఒక పంజరంలో ఉంచి ప్రేమతో ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము తన శిష్యులకు శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు. దానిని నేను రోజూ వింటూ క్రమక్రమంగా పఠిస్తూ సమర్ధురాలనయ్యాను. దైవవశాన, ఒక రోజు ఒక దొంగ ఆ ఆశ్రమానికి వచ్చి నన్ను అపహరించి ఈమెకు విక్రయించాడు. అలా భగవద్గీతలోని ప్రథమాధ్యాయం పారాయణ వలన నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది . నిత్యమూ నేను చెప్పే ఆ సలికాలు వినడం వలన ఈ వేశ్య అంతఃకరణము పరిశుద్ధమయ్యింది. ఆమె చేసినటువంటి పుణ్య దానము చేత నీవు పాప విముక్తుడయ్యావు. అని వివరించింది.
అప్పటి నుండీ సుశర్మ శ్రీమద్భగవద్గీత పారాయణముకు క్రమం తప్పక చేశారు. ఈ విధంగా వారు ముగ్గురు కూడా నిరంతర గీతా ప్రథమాధ్యాయ పారాయణ చేత జ్ఞానోదయం కలవారై, ముక్తిని పొందారు. కాబట్టి నిత్యము మనస్ఫూర్తిగా గీతా ప్రథమాధ్యాయాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే పూర్వజన్మ స్మృతి తప్పకుండా కలుగుతుంది అని నారాయణుడు లక్ష్మీదేవికి వివరించారని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
ప్రాంజలి ప్రభ
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
భగవద్గీతలో ఏ అధ్యాయం పారాయణ చేస్తే ఏ ఫలితం ఉంటుంది?
భగవద్గీత ఒక గొప్ప గ్రంథం. హిందూ ధర్మంలో ఈ గ్రంథానికి చాలా గొప్ప స్థానం ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధనే భగవద్గీతగా పిలవబడుతోంది. ఇది కేవలం కృష్ణార్జునుల మధ్య సాగిన సారాంశంగా కాకుండా మొత్తం మనుష్య ప్రపంచానికి ఉద్దేశించి చెప్పబడిన గ్రంథంగా భావిస్తారు. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలలో ఒకోదాంట్లో ఒకోరకమైన విషయాన్ని ప్రస్తావించారు. వాటిని పారాయణం చేయడం వల్ల కొన్ని ఫలాలు కలుగుతాయని మనవాళ్ళు చెపుతారు. ఇవి అందులో ఉండే విషయాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగేవి కావు. నియమంతో పారాయణ చేస్తే దానివల్ల పాపాలు పోయి పుణ్యం కలగడంవల్ల కలుగుతాయి. అందులో విషయాన్ని పూర్తిగా గ్రహించినవారు, వాటిని జీవితంలో ఆచరించేవారికి కలిగే ఫలాలు అవి.
వాటి గురించి వివరంగా చూస్తే:-
అర్జునవిషాదయోగం - దీన్ని చదవడంవల్ల మానవుడికి పూర్వ జన్మస్మృతి కలుగుతుంది. అతని అసలైన వ్యక్తిత్వం, అతని ప్రవర్తన అతనికి పూర్తిగా అర్థమవుతాయి. దానివల్ల మనిషి తన జన్మ లక్ష్యం ఏమిటి అనేది అర్థం చేరుకుని ఆ మార్గంలో వెళ్లగలుగుతాడు.
సాంఖ్యయోగం - దీవి వల్ల ఆత్మస్వరూపం గోచరిస్తుంది. ఆత్మస్వరూపం అనేది ఓ గొప్ప రహస్యం. అయితే తెలుసుకుంటే అది అందరికీ అర్థమవుతుంది. దాని అర్థం చేసుకునే శక్తిని మేల్కొలపడమే ఇందులో రహస్యం.
కర్మయోగం - దీన్ని ఎవరైనా పారాయణం చేస్తే, ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిస్తుంది. ప్రేతత్వం అంటే మనిషిలో తృప్తి లేకుండా అశాంతితో ఉండటం.
జ్ఞానయోగం - కర్మసన్యాసయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్లు, పశువులు, పక్షులు గూడ పాపం నశించి, ఉత్తమగతిని పొందుతాయి.
ఆత్మసంయమయోగం – దీన్ని పారాయణ చేస్తే సమస్త దానాల ఫలితం కలిగి విష్ణుసాయుజ్యం కలుగుతుంది.
విజ్ఞానయోగం - ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది.
అక్షరపరబ్రహ్మయోగం – ఈ అధ్యాయం వింటే స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగిపోతాయి.
రాజవిద్యా రాజగుహ్యయోగం - దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారినుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది.
విభూతియోగం - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏపుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడుతుంది.
విశ్వరూప సందర్శనయోగం - దీన్ని పారాయణం చేయడంవల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు.
భక్తియోగం - దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు కూడా దీనివల్ల బ్రతుకుతారు.
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం- దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం నశిస్తుంది.
గుణత్రయ విభాగయోగం - దీనివల్ల స్త్రీ హత్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి.
పురుషోత్తమ ప్రాప్తియోగం - ఇది భోజనానికి ముందు చదవతగింది. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది.
దైవాసుర సంపద్విభాగయోగం - దీనివల్ల బలపరాక్రమాలు, నుఖం లభిస్తాయి.
శ్రద్ధాత్రయవిభాగయోగం- దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి.
మోక్ష సన్యాస యోగం - దీనివల్ల సమస్త యజ్ఞాచరణఫలం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది.
ఈ విధంగా భగవద్గీతలో అధ్యాయాలు పారాయణ చేయడం వల్ల ఫలితాలు కలుగుతాయి. అయితే కొన్ని అధ్యాయాలు చదివితే చనిపోయిన వారు కూడా తిరిగి బ్రతుకుతారని చెప్పినమాట నిజమేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటుంది. భూమి మీద పాపపు భారం పెరిగేకొద్దీ మనిషికి దక్కాల్సిన ఫలితం దూరంగా వెళుతుంది. మనసా వాచా కర్మణా భగవద్గీత పారాయణ చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కనీసం ఈ ఫలాలు లభిస్తాయి అని ఆశించి అయినా చేస్తారేమో కానీ ఏమీ ఆశించకుండా చేసేవారు ఉన్నారో లేదో తెలియదు. ఆశించకుండా చేసేపనిలోనే ఫలితం దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
కావున ప్రతిఒక్కరూ శ్రీ శ్రీ శ్రీ కృష్ణవాణి చదవగలరని ఆశిస్తాను.
ఆనాడు వ్యాసుడు వ్రాసిన కృష్ణ భోధ ఆధారముగా తెలుగు వృత్తపధ్యాలు గా కపి రాజు స హాయముతో వ్రాయటం జరిగిందని భావిస్తున్నాను. ప్రతిఒక్కరూ చదవగలరని ఆకాంక్షతో ముద్రణ గా అందజేస్తూ " తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి అంకితంచేస్తున్నాను. ఆ పరమాత్ముని సంకల్పం నేను నిమిత్తమాతృడను
మీ
మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer, DTA. AP.
ప్రాంజలిప్రభ రచయిత, సహజకవి
Comments
Post a Comment